క్రైమ్/లీగల్

రెండు వారాల్లో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 18: ఆర్టీసీ డిమాండ్ల చార్టర్ న్యాయమైనవా? కాదా? అనేది రెండు వారాల్లో తేల్చాలని కార్మిక శాఖ కమిషనర్‌ను రాష్ట్ర హైకోర్టు సోమవారం నాడు ఆదేశించింది. హైకోర్టుకూ కొన్ని పరిమితులు ఉంటాయని, ఈ విషయంలో తమ పరిధి దాటి ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. విషయాన్ని కార్మిక శాఖ చూసుకుంటుందని పేర్కొంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించలేమని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్‌రావు తమ వాదనలు వినిపించారు. ఆర్టీసీ కార్మికులు చట్ట ప్రకారం నడుచుకోలేదని, సమ్మె చట్టవిరుద్ధమని ఏజీ కోర్టుకు తెలిపారు. సంస్థ నష్టాల్లో ఉందని, ప్రభుత్వం ఇప్పటికే అన్నివిధాలా ఆదుకుందని, కార్మికుల సమ్మెతో కార్పొరేషన్ మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. సమ్మె కారణంగా ఇంతవరకూ ఆర్టీసీకి 44 శాతం మేర ఆదాయం నష్టపోయిందని, నోటీసులు ఇచ్చిన తర్వాత కార్మికులు కనీసం ఆరువారాల పాటు కార్పొరేషన్ నిర్ణయం కోసం ఎదురుచూడాలని, కానీ కార్మిక సంఘాలు చట్ట ప్రకారం నడుచుకోలేదని ఏజీ పేర్కొన్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమ్మెపై గత 40 రోజులుగా జరుగుతున్న వాదనలకు హైకోర్టు ముగింపు పలికింది. ఇదిలావుండగా, కార్మికుల సమ్మెపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను విచారించిన హైకోర్టు ఇంతవరకూ ఆరుమార్లు విచారణను వాయిదా వేసింది. ఇటు ప్రభుత్వాన్ని, అటు కార్మికుల తరఫున న్యాయవాదులను రాజ్యాంగంలో ఉన్న న్యాయబద్ధతను, హైకోర్టు అధికారాలను ప్రశ్నించింది. ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకుని కార్మికులు, ప్రభుత్వమూ చర్చలు జరిపి సమస్యలపై ఏకాభిప్రాయంతో సమ్మెకు ముగింపు పలకాలని కూడా హైకోర్టు సూచించింది. మరోపక్క అవసరమైతే సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీని వేసి కార్మికుల డిమాండ్లను పరిష్కరించే ప్రతిపాదనను కూడా చేసినా, ప్రభుత్వం నుండి తిరస్కారం ఎదురైంది. కాగా, చర్చలు జరపాల్సిందేనని అటు ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసిన హైకోర్టు కార్మికులు తమ హక్కుల కోసం చేస్తున్న సమ్మెను విరమించాలని కూడా ఆదేశించలేమని పేర్కొంది. దీంతో ఆర్టీసీ సమ్మె పీటముడి పడింది. ఆర్టీసీ ఆదాయ వ్యయాలు, ప్రభుత్వ పరంగా ఉన్న బకాయిలు, కార్మికుల డిమాండ్లు, విలీనం అంశంతో పాటు అదనంగా రూట్ల ప్రైవేటీకరణ విషయాలు కూడా గత ఐదు వారాలుగా హైకోర్టులో చర్చ జరిగాయి. చివరికి హైకోర్టు తమ పరిధి దాటి ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూనే ఈ సమస్యపై కార్మిక శాఖ కమిషనర్ తేల్చాలని ఆదేశించింది. దీంతో కార్మికుల సమ్మె అంశం మళ్లీ మొదటికే వచ్చింది. కార్మిక శాఖ కమిషనర్‌కు చేరింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించిన వెంటనే కార్మిక శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో సమ్మె చట్ట విరుద్ధమని పేర్కొంది. అయితే మరోమారు తాజాగా ఈ అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోర్టు పేర్కొంది. ప్రభుత్వం మొదటి నుండీ ఆర్టీసీ ఒక స్వతంత్ర కార్పొరేషన్ కనుక, ఈ అంశం కార్మిక శాఖ ఆధీనంలోకి వస్తుందని వాదిస్తూ వచ్చింది. ప్రభుత్వ వాదనతో ఎట్టకేలకు హైకోర్టు మొగ్గు చూపింది. అయితే అనేక ప్రశ్నలకు ఇంకా కార్మికులకు సమాధానం లభించలేదు. సమ్మె విరమించి విధుల్లో చేరినట్టయితే అందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉందా? లేదా? అనే అంశంపై కార్మికుల్లో మీమాంస కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు డెడ్‌లైన్‌లు పెట్టడం, ఆ గడువు కాస్తా మీరిపోవడంతో ఉద్యోగాల్లో చేరుతామని చెప్పినా కార్పొరేషన్ నుండి ఎలాంటి స్పందన వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అయితే ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణతోపాటు జీహెచ్‌ఎంసీ బకాయిలు తదితర అంశాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ కొనసాగనుంది. ఇందులో ప్రైవేటీకరణ అంశంపై మంగళవారం నాడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.