సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు -- 21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెప్పరా చిన్నోడా?’
గంగోత్రి గొంతు వినిపించాక అతను చెప్పాడు.
‘ఇంటర్వ్యూలో కొంతమందిని సెలెక్ట్ చేశాను’
‘గుడ్..’
‘వారిలో రానా అనే యువకుడు పోలీసు ఇన్‌ఫార్మర్...’
‘ఈ మధ్య పోలీసుల దృష్టి మన మీద పడింది. ప్రత్యేకంగా క్రైం విభాగంలోని ఓ ఇన్‌స్పెక్టర్‌కి ఈ పని అప్పగించాడు కమీషనర్. పేపరులో ప్రకటన ఇచ్చి మనకి కావాల్సిన వారిని సెలెక్ట్ చేసుకుంటున్నామని తెలుసుకుని ఉంటాడు ఆ ఇన్‌స్పెక్టర్. ఈ రోజు ఎంతమందిని సెలెక్ట్ చేసావ్?’
‘ముగ్గుర్ని’
‘అంటే ఆ ముగ్గుర్ని రేపు డాక్టర్ దగ్గరకు పంపాలి. అందులో పోలీసు ఇన్‌ఫార్మర్ ఉంటే మనం ఏ డాక్టర్ని కనె్సల్ట్ చేస్తున్నామో తెలిసిపోతుంది. అతనికి పేమెంట్ ఆన్‌లైన్‌లో చెల్లిస్తామని డాక్టర్ చెబుతాడు. ఆ అకౌంట్ నెంబరు పోలీసులకి తెలుస్తుంది. అవునా?’
‘అవును.. నిజమే’
‘అందుచేత ఆ ముగ్గుర్ని లిస్టు నుంచి తీసెయ్’
‘అందులో ఒక్కడే పోలీసు ఇన్‌ఫార్మర్’ చెప్పాడతను.
‘రిస్క్ తీసుకోవద్దు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన వారి వివరాలు పోలీసులు సేకరించి ఉంటే ప్రమాదం. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు పెద్దలు. రేపు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుందని చెప్పావు కాబట్టి ఆ సమాచారం కోసం చూస్తారు పోలీసులు. సాక్ష్యం చిక్కిన వెంటనే నిన్ను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేస్తే మేమంతా జాగ్రత్త పడతామని అంచనా వేసి ఉంటారు పోలీసులు. సో.. ఈపాటికి నీ మీద నిఘా పెట్టి ఉండాలి. లాడ్జి బాయ్ దగ్గర నుంచి ఎవర్నీ నమ్మకు. మూడో కంటికి తెలియకుండా రూమ్ నుంచి అదృశ్యమై మన రొయ్యల కంపెనీకి వెళ్లిపో...’
‘మన అంచనా తప్పి ఈలోపు నన్ను అరెస్ట్ చేస్తే?’
గంగోత్రి నవ్వు వినిపించింది అటు నుంచి.
‘కొత్తగా పెట్టబోతున్న ఫైనాన్స్ కంపెనీకి వాళ్లని సెలెక్ట్ చేసావు. ఇన్‌ఫార్మర్‌తో నువ్వు చెప్పిన నోటి మాటలకి ఎలాంటి సాక్ష్యం ఉండదు. ఒకవేళ తొందరపడి అరెస్ట్ చేస్తే ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకు. మిగతాది మన లాయరు చూసుకుంటాడు’
ఆ వ్యక్తి సెల్ ఆఫ్ చేశాడు.
అంతవరకూ మనసులో కదలాడిన ఆందోళన ఎగిరిపోయింది. ఆలోచిస్తూ కిటికీ దగ్గరకు నడిచి బయటకు చూశాడు. జగదాంబ సెంటర్‌కి వెళ్లే మెయిన్ రోడ్డు రద్దీగా ఉంది. ఆ రోడ్డుకి రెండు వైపులా షాపులున్నాయి. ఒక్కొక్క షాపు చూస్తూ దృష్టి ముందుకు సారించాడు. ఓ జ్యూస్ షాపు పక్కన కుర్చీలో కూర్చుని ఒకతను కనిపించాడు. అతని చూపు లాడ్జి మీద ఉండటంతో మఫ్టీలోని పోలీసుగా నిర్ధారించుకున్నాడు.
ఆ రూము నుంచి తను ఎలాంటి సామాను తీసుకెళ్లకూడదు. రూమ్ ఖాళీ చెయ్యడం వంటి ఫార్మాలిటీస్ పాటిస్తే క్షణాల్లో పోలీసులకి తెలిసిపోతుంది. అప్పుడు తనని పట్టుకోవడమో లేదా అనుసరించడమో చేస్తా. గదిలో విలువైన వస్తువులు ఏమీ లేవు. బ్రీఫ్ దగ్గరకు నడిచి అందులోని కొన్ని కాగితాలు జేబులో పెట్టుకున్నాడు.
కిటికీ దగ్గరకు కుర్చీ లాక్కుని కూర్చున్నాడు. అక్కడ నుండి రోడ్డు, జ్యూస్ షాపు స్పష్టంగా కనిపిస్తాయి. తనవల్ల చిన్న తప్పు జరిగినా గంగోత్రి సహించడని తెలుసు. నిజానికి రెండు రోజులు ఇంటర్వ్యూ ఉంటుందని పేపర్ ప్రకటన ఇచ్చారు. మొదటి రోజే సమస్య ఎదురైంది.
ఇంటి దగ్గర కూర్చుని కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా? ఇరవై ఇరవై అయిదు మధ్య వయసు గల డిగ్రీ చదివిన అందమైన యువతీ యువకులకు మంచి అవకాశం. ఈ ప్రకటన కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. దీన్ని చూసి పోలీసులకి అనుమానం ఎందుకొచ్చింది? అంటే అలాంటి ప్రకటన ఏదొచ్చినా పోలీసులు ఇన్‌ఫార్మర్ని పంపుతున్నారా?
మెరుపు లాంటి ఆలోచన అతని బుర్రలో కదిలింది. ప్రకటన వెలువడిన వెంటనే పేపరు వాళ్లని కాంటాక్ట్ చేసి ఆ ప్రకటన ఇచ్చిన వారి చిరునామా తెలుసుకుని ఉంటారు పోలీసులు. ఆ చిరునామా తప్పని తేలడంతో అనుమానం కలిగి ఇన్‌ఫార్మర్‌ని పంపి ఉంటారు.
అతని ఆలోచనలు చెదరగొడుతూ డప్పుల మోత ఒకటి చెవుల్ని తాకింది. రోడ్డు మీదకి దృష్టి సారించాడు. పాడె మోసుకుని కొంతమంది రావడం కనిపించింది. అది లాడ్జి ముందు నుంచే వెళ్లాలి. అతను చప్పున రూమ్ బయటకొచ్చి తలుపు మూశాడు. లాక్ చేసే ప్రయత్నం చెయ్యకుండా మెట్లు దిగి కిందకి చేరుకున్నాడు.
రిసెప్షన్‌లోని వ్యక్తి తనని గమనించక పోవడంతో ఎంట్రన్సు దాటి తలకొద్దిగా వంచి పాడె వెనుక నడుస్తున్న వారిలో కలిసిపోయాడు. ఆ గుంపు మలుపు తిరిగాక ఓ సందులోకి తప్పుకుని అటుగా వెళుతున్న ఆటో ఆపి ఎక్కి కూర్చున్నాడు.
* * *
‘ఎకరాకి పదివేలు చొప్పున ఏభై వేలు అడ్వాన్సు ఇచ్చాడు. ఆరు నెలల్లో మొత్తం సొమ్ము చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని అగ్రిమెంట్ రాశాడు. అగ్రిమెంట్ సమయం గడిచిపోయింది. ఎన్నిసార్లు అడిగినా అదిగో ఇదిగో అంటూ కాలక్షేపం చేస్తున్నాడు. గట్టిగా నిలదీస్తే కోర్టుకి వెళతానని అంటున్నాడు. మీ అందరికీ తెలుసు అమ్మాయి పెళ్లికి అప్పులు చేసానని, వాటికి వడ్డీలు కడుతున్నానని..’ దీనంగా చెప్పాడు ఏభై దాటిన వ్యక్తి.
నల్లగా, లావుగా ఉన్న మనిషి అంతా విని తనకి రెండో వైపు కూర్చున్న వారివైపు చూశాడు.
‘డబ్బు మొత్తం వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం చేతిలో పైకం లేదు. రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొంత సమయం కావాలి...’ వారిలో ఒకతను చెప్పాడు.
‘అగ్రిమెంట్ పేపరు తెచ్చారా?’ అడిగేడు నల్లటి వ్యక్తి.
ఏభై దాటిన వ్యక్తి ఓ కాగితం అందించాడు. వంద రూపాయల స్టాంపు పేపర్ మీద రాసింది చదివి రెండో అతన్ని అడిగేడు.
‘దీని జిరాక్స్ నీ దగ్గర ఉందా?’
అతను తలూపి జేబులోంచి ఆ పేపరు తీసిచ్చాడు.
‘ఇందులో రాసిన దాని ప్రకారం మూడు నెలల క్రితం నువ్వు సొమ్ము చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ పని చెయ్యలేదు కాబట్టి అగ్రిమెంట్ చెల్లదు’
‘ఆ సంగతి కోర్టు తేలుస్తుంది’ అన్నాడు రెండో అతను.
‘అడ్వాన్సు ఇచ్చి అగ్రిమెంట్ రాయించుకుని ఆ భూమి మరొకరికి అమ్మడానికి ప్రయత్నిస్తున్నావు. ఈ పది నెలల కాలంలో భూమి ధర విపరీతంగా పెరిగింది. ఆ భూమి మరొకరికి అమ్మితే అదనంగా వచ్చే సొమ్ముతోపాటు రిజిస్ట్రేషన్ ఖర్చులు మిగులుతాయని, చేతికి మట్టి అంటకుండా డబ్బు చేతిలో పడుతుందని నీ ఆలోచన. ఓ రైతు తప్పని పరిస్థితులు ఎదురైతే తప్ప తను నమ్ముకున్న భూమిని అమ్ముకోడు. అతని అవసరాన్ని ఆసరా చేసుకుని అగ్రిమెంట్ రాసుకుని చిక్కులు సృష్టించేవు’ నల్లటి మనిషి గంభీరంగా అన్నాడు.
‘అగ్రిమెంట్ రాయడం నా దగ్గర డబ్బు లేకపోతే మరొకరికి బేరం పెట్టడం నేరం కాదు. అగ్రిమెంట్‌లో ఆరు నెలలు రాసుకుని సమయం దాటాక కూడా దానికి విలువ ఉంటుంది. ఇప్పుడు నేను కోర్ట్‌కి వెళితే ఆ తగవు తేలడానికి ఏళ్లు పడుతుంది. అందుచేత రిజిస్ట్రేషన్ చేసేవరకూ ఆగడం మంచిది.’
నల్లటి మనిషి చిన్నగా నవ్వేడు.
‘నువ్వు నేరం చేశావని నేను అనడం లేదు కాని తప్పు మాత్రం చేసావు. కూతురు పెళ్లి చెయ్యాలని, కొన్ని అప్పులు తీర్చాలని భూమి అమ్మకానికి
పెట్టాడు. సమయానికి
నువ్వు రిజిస్ట్రేషన్ చెయ్యకుండా అతనికి కొత్త సమస్యలు సృష్టించావు. చట్టంలోని లొసుగు ఆధారం చేసుకుని రైతుని ఇబ్బందుల్లో పెట్టి ఏకపక్షంగా లాభపడాలని చూస్తున్నావు. బాకురుగూడ ప్రజలు అమాయకులే కాదు మంచివాళ్లు కూడా! నీకు మూడు రోజులు గడువిస్తున్నాను. మొత్తం పైకం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకో..’ చెప్పాడు.
‘అంత తక్కువ సమయంలో డబ్బు తేలేను’ రెండో వ్యక్తి అన్నాడు.
‘అదే చివరి మాటా?’
‘అవును’
నల్లటి వ్యక్తి చేతిలోని అగ్రిమెంట్ పేపర్లని ముక్కలుగా చింపేశాడు. ఆ చర్య ఊహించక పోవడంతో అక్కడున్నవారు విస్తుబోయేరు.
‘ఇక ఆ భూమితో నీకెలాంటి సంబంధం లేదు. బేరం కుదిరి భూమి అమ్మాక నీ అడ్వాన్సు తిరిగి ఇవ్వబడుతుంది’
‘నా సంగతి మీకు తెలియదు..’ ఆవేశంతో ఊగిపోయాడు రెండో వ్యక్తి.
‘ఈ గొమాంగో తగవు తీర్చాక నీ మాట ఎవరూ వినరు’
రెండో వ్యక్తి తన వాళ్లతో అక్కడ నుంచి విసురుగా నిష్క్రమించాడు. అప్పుడు గమనించాడు నల్లటి మనిషి, పక్కనే నిలబడిన కొత్త వ్యక్తిని.
‘మీరెవరు?’ అడిగాడతను.
‘నా పేరు యుగంధర్. మీతో మాట్లాడాలని విశాఖపట్నం నుంచి వచ్చాను’
‘కూర్చోండి’
యుగంధర్ కూర్చున్నాక ఒక మనిషి గ్లాసుతో కొబ్బరి నీళ్లు ఇచ్చాడు. ఈలోపు తన ఊరు వ్యక్తికి కొన్ని సూచనలు ఇచ్చి అందర్నీ పంపేశాడు.
‘అంత దూరం నుంచి నా కోసం వచ్చారా?’ యుగంధర్ని చూస్తూ ఆశ్చర్యంగా అడిగేడు.
‘దేవరాజ్ పాత్రో కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి’ అన్నాడు యుగంధర్.
గొమాంగో నొసలు ముడిపడింది.
‘ఆ కుటుంబం వివరాలు మీకెందుకు?’ అడిగేడు.
‘దేవరాజ్ కూతురు రాజరాజేశ్వరి విశాఖపట్నంలో చనిపోయింది. ఆమె రక్త సంబంధీకుల కోసం వెదుకుతున్నాను’
‘రాజరాజేశ్వరి తల్లిదండ్రులు గతించి నాలుగేళ్లు దాటింది. ఈ గ్రామంలో ఆమెకి కాస్తో కూస్తో నేను తప్ప చుట్టాలు లేరు’
‘రాజరాజేశ్వరిని మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నారట?’
గొమాంగో పెదాల మీద చిరునవ్వు కదిలింది.
‘అప్పటికి నాకు ఇరవై. ఆమెకి ఇరవై రెండేళ్లు. రాజరాజేశ్వర్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక నాకు తీవ్రంగా ఉండేది. కాని ఆమె తండ్రి వయసు తేడా చూపించి వద్దన్నాడు. అయినా నేను వదలకుండా ఆమె వెనుక తిరిగేవాడిని. అప్పుడే చదువు చెప్పించాలనే సాకుతో సాలూరు పంపేశారు. ఆమెని ఆ ఊరు పంపిన విషయం కూడా నాకు తెలియదు. ఓ కుర్రాడితో రాజరాజేశ్వరి లేచిపోయిందని తర్వాత తెలిసింది. నాకు పెళ్లి మీద విరక్తి పుట్టింది. ఈలోపు దేవరాజ్ రెండో కూతురు సుకాంతికి పదిహేనేళ్లు వచ్చాయి. ఆ పిల్లని చేసుకోమని అడిగాడు దేవరాజ్. అది కూడా ఇంట్లోంచి పారిపోయింది’
‘ఆమె ఎందుకలా పారిపోయింది?’ యుగంధర్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘నా వయసు అప్పుడు ముప్పై మూడు. దానికి పదహారు. సన్నగా, తీగలా ఉంటుంది పిల్ల. ఆరడుగుల పొడవుతో నల్లగా భీకరంగా కనిపించే నన్ను చూసి భయపడి పారిపోయిందని నా అనుమానం’ నవ్వేడు గొమాంగో.
‘మీరు పెళ్లి చేసుకోలేదా?’
‘చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు’
‘సుకాంతి కోసం వెతికారా?’
‘నా మనుషులు ఓ నెలపాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది’
‘అంటే రాజరాజేశ్వరికి చెల్లెలు తప్ప దగ్గర బంధువులు ఎవరూ లేరు. ఆ చెల్లెలు ఎక్కడుందో తెలియదు. అంతేనా?’ యుగంధర్ గొంతులో అసహనం.
‘అంతే. ఎక్కడో చనిపోయిన ఓ మనిషి బంధువుల కోసం మీరెందుకు అంత పట్టుదలగా వెతుకుతున్నారు?’ అడిగేడు గొమాంగో.
యుగంధర్‌కి పూర్తి వివరాలు చెప్పడం ఇష్టంలేదు.
‘రాజరాజేశ్వరి నా స్టేషన్ పరిధిలో చనిపోయింది. ఆమె శరీరాన్ని మార్చురీలో జాగ్రత్త చేశాం. ఆమె బంధువులకి బాడీని అప్పగించడం నా బాధ్యత. ఎవరూ లేకపోతే అంత్యక్రియలు మేమే చెయ్యాలి’
యుగంధర్ వైపు విస్మయంగా చూశాడు గొమాంగో.
‘నేను మీకు ఏ సాయం చెయ్యలేకపోతున్నందుకు క్షమించండి. దేవరాజ్ కుటుంబంతో చుట్టరికం ఉన్నది నాకే. అందుచేత రాజరాజేశ్వరి అంత్యక్రియలకి అభ్యంతరం చెప్పేవాళ్లు ఎవరూ లేరు’
‘సుకాంతి ఫొటో ఉందా మీ దగ్గర?’ అడిగేడు యుగంధర్.
‘లేదు’
‘ఆమె ఇంట్లోంచి పారిపోయి పదేళ్లు అవుతోంది. ఈ మధ్య కాలంలో ఆమె గురించి మీకు ఎలాంటి కబురు తెలియలేదా?’
కళ్లు మూసుకుని నుదుటి మీద కుడిచేతి వేళ్లతో కొట్టుకుంటూ ఉండిపోయాడు గొమాంగో. అతనికి అంతరాయం కలిగించడం ఇష్టంలేక వౌనంగా చూడసాగేడు యుగంధర్. కొన్ని క్షణాల తర్వాత కళ్లు తెరిచాడతను.
‘అయిదేళ్ల క్రితం నా మొదటి బిడ్డకి నామకరణం చేశాను. అప్పుడు బంధువులు చాలా చోట్ల నుంచి వచ్చారు. అందులో ఎవరో ఒకతను ఓ మాట చెప్పాడు. విశాఖపట్నం ప్రాంతంలో సుకాంతి ఓ వ్యభిచార గృహంలో కనిపించిందట. పేరు పెట్టి పిలిస్తే తిరిగి చూసి గబగబా వెళ్లిపోయిందట!’ చెప్పాడతను.
‘అది ఏ ప్రాంతమో చెప్పగలరా?’ కాస్త ముందుకి వంగేడు యుగంధర్.
‘చెప్పలేను.. ఏదో వలస అని గుర్తు’
‘నాతవలస, కొత్తవలస, తగరపు వలస...’ పేర్లు చెప్పాడు యుగంధర్.
తల అడ్డంగా ఊపేడు గొమాంగో.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994