చిత్తూరు

సాంప్రదాయ కళారూపాలను గౌరవిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 16 : మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతి రూపమైన మన కళారూపాలను మనం గౌరవించడం మనందరి బాధ్యతని చిత్తూరు ఎంపి శివప్రసాద్ అన్నారు. రాయలసీమ రంగస్థలి 26వ వార్షిక శ్రీ కృష్ణ దేవరాయ సంగీత, సాహిత్య, నృత్య నాటకోత్సవాల గోడపత్రికను సోమవారం ఆయన తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20 నుంచి 22వ తేదీ వరకు స్థానిక మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన 150 మంది నృత్య కళాకారులు కూచిపూడి, భరతనాట్యం, జానపద, బృంద నృత్యాలు, నృత్యపోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వి దశరధనాయుడు, నారాయణరెడ్డి, ఫణిభూషణ్‌రెడ్డి, ధనపాల్ తదితరులున్నారు.

ఫిబ్రవరి నెలాఖరులోగా వకుళామాత ఆలయం పూర్తి చేయండి
* ధార్మిక సదస్సుల నిర్వహణపై 23న ప్రాథమిక సదస్సు
* భక్తుల కోసం టిటిడి వెబ్‌సైట్‌లో 12పేజీల క్యాలెండర్
* టిటిడి ఇఓ డాక్టర్ సాంబశివరావు వెల్లడి
తిరుపతి, జనవరి 16: తిరుపతి రూరల్ మండలం పేరూరు బండపై వెలసి ఉన్న శ్రీ వకుళమాత ఆలయాన్ని ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని టిటిడి ఇఓ డాక్టర్ సాంబశివరావు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక టిటిడి పరిపాలన భవనంలో ఆయన టిటిడి సీనియర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ 2017 సంవత్సరానికి సంబంధించి 32 లక్షల క్యాలెండర్లు, 10 లక్షల డైరీలు ముద్రించగా, జనవరి మొదటి వారానికే విక్రయాలు పూర్తయ్యాయన్నారు. ఈ పరిస్థితిలో 12 పేజీల క్యాలెండర్‌ను త్వరలో భక్తులు టిటిడి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని, దీనిని భక్తులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అన్నారు. ఈనెలాఖరు నాటికి టిటిడి పంచాంగం 70వేల ప్రతుల ముద్రణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో నిర్మాణంలో ఉన్న అఖిలాండం, కల్యాణవేదిక, ధ్వజస్తంభం పనులను ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తిచేయాలన్నారు. టిటిడి విగ్రహాల తయారీ కేంద్రంపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఇఓ అధికారులకు సూచించారు. తిరుమలలోని జలాశయాల్లో 271 రోజులకు సరిపడా నీరు ఉందని, ఈ నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఇఓ సూచింరారు. తిరుమలలో ఫిబ్రవరి 3వ తేదీన రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ధార్మిక సదస్సు నిర్వహణపై ఈ నెల 23వ తేదీన ప్రాథమిక సమావేశం నిర్వహిస్తామన్నారు. తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీనివాస ఆలయం మరమ్మతులపై సంబంధిత అధికారులతో ఇఓ చర్చించారు. టిటిడి విద్యాసంస్థల్లో వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల వారీగా సిలబస్ సమీక్షించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి తిరుపతి జెఇఓ పోల భాస్కర్, ప్రాజెక్టుల ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు, చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎఫ్‌ఏసిఏఓ బాలాజీ, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తగ్గుతున్న టమోటా దిగుబడులు
కిలో రూ.20
మదనపల్లె, జనవరి 16: మదనపల్లె మార్కెట్‌లో గత నెలరోజులుగా రూ.5ల నుంచి రూ.10లు పలికిన టమోటా ధరలు సోమవారం ఒక్కసారిగా రూ.20లకు పెరిగాయి. పడమటి మండలాలలో తక్కువ సాగు అవుతుండటంతో మదనపల్లె మార్కెట్‌కు 165టన్నుల టమోటా వచ్చింది. జిల్లా టమోటాకు కర్నాటక, పాండిచ్చేరి, గోవా రాష్ట్రాలలో డిమాండ్ ఉండేది. ఆయా రాష్ట్రాలలో పంటలు అధికంగా ఉండటంతో మదనపల్లె మార్కెట్‌లో ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. మదనపల్లె మార్కెట్‌తో పాటు బికొత్తకోట, అంగళ్ళు, ములకలచెరువు, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికరి, పుంగనూరు, చింతపర్తి, తరిగొండలలో టమోటా మార్కెట్‌ల కిలోటమోటా రూ.10 నుంచి రూ.15 వరకు పలికింది. వివిధ రాష్ట్రాలతోపాటు రాష్ట్రంలోని హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, బాపట్ల, వరంగల్, కరీంనగర్, గుంటూరు, ఆధోని తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల వ్యాపారులు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో కొనుగోలు చేస్తున్నారు. కిలో రూ.5ల నుంచి రూ.10లు పలుకుతున్న ధర రెండు రోజులకే రూ.20లకు చేరింది. దీనికి కారణం పక్కరాష్ట్రాల్లో టమోటా డిమాండ్ పెరగడం, అక్కడ సాగు తక్కువగా ఉండడం టమోటా రైతులకు గిట్టుబాటు అవుతోంది. ఇప్పటి పరిస్థితులలో కర్నాటక, పాండిచ్ఛేరిలో డిమాండు ఉండటం ధరలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుస్తోంది. అయితే మార్కెట్‌లో టమోటాధరలు పెరిగితే ఒక్కొక్కసారి ఎగుమతి ప్రాంతాలలో ధరలలో వ్యత్యాసాలు వస్తుండటంతో వ్యాపారులు నష్టపోతున్నారు. దీంతో వ్యాపారులు ఖచ్చితమైన డిమాండ్ మేరకు మార్కెట్‌లో టమోటాలు కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్నాటక, పాండిచ్ఛేరి రాష్ట్రాల్లో టమోటా ఉత్పత్తి గణనీయంగా పెరగడం అక్కడి వ్యాపారులు మదనపల్లి మార్కెట్‌కు రావడం మానేశారు. సోమవారం మార్కెట్‌కు 165 టన్నుల టమోటా వచ్చింది. అందులో మొదటి రకం టమోటా పదికిలోలు రూ.20లు, రెండవ రకం రూ.10లు, మూడవ రకం రూ.6లు పలికింది.

బొలెరో వాహనాన్ని ఢీకొన్న లారీ
* ఐదుగురు జార్ఖండ్ వాసులకు గాయాలు * ఇద్దరి పరిస్థితి విషమం
పుంగనూరు, జనవరి 16: బొలెరో వాహనాన్ని లారీ ఢీకొన్న ప్రమాదంలో జార్ఖండ్ వాసులకు తీవ్రగాయాలైన సంఘటన సోమవారం రాత్రి పుంగనూరు మండలంలో జరిగింది. ఎస్సై హరిప్రసాద్ కథనం మేరకు జార్ఖండ్ రాష్ట్రం గిరిడి జిల్లా డోరియో గ్రామానికి చెందిన కార్మికులు పుంగనూరు మండలంలోని క్వారీలో కూలిపనులు చేసుకుంటు జీవనం సాగిస్తున్నారు. వీరు సోమవారం సాయంత్రం సొంత పనులపై బొలెరో వాహనంలో పుంగనూరుకు వచ్చి తిరిగి వెళ్తుండగా మండలంలోని పూజిగానిపల్లె సమీపంలోని గాంధీ నగర్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా బొలెరో వాహనాన్ని ఢీకొంది. ఈప్రమాదంలో డ్రైవర్ శంకర్ ఠాగూర్(25), హహ్మద్ హిమాముల్(24) అతని భార్య నెహజాన్(24), జుబేదా అన్సారీ(21) అతని భార్య జుబేదా(20), మోబిన్(22)లకు తీవ్రగాయాలు అయ్యాయి. వీరు వాహనంలో ఇరుక్కుపోగా జేసిబి సహాయంతో బయటకు తీసి పుంగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో శంకర్ ఠాగూర్, నెహజాన్ పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెపర్ చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను దూషించిన టిడిపి నాయకుడు
* విధులు బహిష్కరించిన మునిసిపల్ సిబ్బంది
శ్రీ కాళహస్తి, జనవరి 16: మునిసిపల్ వైస్ చైర్మన్ పార్ధసారధి అనుచరుడైన టిడిపి నాయకుడు రామచంద్రయ్య సోమవారం శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను దూషించాడని ఆరోపిస్తూ మునిసిపల్ సిబ్బంది విధులు బహిష్కరించారు. పట్టణంలో పారిశుద్ధ్యం గురించి రామచంద్రయ్య శానిటరీ ఇన్‌స్పెక్టర్‌తో గొడవపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వివాదం జరిగింది. అంతేకాకుండా తనను కులంపేరుతో దూషించాడని శానిటరీ ఇన్‌స్పెక్టర్ మునిసిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు, సిబ్బంది మూకుమ్మడిగా విధులు బహిష్కరించారు. కార్యాలయానికి సిబ్బంది వచ్చినా ఎవరూ సీటులో కూర్చొని పనిచేయలేదు. ఇటీవల కాలంలో సిబ్బందిపై పలువురు దౌర్జన్యం చేస్తున్నారని, దూషిస్తున్నారని సిబ్బంది కూడా ఆరోపించారు. అయితే ఈ సంఘటన గురించి తెలుసుకున్న వైస్ చైర్మన్ పార్ధసారధి తన అనుచరుడైన రామచంద్రయ్యను వెనకేసుకొస్తూ సిబ్బందితో రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సిబ్బంది మాత్రం విధులు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

విరగపూసిన మామిడి పూత
గుర్రంకొండ, జనవరి 16: గుర్రంకొండ మండలం ఈఏడాది మామిడి పూత విరగపూసింది. దీంతో ఈసారి మామిడి పంట దిగుబడి అధికంగా ఉంటుందని రైతులు ఆశగావున్నారు. మండలంలో దాదాపు 1326 హెక్టార్లు మామిడి తోట్లువున్నాయి. అన్నిచెట్లు పూతచెట్లు ఆకులు కనబడకుండా పూత వివరగపూసింది. కాని వ్యాపారులుమాత్రం ప్రస్తుతం మంచు అధికంగావుండటంతో పూత నిలువదని, దీంతో పూత రాలపోతుందని వ్యాపారులు అంటున్నారు. మామిడి పూతను చూసి వ్యాపారులకు పంటను అధికంగా వ్యాపారం చెబుతున్నారు. రైతులు వ్యాపారులకు ఏడాది పాటు పంటను అమ్మడంతో వ్యాపారులు తోటను ఎలాగైనా పూతను నిలుపుకోవాలని వేలాది రూపాయలు ఖర్చుపెడుతున్నారు. పూసిన పూత రాలిపోకుండా వుంటే గత ఏడాదిలో వచ్చిన నష్టాన్ని అధిగమించి ఈసారి అప్పు తీర్చుకోవచ్చునని వ్యాపారులు అంటున్నారు. మండలంలో గత ఆరేళ్లుగా ఉద్యానవనశాఖ, వాటర్‌షెడ్‌ల ద్వారా, ఉపాది హామీ పథకం ద్వారా మామిడి మెక్కలు సబ్సిడి ద్వారా మామిడి తోటలు వేశారు. దీంతో అప్పటి మొక్కలు పూత పూయడంతో రైతులు ఈసారి కూడా మామిడి చెట్లు పెంచుకోవాలని రైతులు ఆశతో వున్నారు.

బాధితుడికి న్యాయంచేయండి
* సబ్‌కలెక్టర్‌కు వినతి
మదనపల్లె, జనవరి 16: ప్రమాదంలో గాయపడి ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకున్నా ఫలితం లేకపోయిందని, మరోసారి ఆపరేషన్ చేయడానికి వెళ్ళిన బాధితుడి నుంచి అదనంగా డబ్బులు తీసుకుని రెండవసారి ఆపరేషన్ చేశారని, అయినా ఫలితం లేకపోగా మంచానికే పరిమితమైన బాధితుడికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్, మాలమహానాడు, రాష్టగ్రిరిజన సమాఖ్య నాయకులు సోమవారం మదనపల్లె సబ్‌కలెక్టర్‌కు విన్నవించారు. 2015 జూన్‌లో జరిగిన ప్రమాదంలో ఎడుమకాలు విరిగిపోయిందని, మరుసటి రోజు ఆరోగ్యశ్రీ పథకం కింద మదనపల్లె పట్టణంలోని విశ్వఆర్థఫెడిక్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారన్నారు. ఆపరేషన్‌కు ముందే రూ.15వేలు విలువగల పరీక్షలు చేయించుకున్నారని, ఆపరేషన్ చేయించుకుని పదిరోజుల తర్వాత ఇంటికి వెళ్ళిన మరుసటిరోజే ఆపరేషన్‌లోవేసిన రాడ్ బయటకు రావడంతో తిరిగి అదే ఆసుపత్రికెళితే మరోసారి ఆపరేషన్ చేయాలని, ఇందుకు తిరుపతి బర్డ్స్‌కు రెఫర్ చేశారు. అదనంగా డబ్బులు చెల్లించి అదే ఆసుపత్రిలో రెండవసారి ఆపరేషన్ చేయించుకున్నామని, ఏడాదిన్నర కాలం గడుస్తున్న ఇంతవరకు కాలు నడువలేని స్థితిలో మంచానికి పరిమితమైయ్యారని, బాధితునికి సక్రమంగా ఆపరేషన్ చేయని వైద్యులపై చర్యలు తీసుకుని బాధితునికి న్యాయం చేయాలని ప్రజాసంఘాల నాయకులు సబ్‌కలెక్టర్‌కు కోరారు. సబ్‌కలెక్టర్‌ను కలసిన వారిలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరేటివాసు, నరేంద్రబాబు, మోపూరి మనోహర్, మాలమహానాడు నాయకులు యమలా సుదర్శనం, గుండా మనోహర్, రమణ, మోహన్, ఆర్‌జిఎస్ నాయకులు దివాకర్‌రావు తదితరులు ఉన్నారు.
18న స్విమ్స్‌లో డయాలసిస్ బ్లాక్ ప్రారంభం
తిరుపతి, జనవరి 16: స్విమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ బ్లాక్‌ను ఈ నెల 18న కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. స్విమ్స్, నెఫ్రోప్లస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ బ్లాక్‌ను నిర్వహించడం జరుగుతుందని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్టమ్రంత్రులు కూడా పాల్గొంటారని వివరించారు.

శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో
ఘనంగా పార్వేట ఉత్సవం
తిరుపతి, జనవరి 16: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సోమవారం పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి ఏడాది సంక్రాంతి కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారు, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవమూర్తులను ఆలయం నుంచి రేణిగుంట రోడ్డులోని పార్వేట మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ ఆస్థానం నిర్వహించారు. తిరిగి నగరవీధుల్లో ఊరేగింపుగా ఉత్సవమూర్తులను సాయంత్రం 6 గంటలకు ఆలయానికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డిప్యూటీ ఇఓ పి వరలక్ష్మి, ఎఇఓ ప్రసాదమూర్తిరాజు, ఇతర అధికార ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు.

కోలాహలంగా జల్లికట్టు సంబరాలు
* రంకేసిన కోడె గిత్తలు, చిందేసిన యువత * పశువులను పట్టడానికి యువత పోటీ
రామచంద్రాపురం, జనవరి 16: సంక్రాంతి పండుగలో నాల్గవరోజు పండుగైన ముక్కనుమ సందర్భంగా సోమవారం పాత వేపకుప్పం, కొత్తవేపకుప్పం, మేకలచేను గ్రామాల్లో కోలాహలంగా జల్లికట్లు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పశువుల కాపరులు తమ పశువులకు దొడ్లు ఏర్పాటుచేశారు. గ్రామ దేవతలకు పూజలు చేసి కోడెగిత్తల కొమ్ములను నునుపుగా చెక్కి రంగులు వేశారు. ముందస్తుగా తయారు చేసుకొని రంగుపేపర్లు అంటించిన చెక్క పలకలను, విలువైన బహుమతులను, నగదును కొమ్ములకు కట్టారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల మండలాల ప్రాంతాల నుంచి పలువురు యువకులు పశువులను నిలువరించి పలకలను పట్టుకోవడానికి గుంపులు గుంపులుగా చేరారు. గ్రామపెద్దలు నిర్ణయించిన ప్రాంతంలో ఈ పశువులను పట్టుకొని పలకలను లాక్కోవడానికి పోటీలు పడ్డారు. ఈ సందర్భంగా కొంతమంది యువకులు పశువుల కింద పడి గాయాలపాలయ్యారు. అయినా లెక్కచేయకుండా రంకేసిన కోడెగిత్తల ప్రతాపాన్ని అడ్డుకోవడానికి యువత గంతులేసింది. ఈ సందర్భంగా గ్రామాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం ఊరి చివర్లలో ముళ్లకంపలను చితిగాపేర్చి మంటలు వేసి కాటంరాజు ఉత్సవాలు నిర్వహించారు. రాత్రి గొబ్బెమ్మలను సాగనంపి నిమజ్జనం కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు.
బ్రాహ్మణపల్లిలో...
వెదురుకుప్పం : మండలంలోని బ్రాహ్మణపల్లిలో జరిగిన పరుష పందేలు ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగాయి. సంక్రాంతి ఉత్సవాల్లో చివరిరోజున ముక్కనుమ సందర్భంగా సోమవారం మండలంలోని బ్రాహ్మణపల్లి, కొమరగుంట, కురివికుప్పం గ్రామాల్లో జల్లికట్టు జరిగింది. జిల్లాలోని రంగంపేట తరువాత మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఆ స్థాయిలో ప్రతి ఏడాది జల్లికట్టు నిర్వహిస్తారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన జల్లికట్టు కార్యక్రమం గ్రామ సంప్రదాయం ప్రకారం ఉదయం గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన పశువులను జల్లికట్టులో వదిలే కార్యక్రమాన్ని గ్రామపెద్దలు ప్రారంభించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన యువకులు, కోడిగిత్తెలను నిలువరించడానికి చేసే ప్రయత్నాలు ఉద్వేగభరితంగా కొనసాగాయి. పశువులకు కట్టిన పలకలు, నగదు, నూతన వస్త్రాలను కైవసం చేసుకునేందుకు యువకులు పోటీలు పడ్డారు. పశువులకు కట్టిన వాటిని కైవసం చేసుకునే ప్రయత్నంలో ఇరువర్గాలకు చెందిన యువకులు పోటీపడటంతో జల్లికట్టు ఆలస్యంగా కొనసాగింది. ఈ నేపథ్యంలో స్థానికులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను శాంతింపచేసి పరుష పందేలను సజావుగా కొనసాగించేందుకు ప్రయత్నించారు. స్వల్ప సంఘటనలు మినహా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో జల్లికట్టు శాంతియుతంగా ముగిసింది. ఉత్సవాలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలకు స్థానికులు మంచినీరు, మజ్జిగ, అన్నదానం కార్యక్రమాలు చేపట్టారు.