చిత్తూరు

రానున్న రోజుల్లో ఆటోమొబైల్, ఐటీ రంగాల్లో రాయలసీమదే అగ్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 22: రానున్న రోజుల్లో ఆటో మొబైల్, ఐటీ రంగాలకు రాయలసీమ కీలక కేంద్రంగా మారనుందని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. గురువారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీసిటీకి సమీపంలో ఉన్న మాదన్నపాల్యెం వద్ద 636 ఎకరాల విస్తీర్ణంలో ద్విచక్ర వాహనాల తయారీని హీరో మోటార్స్ ఏర్పాటు చేస్తోందన్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారన్నారు. రూ.3200 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ 2019 చివరి నాటికి 5లక్షల మోటార్ సైకిళ్లను తయారు చేయనుందన్నారు. 2020 నాటికి రెండోప్లాంట్‌ను రెండో దశతో కలిపి రూ.1600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానుందన్నారు. ఈ రెండు ప్లాంట్‌ల నిర్మాణాలు పూర్తయితే ఏటా 10లక్షల ద్విచక్రవాహనాలు తయారవుతాయన్నారు. 2025 నాటికి 18లక్షల మోటారు సైకిళ్లు ఉత్పత్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయన్నారు. ఇప్పటికే రూ. 22కోట్ల 83లక్షలతో కాంపౌండ్ వాల్ పనులు పూర్తయ్యాయన్నారు. అలాగే రూ.8.94 కోట్లతో రెండు లైన్ల బీటీ రోడ్డు విస్తరణ కూడా జరిగిందన్నారు. రూ.45 లక్షలతో అక్కడున్న కోదండరామ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.42.33లక్షలతో 33/11 కెవి హెచ్‌డి/ ఎల్టీ విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రూ.2.19 కోట్లతో 132కేవీ టవర్స్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తిరుపతిలో 150 ఎకరాల విస్తీర్ణంలో జియో సంస్థ పరిశ్రమను ఏర్పాటు చేయనుందన్నారు. జియో సంస్థ ప్రతినిధులు ఇప్పటికే స్థల పరిశీలన చేసి వెళ్లారన్నారు. జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపోలో టైర్ల పరిశ్రమకు శంకుస్థాపన చేశారని, వీటి పనులు వేగవంతంగా సాగుతున్నాయని, అనంతపురంలో కియో కార్ల పరిశ్రమ ప్రారంభం కానుందన్నారు. ఈక్రమంలో రానున్న కాలంలో పరిశ్రమలకు, ఐటీ హబ్‌గా రాయలసీమ నిలువనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కనకనరసారెడ్డి, టూరిజం ఆర్డీ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి తిరుపతి పుణ్యక్షేత్రంలో ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాలు
* 24న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్‌చే సత్సంగ్
* జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడి
తిరుపతి, మార్చి 22: ఆంధ్రప్రదేశ్‌కు ఆధ్యాత్మిక రాజధానిగా విరాజిల్లుతున్న తిరుపతిలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ప్రపంచ ఆధ్యాత్మికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. గురువారం స్థానిక గ్రాండ్ రిడ్జ్ హోటల్లో ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాల నిర్వహణపై ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 24వ తేదీన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్‌చే ధార్మిక సత్సంగ్, ముఖాముఖి ఉంటుందన్నారు. స్మార్ట్ సిటీగా ఉన్న తిరుపతిలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో ఆధ్యాత్మికత మరింతగా పెరుగుతుందని తెలిపారు. ఇలాంటి ఉత్సవాలు ప్రతి ఏడాది తిరుపతిలో నిర్వహిస్తే, తిరుపతి ఖ్యాతి ప్రపంచంలో మరింతగా ఇనుమడింపజేయవచ్చన్నారు. గత నవంబర్ మాసంలో క్రాఫ్ట్ మేళా, దీపావళి ఉత్సవాలను తిరుపతిలో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా తిరుపతి శిల్పారామంలో మూడు రోజులపాటు ప్రతి రోజు ఉదయం 7 నుంచి రాత్రి 8.30 గంటల వరకు యోగా, ధ్యానం కార్యక్రమాలు నిర్వహించబడతాయన్నారు. మహతి ఆడిటోరియంలో మూడు రోజులపాటు వర్క్‌షాప్, ప్యానెల్ చర్చలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రాచీన ఇండియన్ ఆస్ట్రానమీపై సదస్సులు ఉంటాయన్నారు. సంస్కృత విద్యాపీఠం వీసీ ఆచార్య ఎ.మురళీధర్ శర్మ, విశ్వధర్మ పీఠం అధ్యక్షుడు పీవీ అరుణాచలం, చికాగోకు చెందిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ అధ్యాపకుడు వంశీలు ప్రధాన వక్తలుగా ఉంటారన్నారు. మధ్యాహం 3 నుంచి 5గంటల వరకు, పని, హోంలైఫ్ సంతురణం, సంఘంలో మహిళ పాత్రపై గణిత శాస్త్రంలో యంగ్ సైంటిస్ట్ అవార్డు గ్రహీత విశ్రాంత ఆచార్యురాలు బి.మహేశ్వరి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి అరుణకుమారి ప్రసంగిస్తారన్నారు. ఈనెల 26న ఉదయం 11 నుంచి 1 గంట వరకు సేవ, ఆధ్యాత్మికతపై టీటీడీ భాగవతం ప్రాజెక్టు ప్రత్యేక అధికారి సముద్రాల లక్ష్మణయ్య, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ అధ్యాపకుడు వంశీల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 2నుంచి 4 గంటల వరకు భారతదేశం పెరుగుదల-సంఘర్షణపై తీర్మాణాలు, ఆధ్యాత్మిక పాత్ర అనే అంశంపై సదస్సులు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 4 నుంచి 5 గంటల వరకు భారతదేశపు వృద్ధిలో ఆధ్యాత్మిక పాత్ర అనే అంశంపై తనతోపాటు పీవీ అరుణాచలం, స్మిత్ ప్రసంగిస్తారన్నారు. 23న ఆధ్యాత్మిక వేత్త సంగీత శిరోమణి శివమణి సంగీతం, బాలకృష్ణ ప్రసాద్‌చే భక్తిపాటలు, వడిపర్తి పద్మాకర్, సముద్రాల లక్ష్మణయ్య ప్రవచానలు, సౌమ్య బృందంచే సాంప్రదాయ నృత్యాలు ఉంటాయన్నారు. 24వ తేదీన రవిశంకర్‌చే సత్సంగ్, కొండవీటి జ్యోతిర్మయిచే అన్నమయ్య కీర్తాలాపన, హాలిమ్ ఖాన్ బృందంచే సాంప్రదాయ నృత్యం, 25న గోల్డెన్ నంది అవార్డు విజేతలచే శ్రీరామనవమి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయన్నారు. సహస్రావధాన చక్రవర్తి మేడసాని మోహన్‌చే ప్రవచనం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కనక నరసారెడ్డి, టూరిజం ఆర్డీ జయప్రకాష్, బీవీఎం సురేష్ రెడ్డి, జిల్లా టూరిజం అధికారి చంద్రవౌళి, ఈఈ సుబ్రమణ్యం రాజు, డీఈ సతీష్ రెడ్డి, విబ్రీ మీడియా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

నేడు సీఎంచే హీరో మోటార్ సంస్థకు శంకుస్థాపన

తిరుపతి, మార్చి 22: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీసిటీకి సమీపంలోని సత్యవేడు మండలం మాదన్నపాల్యెం వద్ద హీరో మోటార్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న ద్విచక్రవాహనాలు, విడిభాగాల తయారీ సంస్థకు శంకుస్థాపన చేయడానికి శుక్రవారం జిల్లాకు రానున్నారు. శుక్రవారం ఉదయం 9.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్న సీఎం హెలికాప్టర్‌లో మాదన్నపాల్యెంకు 10.15 గంటలకు చేరుకుంటారు. 10.20 నుంచి 11.20 గంటల వరకు అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.