చిత్తూరు

ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ప్రభుత్వం చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 17: ఆర్థికంగా వెనుకబడిన వారందరినీ ప్రభుత్వం చేయూతను ఇస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ గురువారం రేణిగుంట మార్గంలో ఉన్న శ్రీ కృష్ణతేజ విద్యాసంస్థల్లో యువత చైతన్యసదస్సులో విద్యార్థులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లోకేష్ ముందుగా ఎన్ టి ఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు జిల్లాలోని సిద్దార్థ ఇంజనీరింగ్ , రాయలసీమ , కృష్ణతేజ , ఎన్ ఆర్ ఐ తదితర కళాశాలల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నారాలోకేష్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 18 మంది విద్యార్థులు వేసిన వివిధ రకాల ప్రశ్నలకు ఆయన ఓపిగ్గా సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లాంటి కులాల ప్రజలు అన్నివిధాలా పూర్తిగా వెనుకబడి ఉండడంతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రిజర్వేషన్ పదేళ్లపాటు వారికి వర్తించేవిధంగా అప్పట్లో ఉంచారన్నారు. అటు తరువాత కూడా ఆ కులాల్లో ఉన్న ప్రజలు ఎదగకపోవడంతో రిజర్వేషన్లు కొనసాగిస్తున్నారన్నారు. రిజర్వేషన్లు ప్రభుత్వ రంగంలో ఉన్నాయని, ప్రైవేటు రంగంలో సదరు వ్యక్తి నైపుణ్యత,ప్రతిభ, వ్యక్తిత్వ వికాసాల్ని బట్టే ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర కులాల్లో వెనుకబడిన పేదలకు కూడా చేయూత నివ్వడానికి అనేకరకాల ప్రణాళికలను రూపొందించారని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే స్మార్ట్ పల్స్ సర్వే నిర్వహిస్తున్నామని, ఈ మాసాంతానికి అది పూర్తవుతుందన్నారు. నిరుపేద విద్యార్థులను గుర్తించి వారిని అన్నిరకాలుగా ఆదుకుంటుదన్నారు. వారసత్వ రాజకీయాలపై మాట్లాడుతూ తన తాత ఎన్‌టి ఆర్ అటుతరువాత తనతండ్రి చంద్రబాబునాయుడుల స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. 2008 నుంచి 2013 వరకు 5 సంవత్సరాల పాటు తాను పాలు, కూరగాయాలు అమ్ముకున్నానని, హెరిటేజ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా పనిచేశానని ఆయన చెప్పుకొచ్చారు. అటు తరువాత తన భార్య బ్రాహ్మణి రావడంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. మీకు రాజకీయాల్లో రోల్ మోడల్ ఎన్టీఆరా? చంద్రబాబా అని అడిగిన ప్రశ్నకు ఎన్ టి ఆర్‌కు మనమడు కావడం తన అదృష్టంగా భావిస్తానన్నారు. తనకు ఎన్ టి ఆర్, తన తండ్రి చంద్రబాబు, అమ్మ భువనేశ్వరి, మామ బాలకృష్ణ, భార్య బ్రాహ్మిణి అందరూ రోల్‌మోడలే అన్నారు. అందుకే లోకేష్ అందరితో కలగలిపిన ఒక ప్యాకేజీ అని చమత్కరించారు. విద్యార్థులు కూడా కొత్త విషయాలు చెబితే వాటిని కూడా నేర్చుకోవడానికి ఇష్టపడే మనస్తత్వం తనదని ఆయన తెలిపారు. ప్రతి మనిషిలోను బలాలు, బలహీనతలు ఉంటాయని అందులో మంచి వాటిని స్వీకరించి ఎదగడమే యువత నేర్చుకోవాలన్నారు.
తాను పుట్టిందే రాజకీయ కుటుంబం నుంచి అన్నారు. తన తండ్రి 1978లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారన్నారు. తాను పుట్టక ముందే తన తాత ముఖ్యమంత్రని, యువత రాజకీయాల్లోకి రావడమంటే ఒక మార్పు తీసుకొని వచ్చినపుడే సార్థకత చేకూరుతుందన్నారు. రాజకీయాల్లో యువతకు మీపార్టీ ఇస్తున్న ప్రాధాన్యత ఏమిటన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ గడిచిన ఎన్నికల్లో 104మంది ఎమ్మెల్యేలు ఎంపికైతే వారిలో 40 మంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారేనన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎప్పుడు తీరుతుందని ఓ విద్యార్ధి ప్రశ్నకు మనం ఏ రంగంలో విద్యను పూర్తిచేసుకున్నామో ఒకే సారి పెద్ద ఉద్యోగాలు రావాలని వేచి చూసే విధానానికి స్వస్తి పలకాలన్నారు. అందివచ్చిన ఉద్యోగంలో తన నైపుణ్యతను ప్రదర్శించుకుంటే ఉన్నత ఉద్యోగాలు అవంతట అవే వస్తాయని సమాధానమిచ్చారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో మీరు ఐల్యాండ్ కొనుగోనులు చేసినట్లు సాక్షి పత్రికలో వార్తలు వచ్చాయి కదా అన్న ప్రశ్నకు లోకేష్ సమాధానమిస్తూ ధూమపానం ఆరోగ్యానికి చేటని అందరూ భావిస్తారో అలాగే తాను సాక్షి పేపర్ చదవడం అంత ప్రమాదమని భావిస్తానన్నారు. అగ్రిగోల్డ్‌కు సంబంధించిన హాయ్ ల్యాండ్‌ను ఈడి జప్తు చేసిందన్నారు. దానిని తాను ఎలా కొనుగోలు చేసి ఉంటానని అన్నారు. అమరావతికి 33వేల ఎకరాలు సేకరిస్తే లక్ష కోట్ల అవినీతి అని కూడా వైకాపా నేతలు విమర్శించారన్నారు. తాను ఒక తప్పు చేసినట్లు వైకాపా నేతలు నిరూపిస్తే స్వయంగా తానే వెళ్ళి చెంచల్ గూడా జైల్లో కూర్చుంటానని చెప్పారు. రూ.500, రూ.1000 నోట్లుతో బ్లాక్‌మనీ పెరిగిపోతుందని వాటిని రద్దు చేయమని చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల క్రితమే కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. రూ.2వేలు కూడా మంచిదికాదని చిన్న నోట్లు కూడా తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు మరో విద్యార్థి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రధానితో లాలూచి పడాల్సిన అవసరం ఏముంటుందని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇద్దరిని ప్రధానులను చేయడంలోను, అబ్దుల్‌కలాంను రాష్టప్రతి చేయడంలోను చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారన్న విషయాన్ని విస్మరించవద్దన్నారు. కేన్సర్, మధుమేహం పెరిగిపోతోంది కదా, ఆరోగ్యంపై అవగాహన పెంచడం కోసం పిల్లలకు పాఠ్యాంశాలు ద్వారా తెలియజేయాలని మరో విద్యార్థిని కోరింది. ఇది వాస్తవమని ఆచర్యలు కూడా ప్రభుత్వం చేపడుతుందని తెలిపారు. తిరుపతిలో ప్రపంచ ప్రమాణాలతో కూడుకున్న క్రీడల విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం యోచిస్తోందని అన్నారు. ఆన్‌లైన్ షాపింగ్‌తో చిన్న వ్యాపారులు కుదేలైపోతున్నారని వాటిని రద్దు చేయాలని మరో విద్యార్థిని కోరగా అది సాధ్యం కాదని, దానిని ఎవరూ ఆపలేరన్నారు. ప్రజలే వాటికి అలవాటు పడ్డారని లోకేష్ వివరించారు. కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే రాష్ట్భ్రావృద్ధి ఎలా సాధ్యమని, ప్రత్యేక హోదాలో ఎలాంటి ప్రయోజనాలున్నాయో అలాంటి ప్రయోజనాలు కల్పించేందుకే సి ఎం ప్యాకేజీకి అంగీకరించారన్నారు. దానికి చట్టబద్దత కల్పించాలని కూడా డిమాండ్ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఫార్మశీ చదివే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆదిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. రాయలసీమ ఉత్పాదన కర్మాగారంగా అభివృద్ధి చెంది యువతకు గొప్ప ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆయన చెప్పారు. మీరు అమెరికాలో చదువుతున్నప్పుడు మీ తొలి ప్రేమికురాలు ఎవరన్న ప్రశ్నకు తన ప్రేమికురాలు బ్రాహ్మిణి అని అందుకే తనకు చిన్నవయస్సులోనే ఆమెతో వివాహం జరిగిందని నవ్వుతూ సమాధానమిచ్చారు. రాజకీయాల్లోకి యువత రావడం అవసరమని అయితే బాగా చదువుకోవాలని హితవు చెప్పారు. నోట్లు రద్దు మంచి నిర్ణయమని తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నా భవిష్యత్తులో నల్ల కుభేరుల ఆట కట్టింస్తుదని, ఆన్‌లైన్లోనే అన్ని కార్యకలాపాలు జరుగుతాయన్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువులు, పెన్షన్లు ఆన్‌లైన్ ద్వారా పేదలకు చేరు ప్రక్రియకు ప్రభుత్వం స్వీకారం చుట్టిందన్నారు. యువత కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా ఐక్యతతో ముందుకుసాగుతూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో బాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు అభివృద్ధికి ఎంతగా అడ్డంకిగా మారినా వాటిని అధిగమించి ముందుకు సాగే సత్తా సి ఎంకు ఉందని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ వర్లరామయ్య, ఎమ్మెల్సీలు గౌనివారి శ్రీనివాసులు, ముద్దుకృష్ణమనాయుడు, నరేష్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అమర్‌నాథరెడ్డి, శంకర్‌యాదవ్, సుగుణమ్మ, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, సిద్దార్థ ఇంజినీరింగ్ కళాశాల ఛైర్మన్ అశోక్‌రాజు, కృష్ణతేజ విద్యా సంస్థల చైర్మన్ చదలవాడ సుచరిత, రాయలసీమ విద్యాసంస్థల అధినేత మనె్నం రామిరెడ్డి నాయకులు డాక్టర్ సుధారాణి, నరసింహయాదవ్, జడ్పీ చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, డాక్టర్ కోడూరు బాల సుబ్రమణ్యం, శ్రీ్ధర్‌వర్మ, రవినాయుడు, నాని, పసుపర్తిగోపి, ప్రభాకర్ నాయుడు, రాగల అనంద్‌గౌడ్, హరికృష్ణ, శ్రీనివాస చౌదరి, దొరబాబు, సూరాసుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
యువతిపై అత్యాచారం - హత్య
* తెలిసినవారే హంతకులని పోలీసుల అనుమానం
తిరుపతి, నవంబర్ 17: ఎమ్మార్‌పల్లిలోని హరిపురం కాలనీలో ఓ యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన సంఘటన సంచలనం రేపింది. తిరుపతిలో ఓ యువతి హత్యకు గురై 24 గంటలు కూడా గడవక ముందే మరో యువతి హత్యకు గురికావడం పోలీసులకు సవాల్‌గా మారింది. ఎమ్మార్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక హరిపురం కాలనీకి చెందిన రేఖ(24), ఆమె తల్లితో కలసి జీవిస్తోంది. వీరు చిన్న చిన్న పనులు చేసుకుని జీవిస్తున్నారు. రేఖ బుధవారం రాత్రి తన తల్లితో కలసి ఇంట్లో నిద్రించింది. అర్థరాత్రి దాటిన తరువాత మెలుకువచ్చిన తన పక్కన ఉండాల్సిన కుమార్తె కనిపించక పోవడంతో కుమార్తె ఆమె కోసం వెదికింది. అయితే ఆ రాత్రి సమయంలో కుమార్తె జాడ తెలియక తెల్లవారే వరకు వేచి చూసింది. అయితే గురువారం తెల్లవార జామున రేఖ సమీపంలోని ఓ ఇంటి వెనుక ముళ్ళ పొదల్లో మృతి చెంది పడివున్న విషయాన్ని స్థానికులు గుర్తించి ఆమె తల్లికి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరకున్నారు. రేఖ శరీరంపై దుస్తులు లేవు. ఆమె ముఖంపైన తీవ్రగాయాలున్నాయి. ఆమె తలపై రాయితో బలంగా కొట్టిన దాఖలాలు కనిపిస్తున్నాయి. తెలిసిన వారు ఇంటి నుంచి బయటకు తీసుకువెళ్లి ఆపై అత్యాచారం చేసి హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని తెచ్చి పడేసిఉంటారని భావిస్తున్నారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. దుండగులు ఆమెపై ఆత్యాచారానికి ప్రయిత్నిచడంతో ఆమె ప్రతిఘటించిన సమయంలో ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నట్లు తెలిపారు. నింధులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు. దీనిని సవాల్‌గా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.
ఎన్నికల హామీలను నెరవేర్చని బాబు
* వైఎస్‌ఆర్‌సిపి సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ ఆదిమూలం ఆరోపణ

కెవిబిపురం, నవంబర్ 17: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని సత్యవేడు నియోజకవర్గ వై ఎస్ ఆర్ సిపి కన్వీనర్ ఆదిమూలం ఆరోపించారు. గురువారం ఆ పార్టీ మండల కన్వీనర్ గవర్లకృష్ణయ్య ఆధ్వర్యంలో కెవిబిపురం, పాత పాళ్యం పంచాయతీల్లో గడపగడపకూ వైఎస్‌ఆర్ సిపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిమూలం మాట్లాడుతూ రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన ఎన్నికల హామీల్లో మద్యం అమ్మకాలు తగ్గిస్తాం- బెల్టు షాపులను రద్దుచేస్తాం, గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేస్తామని, పేదలకు 3 సెంట్ల భూమిలో 1.50 లక్షలతో పక్కా ఇల్లు నిర్మిస్తామని, నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తామని, అన్ని వ్యాధులకు 2.5లక్షల వరకు ఆరోగ్యశ్రీ అమలుచేస్తామని, ప్రతి నియోజకవర్గానికి వృద్ధాశ్రమం కడతామని, పేదలకు, కార్మికులకు రూపాయికే టిఫెన్, 5రూపాయలకే భోజనం పెడతామని, కళాశాల విద్యార్థులకు ఉచితంగా టాబెలెట్ కంప్యూటర్లు అందిస్తామని, కాలేజి విద్యార్థులందరికీ ఐపాడ్‌లు ఇస్తామని, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామని, హైస్కూల్, ఇంటర్ విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేస్తామని హామీ లిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నర సంవత్సరం పూర్తవుతున్నా హామీలు నీటిమూటలవుతున్నాయని ఆరోపించారు. అసైన్డ్ భూములు, డికెటి భూములన్నింటికీ పట్టాలు ఇస్తామని చెప్పి నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఒక్కరైతును కూడా ఉద్ధరించిన పాపాన పోలేదన్నారు. భూమిలేని గిరిజనులకు 2 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి వారికి ఏమాత్రం సహాయం చేయలేదని, గిరిజయ యువతల వివాహాలకు రూ.50వేలు సాయం చేస్తామని చెప్పి, రూ.5 లక్షల వరకు పూచీకత్తులేని రుణాలు ఇస్తామని చెప్పి ఆ కులాల వారికి ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నాయకులు తప్ప ఇతర మైన వారు అభివృద్ధి కావడంలేదని, నీరు-చెట్టు కాంట్రాక్ట్ పనుల్లో ఉపాధి హామీ పనులు, ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులే చేసుకుంటున్నారని, అధికారులు ఊడా అధికార పార్టీ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈకార్యక్రమంలో ఎంపిపి సులోచన, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథరెడ్డి, లాలిబాబుయాదవ్, డేవిడ్, దశరథరామిరెడ్డి, హరి పాల్గొన్నారు.
ఐ ఇ ఏ సి లో తిరుపతి కార్పొరేషన్‌కు మొదటి పది స్థానాల్లో చోటు
తిరుపతి, నవంబర్ 17: కేంద్రం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షన్ పథకంలో భాగంగా గురువారం విడుదల చేసిన ఇన్‌ఫర్‌మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ విభాగంలో తిరుపతి నగరానికి మొదటి 10 స్థానాల్లో నిలిచిందని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ వినయ్‌చంద్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 500 నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో మెరుగైన నగరాలుగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ సర్వేక్షన్ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. రెండువేల మార్కులతో ఈ నగరాల మధ్య పోటీలు నిర్వహించి తొలి ప్రాధాన్యతలో నిలిచిన నగరాలకు ప్రత్యేక ఆర్థిక సాయం, పారిశుద్ధ్యం మెరుగుదలకు సదుపాయాలు కల్పించడంతోపాటు అవార్డులను అందజేస్తుందన్నారు. 2017 జనవరి లో ఆఖరిఫలితాలు వెలువడుతాయన్నారు.
న్యూజెర్సీలోని శ్రీ వేంకటేశ్వరాలయాన్ని సందర్శించిన టిటిడి చైర్మన్

తిరుపతి, నవంబర్ 17: అమెరికాలోని న్యూజెర్సీలో శ్రీ గురువాయూరప్పన్ ఆలయ సముదాయంలో గల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని బుధవారం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలాడ కృష్ణమూర్తి సంర్శించారు. శ్రీ గురువాయురప్పన్ ఆలయ ప్రాంగణంలో నేటి నుంచి 20వ తేదీ వరకు శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు న ఇర్వహించనున్న విషయం విధితమే. ఈ సందర్భంగా వైభవోత్సవాల నిర్వహణకు ఏర్పాటుచేసిన వేదికను ఛైర్మన్ పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు.
ప్రవాస భారతీయులు శ్రీవారి సేవలను తిలకించండి
తిరుమల తిరుపతి దేవస్థాం ధర్మప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు అమెరికాలోని ప్రవాస భారతీయులందరూ విచ్చేసి స్వామివారి సేవలను తిలకించి తరించాలని ఛైర్మన్ పిలుపునిచ్చారు.
తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని
ఏర్పాటుచేయండి - డాక్టర్ నోరి
దత్తాత్రేయుడిని కోరిన టిటిడి చైర్మన్
రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు ఆకాంక్షల మేరకు వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోని తిరుపతిలో క్యాన్సర్ ఆసుపత్రిని ఏర్పాటుచేయాలని ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నోరి దత్రాత్రేయుడిని టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కోరారు. దీనికి కావల్సిన సహకారాన్ని టిటిడి తరపున అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు జి.్భనుప్రకాష్ రెడ్డి, గురవయూరప్ప, అలయ కమిటీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, సభ్యులు మోహన్‌రెడ్డి, మధుసూదనరాజు, నాయర్ పాల్గొన్నారు.

జిల్లాలో 300 గ్రంథాలయాలు ఏర్పాటు
* సంచార గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తాం
* జిల్లా గ్రంథాలయాల చైర్మన్ తుమ్మల వెల్లడి
తిరుపతి, నవంబర్ 17: మన ఊరు-మన గ్రంథాలయం పేరుతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 300 గ్రంథాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా గ్రంథాలయాల చైర్మన్ తుమ్మల కన్నయ్యనాయుడు చెప్పారు. గురువారం స్థానిక ఎమ్మార్‌పల్లిలోని బాలల గ్రంథాలయంలో 49వ గ్రంథాలయ వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి పేదవాడికి గ్రంథాలయాలను అందుబాటులోకి తీసుకు వెళ్ళాలన్న ఎన్.టి.ఆర్. ఆశయానికి అనుగుణంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఇందుకోసం పాఠకుల నుంచే కొందరిని ఎంపిక చేసి గ్రంథాలయ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తిరుపతి, మదనపల్లి, పీలేరు, పలమనేరు, చిత్తూరు ప్రాంతాల్లోని గ్రంథాలయాల్లో ఇంటర్నెట్ కేంద్రాలు, ఫోటో, జిరాక్స్, ప్రింటర్స్‌ను తక్కువ ఫీజుతో ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన పోటీ పరీక్షలు, కోచింగ్ పుస్తకాలను అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలైన 54 మంది విద్యార్థులకు ఆయన బహుమతులు అందజేశారు. ఈకార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జయచంద్రారెడ్డి, సభ్యుడు శ్రీ్ధర్‌రెడ్డి, ప్రసన్నకుమార్, వెంకటరత్నం, ప్రధానోపాధ్యాయులు సురేంధ్రనాథ్, హేమనళిని, గ్రంథాలయాధికారిణి కె.మీనాకుమారి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మేము మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదు
* నారాలోకేష్‌కు విద్యార్థుల ఫిర్యాదు
తిరుపతి, నవంబర్ 17: తమ సమస్యలను చెప్పుకోవడానికి వాలంటీర్లు అవకాశం ఇవ్వలేదని, దీంతో తాము నిరుత్సాహానికి గురయ్యామని పలువురు విద్యార్థులు టిడిపి జాతీయ కార్యదర్శి నారాలోకేష్‌కు ఫిర్యాదు చేశారు. గురువారం స్థానిక రేణిగుంట రోడ్డులోని చదలవాడ రమణమ్మ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులతో నారాలోకేష్ ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులను చైతన్య పరస్తూ వారడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు విద్యార్థులకు పోటీ పడ్డారనే చెప్పాలి. అయితే ఈ సమయంలో అందరు విద్యార్థులకు మాట్లాడేందుకు అవకాశం లభించలేదు. దీంతో కార్యక్రమం ముగిసిన తరువాత కళాశాల నుంచి బయటకు వస్తున్న నారాలోకేష్‌ను కలిసిన కొందరు విద్యార్థులు తాము మాట్లాడాలని ఉవ్విళ్లూరినా టిడిపి వాలంటీర్లు తమకు మైక్ ఇవ్వలేదంటూ ఆయనకు ఫిర్యాదు చేశారు. తాము ఓసి కులానికి చెందిన వారమని ఓసీలకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించాలనుకున్నా తమకు అవకాశం ఇవ్వలేదని తెలిపారు. దీనిపై నారాలోకేష్ వారిని సముదాయించి మరో సారి అవకాశం వచ్చినప్పుడు తప్పక మాట్లాడదాం అంటు నచ్చజెప్పారు.