క్రైమ్/లీగల్

అల్లర్లు జరిగే వరకు వేచి చూడాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 7: అధికారులు అల్లర్లు జరిగేంత వరకు ఆంక్షలు విధించకుండా వేచిచూడాలా? అని సుప్రీంకోర్టు గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గులాంనబీ ఆజాద్‌ను ప్రశ్నించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించిన రాజ్యాంగంలోని అధికరణం 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత కాశ్మీర్‌లో వివిధ రకాల ఆంక్షలు విధించడాన్ని ఆజాద్ వ్యతిరేకించడంపై స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ ప్రశ్న వేసింది. ‘ఇలాంటి అంశంలో, మొత్తం ప్రాంతం లేదా ప్రదేశంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని మనం ఎందుకు భయపడకూడదు?’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం కాంగ్రెస్ పార్టీలో గులాంనబీ ఆజాద్ సహచరుడు, ఆయన తరపు న్యాయవాది అయిన కపిల్ సిబాల్‌ను ప్రశ్నించింది. కమ్యూనికేషన్, రవాణా సహా వివిధ రకాల ఆంక్షలు విధించడానికి అధికారులు అల్లర్లు జరుగుతాయనే సాకులు చూపుతున్నారని కపిల్ సిబాల్ వాదించారు. ప్రజల ప్రశాంతతకు ప్రమాదం వాటిల్లుతుందనే తమ భయానికి అధికారులు ఆధారాలు చూపకుండా ఇలాంటి ఆంక్షలు విధించడానికి వీలులేదని న్యాయమూర్తులు ఆర్.సుభాశ్ రెడ్డి, బీఆర్ గవాయి సభ్యులుగా గల ధర్మాసనం ముందు సిబాల్ వాదించారు. మొత్తం ప్రజలు తనకు వ్యతిరేకంగా ఉన్నారని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని ప్రభుత్వం ఎలా ఊహించగలదని ఆయన వాదించారు. ‘కాశ్మీర్ లోయలోని పది జిల్లాల్లో గల 70 లక్షల మంది ప్రజల జీవనాన్ని ఇలా స్తంభింపచేయవలసిన అవసరం ఉందా? వారు దీనికి ఆధారాలు చూపవలసి ఉంది’ అని సిబాల్ వాదించారు. ‘మేమిక్కడ జమ్మూకాశ్మీర్ ప్రజల హక్కుల గురించి మాట్లాడటం లేదు. మేము భారత ప్రజల హక్కుల గురించి మాట్లాడుతున్నాం’ అని సిబాల్ ఈ సందర్భంగా అన్నారు. అధికారులు శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే భయాన్ని కలిగి ఉండవచ్చని, అయితే, దానికి వారు ఆధారాలు చూపవలసి ఉంటుందని సిబాల్ పేర్కొన్నారు. ‘అల్లర్లు జరిగేంత వరకు వారు వేచి ఉండాలా?’ అని ధర్మాసనం సిబాల్‌ను ప్రశ్నించింది. దీనికి సిబాల్ బదులిస్తూ ‘అల్లర్లు జరుగుతాయని వారు ఎలా ఊహిస్తారు? అది వారి మనస్సులో పుట్టిన ఊహ అని, దానికి ఆధారాలు లేవని అది సూచిస్తోంది. వారి వద్ద నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ఉంటే చూపించొచ్చు’ అని సిబాల్ బదులిచ్చారు.