చిత్తూరు

ఆలయంలో నేడు అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు అంకురార్పణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 10: కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న వేంకటేశ్వరుడు కొలువుదీరి ఉన్న తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహోసంప్రోక్షణకు శనివారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఆరు రోజులపాటు నిర్వహించనున్న ఈ మహా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఆలయంలో నిర్వహించే అన్ని రకాల ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఈ వైదిక కార్యక్రమాల నిర్వహణ నేపథ్యంలో ఆరు రోజుల పాటు సమయాభావాన్ని బట్టి రోజుకొక విధంగా పరిమిత సంఖ్యలో భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించనున్నారు. తొలి రోజు 50వేల మంది భక్తులను అనుమతిస్తే చివరి రోజైన 16వ తేదీన 18వేల మందికి మాత్రమే దర్శనం కల్పించే అవకాశం ఉంటుందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఇదిలా ఉండగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే ఈ మహాక్రతువుకు శనివారం రాత్రి 7 నుంచి 10గంటల వరకు అంకురార్పణ కార్యక్రమం జరుగుతుంది. వైఖానస ఆగమాన్ని పాటించే అన్ని వైష్ణవ దేవాలయాల్లో లోకసంక్షేమం, ఆలయంలోని మరమ్మతులను ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం పాఠకులకు విధతమే. ఇందుకోసం శ్రీవారి ఆలయంలో 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు ఆధ్వర్యంలో 44 మంది రుత్విక్కులు, 100 మంది వేదపండితులు, ధర్మగిరి వేదపాఠశాల నుంచి 20మంది వేద విద్యార్థులు ఈ మహాక్రతువులో పాల్గొంటారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేద పారాయణం, పురాణాలు, రామాయణం, మహాభారతం, భగవద్గీతను పారాయణం చేస్తారు.
శనివారం అంకురార్పణ
మహాసంప్రోక్షణకు శ్రీకారం చుట్టేవిధంగా శనివారం అంకురార్పణ కార్యక్రమాన్ని చేపడతారు. ఉదయం భగవంతుని అనుమతితో ఆచార్యులకు స్థాన నిర్ణయం జరుగుతుంది. దీనినే ఆచార్య వరణం లేదా రుత్విక్ వరణం అంటారు. రాత్రి 7 నుంచి 9గంటల వరకు స్వామివారి సేనాధిపతి అయిన విష్వక్సేనుల వారు ఆలయం నుంచి బలుదేరి ఆలయానికి ఈశాన్యంలో ఉన్న వసంత మండపానికి చేరుకుంటారు. అక్కడ పుట్టమన్ను సేకరించి రాత్రి 9 నుంచి 10 గంటల వరకు యాగశాలలో శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు.
ఆదివారం నాడు దేవతా శక్తుల కుంభావాహన
బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 6గంటల తరువాత యాగశాలలోని ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యహవచనం, పంచగవ్యారాధన, వాస్తుహోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9గంటల తరువాత నిర్వహించే కళాకర్షణలో భాగంగా గర్భాలయంతోపాటు అన్ని ఉపాలయాల్లోని దేవతామూర్తుల శక్తిని కుంభం (కలశం)లోనికి ఆవాహనం చేస్తారు. ఈ కుంభాలతోపాటు అందరి దేవతల ఉత్సవ మూర్తులను యాగశాలలోకి వేంచేపు చేస్తారు. 18 వేదికలపై కుంభాలను కొలువు దీరుస్తారు. యాగశాలలో ప్రతిరోజు నిత్య కైంకర్యాలతోపాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు వెలిగిస్తారు.
సోమ, మంగళ వారాల్లో విశేష హోమాలు
ఇక మహాసంప్రోక్షణలో మూడవ రోజైన సోమవారం, నాల్గవ రోజైన మంగళవారం 13 విశేష హోమాలతోపాటు అష్టబంధన ద్రవ్యం తయారు చేస్తారు. ఇందులో అరటిపండ్లు, దూది, కరక్కాయ వంటి 8 పదార్థాలతో కూడుకున్న మిశ్రమ లేపనాన్ని తయారు చేస్తారు. దీనినే అష్టబంధన ద్రవ్యం అంటారు. రెండు రోజులపాటు గర్భాలయంతోపాటు ఉపాలయాల్లోనూ అష్టబంధన ద్రవ్యంను సమర్పిస్తారు. ఈ అష్టబంధన కార్యక్రమాన్ని గురించి భృగుప్రకీర్థ్ధాకారం, విమానార్చన ప్రకల్పం గ్రంథాల్లో తెలియజేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి పాదాలు, పద్మపీఠం మధ్య ఏర్పడిన వ్యత్యాసాలను భర్తీ చేస్తూ ఈ లేపనాన్ని తాపడం చేస్తారు. 12 సంవత్సరాల తరువాత ఈ లేపనం పటుత్వం తరుగుతుంది. అందుకే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి బాలాలయ అష్టబంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
బుధవారం.. హోమాలు, అభిషేకాలు
మహాసంప్రోక్షణలో ఐదవరోజైన బుధవారం ఉదయం కైంకర్యాలు నిర్వహించిన అనంతరం మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంట తరువాత గర్భాలయంలోని మూలవర్లకు 14 కలశాలతో మహాశాంతి తిరుమంజనం చేపడతారు. ఉత్సవ మూర్తులకు యాగశాలలోనే అభిషేకం నిర్వహిస్తారు.
గురువారం.. కళావాహన
మహా సంప్రోక్షణలో ఆరవ రోజైన గురువారం ఉదయం 10.16 నుంచి 12 గంటల్లోపు కళావాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈసందర్భంగా శ్రీవారి మూలమూర్తికి, విమాన గోపురానికి, ఉపాలయంలోని స్వామివారి విగ్రహాలకు, గోపురాలకు కుంభంలోని శక్తిని తిరిగి ఆవాహన చేస్తారు. అటు తరువాత ఆరాధన, నైవేద్యం, అక్షితారోపణం, బ్రహ్మఘోష, అర్చక బహుమానం సమర్పిస్తారు. దీంతో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణ కార్యక్రమం ముగుస్తుంది. దీంతో గురువారం సాయంత్రం మలయప్ప స్వామి పెద్దశేష వాహనంపై స్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అదే రోజు గరుడ పంచమి కూడా కావడంతో స్వామివారు గురువారం రాత్రి గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి ఆలయంలో తొలి మహాసంప్రోక్షణ 1958లో
శ్రీవారి ఆలయంలో తొలి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం 1958 విళంబి నామ సంవత్సరం, ఆగస్టు మాసంలో శ్రీవారి ఆలయ విమాన సంప్రోక్షణ, స్వర్ణ కవచ తాపడం జరిగింది. 60 ఏళ్ల తరువాత తిరిగి అదే విళంబి నామ సంవత్సరంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం జరగడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అటు తరువాత 1970, 1982, 1994, 2006 అటు తరువాత 12 సంవత్సరాలు తరువాత 2018 ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం జరుగుతోంది.
అన్ని రకాల దర్శనాలు రద్దు
ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని శనివారం నుంచి గురువారం వరకు రూ.300 టోకెన్లు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లను టీటీడీ రద్దు చేసింది. అలాగే ఆర్జిత సేవలు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులకు టీటీడీ కల్పిస్తున్న ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు కూడా పూర్తిగా రద్దయ్యాయి.