చిత్తూరు

మోదీ నోట్ల రద్దు బాణం పేదల గుండెల్లోకి దూసుకెళ్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 15: పెద్దనోట్ల రద్దుపై నల్ల కుభేరులకు లీకులిచ్చి ప్రధాని వదిలిన బాణం పేదల గుండెల్లోకి దూసుకెళ్ళిందని దీంతో వారి జీవన వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు. నోట్ల రద్దు శాస్ర్తియంగా లేదంటూ వైకాపా ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక గాంధి విగ్రహం వద్ద వైకాపా నేతలు నల్ల దుస్తులు ధరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు రెండున్నర గంటపాటు ధర్నా నిర్వహించడంతో ఈస్ట్ పోలీసులు భూమనతోపాటు ఆపార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి, సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ధర్నా సందర్భంగా భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ రాక్షస సంహారం చేస్తున్నానంటూ పేదల జీవితాలను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. ముందుగా నోట్ల రద్దును సమర్థించుకున్న కేంద్ర ప్రభుత్వం ఆపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలను గమనించిందన్నారు. అందుకే పాతనోట్లను 11వ తేదీ వరకు తీసుకుంటామని ప్రకటించిన కేంద్రం ఆతరువాత 14కు మార్చి, తాజాగా 24వ తేదీ వరకు పెంచిందన్నారు. నోట్లరద్దు వ్యవహారం నల్లకుబేరులకు ముందుగానే చేరవేయడంతో వారు అప్రమత్తమయ్యారన్నారు. అలాంటి వారిలో సి ఎం చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రి వర్గ సహచరులు, అనుచరులు ఉన్నారన్నారు. వీరంతా అమరావతి పరిసర ప్రాంతాల్లో రూ.20లక్షల విలువచేసే భూములను కోట్లు వెచ్చించి కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. దీంతో మూడు నెలల్లో లక్ష కోట్లు తెల్లధనంగా మార్చుకున్నారన్నారు. చెల్లని నోట్లు రైతులకు చేరాయని, బంగారంను పండిచే భూములు నల్లకుబేరుల చేతికి చేరాయని చెప్పారు. మరో గమనించదగ్గ విషయం ఏమిటంటే నోట్లు రద్దుతో లబ్ధి పొందిన సి ఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుంచి వ్యక్తమవుతున్న నిరసనలతో ప్రధాని మోదీ ఇబ్బంది పడుతుంటే, బాబు ఆనందపడుతున్నారని చెప్పారు. శత్రు దేశాల నుంచి నకిలీ నోట్లు వస్తున్నాయని కేంద్రం చెప్పడం దేశ నిఘా వ్యవస్థను అవమానపరచడమే అన్నారు. నల్లకుబేరులకు రక్షణ కల్పించిన ప్రధాని పేదలకు శిక్ష విధించాడని దుయ్యబట్టారు. చిన్న వ్యాపారులు విలవిలలాడుతుంటే దళారులు కళకళలాడుతున్నారన్నారు. ఓట్లువేసి గెలిపించిన పేదల సంక్షేమాన్ని చూడాల్సిన ప్రధాని వారి జీవితాలను చిన్నాభిన్నం చేశారని అన్నారు. ఇదెలావుందంటే గజేంద్ర మోక్షంలో మొసలికి చిక్కిన ఏనుగు మహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన వదిలిన చక్రం, మొసలికి బదులు గజేంద్రుని తల నరికినట్లు ఉందన్నారు. నల్లధనం అంతా బిజెపి, టిడిపి నేతల వద్దే ఉందన్నారు. నోట్ల రద్దు వ్యవహారం ఎలా ఉందంటే అర్జునుడి పాశుపతాస్త్రం ఆయన కొడుకు అభిమన్యుని గుండెల్లో దిగినట్లుందన్నారు. నోట్ల రద్దు చేయడం మంచిదే అయినప్పటికి శాస్ర్తియత, ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం పేదల పాలిట శాపంగా మారిందని చెప్పారు. ఈ కారణంగానే తాము ఎంతో శ్రమించి కూడబెట్టుకున్న సొమ్మును కూడా పొందడానికి రోడ్లపై పడిగాపులు గాయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కాగా కరుణాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై ఆపార్టీ నాయకులు మాట్లాడుతూ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై వైకాపా శాంతియుతంగా పోరాడుతుంటే అరెస్టు చేయడం అప్రజాస్వామికమన్నారు.

26 నుంచి పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
* శ్రీవారి లడ్డూలూ అందుబాటులో ఉంచాలని అధికారులకు ఇఓ ఆదేశం

తిరుపతి, నవంబర్ 15: తిరుచానూరులో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈనెల 26వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు జరుగనున్నాయని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు తెలిపారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో ఏర్పాట్లపై ఇ ఓ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ అధికారులు పూర్తిగా సంసిద్ధులు కావాలని చెప్పారు. అవసరమైన లడ్డూలతోపాటు, రోజుకు 10వేల చొప్పున శ్రీవారి లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. లడ్డూలు కొనుగోలు సమయంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా స్వైయింగ్ యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తిరుచానూరు పంచాయతీ ప్రతిపాదనలతో మందుకొస్తే స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా అవసరమైన ప్రాంతాల్లో మరుగుదొడ్లను నిర్మించేందుకు టిటిడి సహకారం అందిస్తుందన్నారు. పంచమి తీర్థం రోజున వేలాదిమంది భక్తులకు తోళప్పగార్డన్‌లో బఫే పద్ధతిలో అన్నప్రసాదాలు అందించేందుకు ముం దస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. పంచమితీర్థం రోజున 3లక్షల తాగునీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా సిబ్బందిని నియమించుకోవాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. శోభాయమానంగా విద్యుత్ అలంకరణలు, కటౌట్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు తీసుకోవాలని ఇ ఓ చెప్పారు. పంచమి తీర్థంనాడు పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తిరిగి వెళ్లేందుకు వీలుగా అదనంగా ఆర్టీసి బస్సులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు భద్రత కోసం తగినంత మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకులు, ఎన్‌సిసి క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. హిందూ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో అందరిని ఆకట్టుకునేలా సాంస్కృతికార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, వాహన సేవలను ఎస్వీబిసీలో ప్రత్యక్ష ప్రసారం చేయాలని చెప్పారు. సౌభాగ్యం కార్యక్రమం ద్వారా మహిళా భక్తులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించాలని ఇ ఓ తెలిపారు. చుట్టు పక్కల గ్రామాల్లోను ప్రచార రథం ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. లాగే తగినన్ని వైద్య బృందాలను అందుబాటులో ఉంచుకోవాలని ఇ ఒ సూచించారు. ఈకార్యక్రమంలో టిటిడి తిరుపతి, తిరుపతి జె ఇ ఓ లు శ్రీనివాసరాజు, పోలభాస్కర్, సి వి ఎస్ ఓ జి.శ్రీనివాస్, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటి ఇ ఒ మునిరత్నం రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

నేటి నుంచి రేషన్ కార్డులు సవరణ ప్రక్రియ

చిత్తూరు ,నవంబర్ 15: జిల్లాలో రేషన్ కార్డులో ఉన్న తప్పులను సవరించే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు డి ఎస్ ఓ నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల పలు ప్రాంతాల్లో రేషన్ కార్డుల్లో పేర్లలో తప్పులు ఉండటం, కుటుంబ సభ్యుల్లో కొందరి పేర్లు నమోదు కాక పోవడం, కార్డు ఉన్నా నెలనెలా నిత్యావసర సరుకులు కొన్ని సాంకేతిక కారణాలతో అందక పోవడం తదితర సమస్యలపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, వీటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ఆదేశాల మేరకు సవరణ ప్రక్రియను చేపట్టుతున్నట్లు వివరించారు. ఇందు కోసం జిల్లాలో అన్ని నియోజకకేంద్రాల్లోని తహశీల్దార్ల కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. రోజుకు ఒక నియోజక వర్గంలో ఆపరిధిలోని రేషన్ కార్డుల్లో నెలకొన్న తప్పులను సవరించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముందుగానే ఏ నియోజక వర్గంలో ఈ పక్రియ కొనసాగుతుందో ప్రజలకు తెలియజేస్తామన్నారు.
విమానాశ్రయం నిర్మాణానికి స్థల పరిశీలన

రామకుప్పం, నవంబర్ 15: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గ పరిధిలోని రామకుప్పం మండల పరిధిలో మినీ విమానాశ్రయం నిర్మాణానికి మంగళవారం కేంద్ర బృందం స్థలాన్ని పరిశీలించింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత నియోజక వర్గమైన కుప్పం పరిధిలో విమానాశ్రయం నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో రామకుప్పం మండల పరిధిలోని విజలాపురం, కిలాడిపోడి, అమ్మవారి పల్లి, క్రిష్ణరాజపురం తదితర గ్రామాల్లో మంగళవారం కేంద్రవిమానాశ్రయ అధికార బృందమైన అబ్బాస్, రవికుమార్ స్థలాన్ని పరిశీలించారు. ఈప్రాంతం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉందని వారు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో మినీ విమానాశ్రయం నిర్మించాలన్నది ప్రతిపాదనలో ఉందని , ఇందుకు అనేక అనుమతులు కావాల్సి ఉందని స్థల పరిశీలనకు వచ్చిన అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కడ స్పెషల్ అధికారి శ్యాంప్రసాద్, జడ్పిటీసి మునిస్వామి, నేతలు అంజినేయరెడ్డి,శ్రీనివాసుల రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
‘తాగునీరు అందించాలని
ఖాళీ బిందెలతో మహిళల నిరసన’
బుచ్చినాయుడుకండ్రిగ, నవంబర్ 15: తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వి ఎస్ పురంలో బుధవారం కొందరు మహిళలు మోటారుబోరు వద్ద ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారుమాట్లాడుతూ గ్రామంలో తాగునీటి కోసం ఏర్పాటుచేసిన బోరునుంచి నీరు సక్రమంగా రాకపోవడంతో లక్షలాది రూపాయల ఖర్చు చేసి నిర్మించిన తాగునీటి ట్యాంకు నిరుపయోగంగా మారిందన్నారు. తాగునీటి కోసం వేసినబోరు ఎండిపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నెలరోజులుగా నీటి కోసం సతమతమవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. సమస్యను పరిష్కరించకపోతే మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతామని వారు హెచ్చరించారు.
చలో విజయవాడ
కార్యక్రమం
జయప్రదం చేయండి
తిరుపతి, నవంబర్ 15: కార్మికుల సమస్యల పరిష్కారానికి ఈనెల 18వ తేదీన విజయవాడ లేబర్ కమీషన్ కార్యాలయం వరకు జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఏ ఐ టి యు సి జిల్లా కార్యదర్శి హరికృష్ణ కోరారు. మంగళవారం తమ కార్యాలయంలో ఇందుకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని, బోనస్ ఇవ్వాలని ఇతర డిమాండ్ల సాధనకై మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పి.మురళి, నాయకులు ఎన్.డి.రవి, కె.వై.రాజా తదితరులు పాల్గొన్నారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో
ఘనంగా ‘నక్షత్రసత్ర యాగం’ ప్రారంభం

తిరుపతి, నవంబర్ 15: తిరుమలలోని ధర్మగిరిలో గల శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో నక్షత్రసత్ర యాగం మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. డిసెంబర్ 18వ తేదీ వరకు 34 రోజుల పాటు ఈయాగం నిర్వహించనున్నారు. విద్యార్థులకు ప్రాయోగిక పరిజ్ఞానం (ప్రాక్టికల్)లో భాగంగా ఐదుగురు రుత్వికులతో ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఎస్వీ వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపాల్ ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని తెలిపారు. ఈ యాగంలో భాగంగా మొదట 27 రోజుల పాటు 27 నక్షత్రాలను, అభిజిత్ నక్షత్రం, చంద్రుడు, ఉషఃకాలం, అహోరాత్రులు, నక్షత్రసామ్యం, సూర్యుడు, అదితి, విష్ణువును పూజిస్తూ ఈ యాగాన్ని నిర్వహిస్తారు. కార్తీక బహుళపాడ్యమి రోజున ఈ యాగం ప్రారంభమైంది. ఈ విధంగా నక్షత్రకాలం సంభవించడం అరుదు. గ్రహణం, వ్ఢ్యౌం లేని రోజుల్లో మాత్రమే ఈ యాగం నిర్వహణకు అనుకూలమైన సమయం ఆసన్నమైంది. ఈ యాగం వల్ల నక్షత్రఫలం, అకాలమరణం నివారణ, పాపసంహారం, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతాయని ఋత్వికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ వేద విజ్ఞాన పీఠం అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

చిత్తూరు మేయర్ ఎన్నికకు రంగం సిద్ధం
* నగరంలో ఊపందుకున్న రాజకీయ చర్చలు

చిత్తూరు, నవంబర్ 15: చిత్తూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికతో పాటు ఖాళీగా ఉన్న రెండు డివిజన్ స్థానాల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నగపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మున్సిపాలిటిగా ఉన్న జిల్లా కేంద్రమైన చిత్తూరుకు రెండేళ్ళ ముందు ప్రభుత్వం కార్పొరేషన్ హోదా కల్పించింది. నగరాన్ని 50 డివిజన్లుగా విభజించి 2014లో తొలిసారిగా కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించారు. మేయర్ పదవిని బిసి మహిళకు కేటాయించారు. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టిడిపి అత్యధిక డివిజన్లలో విజయం సాధించి తొలిమేయర్‌గా 33వ డివిజన్ నుంచి గెలుపొందిన కఠారి అనూరాధ ఎన్నికయ్యారు. అయితే గత ఏడాది నవంబర్ నెలలో మేయర్ ఆనూరాధ, ఆమె భర్త కఠారి మోహన్ కార్పొరేషన్ కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైయ్యారు. ఈసంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో అప్పటి నుంచి డిప్యూటీ మేయర్‌గా ఉన్న సుబ్రహ్మణ్యం ఇన్ ఛార్జి మేయర్‌గా కొనసాగుతున్నారు. 38 డివిజన్ నుంచి వైకాపా అభ్యర్థిగా విజయం సాధించిన పులిచెర్ల శివప్రసాద్ రెడ్డి ఆత్యహత్యకు పాల్పడ్డాడు. దీంతో ఈ రెండు డివిజన్లుకు ఉప ఎన్నికల అనివార్యమైయ్యాయి. అప్పటి నుంచి ఈరెండు డివిజన్లకు కార్పొరేటర్లు లేని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మేయర్ హత్యకు గురై ఏడాది అవుతున్నా ఎన్నికల సంఘం నుంచి ఈ ఎన్నికపై స్పష్టత రాక పోవడంతో నగరంలో పలు ఊహాగానాలు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే ఖాళీగా ఉన్న రెండు డివిజన్లతో పాటు మేయర్ ఎన్నిక నిర్వహించాలని పలువురు కార్పొరేటర్లు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇందుకు వివరణ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నగరపాలక సంస్థను కోరింది. నవంబర్ చివర వారంలో ఈ రెండు డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇటీవల ఈ సి కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. ముందుగా ఖాళీగా ఉన్న డివిజన్ ఎన్నికలను చేపట్టి తదుపరి డిసెంబర్ నెలాఖరులోగా మేయర్ ఎన్నిక పూర్తి చేయాలని స్పష్టం చేసింది. దీంతో చిత్తూరు కార్పొరేషన్ అధికారులు ఎన్నికల నిర్వహణపై కసరత్తు చేపట్టారు. ఇందుక రిటర్నింగ్ అధికారులు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను కూడా నియమించి ఈసి ఆదేశాలతో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం చేసింది. ఓటర్ల జాబితాతో పాటు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటను కూడా పూర్తి చేసింది. దీంతో ఈనెలాఖరులోగా ఈడివిజన్‌ల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయనున్న తరుణంలో నగరంలో రాజకీయం రసవత్తరంగా మారింది. గతంలో నగరంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న కఠారి మోహన్ పార్టీ విజయం కోసం తనశక్తి వంచన లేకుండా పాటుపడారు. బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొంటూ అనేక ఆటుపోట్లను సైతం ఎదుర్కోవడంతో పార్టీ అధిష్టానం తొలి మేయర్ అభ్యర్థిగా అతని సతీమణి అనురాధాను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో నగర తొలి మేయర్‌గా అనూరాధ ఎన్నికయ్యారు . అయితే అనతి కాలంలోనే ఆమె దారుణ హత్యకు గురి అయిన సంగతి తెలిసింది. ఈనేపధ్యంలో ఈ ఉప ఎన్నికలే నగర మేయర్ పదవిని నిర్ణయించే అవకాశం ఉండటంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే మేయర్ హత్యానంతరం పార్టీ అధినేతలు ఈ పదవిని తిరిగి కఠారి కుటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ఎన్నికల నిర్వహణలో జాప్యం అనివార్యం కావడంతో పలువురు కార్పొరేటర్లు ఈ పదవుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అయితే 33వ డివిజన్ నుంచి తిరగి కఠారి కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో నిలడానికి రంగం సిద్ధం చేసుకుంటుండగా, 38డివిజన్‌లో పోటీ చేయడానికి ఆత్యహత్యకు పాల్పడ్డ కార్పొరేటర్ పులిచెర్ల శిప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు తలపడుతారా లేదా అన్నది స్పష్టం కావాల్సి ఉంది. అయితే ప్రధానంగా నగరంలో రెండు డివిజన్ల ఉప ఎన్నికల కన్నా మేయర్ వ్యహారమే ప్రధాన చర్చనీయాశంగా మారింది.
తాతయ్యగుంట, మల్లయ్యగుంట వాసులకు పట్టాలిప్పిస్తాం
* ఎమ్మెల్యే సుగుణమ్మ హామీ
తిరుపతి, నవంబర్ 15: స్థానిక 27వ డివిజన్ పరిధిలో ఉన్న తాతయ్యగుంట గంగమ్మ గుడి ప్రాంతం, మల్లయ్యగుంట ప్రాంతాల్లో అనాదిగా నివసిస్తున్న స్థానికులకు పట్టాలు ఇప్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆమె మంగళవారం 27వ డివిజన్‌లో పర్యిటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాతయ్యగుంట, మల్లయ్యగుంటలు ఒకప్పుడు చెరువులని, అయితే కొన్ని దశాబ్దాలుగా ప్రజలు అక్కడ ఇళ్లు నిర్మించుకుని ఉన్నారని చెప్పారు. వీరికి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదన్నారు. అయితే సి ఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు సర్వే నిర్వహించి అర్హులకు పట్టాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు సుగుణమ్మ చెప్పారు. ఆమె వెంట టిడిపి నేతలు నరసింహయాదవ్, డాక్టర్ సుధారాణి, డాక్టర్ సిపాయిసుబ్రమణ్యం, సూరాసుధాకర్‌రెడ్డి, పులిగోరుమురళీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

‘దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిన ప్రధాని మోదీ’
* మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన చింతా
* అరెస్ట్‌చేసిన పోలీసులు

తిరుపతి, నవంబర్ 15: ప్రధాని మోదీ దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టాడని, ఈక్రమంలో నిత్యావసరాల ధరలు పెరిగి ఆహార భద్రతకు కూడా ముప్పువాటిల్లే ప్రమాదం ఉందని మాజీ కేంద్రమంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. రూ.500, రూ.1000 నోట్లు రుద్ద చేస్తూ ఈనెల 8న ప్రధాని తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ డాక్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రి ఎదురుగా ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. ఈసందర్భంగా మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దీంతో అలిపిరి సి ఐ బివి శ్రీనివాసులు నేతృత్వంలో ఎస్ ఐ మల్లికార్జునరెడ్డి , బి.శ్రీనివాసులు తమ సిబ్బందితో చింతాతోపాటు ఏడుగురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్‌చేసి స్టేషన్‌కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదలచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చింతామోహన్ మాట్లాడుతూ ఆర్థికవేత్తయిన మన్మోహన్ సింగ్ దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టి ప్రజల సంక్షేమానికి బాటలువేశారన్నారు. అయితే ఎంతో నమ్మకంతో ప్రదాని నరేంద్రమోదీని ప్రజలు ఓటువేసి గెలిపించారన్నారు. మోదీ తన పరిజ్ఞాన లేమితోదేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టే నిర్ణయం తీసుకున్నారని నిప్పులు చెరిగారు. నల్లకుబేరుల అంతుచూడటానికి పెద్దనోట్లు రద్దుచేసినట్లు ప్రధాని చెప్పుకుంటున్నారన్నారు. నోట్ల రద్దు వ్యవహారం నల్లకుబేరులకు ముందుగానే సమాచారం వెళ్లడంతో వారంతా సర్దుకున్నారన్నారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన మంత్రి వర్గం అన్నారు. నల్లధనం గురించి మోదీ మాట్లాడటమే ఒక విడ్డూరం అన్నారు. 2014 ఎన్నికల్లో అదానీ అనే ఒక పారిశ్రామిక వేత్త ద్వారా గెలవడానికి 3వేల కోట్ల రూపాయలు నల్లధనాన్ని వాడుకున్న ఘనుడు మోదీ అన్నారు. నల్లకుబేరులు నిద్రపోవడంలేదని మోదీ కలలు కంటున్నాడని, వాస్తవానికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నది పేద,మధ్యతరగతి వారేనన్నారు. మోదీ ఇలాంటి నోట్ల రద్దు విషయంపై నిర్ణయం తీసుకునే ముందు ముందుజాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండేదన్నారు. ఇందులోభాగంగా రూ.100 నోట్లను ముందుగానే బ్యాంకులకు పంపి ఉంటే నేడు పేద, మధ్యతరగతి ప్రజలు ఇన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. బ్యాంకుల్లో డబ్బులేదు. పేదల వద్ద డబ్బులేదు. దీంతో పూటగడవటం కూడా వారికి కష్టమవుతోందన్నారు. ఇదే పరిస్థితి మరోవారం గడిస్తే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతాయన్నారు. ఆర్థిక సంక్షోభమే కాకుండా ఆహార భద్రతకు కూడా ముప్పువాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మోదీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో విపత్కర పరిస్థితుల్లో పడ్డ ప్రజలు బయట పడ్డానికి 5 సంవత్సరాల సమయం పడుతుందన్నారు. నూటికి తొంభై తొమ్మిది మంది ప్రజలు ఈ పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందుల పాలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీ తాగడానికి వెళ్లినా, కూరగాయలు కొనడానికి వెళ్లినా పేదల దగ్గర డబ్బులులేని పరిస్థితి అన్నారు. ఒకటి అరా పెద్దనోట్లు ఉంటే వాటిని తీసుకొని చిల్లరిచ్చే పరిస్థితి వ్యాపారస్తుల దగ్గర లేని పరిస్థితి అన్నారు. పెట్రోల్ కూడా రూ.500, రూ.1000 కు మాత్రమే పట్టుకోవాల్సి వస్తుందని, ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎక్కడ సాధ్యమవుతుందని అన్నారు. పలువర్గాలు మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు బజారులో వెళ్లిచూస్తే ఆ సమర్థిస్తున్నవారికి వాస్తవాలు తెలుస్తాయన్నారు. మోదీ ఉత్తరప్రదేశ్‌ను టార్గెట్ చేశారని, అయితే అక్కడ మాయావతి 300 సీట్లతో విజయసాధించడం తథ్యం అని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్, గొడుగుచింత రాజేష్, దామోదరం, మహిళానాయకులు పి.శాంతి, ఎం.తేజోవతి, చాముండేశ్వరి, మునిలక్ష్మి పాల్గొన్నారు.