చిత్తూరు

వకుళమాత ఆలయ పునరుద్ధరణకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్దరణకు రూ.2.04 కోట్లు రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు టిటిడి ఛైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. అనంతరం బోర్డు తీసుకున్న నిర్ణయాలను చదలవాడ విలేకరులకు వివరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా పలమనేరులో టిటిడి ఏర్పాటుచేస్తున్న ఎస్వీ గో సంరక్షణ శాలలో గోవుల కోసం 6 షెడ్లు నిర్మాంచాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం 4.74 కోట్లు నిధులు మంజూరుచేశారన్నారు. పేరూరు బండపై ఉన్న స్వామివారి తల్లి వకుళామాత ఆలయ పునరుద్దరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ క్రమంలో పెన్సింగ్, మెట్ల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించేందుకు అవసరమైన అంచనాలను తయారుచేయమని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించడం జరిగిందన్నారు. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మాసాల్లో భక్తులు సమర్పించిన తలనీలాలను ఈ-వేలం వేయడం ద్వారా రూ.14 కోట్ల 71 లక్ష 58 వేల రూపాయల ఆదాయం లభించిందన్నారు. ఇందులో సెప్టెంబర్ మాసంలో 12.13 కోట్ల రూపాయలు, అక్టోబర్ లో రూ.2.07 కోట్లు, నవంబర్‌లో రూ.51.58 లక్షలు ఆదాయం లభించిందన్నారు. బెంగళూరుకు చెందిన స్వర్గీయ వి ఎన్ రంగనాథన్ రెడ్డి సతీమణి కె. సుకన్య తదితరులు కలిసి చిత్తూరుజిల్లా రామకుప్పం మండలం కిల్లాకు పోడు గ్రామంలో కొనుగోలు చేసిన రూ.74.90 లక్షలు విలువచేసే 6.22 ఎకరాల స్థలాన్ని టిటిడికి విరాళంగా ఇచ్చారన్నారు. ఈ స్థలాన్ని స్వీకరించేందుకు కూడా సమావేశం ఆమోదం తెలిపిందన్నారు. 3 నెలల కాలానికి టిటిడికి అవసరమైన 15.30 లక్షల కిలోల సోనామసూరి బియ్యాన్ని కిలో రూ.40 చొప్పున కొనుగోలు చేయడానికి ఆమోదం లభించిందన్నారు. ఇందుకు గాను రూ.6.12కోట్లు నిధులు మంజూరుచేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ మిల్లర్స్ అసోసియేషన్ వారు 9.18 లక్షల కిలోలు, తెలంగాణ రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ 6.12 లక్షల కిలోల బియ్యాన్ని టిటిడి నిర్ణయించిన ధరకు సరఫరా చేస్తారన్నారు. అలాగే శ్రీవారి భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి సబ్సీడీ ధరపై టిటిడి కొబ్బరికాయలను సరఫరాచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో 3నెలలకు అవసరమైన 11 లక్షల కొబ్బరికాయలను కొనుగోలుచేసేందుకు 86.46 లక్షలు నిధులు కేటాయించామన్నారు. బెంగళూరుకు చెందిన బాబు లోకనాథన్, జయశ్రీ బాబు, బెంగళూరులోని జెపి నగర్‌లోరూ.57.33 లక్షల విలువైన తమ స్వగృహాన్ని టిటిడికి విరాళంగా ఇచ్చారన్నారు. ఈ స్వగృహాన్ని స్వీకరించడానికి ఆమోదించామన్నారు. 2 నెలల కాలానికి అవసరమైన 1.25 లక్షల కిలోల ఎస్ గ్రేడ్ జీడిపప్పును కిలో రూ.934.11 చొప్పున ఇ-టెండర్ ద్వారా కొనుగోలుచేయడానికి రూ.1.16కోట్ల రూపాయలు నిధులు మంజూరుచేశామన్నారు. తిరుపతి సుందరీకరణ పనుల్లో భాగంగా టిటిడికి రేణిగుంట జంక్షన్ నుంచి కాలూరుక్రాస్‌వరకు 2వేల అడుగుల రోడ్డు వెంబడి విద్యుదీకరణ సుందరీకరణ పనులకు రూ.10 కోట్లు తుడాకు నిధులు మంజూరుచేసినట్లు ఆయన తెలిపారు.

శ్రీవారి ఆలయ పోటు, టిటిడి కాంట్రాక్ట్ డ్రైవర్లకు ధర్మకర్తల మండలి వరాల జల్లు
* టిటిడి ఉప ఆలయాల్లో 447 మంది అర్చకులు, పరిచారికల పోస్టులకు ప్రభుత్వానికి ప్రతిపాదన

తిరుపతి, డిసెంబర్ 20: శ్రీవారి ఆలయంలో లడ్డూ, వడ ప్రసాదాల తయారీకి సంబంధించి పనిచేస్తున్న అదనపు పోటులో పనిచేస్తున్న కార్మికులకు , టిటిడిలో కన్సాల్డేటెడ్ కార్మికులుగా పనిచేస్తున్న డ్రైవర్లకు టిటిడి ధర్మకర్తల మండలి నూతన సంవత్సరం సందర్భంగా వరాల జల్లు కురిపించింది. ఇందులో భాగంగా అదనపు పోటులోపనిచేస్తున్న 176 మంది కార్మికులకు కాంట్రాక్ట్ కాలపరిమితులు మరోయేడాది పొడిగించింది. అలాగే డ్రైవర్లకు 2015లో సవరించిన వేతన శ్రేణుల ప్రకారం ఒక్కొక్కరికి రూ.15,189 వేల నుంచి రూ.24,500 వేలకు వేతనాలను పెంచింది. ఇక టిటిడి ప్రధాన ఆలయాలు, వాటి అనుబంధంగా ఉన్న ఉప ఆలయాలు, టిటిడిలో విలీనమైన ఆలయాల్లో పనిచేసేందుకు 447 మంది అర్చకులు, పరిచారికల పోస్టులను నియమించాలని, ఇందుకు సంబంధించి ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ సమావేశంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు, రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనురాధ, తిరుమల జె ఇ ఓ కె ఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జె ఇ ఓ పోలాభాస్కర్, ధర్మకర్తల మండలి సభ్యులు రాఘవేంద్రరావు, భానుప్రకాష్‌రెడ్డి, సండ్రా వెంకటవీరయ్య, సుచిత్రా ఎల్లా, పి. అనంతలక్ష్మి, పుట్టా సుధాకర్‌యాదవ్, అరికేళ నరసారెడ్డి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కృష్ణమూర్తి, డోలా బాలవీరాంజనేయ, చింతల రామచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైకుంఠ ఏకాదశి రోజున 4 గంటలకే సర్వదర్శనం - టిటిడి ఇ ఓ
నూతన సంవత్సరంలో జనవరి 8,9వ తేదీలలో జరుగనున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో సామాన్య భక్తులకు పెద్ద పీట వేయనున్నామని ఏకాదశి రోజున ఉదయం 4 గంటల నుంచే భక్తులకు (మిగతా సర్వదర్శనానికి అనుమతిస్తామని టిటిడి ఇ ఓ డాక్టర్ డి. సాంబశివరావు తెలిపారు. తిరుమలలో మంగళవారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశం అనంతరం ఆయన విలేఖరులతోమాట్లాడుతూ నారాయణ గిరి ఉద్యానవనాల్లో భక్తులు వేచి ఉండేందుకు అవసరమైన షెడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. అక్కడ వారికి మరుగుదొడ్లు, వసతి ఏర్పాటుచేస్తామన్నారు. కాగా క్యూలైన్లో నిలుచున్న భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, తాగునీరు అందించనున్నామన్నారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు ఏర్పాటుచేస్తామన్నారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి సులభంగా, ప్రశాంతంగా, సంతృప్తికరంగా శ్రీవారి దర్శన మయ్యేలా చర్యలు చేపట్టామన్నారు. భక్తులు సమన్వయంతో వ్యవహరించి టిటిడికి సహకరించాలన్నారు.

ఉపాధి పనుల్లో నిర్లక్ష్యం తగదు

* ప్రజావేదిక గ్రామసభలో ఎపిడి దీక్షాకుమారి స్పష్టం
* 60,568 రికవరీకి ఆదేశం
* భర్తలు ఉన్నా పింఛన్లు
* సామాజిక తనిఖీలో గుర్తించిన బృందాలు
* ఇరిగేషన్ ఎ ఇ నుంచి 32 వేలు రికవరికి ఆదేశం
రొంపిచెర్ల, డిసెంబరు 20: ఉపాధి పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని కూలీలకు అన్యాయం జరగకుండా చూడాలని జిల్లా డ్వామా అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ దీక్షాకుమారి అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయం ఆవరణంలో మంగళవారం ఉపాధి పనులు తనిఖీపై ప్రజావేదిక నిర్వహించారు. ఈసందర్బంగా జరిగిన సమావేశానికి మండలాధ్యక్షురాలు చల్లా ప్రేమలత అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఉపాధిలో మంచి పనులు చేపట్టి మండలానికి మంచి పేరు తేవాలని కోరారు. ఎపిడి దీక్షాకుమారి మాట్లాడుతూ కూలీలు వలసలు నివారించేందుకు ఉపాధి పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. కూలీలు,రైతులు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకుని మెరుగుపడాలని అన్నారు. మండలంలో రూ.5 కోట్లతో జరిగిన 1884 పనులను తనిఖీ బృందాలు సర్వే చేసినట్లు తెలిపారు. పనులు పూరైన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. చెంచెమరెడ్డిగారిపల్లె పంచాయతీలో కూలీలకు గడ్డపార అలవెన్సులు చెల్లించనందుకు సిబ్బందిని మందలించారు. ఉపాధి మస్టర్లలో తప్పని సరిగా సంతకాలు పెట్టాలని సిబ్బంది ఆఫీసులో కూర్చుని ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు.ఫొటోలు తీయకుండా పనులు ప్రారంభించరాదని పేమెంట్లు చెల్లించవద్దని అన్నారు. ఉపాధి పనుల్లో దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు పనులుచేసి డబ్బులు తీసుకోవాలని కోరారు. తనిఖీ బృందాలు విచారణ రిపోర్టును ఎవరిచేతనైనా రాయించి సంతకాలు తీసుకోవాలని విఎస్‌ఎస్‌లు రాస్తే చెల్లదని అన్నారు. నిర్లక్ష్యంగా విధులు నిర్వహించినందుకు కంప్యూటర్ ఆపరేటర్‌కు, ఫీల్డు అసిసెంట్‌లకు, టెక్నికల్ అసిస్టెంట్లకు ఆమె అపరాధం విధించారు. అలాగే ఉపాధి పనుల్లో బయట పడిన అవకతవకలపై రికవరీకి ఆమె ఆదేశించారు. చెంచెమరెడ్డిగారిపల్లెలో రూ.988, రొంపిచెర్లలో రూ.925, బోడిపాటివారిపల్లెలో రూ.8562, బొమ్మయ్యగారిపల్లెలో రూ.4001,మోటుమల్లెలలో రూ.1581, గానుగచింతలో రూ.8,430, పెద్దమల్లెలలో రూ.2,676, పెద్దగొట్టిగల్లులో రూ.500, రికవరీకి ఆదేశించారు. ఇరిగేషన్ పనుల్లో జరిగిన తప్పులకు ఆశాఖ ఏఇ మహమ్మద్ గౌస్ నుంచి రూ. 32,123 రికవరీకి ఆమె ఆదేశించారు. సామాజిక తనిఖీ బృందాలు పంచాయతీల్లో
పింఛన్లు, విద్యార్థుల ఉపకార వేతనాలు పంపిణీపై కూడా సర్వే నిర్వహించి నివేదికను ప్రజావేదికలో చదివి వినిపించారు. ఈసందర్బంగా ఒకే రేషన్ కార్డుతో ఇద్దరు పింఛన్లు పొందుతున్నట్లు, చేనేత కార్మికులు సర్ట్ఫికెట్ లేకున్నా పింఛన్లు తీసుకుంటున్నట్లు, వయసు తక్కువ ఉన్నా పలువురికి పింఛన్లు ఇస్తున్నట్లు సర్వేలో గుర్తించారు. అలాగే భర్తలు ఉండి కూడా పలువురు మహిళలు వితంతు పింఛన్లు తీసుకుంటున్నట్లు సర్వేలో కనుగొన్నారు. అంగన్‌వాడీ ఆయాలు పనిచేసే ఇద్దరు మహిళలు కూడా పింఛన్లు తీసుకుంటున్నారని సర్వే బృందం పేర్కొన్నారు. రొంపిచెర్లలో సల్మా,షారూఖ్‌బాషా అనే ఇద్దరు విద్యార్థులు చదువు పూరైనా ఉపకార వేతనాలు పొందినట్లు తెలియజేశారు. దీనిపై సంబంధిత అధికారి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ అనర్హులకు ఇస్తున్న పింఛన్లను తీసేయాలని అన్నారు. చేనేత సర్ట్ఫికెట్ లేకుండా ఆపింఛను ఇవ్వడం పద్దతి కాదని సర్ట్ఫికెట్ తెచ్చుకుంటే పింఛను కొనసాగించాలని లేని పక్షంలో అర్హత ఉంటే వృద్ధాప్య పింఛనుగా మార్చాలని కార్యదర్శులను, ఐకేపీ అధికారులను ఆదేశించారు. ప్రజావేదిక గ్రామసభ ఉదయం 12 నుంచి సాయంత్రం 7-30 వరకు జరిగింది. ఈకార్యక్రమంలో ఎంపిడిఒ ఉమాలక్ష్మి, ఎపిడిలు నందకుమార్ (పీలేరు), గురుమూర్తిరావ్ (మదనపల్లె), ఎస్సార్పీ రమేష్, ఉపిధి ఎపిఒలు హరికృష్ణ, కృష్ణయ్య, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు చల్లారామచంద్రారెడ్డి, మండల ప్రత్యేకాధికారిణి రేణుకాదేవి, ఐకేపీ అధికారిణి స్వర్ణలత, ఈవో ఆర్డీ మాలతి, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు.

ఇస్కా సదస్సులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
* అర్బన్ ఎస్పీ జయలక్ష్మి వెల్లడి

రేణిగుంట, డిసెంబర్ 20: తిరుపతిలో 2017 జనవరిలో జరుగనున్న ఇస్కా సదస్సులకు, వైకుంఠ ఏకాదశికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి వెల్లడించారు. సోమవారం మధ్యాహ్నం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లో విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకు సంబంధించి ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇస్కా సదస్సులను విజయవంతం చేసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేశామని, ఇందులోభాగంగా విమానాశ్రయం నుంచి ఎస్వీ యూనివర్సిటీ వరకు సదస్సుకు హాజరయ్యే అతిధులకు ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్ రోడ్స్ ఏర్పాటుచేశామని ముఖ్యమంత్రి , ప్రధాని ఎలా రోడ్డు మార్గాన వెళతారో అదే తరహాలో రోడ్డు మార్గ ప్రయాణంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఇస్కా సదస్సులు జరిగినన్నిరోజులు అర్బన్ పోలీస్ పరిధిలో మఫ్టీ పోలీసింగ్ అందుబాటులో ఉంటుందని, దీని వలన ఎక్కడ ఏం జరుగుతున్నా పోలీసులకు ముందుగా పూర్తి సమాచారం అందుతుందన్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి నాడు టిటిడితోకలిసి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని, తిరుచానూరు బ్రహ్మోత్సవాలను ఏ విధంగా విజయవంతం చేశామో అదే తరహాలో వైకుంఠ ఏకాదశిని విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే ఈనెల 31న రాత్రి అర్బన్ పోలీస్ పరిధిలో యువత హద్దులు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో డి ఎస్పీ నంజుండప్ప, సి ఐ బాలయ్య, టాస్క్ఫోర్స్ డీ ఎస్పీ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సెంటినరీ పార్కును
పరిశీలించిన కమిషనర్
తిరుపతి, డిసెంబర్ 20: తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని తిరుమల బైపాస్‌రోడ్డు నందు రూపొందిస్తున్న సెంటినరీ పార్కును కమిషనర్ వినయ్‌చంద్ ఇంజనీర్లతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వార్ధా తుఫాను కారణంగా కూలిపోయిన పూలచెట్ల స్థానంలో రెండు రోజుల్లో కొత్తవి ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే గోడలకు రంగులు వెలిసిపోయి ఉండటాన్ని చూసి నూతనంగా రంగులువేయించి మంచి బొమ్మలు వేయించాలని అధికారులను ఆదేశించారు. పార్కులో డంపర్‌బిన్‌లు ఏర్పాటుచేయాలని, ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్‌ను, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేవిధంగా పూలచెట్లు ఏర్పాటుచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నగర ప్రజలు కుటుంబ సమేతంగా పార్కును సందర్శించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, ఆహ్లాదకర వాతావరణంలో పిల్లా పాపలతో సంతోషంగా అనుభవించాలని కోరారు. బయటవారెవరూ లోపలకు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట అదనపుకమిషనర్ ఎం.శ్రీదేవి, ఇంజనీర్లు బి.చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.
అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
* సమ సమాజ నిర్మాణంలో మరింత కీలకపాత్ర పోషించాలి
* మహిళా వర్సిటీ రిజిస్టార్ ఆచార్య మమత

తిరుపతి, డిసెంబర్ 20: విద్య, ఉద్యోగాల్లో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించడంపై మహిళా విద్యార్థినులు దృష్టి సారించాలని మహిళా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య మమత అన్నారు. గత 4 రోజులుగా తిరుపతి ఎన్‌జి రంగా వ్యవసాయ కళాశాలలోజరుగుతున్న అంతర్ వ్యవసాయ కళాశాలల క్రీడా సాంస్కృతిక పోటీలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాన్ని అందుకున్న క్రీడా కారులకు, సాంస్కృతిక కళాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన ఆచార్య మమత మాట్లాడుతూ మహిళలు మానసికంగా, శారీరకంగా కూడా బలంగా ఉన్నపుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. ఒక మంచి కుటుంబాన్ని, ఒక మంచి దేశాన్ని తయారుచేయడంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారని, ఇది గొప్ప శుభపరిణామం అన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ టివి సత్యనారాయణ మట్లాడుతూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను అధిగమించే ఆత్మస్థైర్యాన్ని క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందిస్తాయన్నారు. ప్రతి విద్యార్థి విద్యతోపాటు, క్రీడలు, వ్యక్తిత్వ వికాస అంశాలలోప్రావీణ్యం సాధించాలన్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మనం నేర్చుకునే విద్యపై పట్టు సాధిస్తే విజయం మన ముంగిట వాలుతుందన్నారు. ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టు అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ గత 4 రోజులుగా విద్యార్థినీ విద్యార్థులు ఎంతో క్రమశిక్షణతోపోటీల్లో పాల్గొని విజయవంతం చేశారన్నారు. గెలిచిన విజేతల నుంచి 40 మందిని ఎంపికచేసి 2017 జనవరిలో జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల పోటీలకు పంపనున్నామన్నారు. ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ టివి మురళీనాథరెడ్డి, డాక్టర్ ఐ.్భవానీ దేవి, డాక్టర్ ఎస్ ఆర్ కోటీశ్వరరావు, డాక్టర్ టి సి ఎం నాయుడు, ఎస్వీ వెటర్నరీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఈశ్వర్ ప్రసాద్, వర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి, కళావిద్యార్థి సంబంధాల అధికారి డాక్టర్ ఎన్ సి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థినీ విద్యార్థులు మంచి పోరాట పటిమతోపాల్గొని ఈ పోటీలను విజయవంతం చేశారన్నారు. ఇందుకు సహకరించిన బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఇక గుండుకు 11 రూపాయలు

తిరుపతి, డిసెంబర్ 20: టిటిడి కల్యాణకట్టలో పీస్ రేట్ కింద పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులకు ఇకపై ఒకరికి గుండుకొడితే 11 రూపాయలు చెల్లించాలని టిటిడి ధర్మకర్తల మండలి నిర్ణయించినట్లు చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. మంగళవారం అన్నమయ్య భవన్‌లో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేఖరులకు తెలియజేస్తూ ప్రస్తుతం టిటిడి కల్యాణకట్టలో పనిచేస్తున్న పీస్ రేట్ క్షురకులకు ఒకరికి గుండుకొడితే 7 రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. ఇకపై 11 రూపాయలు చెల్లించాలని నిర్ణయించామన్నారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి కార్మికుల విభాగం జిల్లా అధ్యక్షులు పి.చెంచునారాయణ, టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావుకు, జె ఇ ఓ శ్రీనివాసరాజుకు, టిటిడి పాలక మండలి సభ్యులు చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి, ఇతర బోర్డు సభ్యులకు, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
స్విమ్స్ డైరెక్టర్‌గా డాక్టర్ రవికుమార్
పూర్తి స్థాయిలో నియామకం
తిరుపతి, డిసెంబర్ 20: స్విమ్స్‌కు ఇన్‌చార్జ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్న డాక్టర్ తంజావూరు రవికుమార్‌ను పూర్తి స్థాయి డైరెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన 3 సంవత్సరాల పాటు డైరెక్టర్‌గా కొనసాగుతారు.

కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తల ధర్నా
* మెమో నెంబర్ 3211ను రద్దుచేయాలి
* సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

చిత్తూరు, డిసెంబర్ 20: అంగన్‌వాడి కార్యకర్తల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీధర్నాను నిర్వహించారు. ఈ ఆందోళనకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ విఠపుబాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా అంగన్‌వాడిల మీద ప్రభుత్వం కక్షగట్టి కానె్వంట్లగా మార్పు చేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. అంగన్‌వాడి కేంద్రాలు కేవలం ప్రీస్కూల్ కోసం ఏర్పాటు చేసినవి కావని, పిల్లలకు, గర్భిణులు , బాలింతలు, కిషోర్ బాలికలకు ఈ కేంద్రాలు ద్వారా అనేక సేవలు అందుతున్నాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఐసిడిఎస్ ఏర్పడిన తరువాత గ్రామాల్లో శిశుమరణాలు, మాతృమరణాలు తగ్గాయని, వీటివల్ల పాఠశాలలకు వెళ్ళె పిల్లల సంఖ్య పెరిగిందన్నారు. అయితేనేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటికిక్రమేణా నిధులు తగ్గిస్తూ అంగన్‌వాడి కేంద్రాలను వదిలించు కోవడానికి సిద్దమవుతున్నట్లు ఆరోపించారు. అంగన్‌వాడి కేంద్రాలను సక్రమంగా నడవకపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలను ప్రభుత్వం పలురకాల పనులతో వారిని సెంటర్లకు దూరం చేస్తూ వీటిని నిర్వీర్యం చేస్తున్నదని దుయ్యపట్టారు. అంగన్‌వాడి కార్యకర్తలకు సక్రమంగా జీతాలు చెల్లించక వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటం అడుతుందన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించి అంగన్ వాడి కేంద్రాలను కానె్వంట్లుగా మార్చాలన్న ఆలోచనకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని డిమాండ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ అంగన్‌వాడి వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సుజిని మాట్లాడుతూ ఐసిడిఎస్‌కు బడ్జెట్ తగ్గించడం వల్ల వేతనాలు, టిఏలు, సెంటర్ అద్దెలు నెలల తరబడి రాక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. అంగన్‌వాడి కార్యకర్తల చేత ప్రభుత్వం అనేక పనులు చేయించుకొంటున్నా, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా వేతనాలు ఇవ్వడం లేదన్నారు. కనీసం పనికి తగిన విధంగా వేతనాలు అందక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వీడిని రద్దుచేసి కానె్వంట్లను పెట్టాలని నిర్ణయానికి రావడంతో అనేక మందికి ఉన్న ఉపాధి కూడా పోయే ప్రమాదం నెలకొందన్నారు. వెంటనే పెండంగ్‌లో ఉన్న వేతనాలు, కేంద్రాల అద్దెలు ఇతర బిల్లులు చెల్లించాలని, 3211 మెమోను రద్దుచేసి వర్కరు, హెల్పర్ పోస్టులు భర్తీ చేయాలని, సరకుల రవాణా ఛార్జీలు చెల్లించాలని, చనిపోయిన కార్యకర్తలకు గ్రూప్ ఇన్సూరెన్సు అమలు చేయాలని. కార్యకర్తలకు అదనపు పనులకు స్వస్తి పలకాలని డిమాండ్ చేసారు. జిల్లా కార్యదర్శి వాణిశ్రీ మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల సాధనకోసం అనేక ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడి కేంద్రాలే కీలకంగా ఉన్నా ప్రభుత్వం వీటిని క్రమేణా రద్దుచేయాలని కుట్ర చేస్తోందన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నా మాపట్ల వివక్ష చూపడం దారుణమన్నారు. వెంటనే తమ న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేసారు. ఈధర్నాలో సిఐటి యునేత చైతన్య, అంగన్‌వాడి సంఘ నేతలు ప్రమిళా, రాజేశ్వరి, పద్మ, లీలా, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మేస్ర్తి సహా 22 మంది ఎర్రకూలీలు అరెస్ట్
* 69 ఎర్రదుంగలు స్వాధీనం * అర్బన్ ఎస్పీ జయలక్ష్మి వెల్లడి
రేణిగుంట, డసెంబర్ 20: తమిళనాడు రాష్ట్రం పోలూరుకు చెందిన మేస్ర్తితో పాటు 22 మంది ఎర్రకూలీలను అరెస్ట్‌చేసినట్లు అర్బన్ ఎస్పీ జయలక్ష్మి వెల్లడించారు. మంగళవారం ఉదయం రేణిగుంట అర్బన్ పోలీస్ స్టేషన్‌లోజరిగిన విలేకరుల సమావేశంలో అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ గడిచిన 15 రోజులుగా అర్బన్ పోలీస్ పరిధిలోని తిరుచానూరు, వడమాల పేట, ఏర్పేడు, రేణిగుంట పోలీస్ పరిధిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పేరుమోసిన 22 మంది స్మగ్లర్లను అరెస్ట్‌చేశామని, వారి వద్ద నుంచి 88 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు, అలాగే సోమవారం రాత్రి రేణిగుంట మండల పరిధిలోని తారకరామారావు నగర్ ప్లాట్స్ వద్ద తమిళనాడు పోలూరుకు చెందిన మేస్ర్తి మణితోపాటు 22 మంది ఎర్రకూలీలను అరెస్ట్‌చేసి వారి వద్ద నుంచి 69 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఎస్పీ నంజుండప్ప, టాస్క్ఫోర్స్ డి ఎస్పీ విజయ్‌కుమార్, సి ఐ బాలయ్య, ఎస్ ఐ మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.
6నుంచి శ్రీ కపిలేశ్వరాలయంలో తెప్పోత్సవాలు
తిరుపతి, డిసెంబర్ 20: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజులపాటు జరిగే తెప్పోత్సవాల్లో మొదటిరోజైన జనవరి 6వ తేదీన శ్రీ వినాయక స్వామివారు పుష్కరిణిలో ఐదుచుట్లు విహరిస్తారు. రెండోరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారు ఐదు చుట్లు, మూడవ రోజు శ్రీ సోమస్కంద స్వామివారు ఐదు చుట్లు, నాలుగోరోజు శ్రీ కామాక్షి అమ్మవారు ఏడు చుట్లు, ఐదో రోజు శ్రీ చండికేశ్వర స్వామివారు, శ్రీ చంద్రశేఖర స్వామివారు తెప్పలపై ఏడు చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు. జనవరి 11వ తేదీన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామివారు, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.