క్రైమ్/లీగల్

గురుకుల కళాశాలలో విద్యార్థి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనాపురం, నవంబర్ 7: వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీ చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి గురువారం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్‌ఐ సైదయ్య కథనం ప్రకారం చిన్నంబావి మండలం చిన్నదగడ గ్రామానికి చెందిన ఆగురయ్య, సువర్ణ దంపతుల కుమారుడు శ్రీకాంత్ (17) గురుకుల పాఠశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం ఎవ్వరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. అది గమనించిన స్వీపర్, తోటి విద్యార్థులు కళాశాల ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శ్రీకాంత్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు వనపర్తి ఆసుపత్రికి వచ్చి కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. బంధువుల సహాయంతో మృతదేహాన్ని కళాశాలకు తీసుకువచ్చారు. తమ కుమారుని చేతిపై గాటు ఉండడంతో వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, ఎవ్వరో హత్య చేసి ఉంటారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి కొత్తకోట సీఐ వెంకటేశ్వర్లు, ఆత్మకూర్ ఎస్‌ఐ ముత్తయ్య, అమరచింత ఎస్‌ఐ ఆంజనేయులు చేరుకొని విచారణ చేపట్టారు.
మృతదేహంతో ధర్నా
విద్యార్థి శ్రీకాంత్ మృతికి కారణం ప్రిన్సిపాల్ పర్యవేక్షణ లోపమేనని పీడీఎస్‌యు, ఎస్‌ఎఫ్‌ఐ, బంధువులు ఆరోపిస్తూ రోడ్డుపై బైటాయించి ధర్నా చేశారు. ఘటనకు కారణమైన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూర్-కొత్తకోట రహదారిపై ధర్నా చేయడంతో గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బాధిత కుటుంబానికి రూ.25లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఘటన స్థలానికి ఆర్‌సీఓ భీమయ్య చేరుకొని విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.
గురుకుల ప్రిన్సిపాల్ సస్పెన్షన్
సాంఘీక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంఘటనపై గురువారం రాత్రి వనపర్తి ఆర్డీఓ చంద్రారెడ్డి విచారణ జరిపారు. గురువారం సాయంత్రం ఆయన కళాశాలకు వెళ్లి విచారణ జరిపి కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేశారు.

*చిత్రాలు.. మృతి చెందిన విద్యార్థి శ్రీకాంత్ (ఫైల్‌ఫోటో)
* మృతదేహం వద్ద రోధిస్తున్న తల్లిదండ్రులు, బంధువులు