చిత్తూరు

కార్పొరేటర్లతో అధికారులు సమన్వయం చేసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఏప్రిల్ 21 : మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆయా డివిజన్ల కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుని పనిచేయాలని చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ కఠారి హేమలత సూచించారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో చిత్తూరు కార్పొరేషన్ 2017-18 ఆర్థిక సంవత్సరపు బడ్జెట్ సమావేశం జరిగింది. తొలుత ఇటీవల కార్పొరేషన్ పరిధిలోని 33వ డివిజన్ కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కఠారి హేమలత కార్పొరేషన్ రెండవ రెగ్యులర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, డిప్యూటీ మేయర్ సుబ్రహ్మణ్యం, కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో పాటు మున్సిపల్ ఉద్యోగులు, కార్పొరేటర్లు, సిబ్బంది హేమలతకు పుష్పగుచ్చాలు ఇచ్చి అభినందించారు. అనంతరం మేయర్ అనుమతితో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చామంతిపురం కార్పొరేటర్ ఇందు మాట్లాడుతూ బడ్జెట్ సమావేశం అజెండా కాపీని సమావేశం జరిగే సమయంలో ఇస్తే, బడ్జెట్‌పై ఎలా చర్చించాలని ప్రశ్నించారు. కమిషనర్, డిప్యూటీ మేయర్ సమాధానమిస్తూ కార్పొరేషన్ పరిధిలోని రెండు డివిజన్ల ఉప ఎన్నికల కారణంగా ఫిబ్రవరి నెలలో జరగాల్సిన బడ్జెట్ సమావేశం ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఈ కారణంగానే వారం రోజులకు ముందు ఇవ్వాల్సిన బడ్జెట్ అజెండా కాపీలను పంపిణీ చేయడంలో ఆలస్యమైందన్నారు. వారి సమాధానానికి సంతృప్తి చెందని ఇందు నిల్చొనే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ కలగజేసుకుని ఇకపై ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన మరో కార్పొరేటర్ శివకుమార్ మాట్లాడుతూ డివిజన్ వారీగా కేటాయిస్తున్న నిధుల విషయంలో వివక్ష చూపుతున్నారంటూ సమావేశ మందిరం నుంచి బాయ్‌కాట్ చేసేందుకు ఉపక్రమించారు. అయితే ఎమ్మెల్యే సత్యప్రభ సూచనల మేరకు ఆ ప్రతిపాదనను శివకుమార్ ఉపసంహరించుకుని సమావేశంలో పాల్గొన్నారు. సంతపేటకు చెందిన కార్పొరేటర్ సిఎం విజయ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆయా డివిజన్ల కార్పొరేటర్ల ప్రమేయం లేకుండా డివిజన్లలో పలు కార్యకలాపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 9వ డివిజన్ కార్పొరేటర్ లలిత మాట్లాడుతూ తన డివిజన్ పరిధిలో లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే కార్పొరేషన్ అధికారులు పనులు చేసి పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ కార్పొరేషన్‌లో విలీనమైన 14 గ్రామ పంచాయితీల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలను చర్చించాలని కోరారు. గత ఏడాది వేసవి కాలంలో కార్పొరేషన్ పరిధిలో తాగునీటిని సరఫరా చేసిన ట్యాంకర్లకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా పలువురు కార్పొరేటర్లు సమస్యను మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. మేయర్ మాట్లాడుతూ నీటి ట్యాంకర్ల బకాయిలను వెంటనే చెల్లించాలని, దివంగత మేయర్ కఠారి అనురాధ పాలనలో డివిజన్ అభివృద్ధికి ఇచ్చిన సాధారణ నిధుల విషయాన్ని కొనసాగిస్తామని, అయితే సంబంధిత డివిజన్లలో మున్సిపల్ అధికారులతో కలిసి తాను స్వయంగా పర్యటించి ఆయా డివిజన్లలో ఉన్న సమస్యలతో నివేదికను తయారు చేసి తదనుగుణంగా నిధులను కేటాయిస్తామని వివరించారు. ఈ క్రమంలో ప్రతి డివిజన్‌కు ఒక ప్రణాళిక ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఇందుకు స్థానిక ఎమ్మెల్యే, కమిషనర్ సహకారాలు కావాలని కోరారు. కమిషనర్ మాట్లాడుతూ రెండు రోజుల్లో తాగునీటి ట్యాంకర్ల బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గత కౌన్సిల్ సమావేశంలో చర్చించిన సమస్యలను సైతం పరిష్కరించేలా సంబంధితత మున్సిపల్ ఉద్యోగులను ఆదేశిస్తామన్నారు.
* 191.50 కోట్ల బడ్జెట్‌కు ఏకగ్రీవ ఆమోదం :
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన రూ.191.50 కోట్ల ఆర్థిక బడ్జెట్‌కు కార్పొరేటర్లందరూ మూజువాణి ఓటుతో ఆమోదించారు. సంబంధిత బడ్జెట్‌లో మొత్తం రాబడుల పద్దులో పై పేర్కొన్న మొత్తాన్ని చూపగా, మొత్తం ఖర్చుల రూపంలో రూ.168.41 కోట్లుగా నమోదు చేశారు. ఈ క్రమంలోనే రూ.23.09లను అంత్యనిల్వ (మిగులు)గా చూపారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ తులసీరామ్, డిఇ విజయకుమార్‌రెడ్డి, పలువురు అధికార, ప్రతిపక్ష, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.