చిత్తూరు

జిల్లా రైతులకు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, డిసెంబర్ 22 : జిల్లాలోని రైతులకు అండగా ఉంటామని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీష్ వేమన హామీ ఇచ్చారు. గురువారం స్థానిక జడ్పి సమావేశ మందిరంలో‘ రైతు కోసం తానా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేషనల్ ఎగ్‌కో ఆర్డినేషన్ కమిటి (నెక్) అధ్యక్షుడు రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సతీష్‌వేమన మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ సంఘం ద్వారా పలు సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని పేర్కొన్నారు. అయితే దేశానికి వెన్నుముక లాంటి రైతులను ఆదుకొనేందుకు గాను చిత్తూరు జిల్లా ఎన్‌ఆర్‌ఐల సంఘం ఆధ్వర్యంలో రైతుకోసం తానా అనే కార్యక్రమానికి రూపకల్పన చేసి దశల వారిగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. తమ విస్తృత కార్యక్రమాలలో భాగంగానే తొలి ప్రయత్నంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోని 2700 మంది రైతులకు పిచికారి మందుల ప్రభావం నుంచి కాపాడేందుకు వినియోగించి రైతు రక్షణ కిట్లును ఉచితంగా సరఫరా చేశామని వెల్లడించారు. త్వరలోనే మొక్కలు, పలు రకాల పంటల్లో పౌష్టికాహార ధాతువుల లోపాలను కనుగొనేందుకు ఉపకరించే గ్రీన్ సీకర్ కిట్‌ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అమెరికాలో పనిచేస్తున్న తెలుగు శాస్తవ్రేత్త జ్ఞానయ్య మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఇకపై రైతుల భూమి పరీక్షలు నిర్వహణ, మామిడి ఎగుమతులుకు దోహదం చేసే అంశాలు, పాడి పరిశ్రమలో పాటించాల్సిన అత్యాధునిక యాజమాన్య పద్దతులపై రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. అదే క్రమంలో టమోట, చింతపండు తదితర పంటలకు గిట్టుబాటు ధర లభించే అంశాలను వివరిస్తామని వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేష్‌బాబు ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన, బిందు, తుంపర్ల సేద్యం, ఆత్మ సంస్థలు తమ సహకారాన్ని అందజేయాలని కోరారు. చిత్తూరు జిల్లా ఎన్‌ఆర్‌ఐల సంఘం అధ్యక్షులు లోకేష్‌నాయుడు మాట్లాడుతూ 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తానాతో పాటు, ఇటీవల ఏర్పాటు చేసుకున్న తమ సంఘం ఆధ్వర్యంలో రాబోవు రెండేళ్లలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. రైతు కోసం తానా అనే కార్యక్రమం ద్వారా చేపట్టనున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యానశాఖ డిడి ధర్మజ మాట్లాడుతూ గత ఏడాది జిల్లా నుంచి దాదాపు 2వేల టన్నులకు పైగా మామిడిపండ్లను ఎగుమతి చేశామని, వచ్చే సీజన్‌లో తోతాపురి రకం మామిడి సైతం ఎగుమతి చేసుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. టమోట, మామిడి పండించే ఉద్యాన రైతులు గుజ్జు తయారీకి ఉపయోగపడే రకాలను విరివిగా సాగుచేసి అధిక లాభాలును ఆర్జించాలని సూచించారు. జడ్పి సిఇఓ పెంచలకిషోర్ మాట్లాడుతూ రైతులు అత్యాధునిక టెక్నాలజిని అందిపుచ్చుకుని నాణ్యమైన పంటలను పండించి ఆర్థికంగా అభివృధ్ది చెందాలని సూచించారు. ఇందుకు ప్రభుత్వపరంగా అన్ని విధాల సహకరించేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు. ఈ క్రమంలోనే పెనుమూరుకు చెందిన జామరైతు హరికృష్ణారెడ్డి, పుల్లయ్యగారిపల్లెకు చెందిన శ్రీనివాసులునాయుడు, తవణంపల్లెకు చెందిన జయచంద్రచౌదరి, సిద్దయ్యనాయుడులు వ్యవసాయ ఉత్పత్తుల గిట్టుబాటు ధరలు, యాజమన్యా పద్దతుల్లో కలిగే సాధక భాధలను సభాముఖంగా వివరించారు. అనంతరం 100 మందికి పైగా రైతులకు యుపిఎల్ ఫెస్టిసైడ్స్ అండ్ కెమికల్స్, తానా సంయుక్తంగా సమకూర్చిన రైతు రక్షణ కిట్లును అందజేశారు. కాగా ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ జెడి విజయ్‌కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త సుందరనాయుడుతో పాటు జిల్లాకు చెందిన పలువురు ఎన్‌ఆర్‌ఐలు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.

కడప జిల్లాలో భారీ ఎర్రచందనం
డంపు స్వాధీనం

తిరుపతి, డిసెంబర్ 22: కడప జిల్లా కోడూరు వెలుగొండ వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు భారీ ఎర్రచందనం దుంగల డంపును గుర్తించారు. బాలపల్లి రేంజి పరిధిలో ఎర్రచందనం దుంగలు ఉన్నాయనే సమాచారం టాస్క్ఫోర్స్ పోలీసులకు అందింది. ఈ నేపథ్యంలో టాస్క్ఫోర్స్ ఎస్‌పిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ శ్రీనివాస్ పది మంది బృందంతో కూంబింగ్ నిర్వహించారు. స్థానికుల సహకారం తీసుకొని వెలుగొండ అడవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. ఒక ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు చెట్ల పొదల్లో పేర్చి ఉండటాన్ని గుర్తించారు.
వెంటనే అక్కడ ఉన్న డంపును పరిశీలించారు. 115 దుంగలను గుర్తించి వాటిని తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఇంత భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలను పట్టుకోవడం ఇదే ప్రథమం.

ఏ కన్నతల్లి బిడ్డో.... వెంకన్న ఒడి చేరాడు!
* తిరుమల కల్యాణకట్ట వద్ద నెల బిడ్డను వదలివెళ్లిన వైనం

తిరుపతి, డిసెంబర్ 22: స్ర్తి,పురుషులకు జీవితంలో వివాహం ఒక మలుపు. ఇక ఆపై పిల్లలు పుట్టడంతో వారి జీవితం ధన్యమైనట్లుగా భావిస్తారు. పిల్లలు పుట్టడం కోటి జన్మల ఫలంగా ఆనందిస్తారు. పిల్లలు లేనివారు పిల్లల కోసం ముక్కోటి దేవతలను పూజిస్తారు. వ్రతాలు చేస్తారు. అయితే ఏ కన్నతల్లికి ఏమి కష్టమొచ్చిందోకాని.. నవమాసాలు మోసి తాను కన్న బిడ్డను నెల తిరక్కముందే కలియుగ ప్రత్యక్షదైవం వెంక్నన్న క్షేత్రంలో వదలివెళ్లిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. మరో గమనించ దగ్గ విషయం ఏమిటంటే స్వామివారి దివ్యదర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో అష్టకష్టాలు పడి వచ్చే భక్తులకు ఆ బిడ్డ కనపడేలా చేసి వెంకన్న ఒడిలో తన బిడ్డ క్షేమంగా ఉంటాడనే ఆ తల్లి కోరిక నెరవేర్చాడు. ప్రస్తుతం ఆ మగబిడ్డ తిరుమల వన్‌టౌన్ పోలీసుల ఒడిలోకి చేరాడు. ఎంతో ముద్దుగొలుపుతూ తానే పరిస్థితుల్లో ఉన్నానో తెలియక కేరింతలు కొడుతున్న ఆ పండంటి మగ బిడ్డను స్టేషన్‌లోని మహిళా పోలీసులు అల్లారుముద్దుగా చూస్తున్నారు. బిడ్డ తల్లితండ్రులు వస్తారేమో, వారికి ఇద్దామని ఎదురు చూసినా, ఎంతకీ వారు రాకపోవడంతో డి ఎస్పీ మునిరామయ్య ఆబిడ్డకు ప్రసన్నవేంకటేశ్వర అని నామకరణం చేసి తిరుపతి శిశు సంరక్షణ విభాగం అధికారిణి మమతకు అందజేశారు. వివరాల్లోకి వెడితే.. జన్మనిచ్చిన తల్లి, నెల కూడా నిండని తన మగబిడ్డను తిరుమలలోని కల్యాణకట్టకు ఎదురుగావున్న షెడ్‌లో కొన్ని దుస్తుల మధ్య చుట్టి వదలి వెళ్లిపోయింది. అయితే కొద్ది సేపటికి చలికి వణికిపోతూ, ఆకలిని తట్టుకోలేక గుక్కపెట్టి ఏడుస్తున్న బిడ్డను కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు గుర్తించాడు. బిడ్డను ఎత్తుకుని అతనిని కన్న తల్లి కోసం గాలించాడు. ఈ బిడ్డ ఎవరిది?, మీ బిడ్డేనా అంటూ అక్కడున్నవారిని, కనిపించిన వారినందరినీ అడిగాడు. అయితే ఆ బిడ్డ కోసం కన్నతల్లిదండ్రులు ముందుకు రాకపోవడంతో స్థానికులతో కలసి తిరుమల వన్‌టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ ఐ తిమ్మప్ప పసిబిడ్డను స్టేషన్‌కు తీసుకువెళ్ళాడు. ఈసందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ సమీపంలోని సిసి టివి ఫుటేజ్‌ను పరిశీలించామన్నారు. అయితే ఆ శిశువును ఎవరు వదలివెళ్ళారో తెలియడంలేదన్నారు. ప్రస్తుతం బిడ్డ తమ సంరక్షణలోనే ఉందని ఎవరైనా వచ్చి ఆ బిడ్డ తమదేనని సరైన గుర్తులు చెబితే అందజేస్తామని, ప్రస్తుతానికి శిశు విహార్‌కు తరలిస్తున్నట్లు ఆయన చెప్పారు.
స్విమ్స్ అభివృద్ధికి కృషి: డైరెక్టర్ రవికుమార్
తిరుపతి, డిసెంబర్ 22: స్విమ్స్ సమగ్రాభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని డైరెక్టర్ డాక్టర్ టి ఎస్ రవికుమార్ అన్నారు. స్విమ్స్ ఆస్పత్రిలో గురువారం జరిగిన సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఎటువంటి విభేదాలు లేకుండా క్రమశిక్షణతో, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. సిబ్బంది సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. అలాగే వారి జన్మదినాల సందర్భంగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తామని అన్నారు.
గర్భవతినీ కనికరించని ఆసుపత్రి సిబ్బంది

* తిరుపతిలో సాధారణ కాన్పుతో ఊపిరి పీల్చుకున్న కుటుంబ సభ్యులు
శ్రీకాళహస్తి, డిసెంబర్ 22: నెలలు నిండిన నిండు గర్భిణి కాన్పు కోసం వస్తే శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఏ మాత్రం కనికరం చూపకుండా తిరుపతికి పంపేసిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. వరదయ్యపాళెం మండలం మోపురుపాళెం గ్రామానికి చెందిన లావణ్య (20) కాన్పుకోసం బుధవారం సాయంత్రం శ్రీ కాళహస్తి ఆసుపత్రికి చేరింది. కాన్పు సమయం దగ్గర పడటంతో గురువారం ఉదయం డాక్టర్లు, సిబ్బంది కాన్పుకోసం ప్రయత్నించారు. అయితే ఇబ్బందిగా ఉందని 108 వాహనంలో తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి తరలించేశారు. దీనిపై బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాన్పులు జరిగే సమయంలో తిరుపతికి పంపడం అన్యాయమని, ఇక్కడే కాన్పు చేయాలని పట్టుబట్టారు. అయితే సిబ్బంది వినకుండా తిరుపతికి పంపేశారు. తిరుపతిలోని ప్రసూతి ఆసుపత్రికి వెళ్తూనే సాధారణ కాన్పు జరిగింది. దీంతో తల్లి, బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే శ్రీ కాళహస్తిలో అటువైద్యులు, ఇటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆందోళనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మయ్య కూడా ఈ సంఘటనపై నిరసన తెలియజేశారు. సాధారణ కాన్పు లేదా సిజేరియన్ అయినా శ్రీ కాళహస్తిలో డాక్టర్లు చేయాల్సి ఉండగా తమ బాధ్యత కాదని తప్పించుకోవడం అన్యాయం అన్నారు.
మహిళా విశ్వవిద్యాలయ వాల్ బాల్ టీం ఎంపిక
తిరుపతి, డిసెంబర్ 22: కేరళలోని కాలికట్‌లో శుక్రవారం నుంచి జరుగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయ వాలీబాల్ టీంను ఎంపిక చేశారు. ఈసందర్భంగా వర్శిటీ విసి దుర్గ్భావానీ మాట్లాడుతూ క్రీడల్లో విజయం సాధించి వర్శిటీ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలని కోరారు. రిజిస్ట్రార్ మమత, రెక్టార్ పి. ఉమలు క్రీడాకారులను అభినందించారు. ఈ టీంకు వ్యాయామ విభాగాధిపతిగా డాక్టర్ జి.శారోసరోజిని, టీమ్ మేనేజర్‌గా,కోచ్‌గా కె.షణ్ముగంలు వ్యవహరిస్తున్నారు.

తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని దిగ్బంధించిన సిపిఎం
తిరుపతి, డిసెంబర్ 22: తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు దిగ్బంధించారు. గేటుకు తాళాలు వేసి బైటాయించారు. వెంటనే నిరుపేదలకు ఇంటి స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలంటూ చేసిన నినాదాలతో సబ్‌కలెక్టర్ కార్యాలయం హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దడ్డాల సుబ్బరావు, జిల్లా కార్యదదర్శి కె.కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు పేద ప్రజలను హామీలిచ్చి బాబు మోసం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రజలకు వౌలిక వసతులు కల్పించడంలోను ప్రజా సమస్యలు తీర్చడంలోను ఘోరంగా విఫలమైందని అన్నారు. నగరంలో వేలాదిమంది నిరుపేదలు బాడుగ ఇళ్లలో నివసించలేక, సొంత ఇళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సొంతింటి కోసం దరఖాస్తులు చేసుకుంటుంటే వారి పేరుమీద ప్రభుత్వ పథకాలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చివరికి కట్టిన అపార్ట్‌మెంట్లను కూడా పేదలకు ఇవ్వకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. చివరికి శ్మశాన స్థలాలు కూడా కేటాయించకపోండంతో పేదల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు. దీనికితోడు ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన భూములనే బలవంతంగా లాక్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఇది సరికాదని అన్నారు. వారికి నష్టపరిహారం చెల్లించకుండా 2013 భూసేకరణ చట్టాని అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు తగు రీతిలో బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ధర్నా అనంతరం తిరుపతి సబ్ కలెక్టర్‌కు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సి పి ఎం నాయకులు నాగరాజు, పుల్లయ్య, జనార్థన్, జయచంద్ర, సాయిలక్ష్మి, శ్రీనివాసులు, ఒ.వెంకటరమణ, ఆర్.లక్ష్మి, బుజ్జి, జగన్, గురుప్రసాద్, గంధం మణి, గురవమ్మ, వేణుగోపాల్, రజనీ, రాధ పాల్గొన్నారు.
టిటిడి చైర్మన్, ఇఓలను కలసి స్విమ్స్ సంచాలకులు
తిరుపతి, డిసెంబర్ 22: స్విమ్స్ డైరెక్టర్‌గా నియమితులైన డాక్టర్ టి. ఎస్.రవికుమార్ గురువారం సాయంత్రం స్థానిక మాధవం అతిధిగృహంలోని విశ్రాంతి అథిగృహంలో టిటిడి ఛైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తిని, టిటిడి పరిపాలనా భవనంలో ఇ ఒ సాంబశివరావును కలిశారు. ఈసందర్భంగా వారు డైరెక్టర్‌ను అభినందించారు.
కలెక్టరేట్ ఎదుట కాంట్రాక్టు జౌట్ సోర్సింగ్ కార్మికులు ధర్నా

చిత్తూరు, డిసెంబర్ 22: సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని , సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం చిత్తూరు కలెక్టరేట్ ఎదుట, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలువురు కార్మికులు ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా సిఐటియు నేత చైతన్య మాట్లాడుతూ కాంట్రాక్టు అయినా పర్మినెంట్ అయినా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇది ఎక్కడా అమలు కాక పోవడంతో అనేక మంది కార్మికులు నష్టపోవాల్సి వస్తున్నదన్నారు.అనేక సంవత్సరాలుగా చాలీచాలని వేతనాలతో అనేక మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబాలు ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయని తెలిపారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరిని క్రమబద్ధీకరించడం జరుగుతుందని హామీ ఇచ్చినా నేటికి అమలు చేయక పోవడం దారుణమన్నారు. ఉద్యోగుల క్రమబద్దీకరణకు సుప్రీం కోర్టు తీర్పులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయన్న సాకుతో కాలయాపన చేస్తున్నదన్నారు. కాంట్రాక్టు పద్ధతి ఉంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయంటూ పాలకులు నక్కజిత్తుల మాటలు మాట్లాడుతున్నారని దుయ్యపట్టారు. పంచాయితీ కార్మిక సంఘ నేత వెంకటయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికలు మందు కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేడు, అనేక సాకులతో కాంట్రాక్టు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులను నిలువు దోపడికి గురి చేస్తున్నాయన్నారు. తెలుగుదేశం ప్రభుత్వమే కాంట్రాక్టు పద్ధతికి నాంది పలికిందన్నారు. సంవత్సరాలుగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల చేత పలురకాల చాకిరీలు చేయుంచుకుంటూ అందుకు తగిన విధంగా వేతనాలు ఇవ్వక పోవడం శోచనీయమన్నారు. సమాన పనికి సమాన వేతనం అనేది ఒక్క ప్రభుత్వ శాఖల్లో పని చేసే వారికే కాకుండా ఇతర ప్రైవేట్ సంస్థలో కూడా వర్తింపు చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. వెంటనే సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఇతర అన్ని బెనిఫిట్లు అమలు చేయాలని డిమాండ్ చేసారు. ఈధర్నాలో పలువురు కాంట్రాక్టు కార్మికులు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ కార్యాల ఏఓ రవికి వినతి పత్రాన్ని అందజేశారు.

రేణిగుంటలో ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
* ఆస్తికోసం మేనల్లుడు, అతని స్నేహితుల దారుణం
* బంధువులే హత్య చేశారంటున్న కుటుంబ సభ్యులు

రేణిగుంట, డిసెంబర్ 22: నిత్యం రద్దీగా ఉండే స్థానిక గంగమ్మ గుడి సమీపంలో ఉన్న వీధిలో కాపురముంటున్న ఫైనాన్స్ వ్యాపారి గాలి వెంకటరమణను పట్టపగలు ఆస్తికోసం చెల్లెల కొడుకు, అతని ఇద్దరు స్నేహితులు కలసి హత్యచేసి పారిపోయిన సంఘటన గురువారం జరిగింది. ఈ సంఘటనతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక గంగమ్మ గుడి సమీపంలోని వీధిలో గాలి వెంకటరమణ అలియాస్ బియ్యం రమణ (53) గత కొంతకాలంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. ఇతనికి భార్య సంగీత, కొడుకు కృష్ణప్రసాద్, కూతురు ప్రీతి ఉన్నారు. వెంకటరమణకు స్వయాన చెల్లెలయిన ప్రసన్న కడప జిల్లా, ప్రొద్దుటూరులో నివసిస్తోంది. వీరిద్దరి కలసి స్థానిక గంగమ్మ గుడివద్ద దాదాపు 20 అంకాణాల స్థలం ఉంది. ప్రస్తుతం దీంట్లో ఓ చికెన్ షాపు ఉంది. ఈ స్థలంపై కనె్నసిన చెల్లెల కొడుకు ప్రవీణ్ గత కొనే్నళ్లుగా తమ వాటా కింద వచ్చే స్తలాన్ని అమ్మేసి డబ్బు ఇవ్వాలంటూ వెంకటరమణను వేధిస్తున్నాడు. అయితే ప్రస్థుత పరిస్థితుల్లో ఈ స్థలం విలువ విపరీతంగా పెరగడంతో మరి కొంత కాలం ఆగితే మరింత ధర పలుకుతుందని మేనల్లుడికి నచ్చచెబుతున్నాడు. కాగా గత రెండు రోజులుగా తన మేనమామతో, తన ఇద్దరు మిత్రులతో కలసి మద్యం సేవిస్తున్నారు. కాగా గురువారం మధ్యాహ్నం కూడా కలసి మద్యం సేవిస్తున్న సమయంలో వెంకటరమణ కుమారుడు కృష్ణప్రసాద్ కూడా అక్కడే ఉన్నాడు. కొద్ది సేపటి తరువాత సొంతపనిపైన కృష్ణప్రసాద్ ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి అరగంట తరువాత ఇంటికి వెళ్లగా, దుండగులు వెంకటరమణ ఎడమవైపు పొట్టలో కత్తులతో దాడి చేసి పొడవడంతో పేగులు బయటకు వచ్చి రక్తపుమడుగులో కుప్పకూలిపోయి ఉన్నాడు. కత్తిపోట్లకు గురైన వెంకటరమణను కుమారుడు కృష్ణప్రసాద్ స్థానికుల సహకారంతో ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. అక్కడకు చేరుకున్న పోలీసులు వెంకటరమణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించగా ఎస్ ఐ మధుసూధన్ రావు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కృష్ణప్రసాద్ వెంటనే రేణిగుంట పోలీసులకు జరిగి సంఘటనపై ఫిర్యాదు చేయడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనా స్థలానికి వచ్చిన డాగ్ స్క్వాడ్ హత్య జరిగిన ఇంటి నుంచి నేరుగా సమీపంలోని బాయిస్ స్కూల్‌కు అక్కడ నుంచి సి ఆర్ ఎస్ రైల్వేగేటు వద్దకు వెళ్లి ఆగింది. నింధుతులు హత్య జరిగిన తరువాత ఇక్కడ నుంచి తిరుపతి వైపు వెళ్లి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు.
మావటిని గాయపరచిన
గజరాజు అవనిజ తిరుపతికి తరలింపు
తిరుపతి, డిసెంబర్ 22: గత నాలుగు రోజుల క్రితం తిరుమలలోని వరహస్వామి ఆలయం వద్ద మావటి గంగయ్యపై దాడిచేసిన గజరాజు అవనిజకు మరింత శిక్షణ ఇచ్చేందుకు తిరుపతిలోని డైరీఫాంకు తరలించారు. పూర్తి స్థాయి శిక్షణ ఇచ్చిన తరువాత అవనిజను తిరుమల శ్రీ వెంకన్న సేవకు తీసుకురానున్నారు.