చిత్తూరు

ఆత్మవంచన చేసుకోలేను.. సీపీఐలో కొనసాగలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 14: తమ ఆస్తులను, జీవితాలను పీడిత ప్రజల కోసం త్యాగం చేసి ఎంతో మంది మహనీయులు సీపీఐని ఏర్పాటుచేశారని, అయితే వారి ఆలోచనలు, సిద్ధాంతాలు నేటి పార్టీలో కనుమరుగయ్యాయని, అందుకే ఆత్మవంచన చేసుకొని పార్టీలో కొనసాగలేక రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని, తనతో పాటు 100 మంది అనుబంధ సంఘ నాయకులు రాజీనామాలు చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఐ సీనియర్ నేత, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు రామిశెట్టి వెంకయ్య స్పష్టం చేశారు. ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి, రైతు సంఘ నాయకత్వానికి తాను రాజీనామా చేశానని ప్రకటించారు. తనతో పాటు జిల్లాలో వివిధ మండలాలకు చెందిన 100 మంది పార్టీ, ప్రజాసంఘాల నాయకులు కూడా పలువురు రాజీనామాలు చేశారని తెలిపారు. 40 సంవత్సరాల పాటు సీపీఐ సిద్ధాంతాలకు కట్టుబడి తాను పనిచేశానన్నారు. 1978లో తిరుమలలో హాకర్స్ యూనియన్ ద్వారా పార్టీ నిర్మాణాన్ని చేపట్టి పీడిత ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి సత్ఫలితాలు సాధించానన్నారు. అటు తరువాత దశలవారీగా పార్టీలో అనేక పదవుల్లో ఉంటూ సేవలందించానన్నారు. 2014లో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీచేశానన్నారు. కాలక్రమేనా పార్టీలో కొంత మంది నాయకులు అనుసరిస్తున్న నియంతృత్వ ధోరణితో పార్టీ ప్రతిష్ట మసకబారిందన్నారు. తిరుపతిలో సీపీఐ కార్యాలయంతో పాటు కల్యాణ మండపం నిర్మాణంలో తాను కన్వీనర్‌గా వ్యవహరించానన్నారు. వీటిని జిల్లా సమితి నిర్వహించాల్సి ఉందన్నారు. అందుకు భిన్నంగా పార్టీలోని ఒక ముఖ్యమైన వ్యక్తి అంతా తన గుప్పెట్లో పెట్టుకొని నడుపుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరంగా కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగాయన్నారు. ఈ విషయంపై తాను సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, రాష్ట్ర కార్యవర్గసభ్యులు హరినాథరెడ్డిని, తనతోపాటు మరో ఆరుగురు ప్రశ్నించడం జరిగిందన్నారు. దీనిని జీర్ణించుకోలేక గత యేడాది డిసెంబర్‌లో తనతోపాటు ఐదుగురు జిల్లా కార్యవర్గ సభ్యులపై అన్యాయంగా చర్యలు తీసుకున్నారన్నారు. అటు తరువాత పొరపాటు జరిగిందని నచ్చజెప్పి తమ వద్ద లిఖత పూర్వమైన లేఖను తీసుకొని ఇద్దరిని పార్టీలోకి తీసుకున్నారన్నారు. 40 సంవత్సరాలుగా పార్టీకి సేవలందించిన తనలాంటి వారికి కూడా పార్టీలో మద్దతు లేని పరిస్థితులు కొనసాగుతున్నాయని, ఈ వాస్తవాలు తెలిసినా జాతీయ నాయకులు నారాయణ కూడా ప్రేక్షకపాత్ర వహిస్తూ వారిని ప్రోత్సహించడం తనను మరింత బాధ పెట్టిందన్నారు. పీడిత ప్రజల కోసం సేవలందించేందుకు ఏర్పాటైన సీపీఐలో ఇతర రాజకీయ పార్టీల తరహాలో గ్రూపులు మహావృక్షాల్లా ఊడలుబారాయన్నారు. అందుకే ఎంతోమంది మహానుభావులను మార్గదర్శకంగా తీసుకొని పార్టీలో సేవలందించి ఇలాంటి పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ఆత్మ వంచన చేసుకుని పనిచేయలేకే పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో వీరి అరాచకాలను భరించలేక మరెంత మంది సేవా పరులైన నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడాల్సి వస్తుందో అర్థంకాని పరిస్థితులు కొనసాగుతున్నాయన్నారు. ఏదేమైనా జిల్లా సీపీఐలో పేట్రేగిపోతున్న ఆర్థిక అరాచకాలను భరించలేక నీతి, నిజాయితీ, నిబద్ధతతో ఉన్న తనతో పాటు రాజీనామా చేస్తున్న వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ సమావేశంలో పలమనేరు రైతు సంఘం నాయకుడు ఉమాపతి నాయుడు, తిరుపతి భవన నిర్మాణ సంఘం ప్రధాన కార్యదర్శి రంగన్న, వి.కొత్తకోటకు చెందిన రైతు సంఘం నాయకులు రమణారెడ్డి, తంబళ్లపల్లికి చెందిన సురేంద్రరెడ్డి, తిరుమల సీపీఐ సహాయ కార్యదర్శి రామకృష్ణారావు, లక్ష్మణరావు, వెంకటేష్, ఢిల్లీ, ఆర్.రామచంద్రయ్య, ఎన్.వంశీతోపాటు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన 14 మంది నాయకులు పాల్గొన్నారు.