చిత్తూరు

సర్వం శివమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, మార్చి 24: హరహర మహాదేవ శంభో శంకర , ఓం నమఃశివయ అనే నామస్మరణలతో శ్రీ కాళహస్తి క్షేత్రం మారుమోగింది. భక్తుల హృదయాలు పులకించిపోయాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులు వేడుకగా ఆనందంగా జరుపుకున్నారు. దక్షిణ కైలాసమైన శ్రీ కాళహస్తి క్షేత్రంలో తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గంటకు ముందుగానే ఆలయం తలుపులు తెరచి అధికారులు భక్తులను దర్శనానికి అనుమతించారు. అప్పటికే పవిత్ర స్నానాలు చేసిన భక్తులు హర హర మహాదేవ అంటూ ఆది దంపతులను స్మరిస్తూ ఆలయంలోకి అడుగుపెట్టారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకొని తరించారు. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం, శివాలయానికి వెళ్లడం, శివనామస్మరణ చేయడం ఇవన్నీ కూడా ముక్తికి సోపానాలని భక్తులు నమ్ముతారు. అందు వల్లే తెల్లవారుజామున చలి ఉన్నప్పటికీ స్వర్ణముఖి నదిలో దేవస్థానం ఏర్పాటుచేసిన స్నాన ఘట్టాల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు తడి బట్టలతోనే తన్మయత్వం చెందుతూ పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు. భక్తుల కోసం ఉచిత క్యూలు, టిక్కెట్ల క్యూలు దేవస్థానం ఏర్పాటుచేసింది. క్యూల ద్వారా వెళ్లిన భక్తులు స్వామి, అమ్మవార్లను, పరివారదేవతలను దర్శించి స్మరించుకున్నారు. దేవస్థానం భక్తులకు ఉచిత ప్రసాదాలను పంపిణీ చేసింది. క్యూలైన్‌లో ఉన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు, భక్తులకు మంచినీళ్లు సరఫరా చేశారు. గాలిగోపురం నుంచి సర్వదర్శనం క్యూను ఏర్పాటుచేశారు. షాపింగ్ కాంప్లెక్స్ ప్రాంతంలో షామియాలను ఏర్పాటుచేసి క్యూలైన్లు నిర్మించారు. వచ్చిన భక్తులను క్యూలైన్ల ద్వారా పంపడం వల్ల భక్తుల మధ్య తోపులాటలు జరగలేదు. క్యూలైన్లు సక్రమంగా ఏర్పాటుచేసినా నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల భక్తుల మధ్య తోపులాటలు, వాదులాటలు జరిగాయి. రూ.500, రూ.200 టిక్కెట్లనుక కొనుగోలు చేసిన భక్తులు త్రినేత్ర అతిథిగృహం మార్గంలో వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకోవడం జరిగింది. టిక్కెట్లు కొన్నవారిని, కొనుగోలుచేయనివారిని ఒకే లైన్‌లోపంపడం, పోలీసులు మితిమీరి ప్రవర్తించడం తదితర కారణాలపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్వహణ అస్తవ్యస్తం
భక్తుల కోసం ఉచిత క్యూ, రూ.200, రూ.500ల క్యూలను దేవస్థానం తాత్కాలికంగా నిర్మించింది. అదే క్యూలలో భక్తులను పంపి ఉంటే ఎటువంటి ఆటంకం లేకుండా భక్తులు దర్శించుకునేవారు. అయితే ఆలయాన్ని పోలీసులకు అప్పగించడంతో ఇష్టారాజ్యమైంది. ఒక్కొక్కపోలీస్ 10, 15 మందిని గుంపులు గుంపులుగా ప్రత్యేక క్యూలైన్‌లో తీసుకెళ్లడం జరిగింది. రెవెన్యూ అధికారులది, మరోశాఖవారిది కూడా అదేవిధంగా జరగడంతో భక్తులు మనస్థాపానికి గురయ్యారు. టిక్కెట్లు కొనుగోలు చేసినా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లుచేసినా నిర్వహణ లోపం వల్ల క్యూలైన్ల నిర్వహణ అభాసుపాలైంది.

కనిపంచిన సమన్వయ లోపం
ట్రస్టుబోర్డుకు, ఇ ఓ భ్రమరాంబకు మొదటి నుంచి ఉన్న సమన్వయ లోపం శివరాత్రి రోజు మళ్లీ కనిపించింది. ఒక్కొక్క చోట ఒక్కో బోర్డు సభ్యుడికి బాధ్యతలు అప్పగించారు. కొందరు నిర్వహించకపోయినా మరికొందరు క్యూలైన్ల నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఉదయం ఉత్సవ మూర్తుల ఊరేగింపు సందర్భంగా ఆలయం నుంచి ఉత్సవ మూర్తులు బయటకు వచ్చిన తరువాత మూకుమ్మడిగా భక్తులు కంచు గడపల నుంచి ఆలయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ఉండిన బోర్డు సభ్యుడు నారాయణ యాదవ్ కొంత వరకు ప్రయత్నించారు. పోలీసులు, దేవస్థానం సిబ్బంది సహకరించకపోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఆయన చేసేది లేక భక్తులను వదిలివేయడంతో తోపులాటలు మధ్య భక్తులు ఆలయంలోకి వెళ్లడం జరిగింది. బోర్డు సభ్యులు నారాయణ యాదవ్, బాలాజి, ఇ ఓ భ్రమరాంబపై ధ్వజమెత్తారు. ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల నిర్వహణ సక్రమంగాలేదని, దీనికి ఇ ఓ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. భక్తుల కోసం తాముచేసిన సూచనలను ఇ ఓ పట్టించుకోలేదని విమర్శించారు.

మీడియాపై ఇ ఓ మండిపాటు
బోర్డు సభ్యుల ఆగ్రహానికి గురైన ఇ ఓ భ్రమరాంబ ఆ కోపాన్ని మీడియా వారిపై ప్రదర్శించారు. మీడియా సిబ్బంది కేవలం కంచుగడపల వద్దకు మాత్రమే వెళ్లి ఫోటోలు, వీడియోలు తీసుకోవాలని ఆలయంలోకి అనుమతించేది లేదన్నారు. అయితే అప్పటికే ఒక ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది ఆలయంలోని స్వామివారి బంగారు ధ్వజస్తంభం వద్దకువెళ్లి లైవ్ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. వీరిపై మీడియా సిబ్బంది ఇ ఓను నిలదీశారు. ఒకరికి అనుమతించి మిగిలిన వారికి అనుమతించకపోవడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. అయితే కంచు గడపల వద్దకు మీడియా సిబ్బంది వెళ్లకుంటే దేవాదాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానని మీడియా వారిని వీడియో తీయించారు. వీరిపై మీడియావారు కూడా ఇ ఓ ఆగ్రహాన్ని కెమెరాల్లో బంధించారు. ఈసందర్భంగా కొద్దిసేపు వాదులాట జరిగింది. ఆ తరువాత మీడియా వారిని దక్షిణామూర్తి సన్నిధి వరకు అనుమతించడం జరిగింది.

తగ్గిన కళాకాంతులు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి, రథోత్సవం,కల్యాణోత్సవం, పల్లకీసేవలు అతిముఖ్యమైనవి. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల విద్యుత్ దీపాలతో, పూలతో భారీగా అలంకరించడం ఆనవాయితీగా ఉంది. అయితే శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం రోజు ఆలయంలో పూల అలంకరణ, విద్యుత్ దీపాల ఏర్పాట్లు తక్కువగా కనిపించింది. అంతేకాకుండా వివిధ రకాల పండ్లతో ఎటువంటి అలంకారాలు చేయలేదు. దీంతో భక్తులు ఆవేదనకు గురయ్యారు. కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా అలంకారాలకు ఖర్చుచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏర్పాట్లన్నీ భేష్
మహాశివరాత్రి కోసం ట్రస్టుబోర్డు, ఇ ఓ అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేశారని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కితాబిచ్చారు. కుటుంబ సభ్యులతోకలిసి ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగామీడియా వారితోమాట్లాడుతూ క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో భక్తులందరూ స్వామి, అమ్మవార్లను సులభంగా దర్శించుకుంటున్నారని, ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఈ సందర్భంగా ఆయనకు బోర్డు అధ్యక్షుడు గురవయ్యనాయుడు, సభ్యులు, ఇ ఓ భ్రమరాంబ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు. ఆ తరువాత దక్షిణామూర్తి వద్ద ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. గత ఏడాది మంత్రి గోపాలకృష్ణారెడ్డి దర్శనానికి వచ్చినప్పటికీ నీళ్లు లేకుండా పోవడంతో తిరిగి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, శాప్ ఛైర్మన్ పి ఆర్ మోహన్, ట్రస్టుబోర్డు మాజీ అధ్యక్షుడు కోలా ఆనంద్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ చంద్రశేఖర్ తదితరులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.మధ్యాహ్నం వరకు సుమారు 50వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఇంద్ర విమానంపై ఊరేగిన పరమశివుడు
శ్రీ కాళహస్తి, ఫిబ్రవరి 24: మహాశివరాత్రి మహోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీ కాళహస్తిలో ఉదయం వాహనసేవ జరిగింది. గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి ఇంద్రవిమానం వాహనంపైన, జ్ఞాన ప్రసూనాంబ సప్పరం వాహనంపైన ఊరేగి భక్తులకు కనువిందుచేశారు. పాలసముద్రాన్ని అమృతం కోసం చిలుకగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఈ సందర్భంగా ఆయన నిద్రపోకుండా దేవతలు, రాక్షసులు జాగరణ చేశారు. దేవేంద్రుడు తన రథంపై శివుడ్ని ఊరేగించాడు. అందుకే శివరాత్రి రోజు ఇంద్ర విమాన వాహనంపై ఉత్సవాన్ని నిర్వహించారు. అలంకార మండపంలో పూలు, ఆభరణాలతో ఉత్సవమూర్తులను అలంకరించిన తరువాత ట్రస్టుబోర్డు ఛైర్మన్ గురవయ్యనాయుడు, ఇ ఓ భ్రమరాంబ ఉత్సవాన్ని ప్రారంభించారు.

శ్రీ కాళహస్తిలో నేడు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజును బ్రహ్మరాత్రి అంటారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం రథోత్సవం, రాత్రి తెప్పోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. హాలాహలం తాగిన తరువాత మగత నిద్రనుంచి మేల్కొన్న తరువాత బ్రహ్మ తన రథంపై శివుడ్ని అధిరోహించి ఆయన రథసారధిగా ఉత్సవాన్ని నిర్వహించిన సందర్భాన్ని పురస్కరించుకొని రథోత్సవాన్ని నిర్వహించారు. రాత్రి నారద పుష్కరిణిలో తెప్పోత్సవం జరుగనుంది. ఇందుకోసం దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.