చిత్తూరు

పంచమీ తీర్థానికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 1: శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన ఆదివారం 4న పంచమీ తీర్థ మహోత్సవం జరుగుతుందని, ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని టిటిడి ఇ ఓ సాంబశివరావు తెలిపారు. గురువారం ఆయన అధికారులతో కలసి పుష్కరిణి గేట్లతోపాటు క్యూలైన్లు, బారీకేడ్లు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ పంచమితీర్థం నిర్వహణకు అమ్మవారి పద్మపుష్కరిణిని సిద్ధం చేసి ఏర్పాట్లు పూర్తి చేశామని,్భక్తులను ఉదయం 9గంటలకు పుష్కరిణిలోకి అనుమతిస్తామని చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసే అవకాశం ఉండడంతో టిటిడి విజిలెన్స్ సిబ్బంది పోలీసులతో సమన్వయం చేసుకుని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పుష్కరణిలోకి వచ్చే సమయంలోను, అలాగే భక్తులు వెలుపలికి వెళ్లే సమయంలోను తోపులాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉంటే ఎలాంటి తొక్కిసలాటలు జరగవన్నారు. ఇందుకోసం పుష్కరణిలోకి రావడానికి, వెలుపలికి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మధ్యాహ్నం 12.35 గంటలకుచక్రస్నానం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు ఇ ఓ తెలిపారు. దీని ప్రభావం పుష్కరిణిలో మూడు రోజులపాటు ఉంటుందని, భక్తులు సంయమనంతో వ్యవహరించి ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే పంచమీతీర్థానికి వచ్చే భక్తుల కోసం ఉదయం 50వేల మంది భక్తులకు అవసరమైన పొంగళి, ఉప్మా, సేమియా ఉప్మాతో అల్పాహారం, మధ్యాహ్నం 50వేల మందికి చక్కెరపొంగళి, కదంబం, పెరుగన్నం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అలాగే 2.5లక్షల వాటర్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. తిరుపతి జె ఇ ఓ పోల భాస్కర్ మాట్లాడుతూ పంచమితీర్థంకు తరలివచ్చే భక్తులు సంయమనంతో వ్యవహరించి ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ జయలక్ష్మి మాట్లాడుతూ పంచమితీర్థం నాడు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. తిరుచానూరులోకి వాహనాలను అనుమతించమని, బయటినుంచే వాహనాలను దారి మళ్లించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేస్తున్నామని అన్నారు. ప్రజలు,్భక్తులు నిర్దేశించిన ప్రాంతాల్లోనే తమ వాహనాలను పార్క్‌చేసి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో టిటిడి సి వి ఎస్ ఓ జి.శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎలక్ట్రికల్ ఎస్ ఇ వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటి ఇ ఓ మునిరత్నం రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ షర్మిష్ట, ఏ ఇ ఓ రాధాకృష్ణ ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
స్వర్ణరథంపై మెరిసిన మహాలక్ష్మి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణ రథంపై నాలుగు మాడా వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారు. అనంతరం రాత్రి 7 గంటల నుంచి అరగంటపాటు ఊంజల్‌సేవ వేడుకగా జరిగింది.
తహశీల్దార్లు అప్రమత్తంగా ఉండాలి
* తుఫాన్ నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
* జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా

చిత్తూరు, డిసెంబర్ 1: నాడా తుఫాన్ నేపథ్యంలో జిల్లా అంతటా అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ నాడా తుఫాన్ నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా అందరు తహశీల్దార్లు విధిగా మండల కేంద్రాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించినట్లు వివరించారు. తుఫాన్ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా తుఫాన్ వల్ల ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నా వెంటనే 08572-242744 నెంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. ప్రధానంగా తూర్పు మండలాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. ప్రజలు కూడా తుఫాన్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షం
* నాడా తుఫాన్ ప్రభావం

చిత్తూరు, డిసెంబర్ 1 : నాడా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. పలుచోట్ల చిరుజల్లులు కురవగా, మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి కురిసింది. ఈ తుఫాన్‌తో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. రానున్న రెండురోజుల్లో తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మండల స్థాయి అధికారులు తుఫాన్ నేపథ్యంలో విధిగా మండల కేంద్రాల్లోనే ఉండాలని జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా తూర్పు మండలాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న తరుణంలో ఈ మండలాల అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారుల హెచ్చరికలు జారీ చేశారు. రానున్న రెండు రోజుల్లో తుఫాన్ ప్రభావంతో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా మండల స్థాయి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ఆదేశించారు. తుఫాన్ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకు చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ 0872- 242744కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
మీసేవా కేంద్రాల్లో నగదు రహిత
లావాదేవీలు జరగాలి
* జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ఆదేశం

చిత్తూరు, డిసెంబర్ 1: క్యాష్‌లెస్ లావాదేవీలు మీసేవా కేంద్రాల్లో కూడా జరగాలని జిల్లా జాయింట్ కలెక్టర్ గిరిషా ఆదేశించారు. గురువారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని మీసేవా ఆపరేటర్లకు క్యాష్ లెస్ లావాదేవీలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ అన్ని మీసేవా కేంద్రాల్లో ఈపాస్ యంత్రాలు, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ వాలెట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిగాల్సి ఉందని, కావున ప్రతిఒక్క మీసేవ ఆపరేటర్ విధిగా దీనిపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో అర్బన్ ప్రాంతాల్లో ఈపాస్ మిషన్లు ద్వారా క్యాష్‌లెస్ లావాదేవీలు ప్రస్తుతం 25 శాతం జరుగుతున్నాయని, దీనిని నూరు శాతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ఇదే తరహాలో గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా దీనిపై అవగాహన కల్పించాలని, అక్కడ కూడా ఈ తరహాలో ఆర్థిక లావాదేవీలు జరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. డిఆర్‌డిఏ పిడి రవిప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా మీసేవా ఆపరేటర్లు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంచుకొని, ప్రజలకు సేవలు అందించాలన్నారు. అనంతరం క్యాష్‌లెస్ లావాదేవీలపై పలు సంస్థల ప్రతినిధులచే మీసేవా ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్‌డిఎం, రామమోహన్‌రావు, మైనారిటీ కార్పొరేషన్ ఈడి శ్రీనివాసులు, పలువురు మీ సేవా ఆపరేటర్లు పాల్గొన్నారు.

పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమ శాఖల తీరుపై జడ్పీటిసిల ఆగ్రహం

* డార్క్ ఏరియా నిబంధనలు సడలించాలి : జడ్పీ స్థాయా సంఘ సమావేశంలో జడ్పీటిసిల డిమాండ్

చిత్తూరు, డిసెంబర్ 1: పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమశాఖల తీరుపై పలువురు జడ్పీటిసిలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, స్థాయిసంఘాల అధ్యక్షులు గీత, సుభాషిణిల అధ్యక్షతన జడ్పీ స్థాయి సంఘ సమావేశాలు వేర్వేరుగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు జడ్పీటిసిలు పంచాయతీరాజ్‌శాఖ తీరుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయని, పలుమార్లు ఈ విషయాన్ని పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న మరమ్మతులకు కూడా నిధుల్లేవని చెప్పడం వల్ల ఈ శాఖ అసలు ఉందా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. కొన్ని చోట్ల రోడ్లు ఇరుపక్కల ముళ్లచెట్లు పెరిగిపోవడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నిధులు లేవని, మరోపక్క నిబంధనలు అడ్డు వస్తున్నాయని చెప్పడం దారుణమన్నారు. పంచాయతీరాజ్ ఎస్‌ఇ హమీద్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనల మేరకు రోడ్డుకు ఇరుపక్కల ఉన్న చెట్లను పంచాయతీరాజ్ శాఖ తొలగించడానికి వీలు
లేదని తేల్చి చెప్పారు. దీంతో పలువురు సభ్యులు ప్రతి దానికి నిధులు లేవని చెప్పడం ఎంతవరకు సమంజసమని ఎస్‌ఇపై మండిపడ్డారు. జడ్పీ నిధుల నుంచి గ్రామీణ ప్రాంత రోడ్లను రోడ్డుకు ఇరుపక్కల ఉన్న ముళ్ల చెట్లను తొలగించే విధంగా నిర్ణయం తీసుకోవాలని పంచాయతీరాజ్ ఎస్‌ఇ సూచించడంతో దీనిపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ తీరు దయనీయంగా ఉందని మరికొందరు సభ్యులు ఆ శాఖపై మండిపడ్డారు. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు జడ్పీటిసి వెంకట్‌రెడ్డియాదవ్ మాట్లాడుతూ మండలంలో అనేక చెరువులు మరమ్మతులకు గురైనా ఇంత వరకు ఇరిగేషన్ శాఖ అధికారులు పట్టించుకోలేదన్నారు. అలాగే పాకాల జడ్పీటిసి సురేష్ మాట్లాడుతూ స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతం ఆక్రమణలకు గురవుతోందని, ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మరికొందరు సభ్యులు మాట్లాడుతూ నీరు-చెట్టు కింద పనులకు వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గత ఏడాది మంచి వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయని, అయితే అనేక ప్రాంతాలను డార్క్ ఏరియాగా నిర్ణయించడంతో వ్యవసాయ బావులు, బోర్లలో నీళ్లు ఉన్నా వ్యవసాయం చేసుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. ట్రాన్స్‌కో అధికారులు మీ ప్రాంతాల్లో వ్యవసాయ బోర్లకు, బావులకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారని, తద్వారా రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు సభ్యులు ప్రస్తావించారు. వెంటనే ఈ డార్క్ ఏరియా నిబంధనలను సడలించి వ్యవసాయ బావులు, బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో జడ్పీ సిఇవో పెంచల కిషోర్ జోక్యం చేసుకొని డార్క్ ఏరియా ప్రాంతాల్లో నిబంధనలు సడలించడం ప్రస్తుతానికి సాధ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఈ నిబంధనలు సడలించాల్సి ఉందని తెలిపారు. పెనుమూరు జడ్పీటిసి రుద్రయ్యనాయుడు మాట్లాడుతూ పలుచోట్ల ఇష్టారాజ్యంగా చెరువుల్లో మట్టిని తరలిస్తున్నారని, తద్వారా చెరువులు దెబ్బతినే పరిస్థితి నెలకొందని, ఈ విషయం తెలిపినా ఇరిగేషన్ శాఖ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే ఈ ఏడాది వర్షాలు సక్రమంగా కురవని నేపథ్యంలో ముందస్తు తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని సభ్యులు డిమాండ్ చేయడంతో ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ వేణు స్పందిస్తూ జిల్లాలో నీటి సమస్యను నివారించేందుకు రూ.22 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. సదుం జడ్పీటిసి సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ అనేక చోట్ల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో సమస్య జఠిలమవుతుందన్నారు. ఈ విద్యుత్ కనెక్షన్ల కోసం ట్రాన్స్‌కో అధికారులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తుండటంతో గ్రామ పంచాయలకు భారంగా మారిందన్నారు. వాస్తవాలను గుర్తించి ట్రాన్స్‌కో అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. పుంగనూరు జడ్పీటిసి సభ్యుడు వెంకటరెడ్డియాదవ్ మాట్లాడుతూ పలుచోట్ల ఈ బోర్లు సంబంధించి మోటార్లు, పైపులు దొంగలపాలవుతున్నాయని తెలిపారు. దీంతో జడ్పీ సిఇవో స్పందిస్తూ మండల పరిధిలోని ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలని ఎంపిడివోలకు అదేశించామని తెలిపారు. ఈ స్థాయి సంఘ సమావేశాల్లో పలువురు జిల్లా స్థాయి అధికారులు, పలువురు జడ్పీటిసిలు పాల్గొన్నారు.

శ్రీసిటీని నుడాలో చేర్చితే సహించం
* పెనుబాల చంద్రశేఖర్ హెచ్చరిక
* వరదయ్యపాళెంలో కాంగ్రెస్ పార్టీ ధర్నా, రాస్తారోకో
వరదయ్యపాళెం, డిసెంబర్ 1: శ్రీసిటీ పారిశ్రామిక వాడను నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ (నుడా)లో చేర్చితే సహించమని, ఎటువంటి పోరాటానికైనా సిద్ధమని కాంగ్రెస్‌పార్టీ సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పెనుబాల చంద్రశేఖర్ తెలిపారు. ప్రభుత్వం శ్రీసిటీని నుడాలో చేర్చేందుకు జి ఓ విడుదల చేసిన సందర్భంగా శ్రీసిటీలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీనిలో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వరదయ్యపాళెం కాంగ్రెస్‌పార్టీ, సిపిఎం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ పెనుబాల చంద్రశేఖర్ మాట్లాడుతూ అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 12వేల ఎకరాల సముదాయంలో శ్రీసిటీని ప్రారంభించారన్నారు. శ్రీసిటీని చిత్తూరు జిల్లా కోసం వెనుకబడిన ప్రాంతం కావడంతో ఇండస్ట్రియల్ జోన్‌గా కేటాయించారని సెజ్ వల్ల చిత్తూరు జిల్లాకు ఆర్థికంగా వెనె్నముఖ లాంటిదని అన్నారు. అయితే సి ఎం సొంత జిల్లాలో సెజ్‌ను పక్కనున్న నెల్లూరుకు తరలించడంపై సి ఎం చేతగాని తనానికి నిదర్శనమని అన్నారు. ఆనాడు రైతులు తమ భూములు ఉద్యోగ అవకాశాలతో పాటు ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అనే ఉద్దేశ్యంతో భూములు ఇచ్చారని, అయితే శ్రీసిటీ యాజమాన్యం చిన్న చిన్న ఉద్యోగాలే తప్ప ఉన్నత స్థాయి ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేస్తోందని, అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీని నెల్లూరులోని నుడాలో చేర్చితే స్థానికులకు స్వీపర్ ఉద్యోగాలే తప్ప మరే ఉద్యోగాలకు అవకాశం లేదని అన్నారు. అయితే అభివృద్ధి పేరిట శ్రీసిటీలో నుడాలోచేర్చడం విడ్డూరంగా ఉందని, చిత్తూరు జిల్లాలో తుడా ఉండగా నెల్లూరు నుడాలో చేర్చడం వెనుక ఉన్న రాజకీయ స్వార్థం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. శ్రీసిటీని నుడాలో చేర్చినట్లయితే సెజ్ ప్రాంతంలో ఉన్న చెంగంబాకం, మోపూరి పల్లి, అప్పయ్యపాళెం, చిలముత్తూరు, మత్తేరిమిట్ట, సిద్దమ అగ్రహారం తదితర గ్రామాల్లోని ప్రజలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, ఉద్యమాలకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఇకనైనా ప్రభుత్వం ఇకనైనా వీరి బాధలను గుర్తించి శ్రీసిటీని నుడాలో చేర్చే ఆలోచన విరమించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాళెం కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు రమణయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి సుందరీకరణ పనులను పరిశీలించిన టిటిడి ఇ ఓ
* ఆధ్యాత్మికత ఉట్టిపడేలా 7 ఆర్చీల నిర్మాణానికి ఆదేశం
తిరుపతి, డిసెంబర్ 1: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో జరుగుతున్న సుందరీకరణ పనులను ఇ ఓ సాంబశివరావు గురువారం పరిశీలించారు. స్థానిక బాలాజీ కాలనీలోని ఎస్వీ ఉన్నత పాఠశాల మైదానం వద్ద ప్రజలు, భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న బస్‌షెల్టర్‌ను తనిఖీ చేశారు. బస్ షెల్టర్‌ను ఆకర్షణీయంగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అనంతరం శ్రీవారిమెట్టు, ఎల్ ఎస్ నగర్, శ్రీపద్మావతి అతిథిగృహం, వినాయకనగర్ ప్రాంతాల్లో బస్‌షెల్టర్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అలిపిరి వద్ద గరుత్మంతుని విగ్రహానికి సమీపంలో నిర్మిస్తున్న ఆర్చిని ఇ ఓ పరిశీలించారు. నగరంలో భక్తులు సంచరించే ఏడు ప్రధాన కూడళ్లలో ఆధ్యాతికత ఉట్టిపడేలా ఆర్చీలు నిర్మించేందుకు కార్యాచరణ రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈకార్యక్రమంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ ఇ రమేష్ రెడ్డి, ఇ ఇలు మనోహరం, మల్లిఖార్జునప్రసాద్ తదతరులు పాల్గొన్నారు.
జిల్లాస్థాయి ఆసుపత్రిగా అభివృద్ధికి ప్రతిపాదనలు
* ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కోచైర్మన్, సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి
మదనపల్లె, డిసెంబర్ 1: జిల్లాకేంద్రం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో ఆసుపత్రి నిర్వహణకై లీజుకు ఇవ్వడంతో ప్రభుత్వం మదనపల్లె ఏరియా ఆసుపత్రిపై దృష్టి సారించిందని, మదనపల్లె ప్రభుత్వాసుపత్రి జిల్లాస్థాయి ఆసుపత్రిగా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కోచైర్మన్, సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి వెల్లడించారు. గురువారం ప్రభుత్వాసుపత్రి అడ్వయిజరీ కమిటీ సమావేశం చైర్మన్ పోతుల విజయకుమార్ అధ్యక్షతన జరిగింది. అడ్వయిజరీ కమిటీ సమావేశానికి కోచైర్మన్ సబ్‌కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఎమ్మెల్సీ నరేష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ భవానిప్రసాద్, వైస్‌చైర్మన్ భవానిప్రసాద్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ పోతుల విజయకుమార్, డైరెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఆసుపత్రిలో వౌలిక వసతుల కల్పనకు ఆసుపత్రి సలహా కమిటీ కృషి చేస్తుందన్నారు. ఆసుపత్రి కార్యాలయం అవసరాల నిమిత్తం కావాల్సిన స్టేషనరీ కొనుగోలుకు అనుమతిస్తూ, కంప్యూటర్స్, ఇతర వౌలిక వసతుల కల్పనకు అవసరమైన కొటేషన్లు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రధానంగా ఆసుపత్రికి వచ్చే సందర్శకుల వసతి ఏర్పాటుకు, వాహనాల పార్కింగ్ సౌకర్యం వంటి వాటిపై చర్చించారు. అంతేకాకుండా ఆసుపత్రి ఫీజర్‌బాక్స్ ఏర్పాటుకు ఇదివరకే ప్రతిపాదనలు పంపడం జరిగిందని, ఆసుపత్రికి అవసరమైన అంబులెన్స్ ఎంపి నిధుల కింద మంజూరు చేసేందుకు సుముఖంగా ఉన్నారని, అయితే డీజిల్, డ్రైవర్ ఏర్పాటు చేయడంపై చర్చించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు వైద్యుల వద్ద చికిత్సలు చేయించుకోవడానికి సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని, ఆసుపత్రిలో మంచాలు రిపేర్లు చేయించాలని, మరమ్మతులకు గురైన సోలార్‌వాటర్ సిస్టమ్‌ను రిపేరు చేయించాలని, ఫర్నిచర్ కొనుగోలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ రత్నాకర్, ఆర్‌ఎంఓ డాక్టర్ రామ్మూర్తినాయక్, డైరెక్టర్లు కృష్ణమూర్తి, ఉషారాణి, పురుషోత్తం, రత్నమ్మ, ఆసుపత్రి వైద్యులు ఉన్నారు.
2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి

తిరుపతి, డిసెంబర్ 1: ప్రాణాంతకమైన ఎయిడ్స్‌పై అందరిలో అవగాహన పెంచి ఆంధ్రరాష్ట్రాన్ని 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి. ఎస్.రవికుమార్ అన్నారు. గురువారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరింకుని స్థానిక మహతి ఆడిటోరియంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. మన దేశంలో సంవత్సరానికి 86వేల మంది మృత్యువాత పడుతున్నారన్నారు. ఎయిడ్స్ రోగుల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోవడంతో వ్యాధులు విజృంభించి ఇన్‌ఫెక్షన్లకు గురవుతారని, టిబి, క్యానె్సర్, హెచ్‌బి ఎస్‌ఏజి వంటి జబ్బులు విజృంభిస్తాయన్నారు. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు డిప్రెషన్‌కు లోనవుకుండా డాక్టర్ల సలహా మేరకు నాణ్యమైన మందులు వాడటంతో రోగనిరోధక శక్తి పెంచుకొని తమ ఆయష్షును పెంచుకోవచ్చని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న విప్లవాత్మక చర్యల వల్ల ఎయిడ్స్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని అన్నారు. ఈ సందర్భంగా వ్యాసరచన పోటీల్లో విజయం సాధించిన షాలిని, భావన, హారికలకు, స్లోగన్ రైటింగ్ కాంపిటీషన్‌లో ప్రతిభ కనబరిచిన సోనికా, కావ్యలకు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో శ్రీపద్మావతి మహిళ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హనుమంతరావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, కమ్యూనిసటీ మెడిసిన్ ఇన్‌చార్జ్ విభాగాధిపతి డాక్టర్ అంజుఅబే, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణి, డాక్టర్ వై.వెంకటరామరెడ్డి, సుదర్శన్, ఎం.ఎస్.డబ్ల్యు.ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.