చిత్తూరు

బాబు అవినీతి సామ్రాజ్యానికి చరమగీతం పలకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 20: ప్రజా, కార్మిక, విద్యార్థి, రైతు,మహిళ, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక విధానాలతో పాలన అందిస్తూ, అవినీతికి పట్టంకడుతున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాలనకు చరమగీతం పాడించేందుకు శంఖారావాన్ని పూరించి వైకాపాకు విజయలక్ష్మిని అందించి జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి వైకాపా నాయకులు, కార్యకర్తలు కార్యోన్ముఖులు కావాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్సా సత్యనారాయణ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వైకాపా ప్లీనరీ సమావేశం మంగళవారం స్థానిక పిఎల్‌ఆర్ కనె్వన్షన్ హాల్లో జరిగింది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన ఈసమావేశం మధ్యాహ్నం 3.30గంటల వరకు సాగింది. సుమారు మూడువేల మంది వైకాపా నాయకులు, కార్యకర్తలు, సమన్వయ కర్తలు సమావేశానికి హాజరయ్యారు. 6గంటలపాటు నిరాఘాటంగా సాగిన ఈ సమావేశానికి హాజరైన కార్యకర్తలు ఆద్యంతం వక్తల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. ప్లీనరీ సాగినంత సమయం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన ఎంత గొప్పగా సాగింది. చంద్రబాబు పాలన ఎంత అవినీతిమయమైంది, జగన్‌ను సిఎంను చేసేంత వరకు కార్యకర్తలు విశ్రమించకూడదన్న కోణంలో వక్తల ప్రసంగాలు సాగాయి. ముందుగా ప్లీనరీ సమావేశంలో ఉంచిన వై ఎస్ ఆర్ విగ్రహానికి అతిథులు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం సమావేశాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈకార్యక్రమానికి ప్రత్యేక అహ్వానితుడిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అబద్ధాలు చెప్పి అక్రమంగా అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. చట్టాలన్నా, రాజ్యాంగమన్నా చంద్రబాబుకు ఏమాత్రం నమ్మకం, విశ్వాసం, గౌరవం లేదన్నారు. ఈగాడి తప్పిన పాలన గాడిలో పడాలంటే వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమన్నారు. నాడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో తమకు ఎలాంటి కష్టం వచ్చినా రాజన్న ఉన్నాడనే ధీమాతో ప్రజలు సుఖంగా నిద్రపోయేవారన్నారు. అయితే నేడు చంద్రన్న ఉన్నాడనే భయంతో ప్రజలు కంటిమీద కునుకులేకుండా జీవిస్తున్నారన్నారు. ప్రజల్లో ఉన్న ఆ భయం పోవాలంటే రాజన్న పాలన రావాలని, అందుకు జగనన్న ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమన్నారు. అయితే ఈక్రమంలో టిడిపి పాలనలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వైకాపా కార్యకర్తలు ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్మును ఎలా దోచుకోవాలి, దాచుకోవాలి అన్న బాబు పాలనను ప్రజలు ఇప్పటికే ఛీకొడుతున్నారన్నారు. ఏ వర్గానికి చెందిన ప్రజలకు సమస్య తలెత్తినా మరుక్షణం వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. మూడు సంవత్సరాలపాటు ఎన్నో అవమానాలకు గురయ్యామని ఇక ఒక్క సంవత్సరం ఓపిక పడితే రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా సుపరిపాలన అందిస్తారన్నారు. రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు బాబు భారమయ్యాడని అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు జగన్ ముందుకు వచ్చినప్పుడే ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలను పరిష్కరిస్తోందని అన్నారు. లేకుంటే జనం ఇబ్బందులతో అల్లాడుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలను దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరో ధ్యాస లేకుండా పోయిందని ఆరోపించారు. తమది రాజకీయ పార్టీ అని అందుకే అధికారపార్టీ తప్పులను ఎత్తిచూపుతూ, అడుగడుగునా ప్రశ్నిస్తూ, ప్రజల బాధలపై స్పందిస్తున్నామన్నారు. తమది సన్యాసుల పార్టీ కాదని, అలా అయితే హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకునేవారమన్నారు. బాబు పుణ్యమా అని రైతులకు నేడు రుణాలు కూడా లభించడంలేదన్నారు. విద్యార్థులు, కార్మికులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సి వస్తోందని తెలిపారు. బాబు చెబుతున్నట్లుగా రాయలసీమకు నీరందిస్తే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ప్రభుత్వం దానిని ఎందుకు ఆపలేకపోతోందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో జగన్ సిఎం అయితేనే వైఎస్‌ఆర్ పాలన వస్తుందని అందుకే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి టిడిపిని ఓడించాలని పిలుపునిచ్చారు. విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు బాబు భయపడుతున్నారని ఈసందర్భంగా బొత్స ఆరోపించారు. ఈ భూ కుంభకోణానికి సంబంధించిన రికార్డులు హుద్‌హుద్ తుఫాన్‌లో కొట్టుకుపోయాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ విచారణ అయితే ఆలస్యమవుతుందని, అందుకే సిట్ వేశామని చెప్పడం అబద్ధమన్నారు. ఈభూ కుంభకోణంలో స్వాహా చేసింది, అరిగించుకునింది అంతా టిడిపి వారేనని, వారిపేర్లు బయటపడకుండా ఉండేందుకే సిట్ చేత దర్యాప్తు చేయిస్తున్నారన్నారు. బాబు పాలనలో గత మూడేళ్ళుగా అనేక ఇబ్బందులకు, కష్టాలకు గురైన కార్యకర్తలు ఇక ఒక్క సంవత్సరం ఓపికపడితే త్వరలోనే ఎన్నికలు వస్తాయని అందులో జగన్‌ను సిఎం చేసే దిశగా ప్రతి ఒక్కరు పాటు పడాలన్నారు. జగన్ నాయకత్వంలో వైఎస్ పాలన ఏపిలో వస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉండవచ్చని చెప్పారు. వైకాపా జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణ స్వామి అధ్యక్షతన జరిగిన ఈకార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపి వరప్రసాద్, ఎమ్మెల్యేలు రవీంద్రరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతలరామచంద్రారెడ్డి, సునీల్, ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డితోపాటు నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
జిల్లాలో ఇద్దరు ఎస్పీలు బదిలీ

చిత్తూరు/తిరుపతి, జూన్ 20: జిల్లాలో ఇద్దరు ఎస్పీలు బదిలీ జరిగింది. చిత్తూరు ఎస్పీ ఘటమనేని శ్రీనివాస్, తిరుపతి అర్బన్ ఎస్‌పి జయలక్ష్మిని బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఎస్పీ శ్రీనివాస్, ఎఎస్పీ అభిషేక్ మహంతీలను ప్రభుత్వం బదిలీ చేసింది. చిత్తూరు జిల్లా ఎస్పీగా రాజశేఖర్‌ను, తిరుపతి అర్బన్ ఎస్‌పిగా విజయరావును నియమిస్తూ మంగళవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాలో ఎస్పీ శ్రీనివాస్ మూడు సంవత్సరాలు పని చేశారు. ఇటీవల ఆయనకు డిఐజిగా పదోన్నతి లభించింది. ఈ మూడు సంవత్సరాల కాలంలో జిల్లాలో సిపిఓ వ్యవస్థకు శ్రీకారం చుట్టి దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. అలాగే ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టి పలువురి బడా స్మగ్లర్లను అరెస్టు చేయడంలో కీలక పాత్ర వహించారు. అలాగే పోలీసు వ్యవస్థలో పలు సంస్కరణలు చేపట్టారు. చిత్తూరు ఎఎస్‌పిగా ఉన్న అభిషేక్ మహంతీని పద్నోన్నతి కల్పించి గుంటూరు ఎస్‌పిగా ప్రభుత్వం నియమించింది. ఇదిలావుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపుజిల్లా పర్యటనకు వస్తున్న నేపధ్యంలో ఇద్దరు ఎస్పీల బదిలీ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికే వార్డు దర్శిని
* కమిషనర్ హరికిరణ్ వెల్లడి
తిరుపతి, జూన్ 20: నగర ప్రజలకు వౌళిక వసతుల కల్పనలో ఎక్కడా రాజీ పడకుండా వారి వద్దకు అధికారులను పంపించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా వార్డు దర్శిని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ హరికిరణ్ తెలిపారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, 103, వాట్సాప్, గ్రీవెన్స్‌సెల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. ఇందులో భాగంగా లక్ష్మీపురం, శివజ్యోతి నగర్, అక్కారంపల్లి రోడ్డు, లీలామహల్ సర్కిల్, కొర్లగుంట మెయిన్ రోడ్డు, భవానీ నగర్ సర్కిల్, ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్, గాలివీధి, మిట్టవీధి, తీర్థకట్టవీధి, బాలాజీకాలనీ, ఎం ఆర్ పల్లి సర్కిల్, ఆటోనగర్, సత్యనారాయణ పురం వార్డుల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అక్కడికక్కడే సమస్యలను పరిష్కరించారు. ఈకార్యక్రమంలో వార్డుదర్శిని ప్రత్యేక అధికారులు బాలాస్వామి, గుణశేఖర్, సేతుమాధవ్, రమేష్, మాధవ నాయుడు, సుబ్బరావు, చిట్టిబాబు, రమణయ్య డి.సుబ్బారావు, నాగేంధ్రప్రసాద్, సానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్స్‌పెక్టర్లు పాల్గొన్నారు.

జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతాం
* మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి వెల్లడి
రేణిగుంట, జూన్ 20: చిత్తూరు జిల్లాను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అమరనాథరెడ్డి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం విమానాశ్రయ సమీపంలోని సెల్‌కాన్ కంపెనీని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ రాయలసీమను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని, ఇందులో భాగంగా కర్నూల్ జిల్లాలో భారీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను బుధవారం ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారని, అదేవిధంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలను కలుపుతూ అనేక కొత్తకొత్త పరిశ్రమలను స్థాపించేందుకు కృషిచేస్తున్నారని, తిరుపతి చుట్టుపక్కల ఎలక్ట్రానిక్ హబ్‌గా, శ్రీ కాళహస్తిని పరిసర ప్రాంతాలను పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దేదిశలో భాగంగా తొట్టంబేడు వద్ద సిరామిక్ కంపెనీకి శంకుస్థాపన చేస్తున్నారని, అదేవిధంగా 22న సెల్‌కాన్ మొబైల్ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి క్లోస్టర్-2 పనులను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందుగా సెల్‌కాన్ కంపెనీ కర్మాగారంను మంత్రి అమరనాథ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, అర్బన్ ఎస్పీ జయలక్ష్మి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాస్, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు శ్రీ్ధర్‌వర్మ, సెల్‌కాన్ వైస్ చైర్మన్ నరసింహన్ పరిశీలించారు.

జెసి దివాకర్‌రెడ్డి విషయంలో మీడియాపైన మండిపడ్డ సిఎం రమేష్
రేణిగుంట, జూన్ 20: టిడిపి ఎంపి జెసి దివాకర్‌రెడ్డి విమానాశ్రయంలో అక్కడి ఉద్యోగుల పట్ల అనుసరించిన తీరుపై అడిగిన ప్రశ్నలకు టిడిపి రాజ్యసభ సభ్యుడు మీడియాపై మండిపడ్డ సంఘటన జరిగింది. మంగళవారం కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజుతో కలిసి సిఎం రమేష్ రేణిగుంట విమానాశ్రయంకు వచ్చారు. ఈసందర్భంగా అక్కడ ఉన్న విలేఖరులు జెసి దివాకర్‌రెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని కేంద్రమంత్రిని ప్రశ్నించారు. అందుకు ఆయన సమావేశం దాటవేశారు. అదే సమయంలో కారులో ఉన్న ఎంపి సిఎం రమేష్ జోక్యం చేసుకొని మీ ఛానెల్ పేరేమిటని ఆ విలేఖరిని ప్రశ్నించారు. స్టూడియో ఎన్ అని చెప్పడంతో మీలాంటి వారిని చాలా మందిని చూశానని, పై వారితో మాట్లాడుకుంటానంటూ ఆ విలేఖరిపై రుసరుసలాడారు. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా టిడిపి జిల్లా అధ్యక్షుడిగా మీ వర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించాలనుకున్నారు కదా.. మంత్రి గంటా శ్రీనివాస్‌కు సంబంధించిన వ్యక్తిని అధ్యక్షుడ్ని చేయడం పట్ల మీ అభిప్రాయం ఏమిటని కేంద్రమంత్రి గజపతిరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడానికి తిరస్కరించి రోడ్డుమార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్లారు
అందరికీ యోగ అనుసరణీయం

తిరుపతి, జూన్ 20: మన పూర్వీకులు మనకందించిన మహా సంపద యోగ అని, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు సంపూర్ణ ఆరోగ్యం కోసం నిత్యం యోగ చేయడం మంచిదని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ అన్నారు. తిరుపతి పిరమిడ్ స్పిర్చువల్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎస్వీ హైస్కూల్ క్రీడామైదానంలో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని తిరుపతి పిరమిడ్ స్పిర్చువల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మర్షి పత్రీజీ, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎన్ టి ఆర్ వైద్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి, సొసైటీ చీఫ్ ప్యాట్రన్ భీమాస్ రఘు, మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల లక్ష్మయ్యలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నతనం నుంచి యోగ అభ్యసించడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని అన్నారు. కనీసం రోజుకు ఒక గంట సేపైనా యోగ చేయాలనికోరారు. బ్రహ్మర్షి పత్రీజీ మాట్లాడుతూ మనిషి ఉన్నతికి యోగ, ధ్యానం దోహదం చేస్తాయన్నారు. ఒకప్పుడు మన దేశానికే పరిమితమైన యోగ నేడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని ప్రసాదించే స్థాయికి గుర్తింపు పొందిందన్నారు. చివరికి ఐక్యరాజ్య సమితి సైతం యోగ ప్రాధాన్యత గుర్తించడంతో నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.యోగాతోపాటుగా ధ్యానం కూడా చేయాలని వివరించారు. డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ సంపూర్ణ మానసిక, శారీరక ఆరోగ్యానికి ఇది దోహదం చేస్తుందన్నారు. కేవలం ఒక్కరోజు చేసి ముగించడం కన్నా జీవితాంతం దినచర్యగా యోగాను చేయాలని సూచించారు. తిరుపతి పిరమిడ్ స్పిర్చువల్ సొసైటీ అధ్యక్షులు కంచిరఘురామ్ మాట్లాడుతూ బుధవారం ఉదయం 6.30 నుంచి 8గంటల వరకు యోగ, ధ్యానంతో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇందులో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో ఆర్.కుప్పుస్వామి, సంగీతబాబు, సురేంద్రకుమార్, బసవయ్య, సుమతి, రవి, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

రేపు జిల్లాలో సిఎం పర్యటన
తిరుపతి, జూన్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం ఉదయం 10.30 గంటలకు కడప విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం వద్ద ఏర్పాటుచేసిన 100 అడుగుల ఎత్తున్న భారీ జాతీయ జెండా పోస్టును ఆవిష్కరిస్తారు. అనంతరం 11 నుంచి 11.25 గంటల మధ్య సెల్‌కాన్ ఇంపాక్స్ ప్రై లిమిటెడ్‌ను ప్రారంభిస్తారు. 11.30 గంటలకు బహరంగ సభలో పాల్గొంటారు. 11.30 నుంచి 12.30 గంటల వరకు పారిశ్రామిక వేత్తలతో, స్థానిక వ్యాపార వేత్తలతోసమావేశమై ప్రసంగిస్తారు. అక్కడనుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి తొట్టంబేడు మండలం లింగం నాయుడుపల్లి గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.15 గంటలకు సిరామిక్‌క్లస్టర్, ఖజారియాబాత్‌వేర్ ప్రై లిమిటెడ్, క్లోరియా సిరామిక్స్ ప్రై లిమిటెడ్, సుధా సోమాని సిరామిక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు శంఖుస్థాపనచేస్తారు.అనంతరం పారిశ్రామిక వేత్తలతో జరిగే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.అక్కడ నుంచి హెలిక్యాప్టర్‌లో రేణిగుంట విమానాశ్రయం చేరుకొని మధ్యాహ్నం 2.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేకవిమానంలో గన్నవరం బయలుదేరి వెళ్తారు.

మరణంలోను వీడని అనుబంధం

* ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
* అన్నదమ్ములు దుర్మరణం * ఒకరి పరిస్థితి విషమం

బి.కొత్తకోట, జూన్ 20 : బి.కొత్తకోట మండలం సూరపువారిపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. బి.కొత్తకోట ఎస్‌ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తంబళ్లపల్లె మండలం బోడికిందపల్లెకు చెందిన రామలింగారెడ్డి, ప్రమీలకు ఇద్దరు కుమారులు. వారిలో వినోద్‌కుమార్‌రెడ్డి (24) డిగ్రి పూర్తిచేసి ఇంటి వద్ద ఉంటున్నాడు. రెండవ కుమారుడు దిలీప్‌కుమార్ (22) విజయవాడలో సిఏ చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ ఇటీవల తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లివచ్చారు. తిరుమల ప్రసాదం తన చిన్నాన్న మధుసూదన్‌రెడ్డికి ఇచ్చేందుకు బి.కొత్తకోట మండలం సురపువారిపల్లెకు ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. అక్కడి నుంచి చికెన్ తీసుకురావడానికి అన్నదమ్ములిద్దరు తమ చిన్నాన్న కుమారుడు గోకుల్‌కుమార్ (13) ముగ్గురు కలిసి బి.కొత్తకోటకు వెళ్లారు. అక్కడ చికెన్ కొనుగోలు చేసి తిరుగు ప్రయాణంలో సురపువారిపల్లెకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే దిలీప్‌కుమార్, వినోద్‌కుమార్ దుర్మరణం చెందారు. గోకుల్‌కుమార్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరుకు తీసుకెళ్లారు. మదనపల్లె రూరల్ ఇన్‌చార్జి, ములకలచెరువు సిఐ రుషికేశవ, బి.కొత్తకోట ఎస్‌ఐ మల్లికార్జుననాయుడు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి డ్రైవర్ శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రభాకర్, ఆర్టీవో పరిశీలించారు. ఒకే కుటుంబంలో ఇద్దరు కుమారులు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.