చిత్తూరు

భక్తులు సంతృప్తిచెందేలా బ్రహ్మోత్సవాల్లో ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, సెప్టెంబర్ 27: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు సంతృప్తి కలిగించేలా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ఇఓ డాక్టర్ డి సాంబశివరావు సమీక్ష సమావేశంలో ఆయన జెఇఓ శ్రీనివాసరాజుతో కలిసి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై వివిధ విభాగాల అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ అక్టోబర్ 3నుంచి 11 వ తేదీ వరకు జరుగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 7న గరుడసేవ నాడు భక్తుల సౌకర్యార్థం అరగంట ముందుగానే రాత్రి 7.30 గంటలకు వాహనసేవను ప్రారంభిస్తామని తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గుర్తించి వాహనసేవను తిలకించాలని కోరారు. అక్టోబర్ 3న ధ్వజారోహణం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విచ్చేసి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7న గరుడసేవ, 8న పెరటాసి నెల శనివారం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను రద్దు చేసినట్లు చెప్పారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల కోసం 7 లక్షల లడ్డూలను నిల్వ ఉంచుకున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామని, ఆర్జిత సేవలు, వయోవృద్ధులు, వికలాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దుచేశామని ఇ ఓ వివరించారు. వాహనసేవలను భక్తులు సంతృప్తికరంగా తిలకించేందుకు మాడవీధులతోపాటు, రద్దీ ఉన్న బయట ప్రాంతాల్లో కలిపి 30 ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో నాణ్యమైన ప్రసారాలు చేసేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం గల కెమెరాలు, ఇతర పరికరాలను ఉపయోగిస్తున్నామన్నారు. భక్తులను ఆకట్టుకునేలా ఫలపుష్ప, మ్యూజియం, ఫోటో, ఆయుర్వేద, శిల్ప ప్రదర్శనశాలలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు ఏవైనా సమస్యలు ఎదురైతే టిటిడి కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బ్రహ్మోత్సవాల్లో భక్తుల రవాణాకోసం ఆర్‌టిసి బస్సులు రోజుకు 2 వేల ట్రిప్పులు, గరడ సేవ నాడు 3500 ట్రిప్పులు తిరుగుతాయని ఇ ఓ తెలిపారు. ఘాట్‌రోడ్డులో 8 సహాయక బృందాలు నిత్యం అందుబాటులో ఉంటాయన్నారు. గురడసేవ రోజున అర్థరాత్రి ఒంటి గంట వరకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో భక్తులు అన్న ప్రసాదాలు అందజేస్తామన్నారు. శ్రీవారి మెట్టు మార్గాన్ని 24 గంటల పాటు తెరచి ఉంచుతామని, అడవి జంతువులు రాకుండా భక్తుల భద్రత కోసం ప్రతి వంద మెట్లకు ఒక సెక్యూరిటీ సిబ్బందిని, అటవీ సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. ఈ మార్గంలో గోవింద నామస్మరణ వినిపిస్తుంటారన్నారు. శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారి మెట్టు వరకు భక్తులకు ఉచితంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. గురడ సేవ రోజున ఘాట్‌రోడ్డులో ద్విచక్రవాహనాలను నిషేధించామని, భక్తులు తిరుపతిలోని అలిపిరి వద్ద, శ్రీవారి మెట్టు వద్ద ఉన్న పార్కింగ్ స్థలాల్లో తమ ద్విచక్రవాహనాలను ఉంచుకోవాలని సూచించారు. గరుడసేవ రోజున గ్యాలరీల్లో వేచి ఉండే భక్తుల కోసం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆకట్టుకునేలా భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం తిరుమల జె ఇ ఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ తిరుమలలో ఆర్‌టిసి బస్సులను, ప్రైవేటు వాహనాలను వేరువేరు మార్గాల్లో పంపడం ద్వారా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తామన్నారు. గరుడసేవ నాడు తిరుపతిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఉచితంగా సెంట్రల్ బస్టాండ్, అలిపిరి బస్టాండ్‌లకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భక్తులు గరుడసేవ నాడు పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సూచనలకు అనుగుణంగా వాహనాలు పార్కింగ్ చేసుకోవాలని కోరారు. పెరటాసి నెలలో శుక్రవారం గరుడసేవ, శనివారం భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విస్తృతంగా క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక టిటిడి ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి ఎన్.ముక్తేశ్వరరావు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాదనీరాజనం వేదికపై ఉదయం మంగళధ్వని, చతుర్వేద పారాయణం, సాయంత్రం అన్నమయ్య విన్నపాలు నామసంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రముఖ కళాకారులు పాల్గొంటారని తెలిపారు. అదేవిధంగా తిరుమలోని ఆస్థానమండపంలో ఉదయం ధార్మికోపన్యాసాలు, సాయంత్రం గుజరాతి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. అనంతరం టిటిడి చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ మాడ వీధుల్లో బారికేడ్లు, క్యూలైన్ల గేట్లు పటిష్టంగా ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. నిపుణులను సంప్రదించి భక్తులను ఆకట్టుకునేలా విద్యుద్దీపాలంకరణ చేపడుతున్నామని తెలిపారు. ఈసారి వాహనాల పార్కింగ్ స్థలాలను పెంచామన్నారు. అలానే టిటిడి వి ఎస్ ఓ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు పోలీసు విభాగంలో సమన్వయం చేసుకొని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. అనంతరం ఎస్వీబీసీ సిఇఓ ఎ.వి నరసింహారావు మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవాన్ని భక్తులకు అందించేలా ప్రసారాలు చేస్తామని తెలిపారు. వాటర్‌మార్క్‌తో మీడియా ఛానళ్లకు లైవ్‌ఫీడ్ ఇస్తామన్నారు. చివరగా ఎస్వీ నిత్యాన్న ప్రసాదం ట్రస్టు ప్రత్యేకాధికారి చెంచులక్ష్మి మాట్లాడుతూ గరడసేవనాడు గ్యాలరీల్లోని భక్తులకు ప్రతి గంటకు ఒకసారి అన్నప్రసాదాలు అందిస్తామన్నారు. మొత్తం 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు అందజేస్తామన్నారు. అంతకుముందు ఇ ఓ నిర్వహించిన సమీక్షలో టిటిడి ఎస్ ఇ-2 రామచంద్రారెడ్డి, ట్రాన్స్‌పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, డెప్యూటీ ఇ ఓ లు కోదండరామారావు, విజయసారధి ఇతర అధికారులు పాల్గొన్నారు.