చిత్తూరు

మేకిన్ ఇండియా అంటే విదేశీ వస్తువులు దిగుమతి చేసుకోవడమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మే 25: కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అని పిలుపునిచ్చి స్వదేశంలో ఉన్న రైల్వే కార్మికుల పొట్టకొడుతూ విదేశాల నుంచి పరికరాలను దిగుమతి చేసుకోవడం ఎంత వరకు సబబని, రైల్వే కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని కేంద్ర ప్రభుత్వంపై ఎన్‌ఎఫ్‌ఐఆర్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య నిప్పులు చెరిగారు. శుక్రవారం ఉదయం స్థానిక గ్యారేజ్ రిపేర్‌షాపులో 115వ డివిజినల్ కౌన్సిలింగ్ సమావేశం నిర్వహించారు. ఇందులో గుంతకల్లు, విజయవాడ డివిజినల్ నాయకులు పాల్గొనగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్‌ఎఫ్‌ఐఆర్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మర్రి రాఘవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైల్వే కార్మికుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రైల్వే విభాగం జీవన్మరణ సమస్యలతో నలిగిపోతున్నదన్నారు. సెవన్త్ పే కమిషన్‌లో, అలవెన్స్‌లో రైల్వే ఉద్యోగులు మోసపోయారని, కేంద్ర ప్రభుత్వం మాటిచ్చి మాట తప్పుతుందని, కార్మికులు నేడు కఠిన పరీక్ష, కష్టకాలంలో ఉన్నందున అందరూ ఏకమై ముందుకు వచ్చి పోరాటాలు చేయాలన్నారు. రూ. 2.26కోట్ల మంది ప్రయాణికులను ప్రతిరోజూ రైల్వే గమ్యస్థలానికి చేర్చుతుందని, 13వేల 60 మిలియన్ల టన్నుల సరుకును ఎగుమతులు, దిగుమతులు చేస్తే ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉందన్నారు. 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.16వేల కోట్ల పైచిలుకు నిలువ ఆదాయాన్ని రైల్వే సంపాదించేందుకు కార్మికులు తోడ్పడ్డారన్నారు. ఇంతటి పరిస్థితిల్లోనూ కార్మికుల పట్ల తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని కేంద్రం వారి పొట్ట కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్రమోదీ పార్లమెంటు సెగ్మెంట్ వారణాసిలో ఆల్ ఇండియా రైల్వే క్యాన్సర్ ఆసుపత్రిని టాటా ఇన్‌స్టిట్యూట్‌కు దారాదత్తం చేశారన్నారు. ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి రైల్వేలో అమ్మకాలు మొదలు పెట్టారన్నారు. దేశంలోని డీజిల్ లోకోలు మూసివేసి అమెరికా లాంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఇంజన్ల తయారీకి ప్రధాని ముందున్నారన్నారు. దేశంలోని కార్మికులు, టెక్నికల్ కార్మికులు డీజిల్ ఇంజన్లు తయారుచేసి ఏసియాలో ఎగుమతి చేస్తుంటే నేడు పెరంబూరులో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ రైలు ఇంజన్లు తయారుచేసేందుకు సిద్ధంగా ఉన్నా స్పెయిన్ నుంచి ఇంజన్లు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏముందని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నేడు దేశంలోని పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాలలో షికార్లు కొడుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందని ప్రశ్నించారు. దేశం ఈ నాడు కొంతమంది చేతుల్లో ఉండిపోయిందని, దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారి పోతుందని, ఇందుకు పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఈస్ట్ ప్రెసిడెంట్ ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్‌కుమార్, ఏజీఎస్ భానుప్రసాద్, నాగేంద్రబాబు, డీఎస్ హేమంత్‌కుమార్, డివిజినల్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, డీవైడీఎస్ కృష్ణ, సీడబ్ల్యూసీ బాబునాయక్, దుర్గాప్రసాద్, డివిజినల్ సెక్రటరీలు వెంకటేశ్వర్లు, ప్రభాకర్, ఖాజానవాజ్, సీఆర్‌ఎస్ బ్రాంచ్ ఛైర్మన్ అంజిబాబు, సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లోని క్యూలైన్‌లను తనిఖీ చేసిన టీటీడీ ఛైర్మన్
తిరుపతి, మే 25: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలలోని దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం క్యూలైన్‌లను శుక్రవారం ఉదయం టీటీడీ ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్‌లలో భక్తులకు అందిస్తున్న సౌకర్యాలు పరిశీలించారు. శ్రీవారి సేవకులతో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, పాలు గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. క్యూలైన్‌ల పరిసరాలు, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు సులభంగా అర్థమయ్యేలా వివిధ భాషలలో సూచికబోర్డులు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. అనంతరం లేపాక్షి సర్కిల్ నుంచి ఏర్పాటుచేసిన సర్వదర్శనం క్యూలైన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు సర్వదర్శనం సమయాన్ని, సర్వదర్శనం టోకెన్లు పొందే విధానం గురించి ఎప్పటికప్పుడు టీటీడీ రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆరోగ్య విభాగం అధికారిణి డాక్టర్ శర్మిష్ట, ఏవీఎస్‌ఓ గంగరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మోహినీ అవతారంలో శ్రీ గోవిందరాజస్వామి
తిరుపతి, మే 25: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదవరోజైన శుక్రవారం ఉదయం స్వామివారు పల్లకీపై మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 5 గంటలకు పల్లకీ ఉత్సవం ప్రారంభమైంది. ఆలయ నాలుగు మాడ వీధులతో పాటు పుష్కరిణి, శ్రీ కోదండ రామాలయం వరకు వెళ్లి తిరిగి ఉదయం 9 గంటలకు స్వామివారు ఆలయానికి చేరుకున్నారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, కేరళ కళాకారుల డ్రమ్స్, మంగళ వాయిద్యాల నడుమ పల్లకీ ఉత్సవం సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. మోహినీ అవతారం వృత్తాంతం భాగవతంలో రమణీయంగా వర్ణించారు. సురాసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు. అందులో హేయమైన విషంతో పాటు అమృతం, ఎన్నో మేలి వస్తువులు ఉద్భవించాయి. వివిధ దేవతలు వాటిని స్వీకరించారు. చివరికి వారు కోరుకున్న అమృతం లభించింది. దానిని పంచుకోవడంలో కలహం తప్పలేదు. ఆ కలహాన్ని నివారించి అసురులను వంచించి సురులకు అమృతాన్ని పంచడానికి శ్రీహరి మోహినీ రూపంలో సాక్షాత్కరించారు. అసురులు సమ్మోహకమైన ఆమె క్రీగంటి చూపులకు పరవశులైపోయారు. తత్ఫలితంగా వారు వంచించబడటం, దేవతలు అనుగ్రహించబడటం జరిగింది. అనంతరం ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ స్థానిక ఆలయాల డిప్యూటీ ఈఓ వరలక్ష్మి, సహాయ కార్యనిర్వహణాధికారి ఉదయభాస్కర్ రెడ్డి, సూపరింటెండెంట్ జ్ఞానప్రకాష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తిరుమలలో తరగని రద్దీ
* సర్వదర్శనానికి 48గంటలు

తిరుపతి, మే 25: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం వచ్చే భక్తుల రద్దీతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు, వారాంతపు రోజులు కావడంతో శుక్రవారం ఉదయం నుండి తిరుమలలో రహదారులన్నీ భక్తులతో నిండిపోయాయి. దీంతో సర్వదర్శనానికి 48 గంటలు పడుతోంది. అలిపిరి కాలినడక మార్గాలు, శ్రీవారి మెట్టు, రోడ్డు మార్గాల ద్వారా పెద్ద ఎత్తున భక్తులకు తిరుమలకు వస్తున్నారు. దీంతో తిరుమలలో ఎక్కడ చూసినా భక్తజనమే దర్శనమిస్తున్నారు. భక్తుల వచ్చిన వాహనాలతో రోడ్డుకు ఇరువైపులా కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా టీటీడీ నూతనంగా ప్రవేశపెట్టిన సమయ నిర్దేశిత సర్వదర్శనంలో టోకెన్ల కౌంటర్లు తిరుమలలో తాత్కాలికంగా మూసివేయడంతో తిరుపతిలో కేటాయిస్తున్న సమయ నిర్దేశిత సర్వదర్శన కౌంటర్ల ద్వారా భక్తులు వారికి కేటాయించిన సమయంలో తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటున్నారు. రద్దీ అధికంగా ఉన్న కారణంగా రెండురోజులుగా సర్వదర్శనం భక్తులు లేపాక్షి ఎదురుగా ఉన్న క్యూలైన్ల ద్వారా కంపార్టుమెంట్లలోనికి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటున్నారు. కాలిబాటన వచ్చే భక్తులకు కేటాయించే దివ్యదర్శనం టోకెన్లను పరిమితి మేరకు టీటీడీ కేటాయించడంతో టోకెన్లు పొందిన భక్తులు సర్వదర్వనం క్యూలైన్లలో ప్రవేశించి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. రద్దీ నేపధ్యంలో అద్దె గదుల కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉండి పొందుతున్నారు. గదులు దొరకని భక్తులు లాకర్లను పొంది సేదతీరుతున్నారు. ఈ రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా ప్రోటోకాల్ పరిధిలోనే టీటీడీ కేటాయించి సామాన్యభక్తులకు అధిక ప్రాధాన్యమిస్తోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ యంత్రాంగం క్యూలైన్‌లో వేచి ఉన్న భక్తులను ఎప్పటికప్పుడు క్రమబద్దీకరిస్తూ అన్నప్రసాదాలు, అల్పాహారం, తాగునీరు, మజ్జిగ వంటివి శ్రీవారి సేవకుల సహాయంలో నిరంతరాయంగా అందజేస్తున్నారు. వేసవి సెలవులు ముగిసేవరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది.