చిత్తూరు

రాష్ట్రంలో కురబ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, అక్టోబర్ 17: ఉమ్మడి రాష్ట్రంలో 90 లక్షల జనాభా కలిగిన కురబ కులస్తులు, ఆంధ్రప్రదేశ్‌లో 40 లక్షలు కురబ కులస్తులు ఉన్న జనాభాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏటా బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించి ఆర్థికంగా చేయూతనివ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర కురబ కులస్తుల సంఘం సమావేశం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం చౌడేశ్వరి కల్యాణ మండపంలో మంగళవారం ఉపాధ్యక్షుడు జబ్బల గాయిత్రీ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథులుగా కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి హెచ్‌ఎం రేవన్న, మాజీమంత్రి వర్తురు ప్రకాష్, కర్ణాటక ఎమ్మెల్యే బి బసవరాజు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రిటైర్డ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ కెజి కృష్ణమూర్తి, పెనుకొండ ఎమ్మెల్యే బికె పార్ధసారధి, కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం కృష్ణయ్య హాజరయ్యారు. ముందుగా స్థానిక మిషన్ కాంపౌండ్ నుంచి స్కూటర్ ర్యాలీ, రోడ్‌షో నిర్వహిస్తూ పట్టణం మీదుగా నీరుగట్టువారిపల్లె సమీపంలోని చౌడేశ్వరి కల్యాణ మండపం వరకు చేరుకుని సమావేశం నిర్వహించారు. ముందుగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ హరిహరరాయులు, బుక్కరాయుల పాలన నుంచి సత్యం, ధర్మం, నీతిమంతంగా కురబ కులస్తుల చిరునామా అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పెనుకొండ ఎమ్మెల్యే బికె పార్ధసారధి, తెలంగాణలో ఆర్ కృష్ణయ్య మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉన్నారని, కర్ణాటకలో 26మంది కురబ కులస్తులకు చెందిన ఎమ్మెల్యేలు ఉండగా, అందులో ఒకరు మంత్రిగా ఉన్నారని గుర్తుచేశారు. రానున్న 2019 ఎన్నికల్లో అధిక జనాభా కలిగిన కురబలకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అయితే కురబలు ఐక్యత చాటాలని పిలుపునిచ్చారు. కురబ కులస్తుడు ఏ పార్టీ నుంచి పోటీచేసినా అందరు కలసి గెలుపుకు కృషి చేయాలన్నారు. కాపుల ఓటు బ్యాంకుతో ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న ఎన్నికల్లో భయపడుతున్నారని, అదే భయం కురబలు ఐక్యతగా తిరుగుబావుటా వేస్తే అన్ని రాజకీయ పార్టీలలో భయం పుడుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బిసిలలో చైతన్యం తీసుకువచ్చి, నాయకత్వం కలిగిన కులసంఘాల నేతలను ముందుకు నడిపించే దిశగా కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే పార్ధసారధి మాట్లాడుతూ ఐకమత్యమే మహాబలమని, శాసించేదిశగా కురబ కులస్తులు ముందడుగు వేయాలన్నారు. ఏ పార్టీలో అయినా టిక్కెట్ రావాలంటే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులై ఉండాలని, కురబ కులస్తులు ఎక్కువ జనాభా కలిగిన నియోజకవర్గాలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్నారు. కర్ణాటక మాజీమంత్రి మాట్లాడుతూ 2019లో ఏపిలో వైకాపా, టిడిపి పార్టీల పరిస్థితి, తెలంగాణలో కెసిఆర్ పరిస్థితి కూడా తెలియనిస్థితిలో ఉందన్నారు. ఏపి సీఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్ బిజెపితో కలసిపోయారన్నారు.
దేశభాషలందు తెలుగులెస్స
* కర్నాటక మంత్రి రేవన్న
దేశభాషలందు తెలుగులెస్స, తెలుగుబాషలో తీపి గురుతులు, తియ్యని పదాలు, పలకడానికి వినసొంపుగా ఉంటాయని కర్ణాటక రాష్ట్ర రవాణాశాఖ మంత్రి హెచ్‌ఎం రేవన్న అభివర్ణించారు. ఏపి రాష్ట్ర కురబ సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కర్నాటక మంత్రి మాట్లాడారు. దేశవ్యాప్తంగా కురబలను ఓబిసిలుగా గుర్తింపు తీసుకువచ్చింది బిసి సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య కృషి నేటికీ మరవలేనిదన్నారు. పెనుగొండ ఎమ్మెల్యే బికె పార్థసారధి తనతో పాటు చిన్నప్పుడు బెంగళూరులో ఉంటూ చదువుకునే వారని గుర్తుచేసుకున్నారు. ఒకే కులానికి చెందిన వారు కావడం, తాను మంత్రిగా ఎదగడం, పార్థసారధికి అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు. ఏపి కురబ సంఘం సమావేశానికి రావడం, మీ అందరితో ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఏపి కురబ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడారు. చిన్నచిన్న కులాలకు సైతం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నారని, ఏపిలో 40లక్షల జనాభా కలిగిన కురబల ఓటుతో అధికారం చేపట్టి, కురబలకు సైతం అవకాశం కల్పించాలని అడుక్కునే స్థితికి చేరుకుని, ప్రభుత్వం ఎదుట భిక్షమెత్తుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన ప్రాంతం తిరుమల-తిరుపతి దేవస్థానం స్వామివారికి అత్యంత భక్తులు కనకదాసు విగ్రహాన్ని తిరుమల క్షేత్రంలో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యఅతిథులకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కురబ కులసంఘం నాయకులు, రాష్ట్ర నలుమూలల నుంచి అధికసంఖ్యలో కురబ కులస్తులు పాల్గొన్నారు.

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి
* జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు ఘన నివాళి

చిత్తూరు, అక్టోబర్ 17 : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు కొనియాడారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం చిత్తూరు పోలీసు హెల్త్ సెంటర్‌లో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అమరవీరుల ఆశయ సిద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో పోలీసులు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలోని 64 పాఠశాలలను దత్తత తీసుకొని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రజలు ప్రశాతంగా ఉండే విధంగా పోలీసుశాఖ అన్ని చర్యలు తీసుకుందన్నారు. సమాజ సేవలో పాలుపంచుకుంటున్న పోలీసులకు ప్రజలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాధిక, ఇతర పోలీసు అధికారులు, పోలీసులు, విద్యార్థులు, పాత్రికేయులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాలుపంచుకున్నారు.

వైకుంఠ ఏకాదశికి మెరుగైన ఏర్పాట్లు
* బ్రహ్మోత్సవ వాహన సేవల వేళల్లో మార్పుపై త్వరలో నిర్ణయం * టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడి
తిరుపతి, అక్టోబర్ 17 : వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా మెరుగైన ఏర్పాట్లు చేపడతామని టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఆయన వారాంతపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జెఇఓ శ్రీనివాసరాజు మాట్లాడుతూ డిసెంబర్ 29, 30 తేదీల్లో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల ఏర్పాట్లకు సంబంధించి రెండు నెలలకు ముందుగానే ప్రణాళికలు రూపొదించాలని అధికారులను ఆదేశించారు. ఇంజినీరింగ్, విజిలెన్స్ అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా క్యూలైన్లు నిర్వహించాలన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల సమయం మార్పు అంశంపై చర్చించారు. ఈ విషయంపై జీయర్ స్వాములు, ఆచార్య పురుషులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు, భక్తుల నుంచి వచ్చిన సూచనలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్‌ఎంఎస్ ప్రత్యేక హెల్ప్‌లైన్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గదులు పొందిన భక్తులకు ఏవైనా సమస్యలుంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేసి పరిష్కరించుకుంటారన్నారు. ఈ సమావేశంలో టిటిడి చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి, ఏఫ్‌ఏసిఏఓ బాలాజీ, ఎస్‌ఇ రామచంద్రారెడ్డి, విజిఓ రవీంద్రారెడ్డి, డిప్యూటీ ఇఓలు కోదండరామారావు, వేణుగోపాల్, హరీంద్రనాథ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

భక్తులకు టిటిడి ఇఓ, జెఇఓల దీపావళి శుభాకాంక్షలు
తిరుపతి, అక్టోబర్ 17: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి ఇఓ అనిల్‌కుమార్ సింఘాల్, జెఇఓలు శ్రీనివాసరాజు, పోలా భాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా దీపావళి పర్వదినాన్ని జరుపుకుంటారని పేర్కొన్నారు. అందరూ ధర్మమార్గంలో నడవడం ద్వారా శ్రీవారి కృపకు పాత్రులు కావాలన్నారు.

వేదాంతపురం థీం పార్కుకు ఆమోదం తెలిపిన తుడా బోర్డు సమావేశం
* తుడాకు 913 ఎకరాలు ఇవ్వడానికి అంగీకరించిన కలెక్టర్ ప్రద్యుమ్న
తిరుపతి, అక్టోబర్ 17: వేదాంతపురం థీం పార్కు అభివృద్ధికి తుడా బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. తుడా చైర్మన్ నరసింహయాదవ్ అధ్యక్షతన మంగళవారం తుడా బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తుడా వైస్ చైర్మన్ హరికిరణ్, సభ్యులు, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రాముడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ అడిషినల్ డైర్టెర్ సురేష్, తుడా కార్యదర్శి మాధవీలత పాల్గొన్నారు. తుడా పరిధిలోని తిరుపతి, చంద్రగిరి, ఆర్సీపురం, శ్రీకాళహస్తి, ఏర్పేడు ప్రాంతాలలో ప్రభుత్వ భూమి 913 ఎకరాలు అవసరాల నిమిత్తం కావాలని చైర్మన్ నరసింహయాదవ్ కోరారు. దీనిపై త్వరలోనే పరిశీలించి భూములు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. తుడా కమర్షియల్ కాంప్లెక్స్ లీజు పరిధి 9 సంవత్సరాలు దాటడంతో 15శాతం పెంచి మరో సంవత్సరానికి ఆమోదం తెలిపింది. 2018 మే నాటికి మొత్తం 60 షాపులు కాలపరిమితి పూర్తవుతున్నందున తరువాత వేలం పాట ద్వారా కేటాయింపులు చేయడానికి ఆమోదం తెలిపారు. టూరిజం అభివృద్ధి చేయనున్న ప్రాంతాలను తుడాకు అప్పగిస్తూ సమావేశం ఆమోదం తెలిపింది. శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, రేణిగుంటలను కలుపుతూ రింగ్‌రోడ్డు ఏర్పాటుకు తుడా ప్రతిపాదనల ఏర్పాటు వంటి వాటిపై ఈ సమావేశంలో చర్చించారు.

‘పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ ఆపార్ట్‌మెంట్ తరహా గృహాలు’
తిరుపతి, అక్టోబర్ 17: పట్టణ ప్రాంతాల్లో ఎన్టీఆర్ గృహాల నిర్మాణానికి సిద్ధంగా ఉండాలని జిల్లాలోని మున్సిపల్, కార్పొరేషన్ కమిషనర్లను మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాలవల్లవన్ ఆదేశించారు. మంగళవారం స్థానిక పద్మావతి అతిధిగృహంలో ఆయన జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహాలకు సంబంధించిన దరఖాస్తులను ఇప్పటికే ఆన్‌లైన్లో నమోదు చేసి ఉన్నారని, అర్హతలను పరిశీలించి జాబితాను సిద్ధంగా ఉంచాలని చెప్పారు. మున్సిపల్ పరిధిలో ఆదాయవనరులను పెంచకోవాల్సిన అవసరం ఉందన్నారు. అమృత్ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరికిరణ్, ఆర్జేడి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి కోసం శాశ్వత ప్రణాళిక: కలెక్టర్
తిరుపతి, అక్టోబర్ 17: జిల్లాలో తాగునీటి సమస్యకు శాశ్విత పరిష్కారానికి ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇందుకోసం రూ.1.180 కోట్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన గ్రామీణ నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్‌చీఫ్‌తో కిషోర్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నీటికి ఇబ్బంది లేదని, 15 లక్షల మందికి శాశ్వత తాగునీటి పరిష్కారానికి గ్రామీణ నీటిపారుదల శాఖ ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని చెప్పారు. మరో 6 నెలల పాటు తాగునీటికి ఇబ్బందులు ఉండవని ఈ సమయంలో ట్రీట్‌మెంట్‌ప్లాంటు, పైప్‌లైన్లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. హంద్రీ-నీవా జలాలు వచ్చే జనవరి లోపు జిల్లాకు అందుతాయని ఈ నీటిని చెరువుల్లో నింపేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఇ వేణు తదితరులు పాల్గొన్నారు.

ఎస్వీ గో సంరక్షణ ట్రస్టుకు రూ. 10లక్షలు విరాళం
తిరుపతి, అక్టోబర్ 17: టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెదిన యాదా ఉమామహేశ్వరి అనే భక్తురాలు రూ.10,00,011లను విరాళంగా అందించింది. మంగళవారం తిరుమలలోని జెఇఓ శ్రీనివాసరాజును ఆయన బంగ్లాలో కలసి ఈ మొత్తాన్ని డిడి రూపంలో అందజేశారు.

టిప్పర్ సహా 70 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి, అక్టోబర్ 17: తిరుపతి-మంగళం రోడ్డులోని గెస్ట్‌లైన్ డేస్ ఎదురుగా 70 ఎర్రచందనం దుంగలున్న ఏపి 21 యు 7155 నెంబరుగల టిప్పర్‌ను టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ ఐజి కాంతారావు ఆధ్వర్యంలో డిఆర్వో శ్రీనివాస్, ఎఫ్‌ఎస్‌ఓ నాగరాజులు మంగళవారం ఆకస్మికంగా దాడులు చేశారు. టిప్పర్ వద్ద ఉన్న స్మగ్లర్లు అధికారులను చూసి అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసి దొరకకుండా తప్పించుకున్నారు. వీరిని ఆర్‌ఎస్‌ఐ విజయ్ ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ సిబ్బంది వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. పరిసర ప్రాంతాల్లో స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను దాచి ఉంటారన్న అనుమానంతో విస్తృతంగా గాలిస్తున్నారు.

తిరుపతిలో పలు నేరాలకు పాల్పడ్డ పాత నేరస్థుడు అరెస్ట్
* రూ. 10 లక్షలు విలువచేసే బంగారు నగలు స్వాధీనం
తిరుపతి,అక్టోబర్ 17: తిరుపతిలో పలు నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న పాత నేరస్థుడు వంశీధర్ రెడ్డి(27)ని తిరుపతి క్రైం పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి రూ. 10లక్షలు విలువచేసే బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. క్రైం ఎఎస్పీ సిద్ధారెడ్డి, డిఎస్పీ పివి కొండారెడ్డిల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వంశీధర్ రెడ్డి అనేక నేరాలకు పాల్పడి పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడన్నారు. గతేడాది ఒక యువతిని తీసుకువచ్చి తారాక రామా నగర్‌లో ఇక ఇంటిలో కాపురం పెట్టాడన్నారు. ఈ క్రమంలో తిరుపతి-చంద్రగిరి మార్గమధ్యంలోని స్ట్ఫాక్వార్టర్స్ బస్ట్ఫా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను చేసిన నేరాలను అంగీకరించాడన్నారు. ఎస్టీవి నగర్, లక్ష్మీపురం, ఎస్‌బిఐ కాలనీల్లో చోరీలకు పాల్పడ్డాడని అన్నారు. ఈ సమావేశంలో సిఐ పద్మలత, కె.శరత్‌చంద్ర, అబ్బన్న, ఎస్‌ఐ నరసింహారెడ్డి, నరేష్, హెడ్‌కానిస్టేబుల్స్ సుధాకర్, రాజేంద్ర, దాము, శ్రీనివాసులు, పిసిలు అరుణ్‌కుమార్ రెడ్డి, మురళి, హరి, రామకృష్ణ, కామేశ్వరరవులు పాల్గొన్నారు. వీరికి రివార్డులు ఇస్తున్న డిఎస్పీ కొండారెడ్డి చెప్పారు.

బూట్‌పాలిష్ చేసి నిరసన తెలిపిన డివైఎఫ్‌ఐ
తిరుపతి, అక్టోబర్ 17: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని, నిరుద్యోగులకు భృతి, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యువకులు బూట్ పాలీష్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర మాట్లాడుతూ మోదీ, బాబులు హామీలతో నిరుద్యోగులను దారుణంగా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేళ్లు అవుతున్నా ఒక్క ఉద్యోగం ఇవ్వక పోవడం దారుణమన్నారు. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు సందీప్, సుమన్, నరేంద్ర, రోసయ్య, శరత్, జాఫర్ జీవన్ తదితరులు పాల్గొన్నారు.