చిత్తూరు

రూ.6కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 436 ఆస్పత్రుల్లో ఆరోగ్య రక్ష సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 15: రాష్ట్ర వ్యాప్తంగా 436 ఆస్పత్రుల్లో ఆరోగ్య రక్ష సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సిఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మూడు రోజులపాటు నారావారి పల్లెలో బసచేసిన ఆయన అక్కడున్న ఆరోగ్య కేంద్రంలో రూ.6.8కోట్లతో 30 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి ఆదివారం భూమి పూజ చేశారు. ఈసందర్భంగా సిఎం మాట్లాడుతూ నారావారి పల్లెలో ఉన్న ఈ ఆరోగ్య ఉపకేంద్రం 9 సబ్ సెంటర్లలో 31 గ్రామ పంచాయతీల్లో 63,200 మంది గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ఎపి ఎంఐఎస్‌డిసి ఆధ్వర్యంలో ఈ ఆస్పత్రిలో 30 పడకలకు పెంచుతూ నిర్మించనున్న నూతన భవనానికి భూమి పూజ చేయడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు. ఈ ఏడాది ఆఖరులోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. పాజిటివ్‌గా ఆలోచించే ప్రతి ఒక్కరి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్నారు. పరిసరరాలు మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, అందుకే ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ఈసందర్భంగా ఆయన జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల వద్ద నుంచి వినతిపత్రాలు స్వీకరించి వారి సమస్యలను సావదానంగా విన్నారు. వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సోమల మండలం పెద్ద ఉప్పరపల్లికి చెందిన హేమంత్ కుమార్ అనే బాలుడి వైద్య పరీక్షలకు రూ.5లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చంద్రబాబు, ఆ బాలుడి తల్లితండ్రులకు హామీ ఇచ్చారు. అనంతరం రోడ్డుమార్గాన రేణిగుంట విమానాశ్రయానికి తరలివెళ్లారు. ఈకార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే భాస్కర్‌రెడ్డి, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కలెక్టర్ సిద్దార్థ్ జైన్, జెసి గిరీషా, తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ సిఇ రవిచంద్ర, ఇఇ నగేష్, శ్రీనివాసులు, డిఎంహెచ్‌ఓ లలితాగౌరి, డిసిహెచ్‌ఓ సరళమ్మ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాధికారి డాక్టర్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఆస్పత్రిలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 10,979 మంది ఔట్ పేషెంట్లు, 598మంది ఇన్ పేషెంట్లు చికిత్స పొందినట్లు అధికారులు తెలిపారు.

ఎపి పర్స్ పేరుతో తెలుగులో యాప్
* నగదు రహిత లావాదేవీలపైన దృష్టి
* ఆంధ్రాబ్యాంక్ ఎటిఎంను ప్రారంభించిన సిఎం
తిరుపతి, జనవరి 15: నగదు రహిత లావాదేవీలు ఉపయోగపడేలా ఎపి పర్స్ పేరుతో తెలుగులో యాప్‌ను రూపొందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఆదివారం ముఖ్యమంత్రి స్వగ్రామమైన నారావారి పల్లెలో తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం ఆంధ్రాబ్యాంక్ 39వ ఎటిఎం కేంద్రాన్ని ప్రారంభించారు. నగదు డిపాజిట్, విత్‌డ్రా కేంద్రాన్ని ఈసందర్భంగా ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని, ఇప్పటికే 40 శాతం నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడ్డారన్నారు. నారావారిపల్లె ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80శాతం డిజిటల్ లావాదేవీలు జరిగేలా దృష్టిసారించామన్నారు. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. ఈ పాస్, స్వైపింగ్ మిషన్లు, రూపే డిబెట్ కార్డులతో ఆన్‌లైన్‌లో నగదు చెల్లింపులు చేసేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో మంత్రులు నారాయణ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే తలారి ఆదిత్య, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, జడ్పి ఛైర్మన్ గీర్వాణి, జిల్లా కలెక్టర్ సిద్దార్థ్ జైన్, ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ కృష్ణమూర్తి వి వారణాసి, లీడ్ బ్యాంక్ మేనేజర్ లక్ష్మీనారాయణ, డిఆర్‌డిఏ పిడి రవిప్రకాష్, ఆంధ్రాబ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గోవులను రక్షించుకుందాం.. సంస్కృతిని కాపాడుకుందాం
* టిటిడి ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి పిలుపు
* దేశవాళీ గోవులను కాపాడుకోవాలి: ఇఒ
* స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు గోశాలను సందర్శించుకునే ఏర్పాట్లు చేయాలి: ఆధ్యాత్మికవేత్త చాగంటి

తిరుపతి, జనవరి 15: వేదాలు, పురాణాలు పేర్కొన్న విధంగా సకల దేవతా స్వరూపమైన గోవులను రక్షించుకోవడం ద్వారా సనాతన భారతీయ హైందవ సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందని టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. స్థానిక ఎస్వీ గోసంరక్షణశాలలో ఆదివారం కనుమ పండుగను పురస్కరించుకుని గో మహోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా గో పూజను చేశారు. గోవులకు ఆహారాన్ని అందించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ మాట్లాడుతూ గో మాత వేదాల నుంచి ఉద్భవించిందన్నారు. అందుకే భారతీయ హైంధవ సంప్రదాయంలో గోవులకు విశిష్ట స్థానం ఉందన్నారు. గోవు గొప్పతనాన్ని భావితరాలకు అందించేందుకు టిటిడి గోపూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గోపూజ చేసి వెంకటేశ్వరుని కృపకు పాత్రులు కావాలన్నారు. టిటిడి ఇఒ డాక్టర్ డి.సాంబశివరావు మాట్లాడుతూ పూర్వ కాలం నుంచి కనుమ పండగ రోజున గోపూజకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. గోవును పూజించడం వలన పాడిపంటలు పుష్కలంగా పండి దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. తిరుపతి, పలమనేరు గోశాలల్లో 2700 పశువులు ఉన్నాయని, ఇందులో అరుదైన పలు పశువులు ఉన్నాయన్నారు. టిటిడి ఏర్పాటు చేసిన గో ట్రస్టు ద్వారా విరాళాలు అందించాలని కోరారు. దీనికి విరాళాలు అందించిన వారికి ఇన్‌కంటాక్స్ నుంచి మినహాయింపు కూడా ఉంటుందని తెలిపారు. దేశవాలీ గోవుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గో పంచ గవ్యాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పంచగవ్వ ఉత్పత్తుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెరుగుతుందని తెలిపారు.
గోశాల సందర్శనతో యాత్రకు పరిపూర్ణత దక్కుతుంది
* ఆధ్యాత్మికవేత్త చాగంటి
స్వామి, అమ్మవార్లను దర్శించుకునే భక్తులు గోశాల సందర్శనకు కూడా టిటిడి తగిన ఏర్పాట్లు చేస్తే యాత్రకు మరింత పరిపూర్ణత చేకూరుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్థానిక టిటిడి ఎస్వీ డెయిరీఫాంలో జరిగిన గోపూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గో సంరక్షణకు టిటిడి విశేషంగా కృషి చేస్తోందని అభినందించారు. ఇటీవల పుంగనూరు నుంచి గోవధశాలకు తరలివెళుతున్న గోవులను రక్షించి గోశాలకు చేర్చడం అభినందనీయమన్నారు. ఇందులో ఒక్కరోజు లేగదూడ కూడా ఉందని చెప్పారు. ఈ దూడ ఆకలి తీర్చడానికి టిటిడి పాలు తెప్పించి, చిన్న బిడ్డలకు పట్టించినట్లు పట్టించిందన్నారు. విశ్వంలో 24 లక్షల జీవరాశుల్లో సుగంధ ద్రవ్యాలు, మానవాళికి ఉపయోగపడే ఔషధ గుణాలున్న జంతువు గోవు ఒక్కటే అన్నారు. తిరుమల శ్రీవారిని, తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులు గోశాలను కూడా దర్శించుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయన టిటిడి యాజమాన్యాన్ని కోరారు. అంతకుముందు టిటిడి ఛైర్మన్ చదలవాడ, ఇఒ సాంబశివరావు, చాగంటి కోటేశ్వరరావు, ఇస్కా మాజీ ఛైర్మన్ నారాయణరావు, గోశాలలోని వేణుగోపాల స్వామి పూజాది కార్యక్రమాల్లోపాల్గొన్నారు. అనంతరం గౌరీ, తులసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజ, అశ్వ, వృషభాలు, గోవులకు పూజలు చేసి దాణా అందించారు. ఈసందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, కోలాటాలు, ఎస్వీ సంగీత నృత్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎస్వీగోశాల సంచాలకులు కె.హరినాథ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.

రగడ ...రగడ
* చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ తరలింపునకు మరోసారి విఘాతం
* మునస్వామినాయుడు పార్కులో ఏర్పాటును అడ్డుకున్న లోక్‌సత్తా నాయకులు
* దీటుగా సమాధానమిచ్చిన మేయర్, కార్పొరేటర్లు
చిత్తూరు, జనవరి 15 : చిత్తూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ తరలింపు మరోసారి వివాదాస్పదంగా మారింది. చిత్తూరు నడిబొడ్డులోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌ను కూల్చివేసి, ఆ స్థలంలో పలువురు ముఖ్యుల విగ్రహాలు ఏర్పాటు చేయడంతోపాటు ట్రాఫిక్ ఐ ల్యాండ్‌ను ఏర్పరచాలని స్థానిక ఎమ్మెల్యే సత్యప్రభ నిర్ణయించారు. పూర్తిగా తన సొంత నిధులతో ఏర్పాటు చేయాలనుకున్న ఎమ్మెల్యే ప్రయత్నాలకు పలుమార్లు అంతరాయాలు ఏర్పడుతూనే ఉన్నాయి. ఎమ్మెల్యే కోరిక మేరకు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌లోని కమిషనర్‌తో పాటు, 50 మంది కార్పొరేటర్లలో మెజారిటీ సభ్యులు ఇదివరకే కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. మూడునెలలకు ముందు కౌన్సిల్ సభ్యుల తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే స్టేషన్‌కు సరిపడా స్థలాన్ని కొంగారెడ్డిపల్లెలోని వేంకటేశ్వర కాలనీలో మున్సిపల్ శాఖ కేటాయించింది. అయితే అప్పట్లో చిత్తూరు నగరంలోని తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేసి గత ఏడాది పదవీ విరమణ చేసిన మురళి స్టేషన్ తరలింపునకు ససేమిరా అన్నారు. ఇందుకు సంబంధించి స్టేషన్‌ను కూల్చేందుకు వచ్చిన జెసిబిని సైతం ఆయన అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు వైకాపా, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు, పలు ప్రజాసంఘాల మద్దతు కూడా లభించింది. అధికారంలో ఉన్న టిడిపిని ఆందోళనలతో ఏమీ చేయలేమని గ్రహించిన మురళి స్టేషన్‌ను తరలించరాదంటూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్టేషన్ తరలింపు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసి, స్టేషన్ నిర్మాణానికి సరిపడా ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించి అందరి ఆమోదంతో కూల్చివేయవచ్చని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఎమ్మెల్యే, మున్సిపల్ శాఖ వివాదాస్పద స్థలానికి అతి సమీపంలోనే మహాత్మాగాంధీ, పూలే, ఎన్‌టిఆర్ తదితర మహానాయకుల విగ్రహాల ఏర్పాటుకు ఓ వైపు పనులను చేసుకుపోతూనే, మరోవైపు ట్రాఫిక్ ఐ ల్యాండ్‌కు బాగా సరిపోయే వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కూల్చివేతపై తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జన్మభూమి ముగింపు- అభినందన సభ నిర్వహించారు. సభ అనంతరం కార్పొరేషన్ సమావేశంలో మున్సిపల్ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు మిట్టూరులోని మునస్వామినాయుడు పార్కు వద్దకు తరలించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భాగంగానే మంచిరోజు కావడం, కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని మున్సిపల్ అధికారులు పార్కు ఆవరణలో ఏర్పాటు చేయదలచిన స్టేషన్‌కు భూమి పూజ చేసేందుకు ఉపక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న లోక్‌సత్తా పార్టీ నాయకులు రాంబాబు కొందరు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్కు వద్దకు చేరుకుని పార్కు స్థలంలో స్టేషన్‌ను నిర్మించరాదంటూ ఇన్‌ఛార్జ్ మేయర్ సుబ్రహ్మణ్యంతో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పార్కులు, చెరువులు, ఇతర ప్రజాప్రయోజన స్థలాలను ఎవ్వరికి ఇవ్వరాదని, అలాంటి స్థలాలను స్వీకరించేందుకు ప్రభుత్వానికి హక్కు కూడా లేదన్నారు. కేవలం పురావస్తుశాఖ, టూరిజం శాఖకు మాత్రమే సంబంధిత స్థలంపై హక్కు, అధికారాలు ఉంటాయన్నారు. దీన్ని గుర్తించుకుని పార్కు స్థలంలో స్టేషన్ నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని ఇన్‌ఛార్జ్ మేయర్‌ను కోరారు. దీనికి మేయర్ సమాధానం ఇస్తూ చిత్తూరులో మున్సిపాలిటీ ఏర్పాటైనప్పటి నుంచి నేటి వరకు మునస్వామినాయుడు పార్కు ఆలనాపాలనా మున్సిపాలిటీనే చూస్తోందని, ఈ క్రమంలో సంబంధిత పార్కు, పార్కు స్థలంపై మున్సిపాలిటీకే హక్కు ఉందని స్పష్టం చేశారు. ఈ సమాధానం విన్న రాంబాబు ఆగ్రహిస్తూ మారి పార్కు స్థలంలో స్టేషన్ నిర్మాణాన్ని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మతించబోనని, తన ప్రాణాలను అర్పించి అయినా సరే పార్కులో పోలీస్‌స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. ఈ రాద్దాంతం చినికి చినికి గాలివానగా మారింది. విషయం తెలుసుకున్న అధికార పార్టీ కార్పొరేటర్లు పార్కు వద్దకు చేరుకుని నేడే స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేయాల్సిందే అంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో రాంబాబు, ఆయన వర్గీయులు సైతం కార్పొరేటర్లు, ఇన్‌ఛార్జ్ మేయర్, టిడిపి రాష్ట్ర నాయకుడు డికె బద్రినారాయణతో తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ చిత్తూరు నగరాభివృద్ధిని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, అడ్డుకుంటే ప్రగతి ఎలా సాధ్యమవుతుందన్నారు. ఒక్క పైసా ఖర్చు చేయాలన్నా వేలాది సార్లు ఆలోచించే ఈ కాలంలో తన సొంత నిధులతో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యే సత్యప్రభకు అన్ని వర్గాల వారు సహకరించాలని కోరారు. అనంతరం సద్దుమణిగిన ఇరువర్గాలు స్వచ్ఛ్భారత్ పేరుతో పార్కు ఆవరణలో ఇటు కార్పొరేటర్లు, అటు రాంబాబు అనుచరులు చీపుర్లు చేతబట్టుకుని చెత్తను ఊడ్చారు. ఏదిఏమైనప్పటికీ వన్‌టౌన్ స్టేషన్ మార్పు విషయంగా రానున్న రోజుల్లో ఏ విపత్కర పరిస్థితి నెలకొంటుందో వేచి చూడాల్సిందే.

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
వెదురుకుప్పం, జనవరి 15: మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో చెనుగారిపల్లికి చెందిన విశ్వనాథనాయుడు (46) అనే వ్యక్తి మరణించాడు. రామచంద్రాపురం మండలంలో జరిగిన జల్లికట్లు కార్యక్రమాన్ని చూడటానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో బ్రాహ్మణపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మరణించాడు. మృతుడు తిరుపతి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోడ్డు పక్కన పడి ఉన్న విశ్వనాథనాయుడు తీవ్రంగా గాయపడి ఉండటాన్ని గమనించిన గాదంకికి చెందిన ఆటోడ్రైవర్ అతడిని వెదురుకుప్పం ప్రైవేటు వైద్యశాలకు తీసుకువచ్చాడు. విశ్వనాథనాయుడిని పరిశీలించిన వైద్యుడు మరణించినట్లు ధ్రువీకరించారు. సమాచారం తెలుసుకున్న మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని సంఘటనకు ఆటోడ్రైవరే కారణమని పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు ఎస్‌ఐ జయప్ప కేసు నమోదుచేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు వైద్యశాలకు తరలించారు. విశ్వనాథనాయుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

పిజి 1,3 సెమిస్టర్లు వాయిదా
తిరుపతి, జనవరి 15: ఎస్వీయూ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి నిర్వహించాల్సిన పిజి మూడో సెమిస్టర్‌ను ఈనెల 21 తేదీన నిర్వహించనున్నట్లు ఎస్వీయూ విసి ఆచార్య ఆవుల దామోదరం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 17వ తేదీన నిర్వహించాల్సిన పిజి మొదటి సెమిస్టర్‌ను ఈనెల 23వ తేదీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వర్శిటీ వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఎస్వీయూ అనుబంధ యూనివర్శిటీలన్నీ ఈనెల 21వ తేదీ నుంచి పునః ప్రారంభమవుతాయని ఆప్రకటనలో తెలిపారు.

సృష్టిలో తీర్చుకోలేని రుణం మాతృమూర్తిదే
* ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు అనుగ్రహభాషణం
తిరుపతి, జనవరి 15: సృష్టిలో రుణం తీర్చుకోలేనిదేదైనా ఉంది అంటే అది మాతృమూర్తిదేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ఉద్ఘాటించారు. టిటిడి ధర్మప్రచారం పరిషత్ ఆధ్వర్యంలో భక్తి-పరిమితి పేరిట స్థానిక మహతి ఆడిటోరియంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న ధార్మికోపన్యాసాలు ఆదివారంతో వైభవంగా ముగిసాయి. రెండు రోజుల పాటు చాగంటి కోటేశ్వరరావు అభిభాషించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగానే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మహతి ఆడిటోరియం ధార్మిక చింతనకలిగిన వారితో కిక్కిరిసి పోయింది. చాగంటి ప్రసంగిస్తున్నంత సేపు ఆడిటోరియంలో పిన్నువేస్తే కూడా శబ్దం వినిపించేంత గొప్పగా సాగింది అంటే ప్రజల్లో పెరుగుతున్న ధార్మిక చింతనకు ఇదొక నిదర్శనమనే చెప్పాలి. చాగంటి తనదైన శైలిలో ధార్మిక చింతనతో మానవుడు ఎలా సుఖసంతోషాలతో జీవించగలడో అలాగే తల్లితండ్రులు, గురువులుపట్ల అనుసరించాల్సిన విధివిధానాలతో పిల్లలు ఎంత గొప్పవారిగా ఎదగగలరో వివరిస్తూ తన రెండు రోజుల ప్రసంగంలో వివరించన తీరు ప్రజల మనస్సుల్లో మరో గుండె చప్పుడుగా నిలిచిపోయిందనే చెప్పాలి. చాగంటి ప్రసంగిస్తూ భూమిపై జన్మించిన ప్రతి ప్రాణి పితృరుణం తీర్చుకోవచ్చని, కాని మాతృ రుణం తీర్చుకోలేనిదని విస్పష్టంగా తేల్చి చెప్పారు. ఇందుకు సంబంధించి ఆయన పలు పిట్టకథలను వివరించారు. ఇందులో ప్రధానంగా ఒక కోడి నిత్యం అకాశంవైపు చూస్తూ గద్ద ఎప్పుడు తన పిల్లలను తీసుకువెడుతుందోనన్న భయాందోలనల మధ్య ఆహారానే్వషణ చేస్తుందన్నారు. ఒక వేళ గ్రద్ద తన పిల్లలను భక్షించడానికి వినీలాకాశంలో విహరిస్తూ ఉందని గుర్తించిన మరుక్షణం పిల్లలను తన రెక్కల మాటున దాచుకుంటుందని తెలిపారు. అంటే గ్రద్ద తన పిల్లలను భక్షించి ఆకలి తీర్చుకోవడం కన్నా ముందు తనను భక్షించమని త్యాగానికి సిద్ధపడుతుందన్నారు. అలాగే మనషికి జన్మనిచ్చిన ప్రతి తల్లి తన బిడ్డలను సంరక్షించుకోవడానికి, వారి అభివృద్ధికి నిచ్చెనలు వేయడానికి తన ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. అందుకే కొన్ని సందర్భాల్లో పిల్లలు తండ్రి రుణం తీర్చుకోగలిగినా, తల్లి రుణం మాత్రం తీర్చుకోలేదన్నారు. తండ్రి పోషకుడు, సంరక్షకుడిగా వ్యవహరిస్తూనే కుటుంబ పట్ల ఒక ప్రేమతో ముందుకు సాగుతూ ఉంటాడన్నారు. ఇక గురువు అక్షరాన్ని బోధిస్తూ ప్రపంచ విజ్ఞానాన్ని పిల్లలకు బోధిస్తూ ఉంటాడన్నారు. వీరందరి రుణం తీర్చుకోవడమంటే పిల్లలు క్రమశిక్షణతో సత్పప్రవర్తనతో ముందుకు సాగడమే అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ ఈసందర్భంగా చాగంటి కోటేశ్వరరావును సన్మానించారు.

దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలి
* బిజెపి నేత మురళీధర్‌రావు ఆకాంక్ష
తిరుపతి, జనవరి 15: భాతరదేశం సర్వతో ముఖాభివృద్ధి సాధించాలని, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఆకాంక్షించారు. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల్లో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ప్రధాని స్వచ్ఛ్భారత్‌కు పిలుపునిచ్చి పారిశుద్ధ్యంతో పాటుగా దేశంలో అవినీతి నిర్మూలనకు, నల్లధనం అరికట్టడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. స్వామివారి దయతో దేశప్రజలు ఆనందంగా జీవించాలని ప్రార్థించానన్నారు. అంతకమునుపు శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న ఆయనకు టిటిడి పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, బిజెపి నాయకులు సామంచి శ్రీనివాస్, కోలా ఆనంద్, గుండాలగోపినాథ్, పణిభూషణ్‌రెడ్డి, వరప్రసాద్, నారాయణరెడ్డి, కట్టమంచి చంద్రబాబు, నాగేశ్వరాచారి, కట్టమంచి చంద్రబాబు, కె ఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు.