క్రైమ్/లీగల్

జన్మభూమి రాముడిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యపై ఇది సయోధ్య శకం..
భారతీయ సామరస్య జీవనంలో నవోదయం.. దశాబ్దాల అయోధ్య వివాదానికి తెర పడింది.. ‘అయోధ్య’ రాముడి జన్మస్థలమేనని సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం నిగ్గు తేల్చింది. ఆ స్థలాన్ని హిందువులకే కేటాయించింది. ప్రత్యామ్నాయంగా ముస్లింలకు ఐదెరకాల భూమిని అందించింది.
సుప్రీం ఏకగ్రీవ తీర్పును అన్ని వర్గాలు హర్షించాయి. తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయరాదని సున్నీ వక్ఫ్‌బోర్డు తీర్మానించింది. సమత, సంయమనం, సామరస్య స్ఫూర్తితో ముందుకు
సాగాలని సంకల్పించాయి. ఇది నవశకమని ప్రధాని మోదీ అభివర్ణించారు.
న్యూఢిల్లీ, నవంబర్ 9: దశాబ్దాల అయోధ్య వివాదానికి తెరపడింది. దేశ సామాజిక జీవనాన్ని చీలికలుగా మార్చిన ఓ భావోద్వేగ అంశానికి ఏకాభిప్రాయ రీతిలో తెరపడింది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై శనివారం చారిత్రక తీర్పును వెలువరించిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆలయ నిర్మాణానికి మార్గానికి సుగమం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని హిందువులకే కేటాయించింది. ఇది శ్రీరాముడు జన్మించిన భూమేనని చెప్పడానికి ఐతిహాసికంగా, చారిత్రకంగా, పురావస్తుపరంగా ఎన్నో ఆధారాలున్నాయని ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం తేల్చిచెప్పింది. దీనికి ప్రతిగా పవిత్ర అయోధ్య పట్టణంలో ముస్లింలకు ఓ ప్రధాన భాగంలో ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద స్థలంలోనే శ్రీరాముడు జన్మించాడన్న హిందువుల విశ్వాసం, నమ్మకం తిరుగులేనిదేనని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. శ్రీరాముడే ఈ స్థలానికి సంకేతప్రాయంగా యజమాని అన్న విషయాన్ని కూడా సుప్రీం తన తీర్పులో నిగ్గుతేల్చింది. అయితే 16వ శతాబ్దం నాటి బాబరీ మసీదును హిందూ కరసేవకులు ధ్వంసం చేయడం తప్పు అని నిర్ధారించిన న్యాయస్థానం.. ఆ తప్పిదాన్ని సవరించాల్సిందేనని రూలింగ్ ఇచ్చింది. అయోధ్య అంశాన్ని తాము మూడు పార్టీల మధ్య తలెత్తిన వివాదంగానే పరిగణించి పరిష్కరించే ప్రయత్నం చేశామే తప్ప మత విశ్వాసాలు, మనోభావాలతో తమ తీర్పునకు ఎలాంటి ప్రమేయం లేదని న్యాయమూర్తులు వెల్లడించారు. సున్నీ ముస్లిం వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా వీరజ్‌మాన్ మధ్య వివాదంగానే దీన్ని పరిగణించి పరిష్కరించామని వివరించారు. దాదాపు 1045 పేజీలున్న ఈ తీర్పును హిందూ రాజకీయ పార్టీలు, సంస్థలు, గ్రూపులు స్వాగతించాయి. ముస్లిం నేతలు కూడా ఈ తీర్పును తప్పుబట్టినప్పటికీ దాన్ని అంగీకరిస్తున్నట్లు వెల్లడించారు. దేశ ప్రజలందరూ సామరస్యపూర్వక రీతిలో మనుగడ సాగించాలని కూడా పిలుపునిచ్చారు. మొఘల్ చక్రవర్తి బాబర్ ఆదేశం మేరకు 1528లో నేలమట్టమైన శ్రీరాముడి ఆలయం ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశంతో ఊపిరిపోసుకోనున్నది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని హిందువులకు కేటాయించి అక్కడ శ్రీరాముడి ఆలయం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి.. ముస్లింలు మరోచోట మసీదు నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్ బోర్డుకు ఐదెకరాల భూమిని కేటాయించాలంటూ సుప్రీం కోర్టు శనివారం చారిత్రాత్మిక తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నాయకత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు శనివారం ఏకగ్రీవ తీర్పును ప్రకటించి దాదాపు 500 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న వివాదానికి తెరదించింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని హిందువులకు కేటాయించిన సుప్రీం కోర్టు ఇక్కడ దేవాలయాన్ని నిర్మించేందుకు మూడు నెలల్లోగా ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముస్లింలు అయోధ్యలో తమకు నచ్చినచోట మసీదు నిర్మించుకునేందుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని కేటాయించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు బాబ్డే, చంద్రచూడ్, అశోక్ భూషన్, అబ్దుల్ నజీర్‌తో కూడిన రాజ్యాంగ ధర్మాసనం క్రిక్కిరిన ఒకటో నంబర్ కోర్టు హాలులో తీర్పు ప్రకటించింది. శనివారం కోర్టుకు సెలవైనప్పటికీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తీర్పును ప్రకటించటం గమనార్హం. ఐదుగురు న్యాయమూర్తులు ఒకేసారి కోర్టులోకి వచ్చిన అనంతరం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దాదాపు నలభై నిమిషాల పాటు తీర్పును చదివారు. రామజన్మ భూమి స్థలం రామజన్మ భూమి న్యాస్‌కు చెందుతుందని చెప్పిన సుప్రీం కోర్టు భూమిని తమకు కేటాయించాలన్న నిర్మోహి అకారా పిటిషన్‌ను తోసిపుచ్చింది. అదే విధంగా బాబ్రీ మసీదు తమకు చెందుతుందంటూ షియా వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామాలయం నిర్మించేందుకు మూడు నెలల్లోగా ఒక ప్రత్యేక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించిన సుప్రీం కోర్టు ఈ ట్రస్ట్‌లో నిర్మోహి అకారా, రామజన్మభూమి న్యాస్ తదితర సంస్థలకు సభ్యత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. 1992లో బాబ్రీ మసీదును నేలమట్టం చేయటం చట్ట విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. వివాదాస్పద భూమి లోపల ఒక కట్టడం ఉన్నదంటూ ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందజేసిన నివేదిక ఆధారంగా సుప్రీం తీర్పు ఇవ్వటం గమనార్హం. వివాదాస్పద భూమిని హిందువులకు కేటాయించి దేవాలయాన్ని నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీకి అప్పగించటం, ముస్లింలు తమకు నచ్చినచోట మసీదును నిర్మించుకునేందుకు సున్నీ వక్ఫ్ బోర్డుకు
ఐదెకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని ఆదేశించటం ద్వారా ఇటు హిందువులు, అటు ముస్లింలకు సుప్రీం కోర్టు న్యాయం చేసింది. శ్రీరాముడి దేవాలయాన్ని నిర్మించే అవకాశాన్ని హిందూ సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి అప్పగించటం ద్వారా విశ్వహిందూ పరిషత్ తదితర సంఘ్ పరివార్ సంస్థలకు ప్రాధాన్యత కట్టబెట్టకుండా సుప్రీం జాగ్రత్త పడింది. ముస్లింలు గత 300 సంవత్సరాల నుండి బాబ్రీ మసీదులో నమాజు చేస్తున్నట్లు దాఖలాలు లేవు కానీ హిందువులు మాత్రం ఎడతెరిపి లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సాక్ష్యాలు చెబుతున్నాయని కోర్టు అభిప్రాయపడింది. ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పులో పదాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించింది. వివాదాస్పద భూమి లోపల దేవాలయం వంటి నిర్మాణాలు ఉన్నాయన్న భారత ఆర్కియోలాజికల్ సర్వే సంస్థ నివేదికను ప్రామాణికంగా తీసుకున్నా అక్కడ దేవాలయాన్ని కూల్చివేసి మసీదును నిర్మించినట్లు నివేదికలో పేర్కొనలేదని వివరించింది. ఐదుగురు న్యాయమూర్తులు ఇంతటితో ఆగకుండా బాబ్రీ మసీదును ఖాలీ స్థలంలో కట్టినట్లు ఏఎస్‌ఐ పేర్కొనలేదని తీర్పులో అభిప్రాయపడటం గమనార్హం. వివాదాస్పద భూమి లోపల ఉన్న నిర్మాణం ఇస్లామిక్ నిర్మాణం కాదని కోర్టు తమ తీర్పులో పేర్కొన్నది. ఏఎస్‌ఐ జరిపిన తవ్వకాల్లో బైటపడిన వస్తువులు కూడా ఇస్లాం మతానికి సంబంధించినవి కావని కోర్టు స్పష్టం చేసింది. పనె్నండవ శతాబ్దంలో వివాదాస్పద భూమిపై ఒక కట్టడం ఉండేదనే వాదనతో సుప్రీం కోర్టు
ఏకీభవించింది. మత విశ్వాసం వ్యక్తిగతమైనప్పటికీ అయోధ్య రాముడి జన్మభూమి అనే హిందువుల విశ్వాసం తప్పు అని నిరూపించే సాక్ష్యాలేవీ తమ ముందుకు రాలేదని కోర్టు చెప్పింది. శ్రీరాముడు ఇక్కడే జన్మించాడనేందుకు వివాదాస్పద భూమి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాయనే వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. వివాదాస్పద భూమి హిందువుల మతపరమైన ప్రాంతం అనేది సీతమ్మవారి వంటగది, శ్రీరాముడి అరుగు (చబూత్రా), సరుకుల గది (భండార్ గ్రిహ్) నిరూపిస్తున్నాయని సుప్రీం కోర్టు తమ తీర్పులో పేర్కొన్నది. వివాదాస్పద బాబ్రీ మసీదు-రామజన్మభూమి కట్టడంలో శ్రీరాముడి విగ్రహాలను 1949 డిసెంబర్ 22-23 తేదీ మధ్యరాత్రి పెట్టారన్న అలహాబాదు హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు ఆమోదించింది. మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా భూమి యాజమాన్యాన్ని నిర్దారించలేము కానీ వివాదాలను పరిష్కరించేందుకు అవి సూచికలని ధర్మాసనం అభిప్రాయపడింది. రామజన్మభూమి ‘జూరిస్టిక్’ వ్యక్తికాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ జూరిస్టిక్ అనే పదానికి గల స్పష్టమైన అర్థాన్ని న్యాయమూర్తులు తీర్పులో వివరించలేదు.

*చిత్రాలు.. శ్రీరాముడు
*అయోధ్య కేసులో చారిత్రక తీర్పును వెలువరించిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం
*సుప్రీంకోర్టు
*రామాలయం
*తీర్పు వెలువడిన అనంతరం జైపూర్‌లో పరస్పర అభినందనలు తెలుపుకుంటున్న హిందూ-ముస్లిం