చిత్తూరు

పంచాయతీలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాంతీపురం, జూన్ 21: రాష్ట్రంలో ఐదు వేల మంది జనాభా ఉన్న పంచాయతీలకు అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలు పూర్తి చేస్తామని ఐటి, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ వెల్లడించారు. గురువారం కుప్పం నియోజకవర్గ రాళ్లబూదుగూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 228 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశామన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల కోసం రూ.4500 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధికి రూ. 80 కోట్లు కేటాయించామన్నారు. ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు. తుమ్మిశిలో వృత్తి నైపుణ్యం శిక్షణా కేంద్రం వద్ద (ఎన్‌ఎసి) శిక్షణ పొందుతున్న విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా విభజించి కట్టుబట్టలతో బయటికి తరిమినా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు కల్పించాలంటే వృత్తి నైపుణ్యం లేక పోవడంతో ఉద్యోగాలు కల్పించడానికి పరిశ్రమలు ముందుకు రావడం లేదన్నారు. విభజన సమయంలో కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే రాష్ట్రానికి కేటాయించి మిగిలిన 99.9శాతం ఉద్యోగాలను తెలంగాణకు కేటాయించారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో 18 అంశాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ తర్వాత మాటమార్చి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. నాలుగేళ్లలో మొదటి సంవత్సరం ప్రత్యేక హోదా ఇస్తామని, రెండో సంవత్సరం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, మూడో సంవత్సరం ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని, నాల్గవ సంవత్సరం ఇతర రాష్ట్రాలకు హోదా ఇచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ నేతలైన జగన్‌మోహన్‌రెడ్డి, పవన్‌కల్యాణ్ హోదా ఇవ్వని ప్రధానిని వదలి 68 ఏళ్ల వయస్సులో రాష్ట్రం కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబును విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి, జగన్ మోదీ రెడ్డిగా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రధానిని విమర్శిస్తే జగన్ నేరుగా జైలుకు వెళ్తాడని భయపడుతున్నట్లు తెలిపారు. కుప్పంలో ఆరు సార్లు ఎమ్మెల్యేగా చంద్రబాబును గెలిపించిన ప్రజల అభిమానం గొప్పదని, ఈ సారి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని లోకేష్ కోరారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలశాఖ మంత్రి ఎన్.అమరనాథ్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణిచంద్రప్రకాష్, ఎంపీ శివప్రసాద్, కలెక్టర్ ప్రద్యుమ్న, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, సీడీసిఎంఎస్ చైర్మన్ శ్యామరాజు, రెస్కో చైర్మన్ మునిరత్నం, జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాని, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.