చిత్తూరు

తిరుపతిలో ఎండ ప్రచండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 21: మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో తిరుపతిలో భానుడి భగభగలకు జనం హడలెత్తిపోయారు. భానుడి ప్రచండ తాపానికి జనం ఇళ్లల్లోను, వీధుల్లోను ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎప్పుడెప్పుడు చీకటి పడుతుందా అని ఎదురుచూస్తు, తెల్లవారితే ఎండలో వడదెబ్బకు ఎక్కడ గురికావాల్సి వస్తోందనని హడలిపోతున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది మే, జూన్ మాసాల్లో 42డిగ్రీలు, అంతకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన దాఖలాలున్నాయి. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏప్రిల్ నెల మధ్యలో నుంచే ఉష్ణోగ్రతలు ఊహించని విధంగా ఒక్కసారిగా పెరిగిపోవడం అందరిని ఆందోళనకు గురిచేస్తోంది. ఇళ్లలో ఏసిలు, కూలర్లు ఉన్నవారు ఇంటి నుంచి బయటకు రావడంలేదు. ఏవైనా అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అదికూడా ఉదయం సాయంత్రం వేళల్లోనే ఇంటి నుంచి బయటకు వచ్చి తమ పనులు ముగించుకుని బయటకు వెడుతున్నారు. అయితే పేద, మధ్య తరగతి ప్రజలు మాత్రం ఇళ్లలో ఫ్యాన్లున్నా వాటికిందే కూర్చుని సేద తీరడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. వడగాలల దెబ్బకు ఇళ్లు, అందులోని సామగ్రి సైతం వేడెక్కి పోతుండటంతో జనం ఏంచేయాలో తెలియక అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు సూర్యభగవానుని తీవ్రతకు జనం హడలిపోతున్నారు. దీంతో ఉదయం 11.30 నుంచే నగరంలోని ప్రధాన రోడ్లు బోసిపోతున్నాయి. ఇక సాయంత్రం 5గంటల తరువాత రోడ్లన్ని ప్రజలతో కిక్కిరిసిపోతున్నాయి. రాయలసీమలో అనంతపురం తరువాత తిరుపతిలో అత్యధికంగా 42డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపధ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రజాసమస్యలు పరిష్కార దిశగానే ఉద్యోగులు మెలగాలి
* జడ్పీ సిఇవో పెంచలకిషోర్ సూచన
చిత్తూరు, ఏప్రిల్ 21 : ప్రజా సమస్యలు పరిష్కారం దిశగానే ఉద్యోగులు చొరవ చూపాలని జడ్పీ సిఇవో పెంచలకిషోర్ తెలిపారు. గురువారం సివిల్ సర్వీస్‌డే సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఉద్యోగులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే పథకాలను ప్రజలకు సక్రమంగా అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందన్నారు. ప్రధానంగా మండల స్థాయి సిబ్బంది ఇందులో కీలక పాత్ర వహించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందితే సమాజం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ దిశగా ఉద్యోగుల ఆలోచన ధోరణిలో మార్పు రావాలని, అప్పుడే తమ విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందన్నారు. ప్రజల కోసం మనందరి సేవలు పునరంకితం కావాలన్నారు. సంక్షేమ ఫలాలు సక్రమంగా అమలైతే అభివృద్ధి కూడా వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ దిశగా ఉద్యోగులు తమ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ విధులను సమర్థవంతంగా నిర్వహించి సమస్యను అధిగమిస్తే దానికి అనుగుణంగానే అభివృద్ధి సాధించవచ్చన్నారు. విధి నిర్వహణలో మన సేవలు పలువురికి స్ఫూర్తిదాయకం కావాలన్నారు. వ్యవసాయశాఖ డిడి నిర్మల్ నిత్యానంద్ మాట్లాడుతూ తమకు ఎదురైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చని, అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ముఖ్యంగా నిరుపేదలకు ఉద్యోగులు అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సక్రమంగా లబ్ధిదారులకు చేరాలంటే సిబ్బంది అంకితభావంతో కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఇవో మాలతికుమారి, జడ్పీ ఉద్యోగుల సంఘం నేత ప్రభాకర్‌నాయుడు, ఎఓ వెంకటరత్నం, ఉద్యోగ సంఘం నేతలు కనకరాజులు, యుగంధర్, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పాల్గొన్నారు.

300 దర్శన క్యూలైన్ పరిశీలించిన టిటిడి ఇఒ
తిరుమల, ఏప్రిల్ 21: భక్తుల సౌకర్యార్థం ఏటిసి కారు పార్కింగ్ వద్ద ఏర్పాటుచేసిన రూ.300 దర్శన క్యూలైన్‌ను టిటిడి ఇ ఒ డాక్టర్ డి.సాంబశివరావు గురువారం పరిశీలించారు. క్యూలైన్‌లో భక్తులకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి మరింత మెరుగుపరచేందుకు అధికారులకు ఆయన పలుసూచనలు చేశారు. భక్తులకు టీ,కాఫి, మజ్జిగను ఎలాంటి జాప్యంలేకండా అందించాలన్నారు. ఈ నూతన క్యూలైన్ ఏర్పాటు వల్ల ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు బుక్ చేసుకునే భక్తులకు రెండు గంటల్లోనే స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలిపారు. అనంతరం లగేజి డిపాజిట్ కౌంటర్‌ను ఇ ఓ పరిశీలించారు. వేసవి సెలవులు ప్రారంభం కానుండటంతో భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో ఇ ఒ క్యూలైన్‌ను తనిఖీ చేశారు. ఈకార్యక్రమంలో అన్నదానం ప్రత్యేక శ్రేణి డిప్యూటి ఇ ఒ చెంచులక్ష్మి, శ్రీవారి ఆలయ డిప్యూటి ఇ ఒ కోదండరామారావు, ఎస్ ఇ 2 రామచంద్రారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

తిరుమల రెండో ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సులో పొగలు
తిరుమల, ఏప్రిల్ 21: తిరుపతి నుంచి భక్తులతో తిరుమలకు వెడుతున్న ఆర్టీసి బస్సులో రెండో కనుమ మార్గంలోని 16వ మలుపువద్ద పొగలు వచ్చాయి. డ్రైవర్ అప్రమత్తమై బస్సును నిలిపివేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. భానును ప్రతాపం తీవ్రం కావడంతో వాహనాల ఇంజిన్లు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా వాహనాలు నిరంతరాయంగా తిరుగుతుండటంతో బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి.

కుంటలో పడి వృద్ధ దంపతుల మృతి
పుంగనూరు, ఏప్రిల్ 21 : ప్రమాదవశాత్తు కుంటలో పడి వృద్ధ దంపతులు మరణించిన సంఘటన గురువారం పుంగనూరు మండలంలో జరిగింది. ఎస్సై అంజప్ప కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాలెంపల్లె పంచాయతీ వేపమాకుల పల్లెకు చెందిన గంగులప్ప (75), భార్య మునెమ్మ (72) ఉదయం దుస్తులు ఉతికేందుకు గ్రామ సమీపంలోని క్వారీకుంటకు వెళ్లారు. అక్కడ భార్య గంగులమ్మ దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు కుంటలో జారిపడటంతో భర్త గంగులప్ప ఆమెను కాపాడేందుకు కుంటలో దిగాడు. కుంటలో భార్యను రక్షించేందుకు ప్రయత్నించే క్రమంలో ఎంత ప్రయత్నించినా వీలు కాకపోవడంతో ఇద్దరూ సంఘటనా స్థలంలో మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.