చిత్తూరు

26న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 7: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈనెల 26న తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు టీటీడీ పీఆర్వో రవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాలకు ముందు మంగళవారం ఆలయ శుద్ధి నిర్వహించారు. ఈనెల 29న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 26వ తేదీ ఉదయం 6నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారన్నారు. ఇందులో భాగంగా గర్భాలయం, ఉప ఆలయాలు, పోటును శుద్ధి చేస్తారు. ఆలయ సిబ్బంది అత్యంత భక్తిశ్రద్ధలతో ఒక మహాయజ్ఞంలా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ తిరుమంజన ఉత్సవం కారణంగా అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారని తెలిపారు.

ఆన్‌లైన్లో టీటీడీ క్యాలెండర్లు, డైరీలు బుకింగ్ ప్రారంభం
తిరుపతి, డిసెంబర్ 7: టీటీడీ ముద్రించిన 2018 క్యాలెండర్లు, డైరీల ఆన్‌లైన్ బుకింగ్‌ను టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ స్థానిక టీటీడీ పరిపాలనా భవనంలో గురువారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాలు, ముఖ్య నగరాల్లో క్యాలెండర్లు, డైరీలను ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. పలువురు భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించామన్నారు. టీటీడీ క్యాలెండర్లు, డైరీలను ఆన్‌లైన్‌లో బుక్‌చేసి నూతన సంవత్సరం కానుకగా తమ బంధువులకు, స్నేహితులకు పోస్టల్ ద్వారా పంపే అవకాశాన్ని భక్తులకు కల్పించామన్నారు. టీటీడీసేవఆన్‌లైన్.కాం వెబ్‌సైట్‌లో పబ్లికేషన్స్‌ను క్లిక్ చేసి డెబిట్‌కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా ఆర్డరు చేయవచ్చని తెలిపారు. నిర్ణీత వ్యవధిలో క్యాలెండర్లు, డైరీలు భక్తులకు చేరేలా పోస్టల్ శాఖ చర్యలు చేపట్టిందన్నారు. క్యాలెండర్, డైరీలను చేర్చినందుకుగాను ఎంఆర్పీ ధరతోపాటు పోస్టల్ చార్జీలను భక్తులు చెల్లించాల్సి ఉంటుందని, లక్షమంది భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ తిరుపతి జేఈఓ పోలా భాస్కర్, ఎఫ్‌ఏసిఏఓ బాలాజీ, ఐటి విభాగాధిపతి శేషారెడ్డి, టీసీఎఫ్ ఐటీ నిపుణులు భీమశేఖర్, సత్య, పోస్టల్ సూపరింటెండెంట్ కె.శ్రీకుమార్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎం.డి.అబ్దుల్‌ఖాదర్, ఆర్‌ఎంఎస్ ఇన్‌స్పెక్టర్ కె.కృష్ణ పాల్గొన్నారు.

సైనికుల త్యాగ నిరతిని అందరూ స్మరించుకోవాలి
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపు

చిత్తూరు, డిసెంబర్ 7: సైనికుల త్యాగ నిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న పిలుపునిచ్చారు. గురువారం సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా పతాక నిధికి కలెక్టర్ విరాళాలను అందజేసారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి అత్యంత అమూల్యమైన సేవలు అందిస్తున్న సైనికులను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నిరంతరం దేశ భద్రత కోసం పాటుపడుతున్న సైనికులు సంక్షేమం కోసం అందురూ చేయూతనివ్వాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశ సంరక్షణ చాలెంజ్‌గా మారుతున్నదని, ఇలాంటి పరిస్థితుల్లో దేశ భద్రత కోసం పాటుపడుతున్న సైనికుల సేవల అమోఘమన్నారు. దేశం కోసం నిత్యం పాటుపడే సైనికులు త్యాగనిరతిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. దేశ సంరక్షణకు విశిష్ట సేవలు అందిస్తున్న సైనికులు సంక్షేమం కోసం దాతలు విరివిగా విరాళాలు ఇవ్వాలన్నారు. ఎస్‌సిసి క్యాడెట్లు సామాజిక సేవలు పలువురికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అనంతరం సాయుధ దళాలలో సేవలు అందించి మరణించిన వారి కుటుంబ సభ్యులైన సరస్వతి, జయశ్రీ, శాంతిలను, కార్గిల్ యుద్దంలో సేవలు అందించిన మాజీ సైనికుడు వినాయకరెడ్డిలను కలెక్టర్ సన్మానించారు. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా సైనిక సంక్షేమ అధికారి రమణమూర్తి పలువురు ఎస్‌సిసి క్యాడెట్లు, నగర ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో ర్యాలీ నిర్వహించారు.