చిత్తూరు

తిరుపతి రైల్వే స్టేషన వద్ద వ్యక్తి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 14: నిత్యం గోవిందనామ స్మరణలతో ఆధ్యాత్మిక చింతన విరాజిల్లుతున్న తిరుపతి పుణ్యక్షేత్రం హత్యలకు నిలయంగా మారుతోంది. వారం రోజుల వ్యవధిలో పట్టపగలు రెండు హత్యలు జరగడంతో నగర ప్రజలు ఉలిక్కిపడుతున్నారు. ఊహించని ఈ పరిణామాలకు పోలీసులు కూడా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఈనెల 9వ తేదీన పెద్దకాపు లే ఔట్‌లో ఓ కసాయి కొడుకు కిరాయి హంతకులతో తండ్రిని చంపించి పోలీసులకు పట్టుబడ్డ విషయం పాఠకులకు విదితమే. ఈ దారుణ సంఘటన మరువకముందే తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద శనివారం మోహన్ అనే జీపు డ్రైవర్ పట్టపగలుహత్యకు గురైయ్యాడు. రెండు రోజుల క్రితం మోహన్ రెడ్డి ఆయన వర్గం మరి కొందరు జీపు డ్రైవర్లతో ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో శనివారం జీపు డ్రైవర్ల సంఘం పెద్దలు గోవిందరాజ స్వామి వారి కోనేరు కట్టపై పంచాయతీ నిర్వహించారు. ఈ సమయంలో ఒక్కసారిగా మోహన్ రెడ్డి ప్రత్యర్థి వర్గం పెద్దల సమక్షంలోనే దాడికి దిగారు. అదే సమయంలో ఆ వర్గంలోని ఓ డ్రైవర్ కత్తి తీసుకుని మోహన్ రెడ్డిని పొత్తికడుపుపైన మరికొన్ని చోట్ల పొడిచాడు. దీంతో మోహన్ రెడ్డి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్త్రావంతో నేలపై పడి మోహన్ బాధతో దొర్లాడు. అయితే ఏ ఒక్కరు కూడా ఆయన్ను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయకుండా పేక్షకపాత్ర వహించారు. ఆదే సమయంలో కత్తిపోట్లకు గురై రోడ్డుపై ఉన్న మోహన్‌ను చూసి మరి కొందరు పరుగులు తీశారు. మోహన్ కత్తిపోట్లకు గురైన విషయాన్ని తెలుసుకున్న ఆయన భార్య, అత్త అక్కడకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ మోహన్‌ను కాపాడండంటూ అక్కడున్నవారిని వేడుకున్నారు. ఈక్రమంలో కొంత సమయం తరువాత మోహన్‌ను కొంత మంది ఆటోలో వేసుకుని రుయాకు తరలించే ప్రయత్నం చేశారు. తీవ్ర రక్తస్త్రావానికి గురైన మోహన్ మార్గమధ్యంలో మృతి చెందాడు. ఇదిలావుండగా మోహన్ ఒక హత్యకేసులోను, ఒక ఘర్షణ కేసులోను నిందితుడుగా ఉన్నాడు. ఈనేపథ్యంలో అతనిపై ఈస్ట్‌పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా ఓపెన్ చేసి ఉన్నట్లు తెలిసింది. ఏదేమైనా పట్టపగలు, కంటి ముందు ఓ వ్యక్తిని అతిదారుణంగా పొడిచినప్పటికి అడ్డుకునేవారు లేకపోవడం, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం గమనిస్తే మానవత్వం లేదనడం కన్నా తమపై రౌడీ మూకలు దాడి చేస్తారన్న భయం కనిపించింది. ఇటువంటి ఘటనలతో తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉంటున్న ప్రజలు భయం గుప్పిట్లో కొట్టుమిట్టాడుతున్నారన్న విషయం తెలుస్తోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే పోలీసులు రౌడీ మూకలపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు.
చెట్టును ఢీకొన్న కారు: ఒకరు మృతి
* ఇద్దరికి గాయాలు
రొంపిచెర్ల, అక్టోబరు 14: మండలంలో బండకిందపల్లె-మట్లోళ్ళపల్లె మధ్య జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం కర్నాటకకు చెందిన ఆల్టో 800 కారు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలోకారు డ్రైవర్ దీపక్(28) మృతిచెందగా కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు గాయపడ్డారు. వివరాల మేరకు. కర్నాటక రాష్ట్రం చిక్‌బళ్ళాపూర్ తాలూకాకు చెందిన నల్గురు యువకులు కెఎ 40 ఎం 6612 నెంబరు కారులో శుక్రవారం తిరుమలకు వెళ్ళారు. అక్కడ మొక్కులు తీర్చుకుని, శ్రీవారిని దర్శించుకుని శనివారం కారులో స్వగ్రామానికి బయలుదేరారు. బండకిందపల్లె స్టేజి రాగానే డ్రైవర్ నిద్రమత్తులో కారు నడపడంతోకారు ముళ్ళ పొదల్లో కొంత దూరం వెళ్ళి చెట్టును బలంగా ఢీకొంది. ఈదుర్ఘటనలో నందిహిల్స్ సమీపంలో ఎలువల్లి గ్రామానికి చెందిన కారుడ్రైవర్ దీపక్, నందగుడికి చెందిన మంజేష్, నాయనహళ్ళికి చెందిన మోహన్ గాయపడ్డారు. తీవ్రంగా గాయపడి కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ దీపక్‌ను అతికష్టం మీద బయటకు తీశారు. ఇతనితోపాటు గాయపడిన మరో మరో ఇద్దరిని ఆటోలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్సకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డ్రైవర్ దీపక్ మరణించాడు. గాయపడి ఇద్దరికి వైద్యులు చికిత్సలు చేశారు. కారు ప్రమాదం గురించి గాయపడిన వారి కుటుంబాలకు పోలీసులు సమాచారం అందించారు. దీపక్ మృతదేహాన్ని పోస్టుమార్టుం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరితోపాటు కారులో ప్రయాణిస్తున్న రంజిత్ ఎలాంటి దెబ్బలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈదుర్ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఎస్సై రహీముల్లా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి కూలీల కడుపుకొట్టిన వైకాపా ఎంపిలు
* టిడిపి ఆధ్వర్యంలో నిరసన, రాస్తారోకో
నాగలాపురం, అక్టోబర్ 14: రోజూ ఉపాధి హామీ పనికి వెళ్లి వారం వారం ఏదో వచ్చిన కొంత డబ్బులను కూలీలు కూలి రూపంలో తీసుకొని జీవనం సాగిస్తూంటే ఆ కూలీలను కూడా రాకుండా వైకాపా ఎంపిలు అడ్డుకట్ట వేయడంతో ఉపాధి కూలీలు వీధిన పడ్డారని ఆరోపిస్తూ శనివారం నాగలాపురం మండలం అచ్చమనాయుడుకండ్రిగ గ్రామ సమీపాన చెన్నై-పుత్తూరు బైపాస్ రోడ్డుపై టిడిపి నాయకులు యాచంద్రనాయుడు, మురళి ఆధ్వర్యంలో ఉపాధి కూలీలతోకలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యాచంద్రనాయుడు, మురళిలు మాట్లాడుతూ ఉపాధి కూలీలు జీవనం కోసం ఉపాధి హామీ పథకంలో పనులు చేసుకుంటూ ఉంటే ఆ పనుల్లో అవినీతి జరుగుతుందని తప్పుడు ప్రచారం చేసి ఎంపిలైన వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కేంద్రానికి లేఖలు రాయడంతో ఈ లేఖపై ఉపాధి కూలీలకు గత 4 నెలలుగా తాముచేసిన పనులకు బిల్లులు రాకుండా ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. ఉపాధి కూలీలు తాము చేసిన పనులకే బిల్లులు తీసుకుంటున్నారే తప్ప అవినీతి అక్రమాలకు ఎక్కడా పాల్పడలేదని వారు అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక వైకాపా నాయకులు తప్పుడు ప్రచారాలు ఆరోపిస్తుండటం సరైన పద్ధతి కాదని ప్రజల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి నిరంతరం కృషిచేస్తున్నాడని వారు అన్నారు. ఇకనైనా వైకాపా నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడకుండా పేదల కడుపుకొట్టకుండా అభివృద్ధికి సహకరించి కూలీలకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోసుమారు గంటకు పైగా చెన్నై-పుత్తూరు వెళ్లే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

టిడిపికి చేతగాకే నిధులు నిలుపుదల
* టిడిపి బండారం బయటపడుతుందనే ప్రతి పక్షంపై విమర్శలు:పెద్దిరెడ్డి
పుంగనూరు, అక్టోబర్ 14: టిడిపి చేతగాని తనంతోనే ఉపాధినిధులు కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేసిందని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం ఆయన పుంగనూరులోని నక్కబండలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధినిధులు దుర్వినియోగం గురించి కేంద్ర ప్రభుత్వానికి తెలిసి ఉపాధి నిధులు నిలుపుదల చేయడంతో టిడిపి బండారం బయటపడుతుందనే కారణంతోనే జగన్‌పై నోరు పారేసుకుంటున్నారని విమిర్శంచారు. నీరు-చెట్టు పథకం పేరుతో టిడిపి కార్యకర్తలకు కట్టబెట్టి ఉపాధి నిధులు మొత్తం దుర్వినియోగం చేస్తున్నది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. గత జూలై నెలలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులు నిలుపుదలపై రాష్ట్రానికి లేఖ రాశారని తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూలీలు వలస పోకూడదనే కారణంగా ఉపాధి పథకం ప్రవేశ పెట్టిందన్నారు. ప్రస్తుతం బిజేపి ప్రభుత్వం కూడా ఆ పథకాన్ని కొనసాగిస్తుందని అన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుంటలు, చెరువులు నిండి కట్టలు తెగిపోతున్నాయని తెలిపారు. నీరు-చెట్టు పనులు సక్రమంగా నిర్వహించుంటే కట్టలు ఎలా తెగిపోతాయన్నారు. ఉపాధి నిధులు దోచుకుని పనుల్లో నాణ్యత లేకుండా బిల్లులు పెట్టుకుని నగదు మొత్తం దోచేస్తున్నారన్నారు. నిధులు దోచేసిందే కాక తమపై కుట్రలుచేసి ఉపాధి నిధులు తమపార్టీ నేతలు కేంద్రానికి లేఖరాసి నిలుపుదల చేశారని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సొమ్ము ఒకరిది సోకు ఒకరిదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉపాధి పథకం కింద కేంద్రం నిధులిస్తే మనరాష్ట్రంలో చంద్రబాబు సిసిరోడ్లు వేసి చంద్రన్న బాట అని పేరుపెట్టుకోవడం కేంద్రానికి తెలిసి నిధులు నిలుపుదల చేశారన్నారు. మీరు తప్పు చేయకపోతే కేంద్రంను నిలదీయండి రాష్ట్రంలో పేదలు ఆకలితో అలమటిస్తున్నారని నిలదీయండి. తమకు నిధులు విడుదల చేయండి అంటు పోరాడండి అన్నారు. టిడిపి ఎంపిలు ఇద్దరు మంత్రులుగా ఉన్నారని వారిచేత రాజీనామా చేయించి నిధులు విడుదల చేయాలని డిమాండు చేయండి తెలిపారు. అవి చేతకాక తమ పార్టీపై ఎందుకు పడుతున్నారన్నారు. మోది ఏమన్నా మేము చెప్పినట్లు వింటున్నారనా అని ప్రశ్నించారు. టిడిపి అవినీతి గురించి మోదికి తెలుసు కాబట్టే నిధులు విడుదల చేయలేదన్నారు. కేంద్రం పేరు పెట్టకుండా మీరు పేరు పెట్టుకుని నిధులు దుర్వినియోగం చేసి వారి వద్ద నోరు మెదపకుండా మాపై నిందలు వేయడం సరికాదన్నారు. ఈకార్యక్రమంలో ఎంపిపి నరసింహులు, జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్, నాయకులు నాగరాజరెడ్డి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.
చంద్రగిరిలో రాష్టస్థ్రాయికి కబడ్డీ పోటీలు ప్రారంభం
* క్రీడాస్పూర్తితో ఆడాలి:గీర్వాణి *బాబుతో కలిసి ఈ పాఠశాలలోనే చదువుకున్నా :ఎంపి శివ ప్రసాద్
చంద్రగిరి, అక్టోబర్ 14: చంద్రగిరి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రాష్టస్థ్రాయి 63వ ఎపి స్కూల్ గేమ్, 14 సంవత్సరాల బాలబాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలను జడ్పి చైర్మన్ గీర్వాణి చంద్రప్రకాష్, ఎంపి శివప్రసాద్ ఈ పోటీలను ప్రారంభించారు. కబడ్డీ చాంపియన్‌షిఫ్ పోటీలకు గాను 13 జిల్లాల నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలు హాజరైనారు. క్రీడాకారులను ఉద్దేశించి ఎంపి శివప్రసాద్ మాట్లాడుతూ తాను ఇదే పాఠశాలలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి చదువుకున్నానని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పాఠశాల అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడూ ముందుంటానని ఆయన అన్నారు. అనంతరం పాఠశాల మైదానం ప్రహరీగోడ నిర్మాణానికి సంబంధించి రూ.5లక్షల నిధులను మంజూరుచేయవలసిందిగా జడ్పి చైర్మన్ గీర్వాణిని కోరారు. అనంతరం జడ్పి చైర్‌పర్సన్ గీర్వాణి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడాస్ఫూర్తితో క్రీడలు ఆడాలని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వానికి ఉపయోగపడతాయని తెలిపారు. క్రీడామైదానంలో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టి రూ.5 లక్షలను మంజూరుచేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఎగురవేసి క్రీడాకారులను పరిచయం చేసుకొని క్రీడలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి కేశవయ్య, ఎంపిపి కుసుమకుమారి, ఎంపిటిసిలు బుజ్జి, మస్తాన్, సర్పంచ్ ఉమామహేశ్వరి, శేఖర్, సుబ్రహ్మణ్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.

వరద తీవ్రత4ను పరిశీలించిన కలెక్టర్
శాంతీపురం, అక్టోబర్ 14: కుప్పం నియోజకవర్గంలో గత కొంత కాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో వరద తీవ్రతను శనివారం జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న అధికారులతో కలసి పర్యటించి పరిశీలించారు. శాంతీపురం మండల పరిధిలోని పాలారునది పరివాహక ప్రాంతంలో పాటు పోడూరు గ్రామం వద్ద వరద తాకిడికి కొట్టుకుపోయిన జాతీయ రహదారిని పరిశీలించారు. పది రోజుల్లో ఐదు సార్లు తాత్కాలిక రహదారి కొట్టుకు పోవడంతో ఆర్‌అండ్‌బి అధికారు వైఫల్యంపై అసహనం వ్యక్తం చేస్తూ కల్వర్టు నిర్మాణానికి ఇనుప పైపులు వాడి రహదారిపై రాకపోకలను త్వరితగతిన పునరుద్దరించాలని ఆదేశించారు. అనంతరం శివరామపురం, కంగుంది సమీపంలోని పాలారు నది ప్రవాహాన్ని పరిశీలించి వంతెనపై వాహనాల ప్రయాణానికి వీలు కలుగుతుందేమో పరిశీలించాలని సూచించారు. అనంతరం కుప్పంలోని పలు చెరువుల ముంపు ప్రాంతాలను పరిశీలించి అధిక వర్షాల కారణంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని వీలైతే ముంపు బాధితుల తరలింపునకు కృషి చేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బి డిఇ విజయకుమార్, ఇరిగేషన్‌శాఖ డిఇ, శాంతీపురం, కుప్పం మండలాల ఎంపిడిఒలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
యువకుడిపై దాడి
*పరిస్థితి విషమం
మదనపల్లె, అక్టోబర్ 14: పాతకక్షల కారణంగా ఓ యువకుడిపై దాడి చేసిన సంఘటన నిమ్మనపల్లె మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిమ్మనపల్లె ఎస్‌ఐ హారిప్రసాద్ కథనం మేరకు నిమ్మనపల్లె మండలం, మూష్ఠురు పంచాయతీకి చెందిన రెడ్డెప్ప కుమారుడు కుర్రా రెడ్డిశేఖర్ (26) అదే గ్రామానికి చెందిన ఆండే ఖాదర్‌వలీ కుమారుడు గౌస్‌పీర్ మధ్య అంతర్గాత కక్షలు కొనసాగుతున్నాయి. అయితే అదే గ్రామానికి చెందిన మహాబూబ్ బాషా, నిమ్మనపల్లెకు చెందిన మంజునాథ, రెడ్డిశేఖర్ నలుగురు స్నేహితులు. రెడ్డిశేఖర్ వృత్తిరీత్యా కారు డ్రైవర్. గత ఆదివారం మూష్ఠురు పంచాయతీ, దిగువపల్లె సమీపంలోని కొమ్మిరెడ్డిగారిపల్లె సమీమంలో రెడ్డిశేఖర్, గౌస్‌పీర్ ఇద్దరు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో గౌస్‌పీర్ ఎదురు కర్రాతో రెడ్డిశేఖర్ తలపై బాదాడు. అక్కడికక్కడే కుప్పకూలిన రెడ్డిశేఖర్‌ను మంజునాధ్, మహాబూబ్ బాషా నిమ్మనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి రెఫర్ చేశారు. తిరుపతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కోమాలో చికిత్స పొందుతున్నాడు. భార్య మహాలక్ష్మి, బంధువులతో కలిసి శనివారం మదనపల్లె డిఎస్పీని ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు నిమ్మనపల్లె ఎస్‌ఐ తెలిపారు.

ప్రజాస్వామ్యంలో పార్టీలదే హవా
* వైకాపా అధికారంలోకి వస్తే దుగరాజపట్నం, గాలేరు-నగరి తెస్తా * తిరుపతి ఎంపి వరప్రసాద్ స్పష్టం
తిరుపతి, అక్టోబర్ 14: రాజకీయమంటే అదోక పవిత్రమైన వేదికని అయితే ప్రస్తుత రాజకీయాలను ప్రజలను అసహ్యించుకుంటున్నారని ఇందులో ఉన్నవారు ప్రజాద్రోహులు, గుండాలు అనే అభిప్రాయంలో ఉన్నారని ఎంపి వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఎంపి పాల్గొని మాట్లాడుతూ తన జీవితాశయం రాజకీయమేనని అన్నారు. ప్రజా సేవ చేయాలన్న సమున్నత ఆశయంతో తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు.ప్రస్తుత రాజకీయ నాయకులు దేశంలో జిడిపి పెరుగుతోంది, అభివృద్ధి జరుగుతోందని చెబుతున్న మాటలను ఆయన ఖండించారు. అభివృద్ధి కేవలం ఒక్క వైపు జరగడం సరికాదని, కింది నుంచి అభివృద్ధి జరిగి సమానంగా సాగాలని అన్నారు. తాను ఎంపి అయ్యాక పార్లమెంట్ నియోజక వర్గపరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో సొంత కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తున్నానని అన్నారు. ఇప్పటి వరకు వివిధ సమస్యలపై తక్షణం పరిష్కారం చేశానన్నారు.పార్లమెంట్‌లో తన హాజరు శాతం 87శాతంగా ఉందని, 90 సార్లు తాను మాట్లాడానని తెలిపారు. 90 మందికి పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధులు అందేలా చేశానన్నారు. తిరుపతి రాయల్ చెరువు రోడ్డులోని రైల్వేగేటు వద్ద ఆర్వోబి నిర్మించడానికి చేసిన ప్రయత్నంలో గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు బ్రిడ్జ్ నిర్మాణం వస్తోందని ఇందువల్ల వాహన సేవలకు అంతరాయం ఏర్పడుతుందని అన్నారు. అయితే దీనిని కూడా అధిగమించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తిరుపతికి షిర్డీ రైలు, తిరుచానూరు రైల్వే స్టేషన్ ఏర్పాటు, అదనంగా మూడు రైళ్లు రావడానికి కృషి చేశానన్నారు. త్వరలోనే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి సింగపూర్, మలేషియా, దుబాయ్‌ల నుంచి విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయన్నారు. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోను ఆగదని అన్నారు. దీని నిర్మాణానికి కృష్ణపట్నం ఓడరేవు అడ్డని చెప్పడం బావ్యం కాదన్నారు. చెన్నయ్‌లో కేవలం 8 కిలో మీటర్ల పరిధిలోనే మూడు ఓడరేవులు ఉన్న విషయం మరిచి పోరాదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దుగరాజపట్నం ఓడరేవును పూర్తి చేస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లాకు, తిరుపతికి తాగునీరు, సాగునీరు సమస్య లేకుండా ఎస్ ఎస్ కెనాల్, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పారు. ప్రపంచంలోనే భారత దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని అయితే ఇక్కడ రాజకీయ పార్టీలదే హవా నడుస్తోందన్నారు. చివరికి ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం స్వతంత్రంగా మాట్లాడలేని పరిస్థితి ఉందన్నారు. వారు ఏం మాట్లాడాలో అది కూడా పార్టీలే నిర్ణయిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో పలు సమస్యలపై తాను ప్రభుత్వానికి లేఖలు రాస్తే కనీస స్పందన లేదని ఆయన ఆవేధన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకం కింద పనులను మిషన్లు పెట్టి చేస్తూ, కూలీల చేత పనిచేయించినట్లు చూపిస్తున్నారన్నారు. ఎంపి లేఖ ఇస్తే 30శాతం పనులు ఇస్తారన్నారు. వారికి కనీస వేతనాలు ఇవ్వడంలేదన్నారు. కంచె ఐలయ్య దళితుడు కాదని, ఆయన దళితులకు అన్యాయం జరిగితే మాత్రం సహించడని అన్నారు. సమానత్వం కోసం ఆయన పోరాడుతున్నారని తెలిపారు. ఈవిషయంలో తమ పార్టీ జోక్యం చేసుకోదని ఎంపి వరప్రసాద్ స్పష్టం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్ రెడ్డి, సుబ్రమణ్యంలు పాల్గొన్నారు.

కిడ్నాప్ కేసులో ఐదుగురు అరెస్ట్
వాల్మీకిపురం, అక్టోబర్ 14: జల్సాలకు అలవాటుపడిన విద్యార్థులు సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నాప్ మార్గం ఎంచుకున్నారు. మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి కథనం మేరకు వైఎస్‌ఆర్ కడప జిల్లా సంబేపల్లికి చెందిన ఆనందరెడ్డి అతని స్నేహితులు చంద్రగిరికి చెందిన యశ్వంత్, చిన్నమండ్యంకు చెందిన సాయిప్రతాప్‌రెడ్డి, తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డికి చెందిన బాలరాజు బిటెక్ వరకు చదివారు. వీరు చెడు వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాందించేందుకు కిడ్నాప్‌లకు పాల్పడ్డారు. ఈకోణంలో వీరికి కలకడ మండలం కోన గ్రామానికి చెందిన డ్రైవర్ రామాంజులు పరిచయం అయ్యాడు. వీరు కిడ్నాప్ పథకం తెలపడంతో కోన గ్రామానికి చెందిన రాజన్న (75) రిటైర్డ్ ఉపాధ్యాయుడిని కిడ్నాప్‌చేస్తే చాలా డబ్బులు వస్తాయని తెలడపడంతో ఆనందరెడ్డి తన స్నేహితులతో కలిసి ఈనెల 4న కోన గ్రామానికి వెళ్లి బొప్పాయి తోటను కోనుగోలు చేస్తాం అని చెప్పి ఇండికాకారులో రాజన్నను తీసుకుని వెళ్లారు. రాజన్నను కిడ్నాప్ చేశామని రూ. 5లక్షలు చెల్లించి నీతండ్రిని తీసుకెళ్ళాలని అతని కొడుకుకు సమాచారం ఇవ్వడంతో అతను భయపడి పోలీసులకు విషయం తెలిపాడు విషయం తెలియ పోవడంతో కిడ్నాపర్‌లు రాజన్నను వదిలివెళ్లిపోయారు. ఈమేరకు కలకడ ఎస్‌ఐ చాంద్‌బాషా కేసు నమోదుచేశారు. సిఐ శ్రీ్ధర్‌నాయుడు ఆదేశాల మేరుకు విచారణ చేపట్టిన పోలీసులు నిందితులు యర్రావారిపాళెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో తలదాచుకున్నట్లు గుర్తించి శనివారం ఉదయం వారిని అరెస్ట్‌చేశారు. ఈసందర్భంగా వారి వద్దనుండి కారు, కత్తులు, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకన్నట్లు డిఎస్పీ తెలిపారు. కేసును త్వరితగతిన చేదించిన ఎస్‌ఐలు వెంకటేష్, చాంద్‌బాషాలను డిఎస్పీ అభినందించారు. ఈసమావేశంలో సిఐ శ్రీ్ధర్‌నాయుడు, వాల్మీకిపురం, కలకడ ఎస్‌ఐలు పాల్గొన్నారు.