చిత్తూరు

ఆంధ్రప్రదేశ్‌కు మహర్దశ మా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌కు మహర్దశ కల్పించడమే లక్ష్యంగా కేంద్రం సహకారం అందిస్తూందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రత్యేక దృష్టి, ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక సహాయం నినాదంతో ఎపికి మహా ప్యాకేజి ఇప్పించడంలో కృషిచేసిన వెంకయ్యనాయుడుకు జిల్లా బిజెపి శనివారం తిరుపతి పి ఎల్ ఆర్ క కల్యాణ మండపంలో సన్మానసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడానికి వెంకయ్యనాయుడు రేణిగుంట విమానాశ్రయంలో దిగగానే సుమారు 2నుంచి 3వేల మంది పలు జిల్లాలకు చెందిన బిజెపి నేతలు, కార్యకర్తలు తరలివచ్చి ఘనంగా స్వాగతం పలికారు. అక్కడనుంచి స్కూటర్ ర్యాలీతో వెంకయ్యనాయుడు వాహనంపై ఎక్కి రోడ్డుమార్గాన సభావేదిక ప్రాంగణంలోకి చేరుకున్నారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రాంగణం చేరుకోవడానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వెంకయ్యకు బారీ స్వాగతం లభించింది. ఈసందర్భంగా వెంకయ్యనాయుడు సభను ఉద్దేశించి మాట్లాడుతూ విభజన చట్టానికి సంబంధించి కాంగ్రెస్‌పార్టీ చేసిన తప్పిదాలను తాను నిలదీసిన విధానాన్ని వివరించారు. అంతేకాకుండా ప్రత్యేకహోదా చట్టంపై అవగాహన లేకుండా విపక్షాలు రాష్ట్రానికి మేలుచేసే ప్యాకేజిలను విమర్శించే విపక్షాల పైన కూడా ఆయన తనదైన శైలిలో పిట్టకథలు చెబుతూ విమర్శనాస్త్రాలు సంధించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిసహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల విలువచేసే ప్రాజెక్టులను మంజూరుచేసిందో, వాటికి పునాదిరాయి వేసిందో వివరించారు. వెనుకబడిన జిల్లాలైన అనంతపూర్, కర్నూలు, కడప లాంటి ప్రాంతాలనే కాకుండా నెల్లూరు, శ్రీకాకులం, వైజాగ్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఇందులో ఉపాధి అవకాశాలు పెంచే కారిడార్లు, పరిశ్రమలు, విద్యారంగాన్ని అభివృద్ధిపరిచేందుకు చేపట్టిన కార్యక్రమాలు తెలిపారు. రహదారులు, అంతర్జాతీయవిమానాశ్రయాలు, రైలుమార్గాల అభివృద్ధి, తిరుపతిలో అంతర్జాతీయ రైల్వేస్టేసన్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. ఇందుకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నామో కూడా వివరించారు. వెంకయ్యనాయుడు ప్రధానంగా ప్యాకేజి, ప్రత్యేకహోదాకు సంబంధించి ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడంపైనే ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రత్యేకహోదా ఎవరికిస్తారంటే పొరుగుదేశాల సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలకు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు, అటవీప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు, ఆర్థికంగా వెనుకబడి ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఇస్తారన్నారు. ఆ పరిస్థితి ఆంధ్రప్రదేశ్‌కు లేదని, అందుకే ప్రత్యేక ప్యాకేజి ఇచ్చామన్నారు. మరి రాజ్యసభలో ప్రత్యేకహోదాపై ఎందుకు ప్రస్తావించాననే ప్రశ్న వేయడం సహేతుకమని, విభజనలో కాంగ్రెస్ పుణ్యమా అంటూ ఆంధ్రప్రదేశ్‌కు లోటు బడ్జెట్ ఏర్పడిందన్నారు. ఆలోటును పూడ్చటానికే కొనే్నళ్లపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని తాను డిమాండ్ చేయడం జరిగిందన్నారు. తాను వేడిలో మాట్లాడానని అనని మాటను అన్నట్లు పత్రికలో రాయడమే కాకుండా ఆపత్రికాధినేత విష ప్రచారం కూడా చేశారన్నారు. తానన్నది ఆ వేడిలో ప్రత్యేకహోదాను చట్టంలో చేరిస్తే వేడిలోవేడి అయిపోతుందని వ్యాఖ్యానించానన్నారు. ఒక సమాచార శాఖామంత్రిగా ఉన్న తన వ్యాఖ్యలనే వక్రీకరించి వార్తలు రాయడమంటే ఇక పరిస్థితేమిటో అర్థం చేసుకోవాలన్నారు. కాంగ్రెస్‌పార్టీ విభజన చట్టంలో అవకాశాలను పరిశీలించాలని, 10 ఏళ్లలోపు చేయాలని చెప్పిందే తప్ప నిర్దుష్టంగా చేయమని చట్టాల్లో ఎక్కడా పొందుపరచలేదని ఆయన తనవద్ద ఉన్న ఆధారాలను సభకు చదివి వినిపించారు. 50యేళ్లపాటు ఈ భారతదేశాన్ని పాలించిన కాంగ్రెస్ నాయకులు తప్పులుచేసి కూడా తమను ప్రశ్నిస్తున్నారంటే వారు ఎంత తెలివితేటలున్నవారో అర్ధం అవుతోందన్నారు. మరోగమనించదగ్గ విషయం ఏమిటంటే ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే ఆంధ్రాను ఆదుకునేవిధంగా అనేక చర్యలు చేపట్టారన్నారు. అయినా కాంగ్రెస్‌పార్టీ, విపక్షాలు గగ్గోలు చేస్తున్నాయన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు 1981లో పునాదిరాయి పడ్డా ఒరిగిందేమీ లేదని, ఆ పునాదిరాయి అనాదిరాయిగా మారిందన్నారు. అయితే తాము 2014లో అధికారంలోకి వచ్చి బాధ్యతలు చేపట్టిన తొలి క్యాబినెట్ సమావేశంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేయాలని నిర్ణయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రత్యేకహోదావస్తే ప్రతిజిల్లా ఒక హైదరాబాద్ అవుతుందని కాంగ్రెస్‌నేతలు చెప్పడం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ అభివృద్ధి చెందడంలో వెంకట్రావ్, కొంత వరకు చెన్నారెడ్డి, అటుతరువాత ఎన్టీ ఆర్, చంద్రబాబు, వై ఎస్ ఆర్ లాంటి వార్లు హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడంతోనే అభివృద్ధిచెందిందన్నారు. అలాంటి హైదరాబాద్ తెలంగాణకు పోయిందన్నారు. ఈపరిస్థితుల్లో అన్ని జిల్లాలను అభివృద్ధి పరచాలన్నదే కేంద్రంలో తాను, ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు యోచిస్తూ ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ఈ పరిస్థితిలోనే ప్రత్యేకహోదా కన్నా ప్యాకేజితోనే ఆంధ్రరాష్ట్రం అభివృద్ధిచెందుతుందని భావించి నిర్ణయం తీసుకొని బంగారులడ్డులాంటి ప్యాకేజి ఇచ్చామన్నారు. అయితే ఆ ప్యాకేజి పాచిపోయిన లడ్డూలా కొంత మందికి ఎందుకు అనిపించిందో తనకు అర్థంకావడంలేదని ఆయన పరోక్షంగా పవన్‌వ్యాఖ్యలపై స్పందించారు. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడానికి కూడా కేంద్రం దృష్టిసారిస్తోందన్నారు.మన్నవరంకు సంబంధించి తాను అధికారులతో, మంత్రులతో మాట్లాడటం జరిగిందన్నారు.ప్రస్తుతం అక్కడ విద్యుత్ ఉపకరణల ఉత్పత్తులలో భాగంగా కండెన్సర్లు తయారుచేస్తున్నారని , వాటికి మార్కెట్ లేదని, డిమాండ్ రాగానే తయారుచేస్తామని తనకు చెప్పడం జరిగిందన్నారు.మంగళ, బుధవారాల్లో తాను ఎన్ టి పి సి , బి హెచ్ ఇ ఎల్ అధికారులతోనూ, కేంద్ర మంత్రులతోనూ తన ఛాంబర్‌లో సమావేశం కానున్నట్లు తెలిపారు. కొంత మంది కులప్రస్తావన కూడా చేస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. తన పేరు వెనక గాంధీ పేరు పెట్టుకొని వారసత్వపు రాజకీయాల్లోకి రాలేదని నీతి, నిజాయితీ, నిబద్దతలు జవసత్వాలుగా రాజకీయాల్లోకి వచ్చానన్నారు. తాను ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంపిక కానని, గతంలో కర్ణాటక నుంచి ఎంపికయ్యానని, అపుడు అక్కడివారు కర్ణాటక నుంచి ఎన్నికై ఆంధ్రాకు సహాయం చేస్తున్నారని విమర్శలు కూడా చేశారన్నారు. అందుకే ఈమారు రాజస్థాన్ నుంచి ఎంపిగా ఎంపికయ్యానన్నారు. తాను దేశంలో ఏ రాష్ట్రంలో వారైన తమ ప్రాంతంనుంచి ఎంపిగా పోటీచేయమని ఆహ్వానిస్తున్నారని, అందుకు కారణం తాను వ్యక్తులతో, పార్టీలతో సంబంధం లేకుండా అభివృద్ధిపై దృష్టి పెడుతుండటమే అన్న సత్యాన్ని విమర్శకులు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో సార్క్ లాంటి సమావేశాలు నిర్వహించాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అలాగే తిరుపతిలో కూడా అంతర్జాతీయ సెమినార్‌లు కూడా నిర్వహించే విధంగా కూడా అభివృద్ధి చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా 9.35 లక్షల ఇళ్లు నిర్మిస్తూంటే ఒక ఆంధ్రరాష్ట్రానికే లక్షా 93వేల 145 ఇళ్లు ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మంజూరుచేయించానంటే ఈ రాష్ట్రంపై తనకున్న అభిమానం ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఇక విద్యుత్ కొరతతో విలవిలలాడుతున్న ఆంధ్రరాష్ట్రాన్ని విద్యుత్ వెలుగుల్లో కళకళలాడించే విధంగా ఉత్పత్తులు చేపడుతామన్నారు. అయితే ఈరోజు తాను వస్తున్నపుడు తనవెంట వచ్చిన యువతను, ప్రజలను చూస్తుంటే ప్రత్యేకహోదాపై ప్రజలే నాయకులకన్నా తెలివైన వాళ్లని తేలిందన్నారు. ఇక 2015 జనవరి 1నుంచి 2020వ సంవత్సరం వరకు పరిశ్రమలు ఏర్పాటుచేసేవారికి కేంద్ర ప్రభుత్వం వినూత్న రాయితీలను ఇచ్చి ప్రోత్సహిస్తోందని , ఇందుకు సంబంధించిన సిబిడిటి జి ఓ శుక్రవారం జారీ చేసినట్లు ఆయన సభికులకు చూపించారు. ఇక విజయవాడ కేంద్రంగా దూరదర్శన్‌లో తెలుగు కార్యక్రమాలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. అలాగే ఆల్ ఇండియా రేడియోకు సంబంధించి కూడా విజయవాడను కేంద్రంగా చేసి పింగళివెంకయ్య ఆల్ ఇండియా ఆకాశవాణి రేడియో పేరుతో ప్రసారాలు ప్రారంభమయ్యేవిధంగా చర్యలు చేపట్టామన్నారు. స్వచ్ఛ్భారత్‌కు సంబంధించి ప్రధాని నరేంద్రమోదీ తిరుమలలో పరిశుభ్రతను చూసి అందరూ నేర్చుకోవాలని చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఈ సభలో ప్రస్తావించారు. అలాగే ఆంధ్ర ఎక్స్‌ప్రెస్ తెలంగాణకు వెళ్లిపోయిన నేపథ్యంలో ఎపి ఎక్స్‌ప్రెస్ రైలు విజయవాడ నుంచి నడిచేవిధంగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఎల్ ఇడి లైట్ల ఏర్పాటుతో 30 శాతం విద్యుత్ ఆదా చేయడమే కాకుండా బిల్లుల్లో కూడా రాష్ట్రప్రజలకు భారంలేకుండా చేశామన్నారు. కొంత మంది ప్రతిపక్షాలకు సంబంధించిన ఎంపిలు, ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతామని తనను సంప్రదించినా ప్రోత్సహించలేదన్నారు. పార్టీలు మారడం తప్పుకాదని, ఆ పార్టీలో ఉన్న పదవికి రాజీనామా చేసి పార్టీ మారవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్, మాణిక్యాల రావు, ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ, ఎంపి శివప్రసాద్, ఎమ్మెల్సీ గౌనిగారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సుగుణమ్మ, తలారి ఆదిత్య, టిటిడి చైర్మన్ చదలవాడకృష్ణమూర్తి, నాయకులు శాంతారెడ్డి, చిలకం రామచంద్రారెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, చల్లపల్లి సరసింహారెడ్డి, కోలా ఆనంద్, చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యయాదవ్, జల్లి మధుసూధన్, తదితరులు పాల్గొన్నారు.

సామాజిక న్యాయం కోసమే ఎస్సీ వర్గీకరణ
మాలలు, మాదిగలు అందరికీ తగిన సామాజిక న్యాయం చేయడం కోసమే ఎస్సీ వర్గీకరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడు తన ప్రసంగంలో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై ఎందుకు జోక్యం చేసుకున్నావని కొంతమంది తన శ్రేయోభిలాషులు ప్రశ్నించారన్నారు. జనాభా దామాషా ప్రకారం అందరికీ న్యాయం చేయాలన్నదే తన ఆలోచన అన్నారు.
సైనికులు నడిచి వెళ్లి ముష్కరుల శిబిరాలపై దాడిచేశారు
శాంతిని కాంక్షించే భారతదేశంపై ముష్కరులు విర్రవీగిన నేపథ్యంలో భారత సైనికులు 3,5,8 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి ఉగ్రమూకల శిబిరాలపై దాడులుచేసి వచ్చారని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. ఆయన తన ప్రసంగంలోమాట్లాడుతూ సైనికులు హెలికాప్టర్లలో వెళ్లినట్లు చెబుతున్నారని, అది వాస్తవం కాదని, కాలి నడకనే వెళ్లి దాడులుచేసి వచ్చారన్నారు. ఈ చర్యలను యావత్ భారతదేశ ప్రజలంతా ముక్తకంఠంతో అభినందిస్తూ స్వాగతిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాలు అందరూ మెచ్చేలా ఉంటాయన్నారు.

అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణోత్సవం
* భక్తులతో పోటెత్తిన వేయ్యేళ్ల చరిత్రగల బేటరాయస్వామి కొండ
కుప్పం, అక్టోబర్ 1: వేయి సంవత్సరాలు చరిత్ర కలిగిన బేటరాయస్వామి కొండవద్ద శనివారం జరిగిన శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు. మండల పరిధిలోని అందరి ప్రభుత్వ అధికారుల సమన్వయంతో సిఎం పిఎ మనోహర్‌తో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు మొట్టమొదటి సారిగా మండల పరిధిలోని బేటరాయస్వామి కొండ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో శనివారం తిరుమల, తిరుపతి దేవస్థానం వారి తరపున కల్యాణోత్సవం నిర్వహించారు. కుప్పం నియోజకవర్గం నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా అత్యధిక సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో కొండ ప్రాంతం మొత్తం భక్తులతో కిక్కిరిసి పోయింది. సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులు ఆలయానికి రాకపోకలు సాగించాయి.