చిత్తూరు

జగన్, బాబు దొందూదొందే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 26: ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్‌లు దొందూదొందేనని, వీరు రాష్ట్భ్రావృద్ధిని కోరుకునే వ్యక్తులు కాదని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. నాలుగు సంవత్సరాల బీజేపీ పాలనను నిరసిస్తూ శనివారం స్థానిక గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ నాలుగేళ్ల బీజేపీ ప్రభుత్వంలో దేశంలో అభివృద్ధి శూన్యమయ్యిందన్నారు. నిరుపేదలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. నాల్గవ తరగతి వరకు చదివిన మోదీకి దేశ ఆర్థిక పరిస్థితిపై అవగాహన లేదన్నారు. నోట్ల రద్దు అనాలోచిత నిర్ణయమని పేర్కొన్నారు. ఎంతోమంది మేధావులు, ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ వారి సూచనలను పట్టించుకోకుండా మోదీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మోదీ అనాలోచిత నిర్ణయాలతో బ్యాంకింగ్ రంగం కుదేలయ్యిందని, గిట్టుబాటు ధరలేక రైతులు విలవిలలాడుతున్నారన్నారు. నల్లధనాన్ని వెలికి తీసి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో 15లక్షలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన మోదీ ఆ హామీలు తుంగలో తొక్కారన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. నాలుగు సంవత్సరాల బీజేపీ పాలనలో పన్నుల భారం పెరిగిందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు రూ.80లకు పెరిగిందన్నారు. నిత్యావసర వస్తువులైన ఉప్పు, పప్పు, వంటనూనె, బియ్యం ధరలు ఆకాశాన్నంటాయన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకుండా మాట తప్పి ఐదు కోట్ల మంది ఆంధ్రులను అవమానపరిచారన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 175 అసెంబ్లీ, 25పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామన్నారు. జగన్, చంద్రబాబు ఇద్దరూ రాజకీయ విరోధులేనన్నారు. బెంగుళూరులో జరిగిన లౌకికవాదుల వేదికపైకి జగన్ రాకపోవడం గమనిస్తే ఆయన బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారనేందుకు నిదర్శనమన్నారు. మన్నవరం, దుగ్గరాజపట్నం ఓడరేవు, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. 7008మంది నిరుపేదలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, స్విమ్స్‌లో ఉచిత వైద్యం, స్థానికులకు శ్రీవారి దర్శనం, శ్రీకాళహస్తినడికుడి రైల్వే లైన్ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ సభ్యురాలు ప్రమీలమ్మ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోనికి వచ్చిన నాలుగేళ్లలో పేద, మధ్య తరగతి ప్రజలను అణగదొక్కి, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తోందన్నారు. అడ్డదారుల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ కుయుక్తులు పన్నుతోందన్నారు. కర్నాటకలో అధికారంలోనికి రావడానికి శతవిధాల ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆమె ఆన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మోసం చేసిన ఘనత బీజేపీకి దక్కిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తూనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అద్యక్షులు రాహుల్ గాంధీ చెప్పారన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు ఈ విషయాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీని బలపరిచి రానున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలు దక్కేలా చూడాలని ఆమె కోరారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోనికి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు. నగర అధ్యక్షులు పొలకల మల్లిఖార్జున్ మాట్లాడుతూ తాము అధికారంలోనికి వస్తే విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని భారత్‌కు తెప్పిస్తామని చెప్పిన మోదీ మోసం చేశారన్నారు. రైతు ఆత్మహత్యలు ఆపుతామని, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పి వారిని మోసం చేశారన్నారు. దేశవ్యాప్తంగా నిరుపేదలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. దేశాభివృద్ధికి కృషి చేస్తామని మాట ఇచ్చిన మోదీ దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, క్రైస్తవులపై ఒక పథకం ప్రకారం దాడులు చేస్తూ ఇబ్బందులు పాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చుక్కల దాము, నైనారు శ్రీనివాసులు, పాఠకం వెంకటేష్, యార్లపల్లి గోపీ, చిట్టిబాబు, సావిత్రి, ప్రభాకర్, జ్యోతి, మోహన్‌రెడ్డి, సిద్దయ్య, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, పాల్గొన్నారు.