చిత్తూరు

పారదర్శక పాలన టిడిపి లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, సెప్టెంబర్ 18: రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో పారదర్శక పాలన అందించడం టిడిపి లక్ష్యమని మంత్రి అమరనాధ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా సోమవారం కొంగాటం పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో వారు విస్తృతంగా పర్యటించారు. ఈసందర్భంగా కొంగాటం గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మండలంలో రాజకీయాలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి అభిమతం మేరకు లబ్ధి చేకూర్చడం లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందించే లక్ష్యంతో ఈకార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గ్రామాల్లో రేషన్ కార్డులు, పక్కా గృహాలు, ఫించన్లు అందించాలని అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఈకార్యక్రమం పూర్తి అయిన వెంటనే లబ్దిదారులకు తప్పక లబ్ధి చేకూర్చుతామని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఐదు రెట్లు అధికంగా లబ్ధి చేకూర్చిందని తెలిపారు. తమ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 165 కోట్ల రూపాయలు జిల్లా వ్యాప్తంగా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద అందించామన్నారు. మహిళలు, రైతులు, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం తరపున అభివృద్ధిలో అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈకార్యక్రమంలో నేతలు ఎంపిపి సులోచన రంగనాద్, జడ్పిటిసి నాగవేణి, వైస్ ఎంపిపి గోపినాద్, చౌడప్ప, ఎఎంసి మాజీ చైర్మన్ రామచంద్రనాయుడు, ఆర్‌వి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకే యువజనోత్సవ పోటీలు

చిత్తూరు, సెప్టెంబర్ 18: మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకే యువజనోత్సవాలను నిర్వహిస్తూ, యువజనులకు పలు సాంస్కృతిక కార్యక్రమాలపై పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ వెల్లడించారు. సోమవారం స్థానిక పివికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెట్విన్ ఆధ్వర్యంలో చిత్తూరు డివిజన్ స్థాయి యువజనోత్సవాలను నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు తొలుత జ్యోతి ప్రజల్వన చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. సెట్విన్ సిఇఓ ఎడి జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పి చైర్‌పర్సన్ మాట్లాడుతూ ప్రస్తుతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ఆదరణ కరువవుతోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి సెట్విన్ ఆధ్వర్యంలో తరచూ యువజనులకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళల మేళవింపుతో ఉండే కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారని వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న చిత్తూరు ఎంపి డాక్టర్ ఎన్ శివప్రసాద్ మాట్లాడుతూ కళలపై మక్కువ ఉన్న కళాకారులు తప్పకుండా ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు. ఇందుకు ఉదాహరణగా తనతో పాటు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తీసుకోవచ్చన్నారు. తాను కళాశాలలో చదివేటప్పుడు ‘పరువుకోసం’ అనే నాటికలో చంద్రబాబుతో పాటు తానూ నటించి విద్యార్థులను అలరించామని గుర్తు చేశారు. అలా కళలు నమ్ముకున్నందునే తామిద్దరం ఈ స్థాయికి చేరుకున్నామని వివరించారు. యువత సైతం చదువుతో పాటు కళలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అల్లరి ముద్దుగానే ఉంటుందని, అయితే అదే అల్లరి హద్దు మీరితే ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. తాను కేంద్ర మంత్రి అయినా కూడా కళలను, సినిమాలను వదిలి పెట్టబోనని స్పష్టం చేశారు. తన దేహంలో శక్తి సామర్థ్యాలు ఉన్నంత వరకు కళాకారుడిగానే ఉంటూ కళలను బతికించేందుకు తన వంతు సహకారం అందజేస్తానని హామి ఇచ్చారు. ఈ క్రమంలోనే యువత కోరిక మేరకు మహాత్మాగాంధీ ( బాపు ), ముఖ్యమంత్రి చంద్రబాబు ( బాబు ) లపై ఎంపి తానే స్వయంగా రచించిన ఓ పద్యాన్ని పాడి విద్యార్థులను ఉర్రూతలూగించారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కఠారి హేమలత మాట్లాడుతూ యువతలో చైతన్యం నింపిన స్వామి వివేకానందుని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేనినైనా మార్చే సత్తా ఒక్క యువతకు మాత్రమే సాధ్యమన్నారు. అయితే అదే యువత ప్రతి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా తమ జీవితాన్ని సుఖమయం చేసుకునేందుకు కష్టించాలన్నారు. నేటి యువత రాబోవు తరాలకు పునాది రాళ్లుగా ఉండాలే కాని, అందుకు విరుద్దంగా ఉండవద్దని హితవు పలికారు. ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ యువత సాంస్కృతిక కార్యక్రమాల వైపు తమ దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందన్నారు. చిన్నతనం నుంచే సంగీత సాధన చేస్తేనే మంచి కళాకారులుగా ఎదిగేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. భౌగోళికంగా జిల్లా చిన్నదైనా చిత్తూరు నాగయ్య, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, షణ్ముగప్రియ, శ్రీప్రియ లాంటి ఉత్తమ కళాకారులు ఉండటం జిల్లాకు గర్వకారణమన్నారు. విద్యార్థి జీవితం బంగారు యుగమని, విద్యార్థులు తమ విద్యార్థి జీవితంలోనే సంగీతం సప్త సముద్రాలను దాటిస్తున్న నానుడిని అర్థం చేసుకుని మంచి కళాకారులుగా ఎదిగేందుకు ప్రయత్నించాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురు యువజనులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కాగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షులు కఠారి ప్రవీణ్, పివికెఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆనందరెడ్డి, పెద్ద ఎత్తున విద్యార్థులు, యువజనులు తదితరులు పాల్గొన్నారు.

- టిప్పర్ బోల్తా పడి ఇద్దరు మృతి
రామకుప్పం, సెప్టెంబర్ 18: మండల పరిధిలోని చల్దిగానిపల్లి వద్ద కుప్పం-పలమనేరు జాతీయ రహదారిలో టిప్పర్ అదుపు తప్పి బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జాతీయ రహదారి విస్తరణ జరుగుతున్న తరుణంలో కుప్పం వైపు వస్తున్న టిప్పర్ బోల్తా పడడంతో డ్రైవర్ హిమామ్(35), శ్రీశైలం(39)లు అక్కడికక్కడే మృతి చెందారు. వీరు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సురేష్‌బాబు సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకొని మృతులను కుప్పం ఏరియా ఆసుపత్రికి పోసుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సమైక్యతాపురంలో రద్దుచేసిన పట్టాలు తిరిగి ఇవ్వాలి
నాగలాపురం, సెప్టెంబర్ 18: నాగలాపురం మండల కేంద్రంలోని సమైక్యతాపురంలో 750 మందికి ఇచ్చిన పట్టాలను రద్దు చేయడం తగదని, వాటిని వెంటనే తిరిగి లబ్ధిదారులకు ఇవ్వాలని తిరుపతి మాజీ ఎంపి చింతా మోహన్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన నాగలాపురం తహశీల్దార్ కార్యాలయం ముందు స్థానిక కాంగ్రెస్ నాయకులతోకలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులాలు, మతాలు తేడాలేకుండా నాగలాపురం మండల కేంద్రంలోని వ్యవసాయ క్షేత్రభూముల్లో సమైక్యతాపురంగా పేరుపెట్టి 750 మందికి పట్టాలు ఇప్పిస్తే, వాటిని అధికారులు ఎలా రద్దు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుతం ఉన్న అధికార పార్టీల వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన ఆరోపించారు. ఇకనైనా అధికారులు సమైక్యతాపురంలో రద్దుచేసిన పట్టాలను తిరిగి లబ్ధిదారులకు ఇవ్వకపోతే తమ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తానని ఆయన హెచ్చరించారు. అనంతరం హౌసింగ్ ఎఇ, ఉపాధి హామీ అధికారులతో ఆయన మాట్లాడారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేషాద్రి, జ్ఞానకన్ను, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీ రాధికను స్ఫూర్తిగా తీసుకోవాలి

చిత్తూరు, సెప్టెంబర్ 18: చిత్తూరు ఏఎస్పీ రాధికను పలువురు స్ఫూర్తిగా తీసుకోవాలని అనంతపురం రేంజి డిఐజి ప్రభాకర్‌రావు సూచించారు. సోమవారం రాత్రి చిత్తూరులో ఇటీవల రష్యాలోని ఎతైన ఎల్బృస్ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచ రికార్డు సాధించిన చిత్తూరు ఏఎస్పీ రాధికకు జిల్లా పోలీసు శాఖ అభినందన సభ నిర్వహించింది. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ జిల్లా పోలీసు అధికారులు తమ ఉత్తమ ప్రతిభతో పోలీసు శాఖకే ఖండాంతర ఖ్యాతి తెచ్చారని డిఐజి కొనియాడారు. రష్యాలో ఎత్తెన పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిగా రాధిక అరుదైన రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. ఇదివరకు చిత్తూరు ఎస్‌బి డిఎస్పీ రామ్‌కుమార్ ప్రంచస్థాయి పోలీసు ఫైర్ పోటీల్లో బంగారుపతకం సాధించడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ ఇద్దరు అధికారులతో చిత్తూరు జిల్లా పోలీసు శాఖకు ఖండాంతర ఖ్యాతి దక్కిందన్నారు. వీరిని అందురూ స్పూర్తిగా తీసుకోవాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ పర్వతారోహణ సాహసంతో కూడు కొన్నదన్నారు. చిత్తూరు ఏఎస్పీ రాధిక ఒక మహిళాగా ప్రంచంలోనే అనేక ఎతె్తైన పర్వతాలును అధిరోహించడం నిజంగా గొప్ప విషయన్నారు. ఇటీవల వరుసగా జిల్లా పోలీసులు రెండు అరుదైన రికార్డులు సాధించి జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని తెలిపారు. జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ మహిళలు ఆనుకొంటే దేనినైనా సాధించ వచ్చనని ఏఎస్పీ రాధిక నిరూపించిందన్నారు. నిత్యం వత్తిడితో కూడు కొన్న పోలీసు శాఖలోఒక పక్క విధులు నిర్వహిస్తూ, మరో పక్క పర్వతారోహణలో ప్రపంచ రికార్డు సాధించడం నిజంగా గొప్ప విషయమన్నారు. రాధికను మరి కొందరు ఆదర్శంగా తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎమ్మెల్సీ రాజసింహులు, ఎమ్మెల్యే సత్యప్రభ, చిత్తూరు మేయర్ కఠారి హేమలత, పలువురు పోలీసు అధికారుల పాల్గొన్నారు. అనంతరం జిల్లా పోలీసు శాఖ తరుపున ఎఎస్పీ రాధికను ఘనంగా సన్మానించారు.

హత్య కేసులో మరో నిందితుడు అరెస్టు

చిత్తూరు, సెప్టెంబర్ 18: చిత్తూరునగరంలోని అంబేద్కర్ నగర్‌లో ఇటీవల హత్యకు గురైన లారీ ఓనర్ శ్రీనివాసులు కేసులో మరో నిందితుడైన బాబూలాల్‌ను అరెస్టు చేసినట్లు చిత్తూరు టూ టౌన్ సిఐ వెంకటప్ప సోమవారం తెలిపారు. సిఐ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, నగరంలోని అంబేద్కర్ నగర్‌లోశ్రీనివాసులు లారీతో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతని భార్య లక్ష్మి సమీపంలోని ఉన్న బాబూలాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీంతో భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు చోటుచేసుకునేవి. ఈ నేపధ్యంలో ఈ నెల 11వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాసులును అతని భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు బాబూలాల్ కలిసి సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేసారు. ఈ కేసులో ఇప్పటికే లక్ష్మిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న బాబూలాల్‌ను సోమవారం అరెస్టు చేసినట్లు సిఐ తెలిపారు.
వచ్చే నెలలో తిరుపతిలో రాష్ట్ర స్థాయి హస్తకళల మేళా
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడి

చిత్తూరు, సెప్టెంబర్ 18: వచ్చెనెల రెండవ తేదీన తిరుపతిలో రాష్ట్ర స్థాయి హస్తకళల మేళా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ఈ మేళా ఏర్పాట్లపై టూరింజం శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ హస్తకళా మేళా రెండు రోజుల పాటు జరగాలని, ఇందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు, తిరుమల స్వామివారి ప్రాధాన్యతకు అద్దంపట్టెలా ఏర్పాట్లు ఉండాలన్నారు. చిత్తూరు జిల్లా హస్తకళల కళాకారుల ఉత్పత్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇందుకోసం వేదికను త్వరగా ఎంపిక చేసి, పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అధికారులంతా సమన్వయంతో పని చేసి ఈ మేళాను విజయవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు టూరిజం శాఖ అధికారులు పాల్గొన్నారు.
బిసి మంత్రిత్వశాఖ కోసం ఎంపిలు డిమాండ్ చేయాలి
తిరుపతి, సెప్టెంబర్ 18: బిసి సబ్‌ప్లాన్, ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుకు పార్లమెంట్‌ను బిసి ఎంపీలు స్తంభింపజేయాలని, దీనిపై పార్లమెంట్‌లో నోరెత్తని ఎంపిలను రోడ్లపై తిరగనీయమని ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు హెచ్చరించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు బిసిలకు రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించలేదని అన్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి రాజ్యాధికారంలో వాటి కల్పించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుందని చెప్పారు. చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడితే ఇది సాధ్యమవుతుందని, ఇందుకు ప్రతి ఒక్కరు కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 56 శాతం ఉన్న బిసిలకు దేశంలోని 18 రాష్ట్రాల నుంచి ఒక్క ఎంపిలేరన్నారు. 2550 బిసి కులాల నుంచి ఇప్పటి వరకు ఒక్కరుకూడా పార్లమెంట్‌లోకి అడుగుపెట్టలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో బిసిలకు రాజ్యాంగబద్ధ హక్కుల కోసం మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించనున్నట్లు కేసన శంకరరావు తెలిపారు. అస్సోంలో బోడోలను, రాజస్థాన్‌లో గుజ్జర్లను, శ్రీలంకలో తమిళ ఈలం తరహాలో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిరుపతిలో బిసి సంక్షేమ సంఘం పొలిట్ బ్యూరో సమావేశం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరుగుతుందని వివరించారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బిసిల రిజర్వేషన్లను 34 నుంచి 50శాతానికి పెంచి రాజ్యాంగ బద్దత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన 56 శాతానికి పెంచాలని, బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం రూ.20వేల కోట్లు కేటాయించాలన్నారు. బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బిసి యాక్ట్‌ను తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యాంగ బద్దత కల్పించాలని, బిసిల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై క్రిమిలేయర్‌ను తొలగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో బిసిలకు పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్, ఫీజుల రీయంబర్స్‌మెంట్ స్కీం విధానాన్ని శాచురేషన్ పద్ధతిలో ప్రవేశపెట్టాలన్నారు. సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. విలేఖరుల సమావేశంలో బిసి జెఏసి చైర్మన్ నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆదిశేషు, కార్యదర్శి ఆల్మెన్‌రాజు, తుమ్మిడి రాంకుమార్, చిన్నరెడ్డెప్ప, బోజరాజు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.