చిత్తూరు

హాఫ్ మారథాన్‌కు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 16: స్వచ్ఛ తిరుపతి కోసం ఆదివారం తిరుపతిలో నిర్వహించిన హాఫ్ మారథాన్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. దాదాపు 7వేల మంది యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ఎస్వీయూ తారకరామా క్రీడామైదానం నుంచి ఉదయం 5గంటలకు 21కె పరుగు, 5.30 గంటలకు 10కె పరుగు, 7గంటలకు 5కె పరుగు ప్రారంభమయ్యాయి. స్పోర్ట్స్ అథారిటి 21కె పరుగును ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రారంభించగా, 10కె పరుగును టిటిడి సివిఎస్‌ఓ రవికృష్ణ, తిరుపతి అర్బన్ జిలా ఎస్పీ అభిషేక్ మహంతి, 5కె రన్‌ను చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తాము కూడా మారథాన్‌లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి వీడియో లైవ్ ద్వారా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మారథాన్ పరుగులను నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం, విజయవాడ, ఇప్పుడు తిరుపతి నగరాల్లో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజల భాగస్వామ్యం అభినందనీయమన్నారు. స్వచ్ఛతే సేవ కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పరిశుభ్రతతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోవాలని పేర్కొన్నారు. పరుగుల అనంతరం 21కె విజేతలకు కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి ఎంపి వరప్రసాద్, మున్సిపల్ కమిషనర్ హరికిరణ్, సబ్ కలెక్టర్ నిషాంత్ కుమార్‌లు బహుమతులు ప్రదానం చేశారు. 21కె రన్‌లో వరుసగా మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.10వేలు, రూ.7500, రూ.5వేలు బహుమతి అందించారు. 18-35 సంవత్సరాల పురుషుల విభాగం కిరణ్, కోలరాజు, దాదాసాహెబ్‌లు మొదటి మూడుస్థానాల్లో నిలువగా మహిళా విభాగంలో వి.నవ్య, రాజశ్రీ, స్వర్ణలతలు నిలిచారు. అలాగే 35-45 సంవత్సరాల పురుషుల విభాగంలో శివానంద శెట్టి, జగన్‌రెడ్డి, వేంకటేశ్వరరావులు, మహిళా విభాగంలో భగవతి, దీపిక, సువర్ణలు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచారు. 45 సంవత్సరాలు పైబడిన పురుషుల విభాగంలో శ్రీనివాసరావు, దశరత్, టాటాబాబు, మహిళా విభాగంలో భబిత, దుర్గ, రీనారాయ్‌లు తొలి మూడు స్థానాల్లో నిలిచారు. బహుమతుల ప్రదానం అనంతరం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ హ్యాపి సండే కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించిన నేపథ్యంలో నెలకు ఒకసారైనా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. డిప్, ఎన్‌ఇబి సంస్థల సహకారం, మీడియా ప్రోత్సాహం, పోలీస్‌శాఖ రూట్ మ్యాప్, భద్రత ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ నరసింహయాదవ్, ఎస్వీయూ విసి ఆచార్య దామోదరం, ఎన్‌టిఆర్ వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. హాఫ్ మారథాన్ సందర్భంగా ఎస్వీయూనివర్శిటీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం విద్యార్థులు తమ నృత్యాలతో ఆకట్టుకున్నారు. ఉత్సాహాన్ని నింపారు. డప్పుల మోత మధ్య ఆద్యంతం అందరినీ ఆకట్టుకునేలా ప్రదర్శనలు ఇచ్చారు.