చిత్తూరు

గ్రామ, వ్యక్తిగత సమస్యల పరిష్కారానికే గ్రామదర్శిని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, ఆగస్టు 17: గ్రామ, వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామదర్శిని కార్యక్రమం రూపొందించిందని, అధికారులు గ్రామానికి వచ్చినపుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు. శుక్రవారం చంద్రగిరి మండలం మామండూరు గ్రామ పంచాయతీలో నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా మాజీ ప్రధాని వాజ్‌పేయి మృతికి 2నిముషాలు వౌనం పాటించి, అనంతరం గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రం గత 3 సంవత్సరాలుగా సులభతర వాణిజ్యంలో ప్రథమస్థానం సాధిస్తున్నదని చెప్పారు. పరిశ్రమల స్థాపనతో ఉద్యోగాలకల్పన చేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు ర్యాంకులను ఇవ్వనున్నట్లు తెలిపారు. పరిశ్రమల స్థాపనలోనే కాకుండా తిరుపతి పట్టణం నివాసయోగ్య స్థానాలలో దేశంలో నాలుగవదిగా, రాష్ట్రంలో మొట్టమొదటిగా నిలిచిందన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమి, నవనిర్మాణ దీక్ష, మహాసంకల్పం వంటి కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదేరీతిలో నేడు గ్రామదర్శిని పేరుతో అధికారులు ప్రతి గురువారం, శుక్రవారాలు గ్రామాల్లో పర్యటిస్తారని, ఇంకా ఏవైనా సమస్యలు మిగిలి ఉంటే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచేకాక వ్యక్తిగతంగానూ, గ్రామపరంగానూ కూడా సమస్యల పరిష్కారానికి గ్రామస్థులు చొరవచూపాలన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్లని, అందుకే ప్రతి గ్రామం తప్పనిసరిగా 11 అంశాలను పాటించాలన్నారు. ఇందులో మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీరు, గ్యాసు, రోడ్డు, ఫైబర్‌గ్రిడ్, బృందావనాల నిర్మాణం వంటివి చేపడితే అభివృద్ధి పథంలో నడుస్తాయని తెలిపారు. మహా సంకల్పంలో నిర్దేశించుకున్న అంశాల మేరకు శ్మశానానికి రోడ్డు, దళితవాడకు వాటర్ ట్యాంకు, హైవేను కలుపుతూ సీసీ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ రికార్డులను పరిశీలిస్తూ కార్యదర్శి నాగమణిని అడిగి 14వ ఫైనాన్స్ నిధులు, వాటి వివరాలను తెలుసుకున్నారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలను సరిచూసుకొని మిగిలిన మొత్తంతో పంచాయతీ అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. మహిళా సాధికారతపై ఏపీఎం ద్రాక్షాయిని జిల్లా కలెక్టర్ అడిగినవాటికి బదులిస్తూ మండలంలో మహిళా సమైక్యలకు రుణాలు, ఆర్థిక సహాయం రూ.42కోట్లు కాగా, నేటి వరకు రూ.15కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. మామండూరులో 8 మహిళా సంఘాలు ఉన్నాయన్నారు. అనంతరం కలెక్టర్ గ్రామంలో పర్యటించి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు కల్పలతతో మాట్లాడి చదువుతున్న విద్యార్థుల వివరాలు, అంగన్‌వాడీ టీచర్ లావణ్యతో మాట్లాడి పిల్లల సంఖ్య బాలింతలు, గర్భిణులకు అందిస్తున్న పోషకాహారం విషయాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా స్థానికులు కలెక్టర్‌తో మాట్లాడుతూ గత కొంత కాలంగా 72 మందికి పత్రాలు పంపిణీచేశారని, ఇంతవరకు భూమి చూపించలేదని, 26 మందికి ఎన్టీఆర్ గృహాలు అవసరమని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ తహశీల్దార్ వెంకటరాయులును ఆదేశిస్తూ వెంటనే వారికి స్థలాలు చూపించి బౌండరీలు ఏర్పాటుచేయాలని పక్కాగృహాలు కూడా మంజూరుచేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా గ్రామస్థులు మీ వంతుగా గ్రామాలకు ఏమి చేస్తున్నారని, వ్యక్తిగత శ్రమ ఉంటేనే అభివృద్ధి జరుగుతుందన్నారు. దీంతో మాజీ సర్పంచ్ మాట్లాడుతూ ప్రాధమిక పాఠశాలకు తనవంతుగా ఫర్నీచర్, అంగన్‌వాడీ స్కూల్‌కు టీవీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దీంతో స్థానికులు పలువురు కలెక్టర్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీపీఓ సురేష్‌నాయుడు, డీఈఓ రవికుమార్, చంద్రగిరి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ కనకనరసారెడ్డి, ఎంపీడీఓ వెంకటనారాయణ, డీఈఓ పాండురంగయ్య, తహశీల్దార్, గ్రామస్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

రుయాలో కలెక్టర్ ప్రద్యుమ్న తనిఖీలు
* మెటర్నటీ ఆస్పత్రికి 40 సీసీ కెమేరాలు మంజూరు
తిరుపతి, ఆగస్టు 27: రుయా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న శుక్రవారం రుయా ఆస్పత్రిని తనిఖీ చేశారు. వార్డుల్లోకి వెళ్లి రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా రోగుల సహాయకులు వార్డు బయట కూర్చోవడానికి వీలుగా బెంచీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాడైన వాటిలో పనికి వచ్చేవాటిని గుర్తించి మరమ్మతు చేయించి వాడుకోవాలని, మిగిలిన వాటిని తొలగించాలన్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, పచ్చదనం పెంపొందించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం జరిగిన అస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గత సమావేశంలో 25 పనులు చేపట్టాలని నిర్ణయించగా, 15 పూర్తయ్యాయని చెప్పారు. సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, బీఎస్సీ నర్సింగ్ హాస్టల్ పనులు పూర్తయ్యాయని, పీజీ హాస్టల్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ టెండర్ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఆస్పత్రి ఆవరణలో పూర్తిగా అర్బన్ గ్రీన్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో పచ్చదనం పెంపొందించాలన్నారు. ప్రసూతి ఆస్పత్రిలో సహాయకులు వేచివుండే కాంప్లెక్స్, తాగునీటి శుద్ధి ప్లాంట్‌ను మంజూరు చేసిన కలెక్టర్ సెంట్రల్ ఆక్సిజన్ సరఫరాకు, 40 సీసీ కెమేరాల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. ఈ సమావేశంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ బి.సిద్ధానాయక్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రవిప్రభు, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్ భారతి, కమిటీ సభ్యులు చినబాబు, డాక్టర్ సుధారాణి, ఆర్‌ఎంఓ శ్రీహరి, ఎపీ ఐ.ఎం.డీ. సి.నగేష్ తదితరులు పాల్గొన్నారు.

ఉప రాష్టప్రతి కార్యక్రమం వాయిదా
రేణిగుంట, ఆగస్టు 17: ఉపరాష్టప్రతి చేతులమీదుగా ప్రారంభం కావాల్సిన కల్నరీ పాకశాస్త్ర విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. వివరాల్లోకెళితే.. కేంద్ర ప్రభుత్వం రూ.99కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించిన కల్నరీ విశ్వవిద్యాలయం ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉండగా హఠాత్తుగా బీజేపీ వ్యవస్థాపకులు, మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి మృతిచెందడంతో కేంద్ర ప్రభుత్వం వారం రోజులు సంతాప దినాలు ప్రకటించారు. దీంతోదేశ వ్యాప్తంగా ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు, ఎంపీలు, పార్టీకేడర్ మొత్తం ఢిల్లీలో మాజీ ప్రధాని వాజ్‌పేయి అంత్యక్రియల కార్యక్రమాల్లో ఉండిపోయారు. దీంతో ఈనెల 19వ తేదీన ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ప్రారంభం కావాల్సిన కార్యక్రమం అధికారిక ప్రకటనతో వాయిదా పడింది.

సంఘమిత్రల జీతాల కోసం సెప్టెంబర్ 1 నుంచి
నిరాహార దీక్ష చేస్తా
* చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడి
తిరుపతి, ఆగస్టు 17: సంఘ మిత్రలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలాఖరులోగా జీతాలు ఇవ్వకుంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తాను చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష చేపడతానని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ సంఘ మిత్రల చేత పనులు చేయించుకుంటూ ఒక్క పైసా కూడా జీతం ఇవ్వకుండా వేధిస్తోందని ఆరోపించారు. వారి బాధలు చూసి వారి అంగీకారంతోనే వారి అకౌంట్లలోకి తాను నగదు బదిలీ చేశానని ఆయన స్పష్టం చేశారు. వారికి ఇష్టం లేకుంటే తాను 4వ తేదీన వారి అకౌంట్లలోకి నగదు బదిలీ చేసిన వెంటనే తనను ఎందుకుప్రశ్నించలేదన్నారు. తాను న్యాయ శాస్త్రంలో పట్ట్భద్రుడినని, సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడినని, చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నానని ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పారు. పెద్ద నాయకులు కొందరు వెలుగు అధికారులను బెదిరించారని, తన వద్ద వీడియో, ఆడియో ఆధారాలున్నాయని తెలిపారు. తనకు వ్యతిరేకంగా సంఘమిత్రల నుంచి తీర్మానాలు చేయించడానికి ఏ స్థాయిలో ఒత్తిడి చేశారో, ఎలా బెదిరించారో తన వద్ద ఆధారాలు ఉన్నాయన్న ఆయన వాటిని చూపించాలని కోరే వారు మీడియా ముందుకు రావాలని సవాల్ విసిరారు.

తిరుమలలో ఘనంగా పురుశైవారి తోట ఉత్సవం
తిరుపతి, ఆగస్టు 17: శ్రీ వేంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి విశ్వాసాలను ప్రదర్శించిన ప్రముఖ శ్రీ వైష్ణవాచార్యుడు అనంతాళ్వార్ పరమపదించి స్వామివారిలో ఐక్యమైన సందర్భాన్ని పురస్కరించుకుని తిరుమలలో శుక్రవారం పురుశైవారి (అనంతాళ్వార్ తోట) ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలంకార సేవ అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సేమత శ్రీ మలయప్ప స్వామివారు పురుశైవారి తోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనలు, ఆస్థానం అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇచ్చారు. శేషహరతి, పుష్పసరము, శ్రీ శఠారి పొగడ చెట్టుకు సమర్పించారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా తిరిగి శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఓఎస్డీ పాలశేషాద్రి పాల్గొన్నారు.