చిత్తూరు

నేడు జిల్లాలో కేంద్ర కరవు బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జనవరి 22: జిల్లాలో 2016 ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న కరవు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సోమవారం కేంద్ర పరిశీలన బృందం జిల్లాలో పర్యటించనున్నది. జిల్లాలో ఈ బృందం తొమ్మిది మండలాల్లో క్షేత్రస్థాయిలో కరవు పరిస్థితులను పరిశీలించనున్నది. జిల్లాలో గత నాలుగేళ్లుగా ప్రకృతి వైపరిత్యాల కారణంగా ప్రధాన వాణిజ్య పంట అయిన వేరుశనగను రైతాంగం నష్టపోతున్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో కూడా 1.30 లక్షల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు చేసినా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట తుడిచిపెట్టుకుపోవడంతో భారీగా రైతాంగానికి నష్టం చేకూరింది. గత ఏడాదితో నెలకొన్న వర్షాభావ పరిస్థితి కారణంగా జిల్లాలో వ్యవసాయం సాగు చేయడం రైతులకు కష్టతరంగా మారింది. ఖరీఫ్‌లో వేసిన వేరుశనగ పంట చేతికి వచ్చే సయమానికి వరుణ దేవుడు కనె్నర్ర చేయడంతో పంటి ఎండిపోయింది. దీంతో ఈ పంటను కాపాడటానికి ప్రభుత్వం వినూత్న రీతిలో రెయిన్ గన్స్‌తో పలుచోట్ల నీటిని అందంచినా ప్రయోజనం శూన్యమే అయ్యింది. దీంతో పంటకు పెట్టిన పెట్టుబడులకు సైతం కనీసం వడ్డీలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. వరుసగా వేరుశనగ రైతులకు దెబ్బమీద దెబ్బ పడుతుండటంతో కొలుకోలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క రోజురోజుకు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీటితో పాటు తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో కరవు పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సోమవారం కేంద్రబృందం ప్రతినిధులైన అమితాబ్ గౌతమ్ నేతృత్వంలో డాక్టర్ పొన్నుస్వామి, ప్రేమ్‌సింగ్‌తో కూడిన బృందం కరవు పరిస్థితులను పరిశీలించనుంది. జిల్లాలో వరుస కరవుతో అల్లాడుతున్న రైతులకు పాడి పరిశ్రమే జీవనాధారమైంది. గత ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ పంటతో పాటు ఇతర పంటలు వర్షాభావ పరిస్థితుల కారణంగా చేతికి రాకపోవడంతో కనీసం పశుగ్రాసం కూడా అందని పరిస్థితి నెలకొంది. రానున్న వేసవిలో పాడి రైతుకు పశుగ్రాస కొరత మరింత కష్టతరంగా మారింది. ఇటీవల కురిసిన వార్దా తుఫాన్ కారణంగా తూర్పు మండలాల్లో కొంతవరకు వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరిగినా పడమటి మండలాల్లో మాత్రం పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారింది. మదనపల్లె డివిజన్ పరిధిలో ఎటుచూసినా చుక్కనీరు లేని చెరువులు బీడుగా మారిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. గత ఏడాది సుమారు 2.2 లక్షల మంది వేరుశనగ రైతులు పంట సాగు చేసినా చేతికి చిల్లిగవ్వ రాక కనీసం పంటలపై పెట్టిన పెట్టుబడులు సైతం అందని దయనీయ పరిస్థితి నెలకొంది. అలాగే గతేడాది పంట నష్టపరిహారం ఇటీవల ప్రభుత్వం మంజూరు చేసినా పలువురు అర్హులైన రైతులకు ఈ నష్టపరిహారం అందిన దాఖలాలు లేవు. జిల్లాలో పడమటి మండలాల్లో తాగునీటి సమస్య తారస్థాయికి చేరుకుంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 257 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. ఇందులో 211 గ్రామాల్లో రవాణా ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. మరో 46 గ్రామాల్లో వ్యవసాయ బావుల ద్వారా నీటిని అందిస్తున్నారు. కుప్పం నియోజకర్గంలోనే ఈ సమస్య మరింత జఠిలమైంది. రోజురోజుకు పడమటి మండలాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బావులు, బోర్లలో నీటిమట్టం క్రమేణా తగ్గుతూ వస్తోంది. రానున్న వేసవిలో ఈ తాగునీటి సమస్య మరింత తీవ్రతరం కానుంది. దీంతో మదనపల్లె డివిజన్ పరిసర ప్రాంతాల్లోని మండలాల్లో రానున్న వేసవి పరిస్థితిపై రైతుల్లోను, ప్రజల్లోను భయాందోళన నెలకొంది. సోమవారం ఈ కరవు బృందం జిల్లాలోని చిన్నగొట్టిగల్లు, రొంపిచెర్ల, పీలేరు, కలకడ, కలికిరి, గుర్రంకొండ, మదనపల్లె, వాల్మీకిపురం, కురబలకోట, తదితర మండలాల్లో పర్యటించి స్థానిక పరిస్థితులను ఆరా తీయనున్నది. అలాగే రైతులతో కూడా సమావేశమై పంటల స్థితిగతులపై సమీక్షించనుంది. జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితులను ఈ బృందం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించనున్న ఈ బృందంతో న్యాయం జరుగుతుందన్న ఆశతో రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

రానున్న ఐదేళ్లలో విమానాశ్రయాల్లో వౌలిక వసతుల కల్పనకు రూ.15వేల కోట్లు
* ఏపిలో విమానయాన ప్రయాణాల శాతం బాగా పెరిగింది
* కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వెల్లడి

తిరుపతి, జనవరి 22: దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వౌలిక వసతుల కల్పనకు రానున్న ఐదేళ్లలో రూ.15వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు వెల్లడించారు. తిరుమల, తిరుపతిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూ ఢిల్లీ నుంచి ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయన వెంట పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు, కేంద్ర పౌర విమానయాన కార్యదర్శి ఆర్ ఎస్ చుబే, అనిల్ శ్రీవాత్సవ, అంకుర్‌కార్గ్, వి.అప్పారావు, ఎస్.శ్రీనివాసరావు ఉన్నారు. ఇక్కడ నుంచి నేరుగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్న వారికి టిటిడి అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం కేంద్రమంత్రి అశోక్‌గజపతిరాజు ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగానే సోమవారం తిరుపతిలో పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకుని వాటిని అమలు చేయడానికి కృషి చేస్తామని అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన ప్రయాణాల శాతం బాగా పెరిగిందని చెప్పారు. అనంతరం మంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. కేంద్రమంత్రి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా ఆయనకు తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్, తిరుపతి ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ హెచ్.పుల్లా, తిరుపతి రూరల్ తహశీల్దార్ కిరణ్‌కుమార్ స్వాగతం పలికారు.
కర్నూలు జిల్లాలో జోరుగా కల్తీ కల్లు వ్యాపారం
* సహకరిస్తున్న డిప్యూటి కమిషనర్, సూపరింటిండెంట్‌కు 60 లక్షలు
* విలేఖర్ల సమావేశంలో ఎక్సైజ్ సిఐ ప్రసాద్‌రెడ్డి వెల్లడి
మదనపల్లె, జనవరి 22 : రాయల కరవు సీమలోని కర్నూలు జిల్లాలో నకలీ కల్లు వ్యాపారం జోరుగా జరుగుతోందని, ఈ నకలీ కల్లు సేవించడం వల్ల అనేకమంది పేదలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని, అనేకమంది చనిపోతున్నారని ప్రజలు గొంతెత్తి అరుస్తున్నా అబ్కారీ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుళ్ల వరకు ప్రతినెలా మామూళ్లు ముడుతున్నాయని మదనపల్లె ఎక్సైజ్ సిఐ ప్రసాద్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కల్తీకల్లుకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న కర్నూలు జిల్లా అబ్కారీ డిప్యూటి కమిషనర్, ఎక్సైజ్ సూపరింటిండెంట్‌కు ప్రతినెలా రూ.60 లక్షలు ముడుతోందని ఆరోపించారు. ఆదివారం మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎక్సైజ్ సిఐ ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. కర్నూలు జిల్లా కల్తీకల్లుకు పుట్టినిల్లుగా మారిందని, వీటిని అరికట్టాల్సిన ఎక్సైజ్‌శాఖ మామూళ్లకు అలావాటుపడి క్షేత్రస్థాయి నుంచి లంచాలకు అలవాటు చేస్తున్నట్లు ఆరోపించారు. కల్తీకల్లు, నాటుసారా, మద్యంషాపులలో నకలీ ఛీప్‌లిక్కర్స్ విక్రయాలు చేస్తున్నా ప్రతినెలా తనిఖీల పేరుతో వసూళ్లు చేసుకుంటున్నారని తెలిపారు. కేవలం ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్, ఎక్సైజ్ సూపరింటిండెంట్‌లకు ప్రతినెలా రూ.60 లక్షలు ముడుపులు అందుతున్నాయన్నారు. తన సర్వీసులో ఇలాంటి వాటిపై అనేకమార్లు ఆపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం, అక్కడి నుంచి తనను బదిలీ చేయించడం సర్వసాధరణమైందన్నారు. ఇదిలావుండగా సర్వీసులో ఉన్న ఉన్నతాధికారి తన పరిపాలన కార్యాలయంలో పనులపై వెళితే, ఈ ఫైలు కదలాలంటే ముడుపులు చెల్లించాల్సిందే అని ముఖానే చెప్తున్నారని, ఈ సంఘటన తనకే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఓ కానిస్టేబుల్ ఫయాజ్ ఎక్సైజ్‌శాఖ డిప్యూటి, సూపరిండెంట్ కార్యాలయాల పరిపాలన విభాగంలో గత పాతికేళ్లుగా ఒకే సీట్లో విధులు నిర్వర్తించడం, మూడేళ్లకు ఒకసారి బదిలీలు వచ్చినా వెళ్లకుండా లంచాలిచ్చి అక్కడే పోస్టింగ్ వేయించుకుని కొనసాగుతున్నారని ఆరోపించారు. అక్రమ సంపాదనపై ఉన్న శ్రద్ధ శాఖలో పనిచేసే అధికారులపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంత సంపాదించామన్నది కాదు- సమాజానికి ఏం చేశామన్నదే ముఖ్యం
* శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి ఉద్బోధ
శ్రీకాళహస్తి, జనవరి 22: సమాజంలో ఎంతోమంది ధనం సంపాదిస్తారని అయితే అది ముఖ్యం కాదని సమాజానికి మనం ఏం చేశామన్నదే మానవ జన్మ సార్థకతకు ముఖ్యమని కాకినాడ శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. ఆదివారం శ్రీకాళహస్తిలో జరిగిన అతిరుద్ర మహాయాగంలో పాల్గొన్న ఆయన మెగాస్టార్ చిరంజీవి ప్రసంగానికి ముందు అభిభాషణం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషిలో ధార్మిక చింతన లోపిస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుందని తద్వారా అనారోగ్యం వెంటాడుతుందన్నారు. ఆ సమయంలో ఎంత సంపద ఉన్నా మానసిక ప్రశాంతత ఉండదన్నారు. అందుకే మనిషి సమాజ సేవలో తన వంతు పాత్రను పోషిస్తూ ధార్మిక చింతన పెంచుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. తన తల్లితండ్రుల అనుమతితోనే తాను కాషాయం ధరించి నేడు ఇలాంటి మహాయాగాల్లో పాల్గొంటున్నట్లు వివరించారు. చిరంజీవికి కోట్ల మంది అభిమానులు ఉన్నారన్నారు. నేడు తాను కూడా ఆయన పక్కన కూర్చుని ఉండటం సంతోషంగా ఉందన్నారు. నాటి రాజగోపురం కళకు ఏమాత్రం తీసిపోని విధంగా నేడు రాజగోపురాన్ని నిర్మించిన నవయుగ సంస్థ చైర్మన్ విశే్వశ్వరయ్య ధన్నుడన్నారు. ఆయన విధేయతే ఆయనకు ఇలాంటి గొప్ప కార్యక్రమాలను నిర్వహించే బాగ్యాన్ని కల్పించిందనడంలో మరో అనుమానానికి తావులేదన్నారు.
ఈలలతో మారుమోగిన ముక్కంటీశ్వరుని ఆలయం
* శివయ్యను దర్శించుకున్న చిరంజీవి దంపతులు
* ఇఓ, చైర్మన్‌ను నెట్టివేసిన ‘చిరు’ అభిమానం
శ్రీకాళహస్తి, జనవరి 22: నిత్యం శివనామ స్మరణలతో మారుమోగే దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలోని ముక్కంటీశుని ఆలయం ఆదివారం సాయంత్రం ఈలలతో, ‘చిరు’ నినాదాలతో మారుమ్రోగింది. శ్రీకాళహస్తిలో జరుగుతున్న అతిరుద్ర మహాయాగంలో పాల్గొనేందుకు తన సతీమణితో కలసి రేణిగుంట విమానాశ్రయం నుంచి కారులో శ్రీకాళహస్తికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. చిరంజీవి వస్తున్న విషయం ముందే తెలియడంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున చిరంజీవి అభిమానులు శ్రీకాళహస్తికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆయన శ్రీకాళహస్తి ఆలయంలోకి వెడుతున్న సమయంలో ఒక్కసారిగా చిరు అభిమానులు ఆలయంలోకి ప్రవేశించారు. వారిని నియంత్రించడం పోలీసులకు కూడా అసాధ్యమైంది. ఈ క్రమంలో చిరు ఆలయంలోకి వెళ్లే సమయంలో ఆలయ పాలకమండలి చైర్మన్, సభ్యులు, కార్యనిర్వహణాధికారి భ్రమరాంబను సైతం వెనెక్కి నెట్టేశారు. ఈ పరిస్థితి ఆలయ సిబ్బందికి కూడా ఇబ్బంది కరంగా మారింది. కాగా ఆలయంలో చిరంజీవి శంఖాన్ని ఊది భంభం భోలే అనిపించారు. ఆయన వెంట నిర్మాత ఎన్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
విమానాశ్రయాలు పరిశీలించనున్న ప్రత్యేక కమిషన్
* కేంద్ర మంత్రి అశోక్‌గజపతి రాజు వెల్లడి
రేణిగుంట, జనవరి 22: భారతదేశంలోని అన్నివిమానాశ్రయాలను ఢిల్లీ నుంచి ప్రత్యేక కమిషన్ సభ్యులు పరిశీలించనున్నారని కేంద్ర విమానాయ శాఖామంత్రి అశోక్‌గజపతి రాజు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో రేణిగుంటకు చేరుకున్న ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలుకగా విమానాశ్రయంలో విలేఖరులతో కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలోని అన్ని విమానాశ్రయాలను ప్రత్యేక కమిషన్ పరిశీలించి విమానాశ్రయంలోని లోటుపాట్లను ప్రయాణీకులు కల్పించే సౌకర్యాలను వసతులపై దృష్టిసారించిందని ఆయా విమానాశ్రయాల్లో పరిశీలనలో పేర్కొన్న లోటుపాట్లను పార్లమెంటు కమిటీకి కమిషన్ అందిస్తుందని తెలిపారు. అనంతరం చట్టసభల్లో విమానాశ్రయంలో లోటుపాట్లను తీర్చేందుకు పార్లమెంటులో ఆమోదం అనంతరం సిఫార్సు చేసి తద్వారా విమానాశ్రయాలు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఇదే కోవలో తిరుపతి విమానాశ్రయం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కేంద్ర హోం శాఖ తిరుపతి విమానాశ్రయంకు ఇమిగ్రేషన్ పనులను పరిశీలిస్తుందని, పనులు పూర్తికాగానే తిరుపతి విమనాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు నడుస్తుందన్నారు. రేపు తిరుపతిలో విమానాశ్రయాల ప్రత్యేక కమిషన్ సమావేశం నిర్వహిస్తున్నట్లు, ఇందులో పలు నిర్ణయాలు తీసుకొని ప్రకటిస్తామన్నారు. అనంతరం ఆయన రోడ్డు మార్గాన తిరుచానూరుకు బయలుదేరి వెళ్లారు.

శ్రీపద్మావతి అమ్మవారికి తంజావూరు అష్టలక్ష్మి
చిత్రాల విరాళం
తిరుపతి, జనవరి 22: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి విజయవాడకు చెందిన నందమూరి లలితారాణి, రాంప్రసాద్ దంపతులు తంజావూరు చిత్రలేఖనంతో కూడిన అష్టలక్ష్మి చిత్రాన్ని విరాళంగా అందించారు. ఇందులో ధన, దాన్య, సంతాన, గజ, వీర, విజయ, ఆది, ఐశ్వర్య లక్ష్మీదేవిల చిత్రాలు ఉన్నాయి. వీటిని రూపొందించడానికి 8నెలల సమయం పట్టిందని దాతలు తెలిపారు. ఈ చిత్రాలను ఆదివారం అమ్మవారి ఆలయంలోని శ్రీకృష్ణముఖ మండపంలో టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావుకు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి ఇ ఓ మునిరత్నం రెడ్డి, ఏ ఇ ఓ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘శ్రమకు నైపుణ్యాలు తోడైతేనే విజయం’
తిరుపతి, జనవరి 22: నిరంతర శ్రమకు నైపుణ్యాలు తోడైనపుడే అనుకున్న విజయాలు సాధించవచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు చెంగవళ్లి వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక యూత్ హాస్టల్లో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, జూనియర్ చాంబర్ సంయుక్తంగా నిర్వహించిన ప్రేరణ కార్యక్రమం ప్రధానవక్తగా ప్రసంగించారు. 108 వాహన సౌకర్యాల రూపకర్త అయిన ఆయన మాట్లాడుతూ మేధోవికాసానికి వ్యక్తి ప్రగతికి కులం, పేదరికం అవరోధం కాదని అన్నారు. ఆత్మవిశ్వాసమే ఆయుధంగా చురుకుదనం, ఉత్సాహం ఇంధనంగా మార్చుకున్న యువత ప్రగతిపథంలో పయనిస్తారని చెప్పారు. విద్యార్థులు పాఠాలు, విషయ పరిజ్ఞానంతోపాటు జీవననైపుణ్యాలు సామాజిక స్పృహ పెంపొందించుకోవాలని సూచించారు. భావ వ్యక్తీకరణ , పరస్పర సంబంధాలు, సమయపాలన, ఉద్వేగ నియంత్రణ, ఒత్తిళ్ల నిర్వహణ లాంటి అంశాలతో ప్రావీణ్యం సంతరించుకోవాలని చెప్పారు. ప్రతికూల ప్రేరకులకు దూరంగా ఉంటూ స్వీయ నమ్మకం చెరగకుండా లక్ష సాధనపై దృష్టి పెట్టాలన్నారు. రాదు, కాదు, లేదు అన్న మాటల్ని పట్టించుకోకుండా సానుకూలంగా ఆలోచించే వారు భవిష్యత్తుకు బంగారు బాటలు వేయగలరన్నారు. లక్ష్యాలపట్ల స్పష్టత కలిగి పనిచేయాలన్నారు. సద్విమర్శలను స్వీకరిస్తూ లోపాలను సరిదిద్దుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సి. హనుమంతరావు, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సి.స్వరాజ్య లక్ష్మి, పి ఆర్ ఎస్ ఐ తిరుపతి శాఖ ఛైర్‌పర్సన్ ఫ్రొఫెసర్ టి.త్రిపుర సుందరి, కార్యదర్శి ఎన్.బి హర్షవర్థన్ రెడ్డి, తిరుపతి జూనియర్ చాంబర్ అధ్యక్షురాలు జి.అనుపమ, కార్యదర్శి ఎన్. రవికుమార్ ప్రసంగించారు. పలువురు పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా కోసం వౌనదీక్ష
* అరెస్టు చేసిన పోలీసులు
కుప్పం , జనవరి 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కుప్పంలో కాంగ్రెస్ నేత మునుస్వామి వౌనదీక్ష చేపట్టారు. ఆదివారం కుప్పంలోని గాంధీ విగ్రహం వద్ద మునుస్వామి అర్ధనగ్న ప్రదర్శనతో ఉదయం 6గంటల నుంచే వౌనదీక్ష చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మునుస్వామితో చర్చించారు. జల్లికట్టు విషయంగా తమిళనాడు వాసులు ఐక్యతతో విజయం సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంగా అందరూ ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఎటువంటి అనుమతి లేకుండా దీక్షలు చేయడం చట్టవ్యతిరేకమని మునుస్వామిని పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే మునుస్వామి మాత్రం స్టేషన్‌లో కూడా దీక్ష కొనసాగిస్తున్నారు.