క్రైమ్/లీగల్

సమ్మె చట్టవిరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం చట్టవిరుద్ధమని, ఈ దిశగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సంస్థ తాత్కాలిక ఎండీ సునీల్‌శర్మ శనివారం నాడు హైకోర్టులో అదనపు అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేయడం హక్కుగా భావిస్తున్నారని, ముందుగానే నోటీసు ఇచ్చామని వాదిస్తున్నారని ఆయన ఆ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే, సమ్మె చేయడమే చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నేతలు దురుద్దేశ్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారని అఫిడవిట్‌లో ఆరోపించారు. కార్మిక శాఖ వారి సమస్యలపై మధ్యవర్తిత్వం వహిస్తున్న దశలోనే కార్మికులు సమ్మెకు వెళ్లారని గుర్తుచేశారు. అత్యంత కీలక సమయాల్లో ఆర్టీసీ యాజమాన్యాన్ని కార్మికులు బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న సమ్మె చట్టవిరుద్ధం కాబట్టి, ఆర్టీసీ జాక్ నేతలతో చర్చలు జరపలేమని ఆయన తేల్చిచెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్‌ను జేఏసీ నేతలు తాత్కాలికంగా పక్కన పెట్టినా, మళ్లీ ఏ క్షణాన్నైనా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే అవకాశం ఉందని ఆ అఫిడవిట్‌లో అనుమానం వ్యక్తం చేశారు. సమ్మె చట్ట ధిక్కారంగా ఉండరాదని, ఇలాంటి సమ్మెను ప్రోత్సహించరాదని అన్నారు. ఈ కోణంలోనే సమస్యను చూడాలని, తదనుగుణంగా ఆదేశాలు జారీ చేయాలని ఆ అఫిడవిట్‌లో హైకోర్టును కోరారు. కార్మికులు స్వచ్ఛందంగా విధుల్లో చేరేందుకు ముందుకు వచ్చినా, వారి కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవడం ఆర్టీసీ యాజమాన్యానికి ఇబ్బందిగా మారుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా వీలైనంత త్వరగా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఆర్టీసీ జేఏసీ నేతలు కేవలం
తమతమ స్వార్థ ప్రయోజనాల కోసం, విపక్షాలతో కలిసి కుట్రపూరితంగా సమ్మెకు వెళ్లారని ఆరోపించారు. స్వలాభం కోసం కార్మికులను సమ్మెలోకి తీసుకువెళ్లి కార్పొరేషన్‌కు అదనపు నష్టాన్ని కలిగించారని విమర్శించారు. ఆర్టీసీ యాజమాన్యం తీవ్ర ఆర్థిక నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో, ఇప్పటికపుడు సంస్థను బాగుచేసే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సంఘాల నేతలతో చర్చలు జరపడం కష్టమని అన్నారు. సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని హైకోర్టును కోరారు. ఈ నెల 18వ తేదీన హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరగనున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ అఫిడవిట్ దాఖలు చేయడంతో దానికి ప్రాధాన్యత ఏర్పడింది. సుప్రీంకోర్టుకు చెందిన ముగ్గురు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేయాలనే హైకోర్టు ప్రతిపాదనను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో సోమవారం నాటి విచారణపై ఉత్కంఠ నెలకొంది.
ఆయనకేం తెలియదు: అశ్వత్థామరెడ్డి
ఆర్టీసీ సమ్మెపై సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్ శర్మ హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ అఫిడవిట్‌పై ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అఫిడవిట్ తయారుచేసి ఇస్తే సునీల్ శర్మ సంతకం పెడుతున్నారని, అది ఫక్తు పొలిటికల్ అఫిడవిట్ మాత్రమేనని అన్నారు. సునీల్ శర్మ ఇన్‌ఛార్జి ఎండీగా 17 నెలలు పూర్తయినా కనీసం ఏడుసార్లు కూడా ఆఫీసుకు రాలేదని అన్నారు. ఆర్టీసీ ప్రధానకార్యాలయంలో ఫైళ్లు కుప్పలుతెప్పలుగా పేరుకున్నాయని చెప్పారు.

*చిత్రం... ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ