క్రైమ్/లీగల్

కుప్పకూలి.. కూలీ దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, ఏప్రిల్ 24: పాత ఇంటిని కూల్చివేస్తుండగా ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా స్లాబ్ పడిపోవడంతో కూలీ అక్కడికక్కడే చనిపోగా మరో కూలీ తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైనాడు. నష్టపరిహారం కోసం మృతుని బంధువులు ఆందోళనకు దిగడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ వీ.జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ ఏసీపీ సంక్రాంతి రవి కుమార్, మియాపూర్ ఇన్‌స్పెక్టర్ చీమర్ల హరిశ్చంద్రా రెడ్డి, జీహెచ్‌ఎంసీ చందానగర్ సర్కిల్ అసిస్టెంట్ సీటీ ప్లానర్ ఆర్.శ్రీనివాస రావు, టీపీఎస్ శ్యాంసన్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. హఫీజ్‌పేట డివిజన్ పరిధిలోని హుడా కాలనీ ప్లాట్ నెంబర్ సీ3-548లో ఉన్న పాత ఇంటిని కూల్చివేసి నూతనంగా ఇల్లు కట్టుకోవడానికి యజమాని రాయుడు రాంచందర్ కాంట్రాక్టర్‌కు అప్పగించాడు. మంగళవారం ఆ పాత ఇంటిని కూలగొడుతుండగా అకస్మాత్తుగా స్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద పడి మహబూబాబాద్ జిల్లా, మల్యాల గ్రామం, సాదు తండాకు చెందిన బుక్యా వీరన్న (45) శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌నగర్‌కు చెందిన పి.సిద్దులు (30) కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. జేసీబీ యంత్రం సహాయంతో శిథిలాలు తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు.నష్ట పరిహారం చెల్లించేంత వరకు తాము మృతదేహాన్ని తరలించనివ్వమని కుటుంబ సభ్యులతో పాటు టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మిద్దెల మల్లారెడ్డి, ఇతర నాయకులు డిమాండ్ చేయడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఇరు వర్గాలను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ సముదాయించి మృతుని కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించడానికి యజమానిని ఒప్పించడంతో గొడవ సద్దుమణిగింది. వ్యక్తి మృతికి కారణమైన ఇంటి యజమాని, కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేస్తామని ఏసీపీ రవి కుమార్ తెలిపారు. ఎస్‌ఐ వేణుకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.