చిత్తూరు

మరోమారు సెలవులో స్విమ్స్ డైరెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 5: అమెరికాలో ఉంటున్న డాక్టర్ టి ఎస్ రవికుమార్‌ను స్విమ్స్ డైరెక్టర్‌గా నియమిస్తే స్విమ్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతుందని సి ఎం చంద్రబాబునాయుడు భావించి ఆయన్ను నియమించారు. అయితే స్థానిక అధికార పార్టీలోని నాయకులు టెండర్లు తమకు దక్కించాలంటూ డాక్టర్ రవికుమార్‌పై ఒత్తిడి తీసుకురావడంతో ఆయన కొంత అసహనానికి లోనవుతున్నారు. ఈక్రమంలోనే ఆదివారం నుంచి 13 రోజుల పాటు సెలవు పెట్టి అమెరికాకు వెళ్లారు. గతంలో ఒక మారు ఇలాంటి పరిస్థితులతోనే ఆయన సెలవుపై వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకొని పరిపాలనా విషయంలో పూర్తి స్వేచ్ఛ కల్పించారు. అయితే స్థానిక టిడిపి నేతలుమాత్రం ఒక మంత్రి అండతో ఆయనచేత అక్రమమైన పనులుచేయించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చారు. ఇందులో భాగంగానే ఇటీవల పలు టెండర్లను కూడా రద్దుచేశారు. ముక్కుసూటిగా పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ఉన్న డైరెక్టర్ డాక్టర్ రవికుమార్‌కు ఇది మింగుడు పడలేదు. ఈ నేపథ్యంలో ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. వాస్తవానికి డాక్టర్ రవికుమార్ స్విమ్స్‌డైరెక్టర్‌గా రెండోవిడత బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి స్విమ్స్‌ను ప్రగతి పథంలో నడపటానికి అనేక చర్యలు చేపడుతున్నారు. అంతేకాకుండా స్విమ్స్‌లో ఉన్న రోగులకు సేవలందించడంలో విశేష కృషిచేస్తున్న ఉద్యోగులను గుర్తించి అభినందించి ప్రోత్సహిస్తున్నారు. వారికి అవసరమైన ఉద్యోగ ఉన్నతులు కల్పించి వారి మన్ననలు కూడా పొందారు. నిజాయితీ పరులైన అధికారి ని సైతం అవినీతి బురద పూయడంలో టిడిపి, బిజెపి నేతలు ప్రయత్నిస్తుండడం దురదృష్టకరమని, రోగులు సైతం ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే స్విమ్స్‌కు అనుబంధంగా ఉన్న శ్రీ పద్మావతి మెడికల్ కళాశాల రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న వాసుదేవరెడ్డి తన రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేశారు. అలాగే హనుమంతరావుఅనే మరో అధికారి కూడా ప్రస్తుతం తాను ఉన్న పదవి నుంచి తప్పించాలంటూ డైరెక్టర్ కోరినట్లు కూడా సమాచారం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్విమ్స్‌ను అభివృద్ధి పథంలోనడపాలని చూస్తుంటే అధికార పార్టీకి చెందిన నాయకులు అవినీతి మయం చేస్తున్నారని విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి.
టెండర్ల రద్దుప్రక్రియ తన సెలవుకు కారణం కాదు
- డైరెక్టర్ డాక్టర్ రవికుమార్
కాగా తన సెలవుకు కారణం టెండర్ల రద్దు అధికార పార్టీనాయకుల ఒత్తిళ్లు కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ శనివారం ఒక ప్రకటన విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్విమ్స్ ఒప్పంద ఉద్యోగుల కాంట్రాక్ట్ టెండర్ల ప్రక్రియ నియమనిబంధనలకు లోబడిలేనందున రద్దుచేయడం జరిగిందన్నారు. రీ-టెండర్లు చేపట్టాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పారదర్శకంగా టెండర్లు చేపట్టాలన్నదే తమ లక్ష్యం అన్నారు.తాను సెలవుపై విదేశాలకు వెళ్తుండటం సంస్థ అభివృద్ధి కోసమేనని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఇందులో ఎవరి ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు.
స్విమ్స్ అక్రమాలను ప్రోత్సహిస్తున్న మంత్రి కామినేని శ్రీనివాస్ రాజీనామా చేయాలి
-నవీన్‌కుమార్ రెడ్డి డిమాండ్
ఇదిలా ఉండగా ఈ అంశాలపై రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి కామినేని శ్రీనివాస్ సహకారంతో స్విమ్స్‌లో అవినీతి పెట్రేగిపోతుందని ఆరోపించారు. ఓ వైపు అధికార పార్టీకి చెందిన నాయకులు, మరోవైపు బిజెపి నాయకులు స్విమ్స్‌ను దోచుకుతినడానికి బరితెగిస్తున్నారన్నారు. టిటిడి నిధులతో నడుస్తున్న స్విమ్స్ ఔట్‌సోర్సింగ్ టెండర్లను పారదర్శకంగా జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికే 3 పర్యాయాలు అధికార పార్టీ బలంతో టెండర్లను రద్దుచేసిన విషయాన్ని ఈసందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్విమ్స్ అసుపత్రి నిబంధనలకు లోబడి టెండర్లు జరిగితే సి ఎం ఇచ్చిన జి ఓనెంబర్ 68 ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.18వేలు వేతనం వస్తుందన్నారు. ప్రస్తుతం బిజెపి, టిడిపి నేతలు ఈ టెండర్లను దక్కించుకొని కార్మికులకు రూ.9వేలు చెల్లిస్తున్నామన్నారు. స్విమ్స్‌లో వెట్టిచాకిరి చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి స్థానిక లేబర్ కమిషనర్ అధికారులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడంలేదన్నారు. మందులు కొనుగోలు విషయంలో కూడా అధికార పార్టీ నేతలదే పెత్తనంగా మారిందన్నారు. ఇంత జరుగుతున్నా టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు అక్రమాలపై వౌనం వహించడం తగదన్నారు. ముఖ్యమంత్రి తాను నిప్పుఅని చెప్పుకుంటుంటే స్థానిక నేతలు మాత్రం తాము తప్పు అన్నచందాన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ అవినీతి అక్రమాల వెనుక ముఖ్యమంత్రి బంధువులు అని చెప్పుకుంటున్న వ్యక్తుల హస్తం కూడా ఉందన్నారు. ఈ అవినీతిలోభాగస్వామి అయిన ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. స్విమ్స్‌లో పారదర్శకత లోపిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్న, వెంకట్, బాబు, అమర్,కేశవ్, ప్రసన్నకుమార్, మహేష్, అనిల్‌కుమార్, రమణ తదితరులు పాల్గొన్నారు.
స్విమ్స్‌లో ముగిసిన విజిలెన్స్ అవేర్‌నెస్ వారోత్సవాలు
స్విమ్స్‌లో వారంరోజుల పాటు నిర్వహించిన విజిలెన్స్ వారోత్సవాలు శనివారం ఉదయం ఘనంగా ముగిసినట్లు స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ తెలిపారు. ఈ వారంరోజులపాటు అవినీతిని నిర్మూలించడానికి తీసుకోవాల్సిన అనేక అంశాలను చర్చించామన్నారు. అంతేకాకుండా సిబ్బంది, విద్యార్థుల చేత కూడా ప్రతిజ్ఞ చేయించామన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు అవినీతి నిరోధక అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ముగింపు సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ టిసి కళావత్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అధికారులు అనర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేస్తే సస్పెండ్ చేస్తాం
* మంత్రి బొజ్జల హెచ్చరిక
పీలేరు, నవంబర్ 5: పీలేరు నియోజకవర్గ పరిధిలోని మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు అనర్హులకు చేరవేస్తే అధికారులను సస్పెండ్ చేస్తామని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాత్రి పీలేరు ఎంపిడివో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పడమటి మండలాలను కరువుమండలాలుగా ప్రకటించడం జరిగిందని, వేరుశనగ పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్‌పుట్ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాకు కేటాయించిన ఎన్ టి ఆర్ గృహాలను అన్ని గ్రామాలలో అర్హులను గుర్తించి అంచలవారీగా అర్హులకందరికీ ఎన్‌టి ఆర్ పక్కాగృహాలు అందేటట్లు అధికారులు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలని ఆయన అన్నారు. రెవెన్యూశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆదాయ ధృవపత్రం, రెసిడెన్సిషల్ సర్ట్ఫికెట్, బర్త్ సర్ట్ఫికెట్‌లను ఇవ్వకూడదని, వీటికి అనుబంధంగా ఆధార్‌కార్డు, బియ్యంకార్డు, ధ్రువీకరణపత్రాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ పథకాల్లో విద్యార్థులు లబ్ధి పొందాలని ఆయన తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో అన్ని శాఖల అధికారుల పనితీరును ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సాయిప్రతాప్, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, జడ్పి చైర్మన్ గీర్వాణిచంద్రప్రకాష్, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాధ్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
‘వడ్డెరుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి’
రాష్ట్రంలో వడ్డెరుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తోందని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఓ ప్రైవేటు కల్యాణమండపంలో రాష్ట్ర వడ్డెరుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ జరిగింది. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశంపార్టీ బడుగు, బలహీన వర్గాలకు చెందిన పార్టీ అని , పేద ప్రజలు ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందారని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర వడ్డెరుల ఫెడరేషన్ చైర్మన్ మురళి, మాజీ మంత్రి సాయిప్రతాప్, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాధ్‌రెడ్డి, నాయకులు చింతగింజల శ్రీరామ్, కేశవర్థన్, రమాదేవి, కన్నయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం
చిత్తూరు జిల్లాలో పీలేరులో సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం నియోజకవర్గంలోని గుర్రంకొండ, కలికిరి మండలాల్లో జరుగుతున్న జనచైతన్య, సభ్యత్వ నమోదు కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళుతూ పీలేరులో మంత్రి తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలతో మట్లాడారు. పీలేరులో ఎల్ బి ఎస్ రోడ్డును వెడల్పుచేపడతామని ఎన్ హెచ్ అధికారులు మార్కింగ్ ఇచ్చారని మంత్రికి స్థానిక వ్యాపారస్తులు వినతిపత్రం అందజేశారు. మంత్రి స్పందిస్తూ పీలేరులో వ్యాపారులకు ఇబ్బంది లేకుండా బైపాస్‌రోడ్డును ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. అదేవిధంగా మదనపల్లి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, వ్యాపారులను వేధింపులకు గురిచేస్తున్నారని మంత్రికి ఫిర్యాదుచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే జివి శ్రీనాధ్‌రెడ్డి, నాయకులు బాబురెడ్డి, కేశవర్థన్, సుబ్రహ్మణ్యం, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
‘శంషాబాద్’ తరహాలో తిరుపతి ఎయిర్‌పోర్ట్
* నగర పాలక సంస్థ కమిషనర్ వెల్లడి
తిరుపతి, నవంబర్ 5: శంషాబాద్ విమానాశ్రయ కేంద్రం తరహాలో తిరుపతి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దుతామని నగర పాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్ తెలిపారు. నగర పాలక సంస్థ, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఎయిర్ పోర్ట్ విమానాశ్రయాన్ని సుందీకరిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఈ నేపథ్యంలో శనివారం ఆయన తుడా కార్యదర్శి మాధవీలతతో కలిసి సుందరీకరణ పనులను పరిశీలించారు. ఇందులో భాగంగా ఎయిర్‌పోర్టు ప్రాంతంలో పేరుకుపోతున్న చెత్తాచెదారాన్ని గమనించి వాటిని ఎప్పటికప్పుడు శుభ్ర పరచుకోవాలని ఆయన ఎయిర్ పోర్ట్ అధికారులకు సూచించారు. అలాగే తుడా అధికారులతో మాట్లాడుతూ విమానాశ్రయం రోడ్డు మార్గానికి ఇరువైపులా కొత్తరకం పూలమొక్కలు నాటించి వాటికి జియో ట్యాగింగ్ చేయాలని, అలాగే మొక్కల సంరక్షణకు కల్ల వేయాలని సూచించారు. మొక్కల పరిరక్షణపై తుడా, ఎయిర్‌పోర్ట్‌ల సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూండాలని ఆదేశించారు. వాటర్ ఫౌంటేన్‌కు రంగురంగుల లైట్లు, మ్యూజిక్ సిస్టమ్ అమర్చి ఈ ప్రాంతం గ్రీన్‌పార్కులా ఉండేవిధంగా చేయాలన్నారు. తిరుపతి విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో విదేశాల నుంచి ప్రయాణీకులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారని, ఈనేపథ్యంలో విమానాశ్రయ ప్రాంతమంతా తిరుపతి ప్రతిష్టను ఇనుమడింపచేసేలా ఉండాలని ఆదేశించారు. ఆయన వెంట ఇంజనీరింగ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్ అథారిటీ మేనేజర్ రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుపతి, నవంబర్ 5: కేరళ రాష్ట్ర గవర్నర్ సదాశివం శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జెఇఓ కెఎస్ శ్రీనివాసరాజు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. భారతదేశ మాజీ క్రికెటర్ వివి ఎస్ లక్ష్మణ్ శనివారం తెల్లవారుజామున సుప్రభాతసేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం బేడి ఆంజనేయస్వామి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద లక్ష్మణ్ సతీమణి కార్తీక దీపం వెలిగించి కొబ్బరికాయకొట్టి మొక్కులు తీర్చుకున్నారు.

11న కౌశిక ద్వాదశి
* తిరుమల మాడవీధుల్లో భక్తులకు దర్శనమివ్వనున్న ఉగ్ర శ్రీనివాసులు
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, నవంబర్ 5: శ్రీవారి గర్భాలయంలో కొలువుదీరి ఉన్న పంచబేరుల్లో ఒకరైన ఉగ్ర శ్రీనివాసమూర్తి ఈనెల 11న కౌశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. పంచలోహాలతో తయారైన ఈ ఉగ్ర శ్రీనివాసమూర్తిని ఏడాదిలో కౌశిక ద్వాదశి పర్వదినాన్నిమాత్రమే ఆలయం వెలుపలకు తీసుకొస్తారు. ఏడాది పూర్తిగా ఆయన్ను మూలవిరాట్టు సన్నిధిలోనే కొలువుదీరుస్తారు.
బాబు అభీష్టం మేరకు అన్నివిధాలా స్విమ్స్ అభివృద్ధి
* టిటిడి చైర్మన్ చదలవాడ వెల్లడి

తిరుపతి, నవంబర్ 5: స్విమ్స్‌ను దేశంలోనే ఒక గొప్ప ఆసుపత్రిగా రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారని, ఆయన అభీష్టం మేరకే ఆ దిశగా ముందుకు సాగుతామని టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అన్నారు. శనివారం స్విమ్స్ రేడియేషన్ ఆంకాలజీ అసోసియేషన్ ఆఫ్ రేడియో థెరఫీ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానిక హోటల్ మినర్వాగ్రాండ్‌లో 20వ సంవత్సరిక జాతీయ సదస్సును ఆయన జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడుతున్న రోగుల సంఖ్యరోజు రోజుకూ పెరుగుతోందన్నారు. ఈనేపథ్యలో క్యాన్సర్ బాధితులకు స్విమ్స్ ఆంకాలజీ విభాగంలో అధునాతన వైద్యసేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు. ఇందుకు గాను రూ.15కోట్లను క్యాన్సర్ విభాగానికి నిధులు కేటాయించామన్నారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు స్విమ్స్‌లో ఒక ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ఏర్పాటుచేయడానికి కృషిచేస్తున్నామన్నారు. ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అట్రీకాన్ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కొత్తరేడియేషన్ టెక్నిక్ ద్వారా క్యాన్సర్ వ్యాధికి వైద్యం అందించడం, రేడియోథెరఫీ చికిత్స చేసే సమయంలో క్యాన్సర్ సెల్స్‌తో పాటు ఆరోగ్యవంతమైన సెల్స్ దెబ్బతినకుండా వైద్య సేవలు అందించడంపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఇన్‌చార్జ్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్, డాక్టర్లు సత్యనారాయణ, డాక్టర్ కళావత్, డాక్టర్ జనార్థనరావునాయుడు , డాక్టర్ స్వప్న, డాక్టర్ పిబి దాస్, డాక్టర్ యాదగిరి, దేశం నలుమూలల నుంచి వైద్యుడు పి ఆర్వో రాజశేఖర్, సురేష్‌కుమార్, అమరేంద్ర, సుందరాజు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే
జనచైతన్యయాత్ర లక్ష్యం

చంద్రగిరి, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ప్రజలే ధ్యేయంగాప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే జనచైతన్యయాత్రల ప్రధాన లక్ష్యమని మాజీ మంత్రి, చంద్రగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ గల్లా అరుణకుమారి అన్నారు. శనివారం చంద్రగిరిలో జనచైతన్యయాత్రలో భాగంగా టవర్‌క్లాక్ వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. సభ్యత్వ నమోదులో తెలుగుదేశం పార్టీ నాయకులంతా సమష్టిగా కృషిచేసి మండలాన్ని రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంచాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీలో సభ్యత్వం తీసుకోవడం వలన బీమా సౌకర్యం కూడా కలుగుతుందని అన్నారు. బ్రాహ్మణ సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటుచేయడం ఒక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికే చెందిందని అన్నారు. సభ్యత్వ నమోదులో గత ఏడాది చంద్రగిరి నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానం ఆక్రమించిందని ఈ యేడాది కూడా దానిని కాపాడుకోవాలని అన్నారు. విశాఖ తుఫాన్ సహాయార్థం ప్రజలు రూ.2.76 కోట్లు ప్రజలు వసూలుచేసి అందజేశారని, ఈ ఘనత కూడా చంద్రగిరికే దక్కుతుందని అన్నారు. అనంతరం పార్టీ సభ్యత్వం తీసుకొని ఇటీవల మృతి చెందిన రాజేష్ తల్లి కళకు బీమా నగదును రూ.2లక్షలను గల్లా అరుణకుమారి అందజేశారు. అనంతరం వెంకటంపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో జడ్పిటిసి సరితా రమణమూర్తికి సభ్యత్వ నమోదు ఐడెంటిటీ కార్డును గల్లా అరుణకుమారి అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గ పరిశీలకురాలు పుష్పలత, మండల పార్టీ అధ్యక్షులు గౌస్‌భాష, జిల్లా ఉపాధ్యక్షులు నీలకంఠ చౌదరి, హేమాంబరధరరావు, సుబ్రహ్మణ్యం నాయుడు, రమణమూర్తి, సర్పంచ్ శేఖర్, కుమార్‌రాజారెడ్డి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసం 7,8 తేదీల్లో
జిల్లా డివిజన్ కార్యాలయం వద్ద దీక్షలు
* యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నేతల వెల్లడి

తిరుపతి, నవంబర్ 5: విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యోగుల సమస్యల పట్ల సంస్థ యాజమాన్యం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 7,8 తారీఖుల్లో జిల్లాలోని ఆయా డివిజన్ కార్యాలయం వద్ద నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జయమణి, అధ్యక్షుడు శేషాద్రి నాగరాజులు శనివారం ఒక ప్రటకనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20 డిమాండ్ల పరిష్కారం కోసం తాము ఈ దీక్షలు చేస్తున్నామన్నారు. ఇందులో కొన్ని ..ఎస్‌పిడిసిఎల్‌లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ తమిళనాడు తరహాలో (వయస్సు,విద్యార్హతతో సంబంధంలేకుండా) రెగ్యులర్ చేయాలని డిమాండ్‌చేశారు.అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, జి.ఓ.ఎం.ఎస్.నెం 197 ప్రకారం ప్రతి కాంట్రాక్టు కార్మికునికి / ఔట్‌సోర్సింగ్ కార్మికుడికి ప్రతినెలా 1వ తారీఖున బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వాలి, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దుచేసి యాజమాన్యమే నేరుగా కార్మికులకు జీతాలు చెల్లించాలి.పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.18,000 ఇవ్వాలి.పనిచేస్తున్న కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 10 లక్షల రూపాయలు ప్రమాద బీమా ఇవ్వాలి, ఎంప్లారుూస్ స్టేట్ ఇన్సూరెన్స్ (ఇఎస్‌ఐ) ని జిల్లా యూనిట్‌గా తీసుకొని అమలు చేయాలన్నారు. అలాగే కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు, పెండింగ్‌లో ఉన్న డివిజన్‌లో ఇపిఎఫ్ తో వెంటనే చెల్లించి స్లిప్పులివ్వాలని డిమాండ్‌చేశారు.
శ్రీ కపిలేశ్వరాలయంలో ముగిసిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి హోమం

తిరుపతి, నవంబర్ 5: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమం ఘనంగా ముగిసింది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారికి మహాభిషేకం, కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు శ్రీ నవగ్రహ కలళస్థాపన, హోమం, లఘుపూర్ణాహుతి, విశేష దీపారాధన చేపట్టనున్నారు. ఈసందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవం వైభవంగా జరుగనుంది.
నేడు నవగ్రహ హోమం
హోమ మహోత్సవాల్లో భాగంగా ఈనెల 6వ తేదీ ఆదివారం నవగ్రహ హోమం జరుగనుంది. 7న సోమవారం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమం నిర్వహించనున్నారు. గృహస్థులకు రూ.500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. గృహస్థులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆయాల ఉపకార్యనిర్వహణాధికారి బాలాజి, ఎ ఈ ఓ శంకర్‌రాజు సూపరింటెండెంట్ ఓబుల్‌రెడ్డి, ఆలయ అర్చకులు మణిస్వామి, శ్రీ స్వామినాథ స్వామి, విజయస్వామి, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ నారాయణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

పాశ్చాత్య సంస్కృతిపై కాదు..
ప్రజా సమస్యలపై దృష్టిపెట్టండి
* జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీదేవి డిమాండ్
తిరుపతి, నవంబర్ 5: రాష్ట్రంలోప్రజలు సమస్యల ఊబిలో కూరుకుపోతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీయ సంప్రదాయాలపై మోజు వీడి ప్రజాసమస్యలపై దృష్టిపెట్టాలని కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాలకు పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్‌లో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు యోచించడం దురదృష్టకరమన్నారు. పరిశ్రమల పేరుతో విదేశాల్లో విహార యాత్ర చేస్తున్న చంద్రబాబునాయుడుకు అక్కడ అలవాట్లు, చేష్టలు వంటబట్టినట్టున్నాయని ఎద్దేవాచేశారు. బాబు యోచన చూస్తుంటే ఆయన తనయుడు విదేశీయ వనితలతో మద్యం మత్తులో నృర్తించిన అనుభవాలను రాష్ట్ర ప్రజలకు కూడా పరిచయం చేయమని సలహా ఇచ్చినట్లు కనబడుతుందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అన్నారు. ప్రజాసమస్యలపై దృష్టిపెట్టకపోతే మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్లు, సావిత్రియాదవ్, జ్యోతి, గుర్రమ్మ, శివలక్ష్మి, వరలక్ష్మి, వసంతమ్మ తదితరులు పాల్గొన్నారు.