చిత్తూరు

ధనార్జన కన్నా నైతిక విలువలకు అధిక ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 6: ధనార్జన కన్నా నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సమసమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, తద్వారా దేశాభివృద్ధి పురోగతి సాధిస్తుందని కెనరాబ్యాంక్ చైర్మన్, పద్మశ్రీ ఎన్ మనోహరన్ అన్నారు. ది సౌత్ ఇండియన్ రీజనల్ కౌన్సిల్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఆర్‌సి) 48వ రీజనల్ కాన్ఫరెన్స్ మంగళవారం స్థానిక ఎస్వీవెటర్నీ క్రీడా మైదానంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ రెండు నిమిషాలు వౌనం పాటించారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ మనోహరన్ మాట్లాడుతూ కాలానుగుణంగా చట్టాల్లో వస్తున్న మార్పులపై ఆడిటర్లు అవగాహన పెంచుకుని పట్టు సాధించాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ నోట్ల రద్దు ప్రకటన చారిత్రాత్మకమైందన్నారు. అయితే ప్రస్తుతం సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అవి తాత్కాలికమే అన్నారు. భవిష్యత్తులో మేలు జరిగేది కూడా పేద, మధ్యతరగతి ప్రజలకే అన్నారు. భారతదేశంలో నల్లధనాన్ని అరికట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించాలని అన్నారు. అయితే ఆడిటర్లు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదే సమయంలో ఆడిటర్లు తమ ఆరోగ్యం, కుటుంబ బంధాన్ని విస్మరించకూడదన్నారు. ఏ వృత్తిలో ఉన్న వారికైనా వృత్తిలో వచ్చే సంపాదన ఒక రబ్బరు బంతైతే, కుటుంబ బంధం, ఆరోగ్యం, నైతిక విలువలు మూడు గాజు బంతులన్నారు. రబ్బరు బంతి చేయిజారినా తిరిగి అంతకన్నా తిరిగి పొందే అవకాశం వస్తుందని చెప్పారు. అయితే గాజు బంతులు చేజార్చుకుంటే అవి అతుకులు అవుతాయేతప్ప సహజ రూపాన్ని కోల్పోతాయని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని సమావేశంలో ప్రతినిధుల హర్షద్వానాల మధ్య తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజశేఖర్ అనే యువకుడు ఛార్టెడ్ అకౌంటెంట్ పరీక్షలు రాశారన్నారు. ఎందుకు ఈ వృత్తిని ఎంచుకున్నావని ప్రశ్నిస్తే అందుకు ఆ యువకుడు చెప్పిన మాటలు తనకు ఎంతో నచ్చాయన్నారు. తాను ఛార్టెడ్ అకౌంటెంట్ కావాలన్న ఆస్పిరేషన్, తన స్నేహితుల ఇన్స్పిరేషన్, కుటుంబంలో తలెత్తిన ఆర్థిక పరిస్థితులతో డెప్పిరేషన్, విజయం సాధించాలన్న రెస్ట్రిరేషన్‌తో పరీక్షలు రాశానని ఆ యువకుడు చెప్పారని అన్నారు. అందుకే ఆడిటర్లు తమ వృత్తి ధర్మాన్ని పాటించడంలో సమాజానికి మార్గదర్శకులు కావాలని పిలుపునిచ్చారు. ఐసిఏఐ అధ్యక్షులు దేవరాజులురెడ్డి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నేడు అనేక ఆర్థిక సంస్కరణలు, తద్వారా జరుగుతున్న పరిణామాల గురించి వివరించారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో వేళ్లూనుకని ఉన్న ఉగ్రవాదాన్ని, అవినీతిని, నల్లధనాన్ని అలాగే స్మగ్లింగ్‌ను నివారించేందుకే పెద్దనోట్లు రద్దు చేశారని అన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రజల కళ్లల్లో ఆనందాన్ని, వారి జీవితాలకు వెలుగులు నింపుతాయని చెప్పారు. చిత్తూరు ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోదీ నిర్ణయం నల్లకుబేరుల్లో సంతోషాన్ని, సామాన్యుల్లో దుఃఖాన్ని, కష్టాన్ని మిగిల్చాయని అన్నారు. అందుకే తాను పార్లమెంట్‌లో బ్లాక్ అండ్ వైట్ షర్ట్‌తో నిరసన వ్యక్తం చేశానని అన్నారు. బ్లాక్ అంటే నల్లధనం ఉన్నవారని వారు ఆనందంగా ఉన్నట్లు వైట్ మనీ కలిగి ఉన్న పేదప్రజలు రోదిస్తున్నట్లు వస్తధ్రారణతో ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజేశానని చెప్పారు. అయితే ఆడిటర్లు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రత్యేక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి నినాదాలతో ప్రభుత్వాలు ముందుకు వెళ్తుంటే దానికి అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సి చైర్మన్ ఫల్గుణకుమార్, అమర్‌రాజా బ్యాటరీస్ అధినేత గల్లా రామచంద్రనాయుడు, జోహో సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎండి జోహో, ఎస్‌ఐఆర్‌సి కార్యదర్శి జోమోన్ కె జార్జి, తిరుపతిశాఖ చైర్మన్ కె రఘురామిరెడ్డి, కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్ చంద్రారెడ్డి, విశ్వనాథ్, ప్రదీప్, కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో ఛార్టెడ్ అకౌంటెంట్లు కీలకపాత్ర పోషించాలి
* పన్ను చెల్లింపుల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి
* ఐసిఏఐ అధ్యక్షుడు ఎం దేవరాజరెడ్డి పిలుపు

తిరుపతి, డిసెంబర్ 6: పన్ను చెల్లింపుల్లో నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి దేశప్రగతిలో భాగస్వాములు కావడంలో ఛార్టెడ్ అకౌంటెంట్లు కీలకపాత్ర పోషిచండంలో కట్టుబడి ఉండాలని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు ఎం దేవరాజరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఎస్వీ వెటర్నీరీ క్రీడా మైదానంలో ఐసిఏఐ దక్షిణ భారత దేశ ప్రాంతీయ కౌన్సిల్ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఆయన విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఉగ్రవాదాన్ని, నల్లధనాన్ని, అవినీతిని, అక్రమ రవాణాను నియంత్రించడానికే ప్రధాని మోదీ పెద్దనోట్లు రద్దు చేశారని అన్నారు. ఇందుకోసం రాజకీయంగా తన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆయన తీసుకున్న నిర్ణయంతో తాత్కాలికంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు కష్టాలు ఎదురవుతాయని, మరో 6 నుంచి 9నెలల తరువాత దీని ఫలితాలు అందరికీ అందుతాయన్నారు. అయితే ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఛార్టెడ్ అకౌంటెంట్లపైనే ఉందని తెలిపారు. ఇందుకోసం సభలు, సమావేశాలు నిర్వహించాలన్నారు. ఇందుకు ఏవైనా నిధులు అవసరమైనా తమను సంప్రదించాలని కోరారు. ఛార్టెడ్ అకౌంటెట్లు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. దేశంలో అనేక రంగాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నట్లు చార్టెడ్ అకౌంటెంట్లలో కూడా కొందరు తమ సంపాదన కోసం అవినీతిపరులకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందేనన్నారు. అయితే ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే మాత్రం వారిపై చర్యలు తప్పవని చెప్పారు. మోదీ నిర్ణయంతో నవంబర్ 8వ తేదీ మరో ఆర్థిక స్వాతంత్రోద్యమానికి నాంది పలికారని ధనంజయరెడ్డి చెప్పారు. పెద్ద నోట్లు రద్దు తరువాత అవసరాల కోసం రూ.2 వేల నోట్లను కేంద్రం తీసుకువచ్చిందని వివరించారు. 1700 మంది సభ్యులతో ప్రారంభమైన ఐసిఏఐ నేడు 2.5 లక్షల మంది ఉన్నారని అన్నారు. చార్టెడ్ అకౌంటెంట్లుగా 2.54 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఐదు రీజనల్ కార్యాలయాలతో, 161 బ్రాంచ్‌లతో ఐసిఏఐ అభివృద్ధి చెందుతోందని అన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో ప్రధాని చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి, ఓయుబి, ఆడిట్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, ఇన్‌కం డిక్లరేషన్ స్కీం, 2016- ఆన్ ఆపర్చునిటీ టు పే టాక్స్ అండ్ కంక్లీన్ వంటి అంశాలపైనే కాకుండా ఇతర అంశాలపై కూడా సభ్యులకు అవగాహన కల్పిస్తారని ఆయన చెప్పారు.