క్రైమ్/లీగల్

డీఆర్‌ఐ, ఏపీ ఇంటిలిజెన్స్ దాడుల్లో అంతర్జాతీయ ఆయిల్ మాఫియా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 20: రాష్ట్రంలో అతి పెద్ద ఆయిల్ మాఫియా గట్టు రట్టయింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ), ఆంధ్రప్రదేశ్ ఇంటిలిజెన్స్ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సుమారు మూడు లక్షల 15వేల లీటర్ల డీజిల్‌ను సీజ్ చేశారు. ఆయిల్ మాఫియాముఠాకు చెందిన ఐదుగురిని అరెస్టు చేశారు. అధికారులు స్వాధీనం చేసుకున్న డీజిల్ విలువ మార్కెట్‌లో సుమారు రెండు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డైరెక్టరేట్ ఆప్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ, చెన్నై, నౌకాశ్రయాలు కేంద్రంగా దుబాయ్ నుంచి మినరల్ స్పిరిట్ పేరుతో కొందరు ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు డీజిల్‌ను దిగుమతి చేసుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఏపీ ఇంటిలిజెన్స్ అధికారులు గుర్తించారు. దీనిపై డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇంటిలిజెన్స్ (డిఆర్‌ఐ) అధికారులకు సమాచారం ఇవ్వగా డీజిల్ స్మగ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి ఇంటిలిజెన్స్ అధికారుల సహకారంతో హైదరాబాద్, చెన్నైలకు చెందిన డిఆర్‌ఐ అధికారులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో దాడులు నిర్వహించారు. చెన్నై పోర్టుకు మెస్సర్స్ ఎస్‌ఎఎఫ్ పెట్రోలియం, మెస్సర్స్ ఆదిత్య మెరైన్ పేరుతో 14 కంటైనర్లు దిగుమతి అయినట్లు గుర్తించిన అధికారులు చెన్నైలోని శాంకో సిఎఫ్‌ఎస్, గేట్‌వే సిఎస్‌ఎఫ్‌పై దాడులు నిర్వహించి మూడు లక్షల 17వేల లీటర్ల (263.78 మెట్రిక్ టన్నులు) డీజిల్‌ను గుర్తించారు. రసాయనిక పరీక్షల్లో డీజిల్‌గా నిర్ధారణ కావడంతో ఆపరేటర్లను ప్రశ్నించగా డీజిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. వీరిచ్చిన సమాచారంపై రాష్ట్రంలోని కాకినాడ, చెన్నైలోని ఆపరేటర్లు, దిగుమతుదారులు, క్లియరింగ్ ఏజెంట్లు, ట్రాన్స్‌పోర్టు బ్రోకర్లు, సూపర్‌వైజర్లు, హవాలా ఆపరేటర్లకు చెందిన 12ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. దేశీయ అవసరాల కోసం పెట్రోలియం మంత్రిత్వశాఖ ఆధీనంలో నిర్వహించే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇతర ఆయిల్ మార్కెటింగ్ సంస్ధలు మినహా ప్రైవేటు వ్యక్తులు దిగుమతి చేసుకోవడం నిశిద్ధం. దీన్ని దృష్టిలో ఉంచుకుని కాకినాడకు చెందిన స్మగ్లర్లు మినరల్ స్పిరిట్ పేరుతో డీజిల్ దిగుమతి చేసుకుంటున్నట్లు డిఆర్‌ఐ గుర్తించింది. ఈ ముఠా కాకినాడులో కార్యాలయం ఏర్పాటు చేసుకుని స్మగ్లింగ్‌కు అనువుగా ఉండేందుకు చెన్నైలో గోదాములు ఏర్పాటు చేసుకున్నారు. కాకినాడ ఆపరేటర్ బంధువు అక్రమంగా దిగుమతి చేసుకున్న డీజిల్‌ను చెన్నై, కాకినాడ, ఒంగోలు, తెలంగాణాలోని కొన్ని ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం దుబాయిలో ఒక డమీ కంపెనీ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం నకిలీ ఇన్వాయిస్ పత్రాలు సృష్టించి చెలామణి చేస్తున్నారు. హవాలా పద్ధతిలో నగదు చెల్లింపులు జరుపుతూ గతంలో ఇదే ఆపరేటర్లు రూ.17.7 కోట్ల విలువైన 5366 మెట్రిక్ టన్నుల (63లక్షల లీటర్లు) డీజిల్‌ను 285 కంటైనర్లు ద్వారా దిగుమతి చేసుకుని అమ్మకాలు జరిపినట్లు అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో భాగంగా డీజిల్ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తితోసహా నలుగురు, ఒక హవాలా వ్యాపారిని అరెస్టు చేశారు. వీరిపై విదేశీ ట్రేడ్ నియంత్రణ, కస్టమ్స్ చట్టాల కింద కేసు నమోదు చేసిన డిఆర్‌ఐ అధికారులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.