క్రైమ్/లీగల్

మోసపోయాడు... అనుభవంతో మోసగాడయ్యాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఏప్రిల్ 17: కోటి విద్యలు కూటి కొరకేనన్న నానుడిని.. ఒక్క అనుభవంతో కోటి మోసాలు చేయవచ్చని నానుడిని తిరగరాసిన ఎర్రావారిపాల్యెంకు చెందిన డేవిడ్‌కుమార్ అనే ఓ నిరుద్యోగ యువకుడు మంగళవారం రేణిగుంట విమానాశ్రయ పోలీసులకు అడ్డంగా చిక్కి కటకటాలపాలైన ఉదంతమిది. డేవిడ్‌కుమార్ డిగ్రీ చదువుకున్నాడు. ఎలాగైనా విమానాశ్రయంలో ఒక భద్రతాధికారిగా చేరాలని కలలు కన్నాడు. గత ఐదేళ్లక్రితం ఆ యువకుడి ఆశను కనిపెట్టిన పాండిచ్చేరికి చెందిన ఓ మాయగాడు ఆ నిరుద్యోగ యువకుడిని మోసం చేశాడు. తన ఆశయం నెరవేరకపోవడంతో సమాజంపై కసి పెంచుకున్నాడు. తానే ఒక మోసగాడి అవతారం ఎత్తాడు. తనలా ఆశపడుతున్న వారిని టార్గెట్ చేశాడు. తాను విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ కమాండోనని చాటుకోవడానికి నకిలీ ఐడీ కార్డును తయారు చేసుకున్నాడు. అంతేకాదు తనచే మోసపోయిన వారి నుంచి వసూలు చేసిన సొమ్ముతో కమాండో తరహాలో సూటు, బూటు తయారు చేయించుకున్నాడు. అంతేకాదు తాను కమాండో అని తెలిసేలా ఒక కారుపై ఇండియన్ గవర్నమెంట్ అని స్టిక్కర్‌ను, పోలీస్ అనే ప్లేకార్డును కారు ముందు ఉంచుకున్నాడు. ఈ కారు కొన్నదా, లేకుంటే కొట్టుకొచ్చిందా అనేది తేలాల్సి ఉంది. ఇక తన మోసాలకు తెర తీసాడు. ఈ క్రమంలో విద్యావంతులై, నిరుద్యోగులుగా ఉన్న కల్లూరుకి చెందిన మనోజ్‌కుమార్ (25), జయతేజ (23)లకు వలపన్నాడు. విమానాశ్రయంలో ఎస్‌ఐగా ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆశ పెట్టాడు. వారి నుంచి అప్పనంగా రూ. 6.80లక్షలు సొమ్మును చెల్లించాలని సూచించాడు. దశలవారీగా సొమ్ము తీసుకుంటూ వచ్చాడు. తమకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయని ఆ యువకులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో చివరి విడతగా చెల్లించాల్సిన రూ.25వేలను తన బ్యాంకు ఖాతాలో వేసి మంగళవారం విమానాశ్రయం వద్దకు వస్తే ఉద్యోగాలిప్పిస్తానని ఆ యువకులను నమ్మబలికాడు. ఇంత వరకు అంతా సజావుగానే సాగింది. ఇక ఆ యువకులు రేణిగుంట విమానాశ్రయానికి రానున్న సమయంలో డేవిడ్‌కుమార్ కమాండో తరహాలో తన ఇన్నోవా కారులో విమానాశ్రయం వద్దకు చేరుకున్నాడు. కారును పార్కు చేసి సూటు, బూటు వేసుకుని విమానాశ్రయం ముందు హడావుడి చేశాడు. అంతేకాదు తన వద్ద ఉన్న నకిలీ కార్డుతో విమానాశ్రయం లోపలికి వెళ్లాడు. అంటే విమానాశ్రయం ముందు భద్రతా డొల్లతనం ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. విమానాశ్రయంలోకి వెళ్లిన డేవిడ్ లోపల కూడా హడావుడి చేశాడు. ఇది గమనించిన విమానాశ్రయ భద్రతాధికారి మనీష్ పాండే, డేవిడ్‌ను ప్రశ్నించాడు. ఏమాత్రం జంకు, బొంకు లేకుండా తాను కమాండోనంటూ తనదైన శైలిలో సమాధానం చెప్పాడు. అంతేకాదు తన వద్ద ఉన్న నకిలీ ఐడీ కార్డును చూపించాడు. దీంతో మనీష్ పాండేకు అనుమానం మరింత బలపడింది. వెంటనే అదుపులోకి తీసుకుని రెండు గంటలపాటు విచారించారు. అయితే డేవిడ్ ఏమాత్రం తగ్గకుండా సమాధానాలు చెబుతూ వచ్చాడు. అదే సమయంలో ఉద్యోగం కోసం డబ్బులు ఇచ్చిన యువకులు ఫోన్ చేశారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది సెల్‌ఫోన్ స్పీకర్ ఆన్ చేయించి మాట్లాడించారు. అటువైపు యువకులు అడిగిన ప్రశ్నలు, డేవిడ్ ఇచ్చిన సమాధానాలతో నకిలీ కమాండో మోసగాడని తేలింది. వెంటనే మనీష్ పాండే అతని ఫోన్ తీసుకుని డేవిడ్‌కుమార్ మోసగాడని వివరించి విమానాశ్రయానికి రమ్మన్నారు. అక్కడకు చేరుకున్న మనోజ్‌కుమార్, జయతేజాలు జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించారు. దీంతో డేవిడ్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది ఏర్పేడు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భలే మోసగాడు కటకటాలు లెక్కిస్తున్నాడు.