చిత్తూరు

సంక్షేమం, అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి.కోట, డిసెంబర్ 14: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా వి.కోట పంచాయతీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. ఇందులో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగాజాబ్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడిదారులు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. దీనితో ఉపాధి అవకాశాలు పెరిగాయని, దానికి అనుగుణంగా యువత నైపుణ్యం పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన అవకాశాలు అందిస్తోందని, దీనితో వృద్ధిరేటు 11 శాతం సాధించామన్నారు. జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్‌గా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను స్థాపించనున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఇ స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. సుమారు 23 కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయి. అనంతరం ఖాజీపేటలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించారు. సీసీ రోడ్లు ప్రారంభించి వెలుగు గ్రూపు మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు. మిట్టూరు అంబేద్కర్ నగర్‌లో యువకులు పార్టీలోకి చేరారు. చివరగా వైఎస్సార్ కూడలి నుంచి లాంగ్ బజార్ మీదుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ కూడలిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. టీడీపీ బలోపేతానికి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సులోచన, ఎఎంసీ మాజీ చైర్మన్ రామచంద్రనాయుడు, నేతలు రంగనాథ్, రామకృష్ణ, సోము, రాంబాబు, డీఎస్పీ చౌడేశ్వరి, ఎంపీడీవో బాలాజీ, తహశీల్దార్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

టీటీడీలో నాల్గవతరగతి, జూనియర్ అసిస్టెంట్‌ల నియామకాలకు కృషి
* రోస్టర్‌ను పాటించి నియామకాలు జరపండి
* టీటీడీకి శాసనసభ ఎస్సీ కమిటీ ఛైర్మన్ టి.శ్రావణ్‌కుమార్ ఆదేశం
తిరుపతి, డిసెంబర్ 14: టీటీడీలో నాల్గవ తరగతి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల నియామకాలకు ప్రభుత్వం నుంచి తమవంతు ప్రయత్నం చేస్తామని, అయితే రోస్టర్‌ను పాటించి నియామకాలను చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభా షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ ఛైర్మన్ టి.శ్రావణ్‌కుమార్ ఆదేశించారు. గురువారం టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓలు పోలా భాస్కర్, శ్రీనివాసరాజు ఇతర ఉన్నతాధికారులతో శాసన సభా కమిటీ స్థానిక పద్మావతి అతిథి భవనంలో సమావేశమైంది. ఈ సందర్భంగా టీటీడీ భక్తులకు అందిస్తున్న సేవలు, ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రూరల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై సమీక్షించారు. ఈసందర్భంగా కమిటీ ఛైర్మన్ టి.శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ భక్తులకు సేవలు అందించడంలో ఏరోజుకారోజు సమస్యలను సరిదిద్దుకుంటున్న కారణంగా టీటీడీ అందిస్తున్న సేవలపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని, ఇది అభినందనీయమన్నారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుపై కొంతమంది నుంచి ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలించాలని ఈఓకు చెప్పారు. ఈసందర్భంగా ఈఓ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీలో 13,455 పోస్టులకు గాను 3,708 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. 2010లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఉద్యోగాల భర్తీని చేపట్టలేదన్నారు. గత పాలక మండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించి నియామకాలకు అనుమతి కోరుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు పేర్కొన్నారు. టీటీడీలో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ నియామకాల్లో కూడా రోస్టర్ పాయింట్ పాటిస్తున్నామని, ప్రస్తుతం శాశ్వత ఉద్యోగుల్లో 19.12శాతం మంది ఎస్సీలు ఉన్నారని అనిల్‌కుమార్ సింఘాల్ చెప్పారు. ఎస్వీభక్తిచానల్ ప్రత్యేక సంస్థ అయిన కారణంగా 2008లో జరిగిన నియామకాల్లో రోస్టర్ పాటించలేదని, ఇకపై జరిగే నియమాకాల్లో రోస్టర్ పాటించేలా రెజల్యూషన్ తీసుకువస్తామని చెప్పారు. ఇందులో 254పోస్టులకు గాను ముగ్గురు మాత్రమే ఎస్సీలు ఉన్నారని, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది 8855 మంది పనిచేస్తుంటే ఇందులో 1320 మంది ఎస్సీలు ఉన్నారని చెప్పారు. శ్రీవారి ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం 1320 పోస్టులకు రోస్టర్ విధానం పాటించరని కమిటీకి తెలిపారు. విద్యా సంస్థల్లో కాంట్రాక్ట్ నియామాకాలకు కూడా రోస్టర్ పాటించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ ఛైర్మన్ పదోన్నతుల విషయంలో తమకు అందిన మూడు అర్జీలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఈఓను ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఎం.వెంకటేశ్వరరావు, పి.నారాయణమూర్తి, కె.సంజీవయ్య, టి.జయరాములు, జి.దీపక్, టీటీడీ సిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ డిఎం శేషారెడ్డి, విద్యావిభాగం ఆఫీసర్ రామచంద్ర, డీపీపీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, పీఆర్వో రవి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా విద్యాశాఖ కార్యాలయ అటెండర్ శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్య
బి.కొత్తకోట, డిసెంబర్ 14: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న బి.శ్రీకాంత్ రెడ్డి బుధవారం రాత్రి బి.కొత్తకోటలోని తమ పొలం వద్ద ఉన్న గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. కడప జిల్లా జమ్మలమడుగులో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ 13 సంవత్సరాల క్రితం గుంతవారిపల్లెలో స్థిరపడ్డ వెంకటరెడ్డి కుమారుడు శ్రీకాంత్ రెడ్డి. గత ఏడాదిన్నర క్రితం వెంకటరెడ్డి విధుల నుంచి ఇంటికి వస్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. దీంతో అతని కుమారుడైన శ్రీకాంత్ రెడ్డికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో అటెండర్‌గా ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి చిత్తూరు డీఈఓ కార్యాలయంలో తన విధులు నిర్వహించుకుంటూ ఓగదిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. తరచూ తల్లి రమాదేవి వద్దకు వచ్చి వెడుతుండేవాడు. రమాదేవి గత ఐదు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న తన కుమార్తెకు ఆరోగ్యం సరిగాలేక పోవడంతో అక్కడకు వెళ్లింది. బుధవారం శ్రీకాంత్ రెడ్డి సొంత ఊరు గుంతలవారిపల్లెకు వచ్చాడు. రాత్రి వేళ సమీపంలోని తమ పొలం వద్దకు వెళ్లి అక్కడున్న గదికి ఫుల్ బాటిల్ మద్యం తీసుకువెళ్లాడు. అందులో సగం మద్యం సేవించాడు. అనంతరం సూసైడ్ నోట్‌రాసి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు శ్రీకాంత్ రెడ్డి కొంత మంది స్నేహితులకు సెల్‌ఫోన్‌లో మెసేజ్‌లుపెట్టాడు. ఈక్రమంలో అతని స్నేహితులు గురువారం సాయంత్రం ఆ గది వద్దకు చేరుకున్నారు. అప్పటికే ఆత్మహత్య చేసుకుని ఉండటం గమనించిన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని బెంగళూరులోవున్న అతని తల్లికి సమాచారం అందించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అమ్మా... నన్ను క్షమించు!
* నేను నాన్న దగ్గర ఉంటా... నువ్వు నాఫ్రెండ్స్ వద్ద ఉండు
* నీకే కష్టం వచ్చినా నేను వస్తా * సూసైడ్ నోట్‌లో శ్రీకాంత్ రెడ్డి అమ్మకు చివరి సందేశం
బి.కొత్తకోట, డిసెంబర్ 14: అమ్మా.. నన్ను క్షమించు. నేను బతికి చావలేను. నా తలలో ఏదో దూరింది. నా మానసిక స్థితి బాగాలేదు. తల పగిలిపోతుంది. నిన్ను బాధపెడుతున్నందుకు క్షమించు అంటూ బుధవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రభుత్వ విద్యాశాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి తన చివరి సందేశాన్ని తన తల్లి రమాదేవికి ఇచ్చాడు. సూసైడ్ నోట్‌లో శ్రీకాంత్ రెడ్డి రాసిన వివరాలు ఇలా ఉన్నాయి. నేను జాబ్‌లో చేరినప్పటి నుంచి హ్యాపీగా లేను. కొద్దిరోజులైతే అలవాటు పడవచ్చనుకున్నాను. కాని నావల్ల కావడంలేదు. నాన్న బతికున్నప్పుడు నేను ఇలా లేను. నా మనస్సు ఈ జీవితానికి అలవాటు పడలేదు. అమ్మా... ఫీలవ్వద్దు. నువ్వు హ్యాపీగా ఉండాలి. నీకు ఎటువంటి ఆపద వచ్చినా నేను వస్తాను. కానీ నీవు బాధపడకు. నేను ఇంకా బాధపడతా. నా ఆత్మకు శాంతి ఉండదు. డోంట్ వర్రీ అమ్మ... సారీ అమ్మ.. మిస్ యూ అమ్మ.. స్పెలింగ్ మిస్టేక్‌లుంటే క్షమించండి. ఎందుకంటే నేను తాగి రాస్తున్నాను. తాగడానికి కారణం చావడానికి ధైర్యం చాలకే... సంధ్యా... అమ్మను బాగా చూసుకో అంటూ తన సోదరికి కూడా తెలియజేశాడు. ఫ్రెండ్స్.. నన్ను క్షమించండి. నా చావుతో ఎవరికి సంబంధంలేదు. శ్రీకాంత్ రెడ్డికి విధి నిర్వహణలో ఎదురైన కష్టాలు ఏమిటో మాత్రం తన సూసైడ్ నోట్‌లో తెలియజేయలేదు. అయితే శ్రీకాంత్ రెడ్డి తల్లికి, సోదరికి, స్నేహితులకు రాసిన సూసైడ్ నోట్‌ను చదివిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. ఓవైపు ఏడాదిన్నర క్రితం భర్త మరణించి బిడ్డలను చూసుకుని జీవితాన్ని సాగిస్తున్న రమాదేవి, తల కొరివి పెట్టి పున్నామనరకం నుంచి విముక్తి కలిగిస్తాడనుకున్న కొడుకు శ్రీకాంత్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ తల్లి పడుతున్న వేదన వర్ణనాతీతంగా మారింది. కుమారుడి మరణవార్త తెలుసుకుని బెంగళూరు నుంచి వచ్చిన రమాదేవిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కాగా శ్రీకాంత్ రెడ్డి మరణ వార్తతో ఆగ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.