చిత్తూరు

ప్రత్యేక హోదా అజెండాతోనే కేంద్రం వద్దకు వస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 20: అఖరి క్షణంలోనైనా అఖిలపక్షంతో కేంద్రం వద్దకు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవడం ఆహ్వానించదగ్గ పరిణామమని, అయితే ప్రత్యేక హోదా అజెండాతో వస్తేనే తాము అఖిలపక్షం తరపున కేంద్రం వద్దకు వస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. స్థానిక బైరాగిపట్టెడలోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అడగటం కేంద్రం వద్ద భిక్షం ఎత్తుకున్నట్లేనన్నారు. అందుకే ప్రత్యేకహోదా కోసం కేంద్రాన్ని నిలదీయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమైతేనే తాము కేంద్రం వద్దకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సమయంలో పార్లమెంట్‌లోవున్న టీడీపీ ఎంపీలు నోరు మెదపలేదని, ఇప్పుడు ప్రజల నుంచి విమర్శలు పెరిగాక మాట్లాడుతున్నారన్నారు. దూరదృష్టివున్న బాబు తన స్వార్థం కోసమే ఇంతకాలం ఏమీ మాట్లాడలేదన్నారు. బీజేపీ నాయకుడు టీడీపీని వెంట్రుకతో పోల్చారని, అయినప్పటికీ టీడీపీ బీజేపీని పట్టుకుని వేలాడటం అవమానకరమన్నారు. బీజేపీ నేతలు టీడీపీని కాకుండా రాష్ట్ర ప్రజలను దూషించనట్లుగా తాము భావిస్తున్నామన్నారు. అటు తెలంగాణకు సైతం విభజన చట్టం హామీలు అమలుకాలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని దీనిపై రెండు రాష్ట్రాలు కలిసి కేంద్రంపై పోరాడాలని నారాయణ చెప్పారు. తమది నీతివంతమైన పాలన అని చెప్పుకుంటున్న మోదీ కాలంలోనే పారిశ్రామిక వేత్తలు రూ.7లక్షల 25వేల కోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయారన్నారు. కేవలం 2014-17 మధ్య కాలంలోనే ఈ మోసాలు జరిగాయని, దీనికి కేంద్రమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వేలకోట్లు స్వాహా చేసి దేశం నుంచి పారిపోయిన అదాని దావోస్‌లో ప్రధాని మోదీతో కలిసి ఎలా ఫొటో తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 10 కోట్లమంది పేదలకు రూ.5లక్షలు చొప్పున ఇన్స్యూరెన్స్ చేయడం వెనుక కూడా కార్పొరేట్ శక్తులకు మేలు చేయడమే అసలు రహస్యమన్నారు. ఒక్కో ఎంపీ నియోజక వర్గంలో 3 మెడికల్ కళాశాలలు పెట్టి, వాటికి అనుబంధంగా కార్పొరేట్ ఆస్పత్రులను నిర్మించి పేదలకు ఆ ఆస్పత్రుల్లో వైద్యం అందించేలా ప్రణాళికలు రచించారన్నారు. దీనికి బదులుగా పీహెచ్‌సీలను, ప్రభుత్వ ఆస్పతులను బలోపేతం చేస్తే పేదలకు సరైన వైద్యం అందుతుందన్నారు. ఈ దేశానికి పాకిస్థాన్ వల్లో, అమెరికావల్లో లేకుంటే టెర్రరిస్టుల వల్లో ప్రమాదం రాదని, దేశ ప్రధాని వల్లే ప్రమాదం పొంచివుందని నారాయణ ఆరోపించారు. ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక సీబీఐ, ఎన్నికల కమిషన్, ఆర్బీఐ ఇతర సంస్థలపై పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్‌పార్టీది రీటైల్ అవినీతి అయితే బీజేపీదీ హోల్‌సేల్ అవినీతి అని ఆయన ధ్వజమెత్తారు. కేరళ రాష్ట్రంలో ఏప్రిల్ 25 నుంచి జరుగనున్న సీపీఐ జాతీయ మహాసభల్లో ఈ పరిణామాలన్నింటిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని ఆయన చెప్పారు. సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ పార్టీ జిల్లా మహాసభలు చిత్తూరులో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ నాయకులు పెంచలయ్య, జె.విశ్వనాథ్‌లు పాల్గొన్నారు.