చిత్తూరు

శ్రీపద్మావతి అమ్మవారికి వైభవంగా వసంతోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 8: తిరుచానూరులో కొలువైన శ్రీపద్మావతి అమ్మవారు కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం, రాత్రి సమయాల్లో రోజుకు రెండు వాహనాలపై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తూ... అలసిన సందర్భంగా అమ్మవారికి ఉపశమనం కోసం శనివారం ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో వసంతోత్సవాన్ని నిర్వహించారు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయంలోని ముఖ మండపంలో వేడుకగా వసంతోత్సవం జరిగింది. అర్చకులు భక్తులు ఆహ్లాదంగా వసంతాలు చల్లుకున్నారు. ఈసందర్భంగా టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో శ్రీపద్మావతి అమ్మవారు అలసిన కారణంగా ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలను నిర్వహించినట్లు చెప్పారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం నిర్వహించినట్లు తెలిపారు. వసంతోత్సవాల అనంతరం అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందన్నారు. కాగా ఆదివారం సాయత్రం 4 గంటలకు స్వర్ణ రథోత్సవం, రాత్రి గరుడ వాహన సేవ వేడుకగా జరుగుతుందని అన్నారు. 12వ తేదీ పంచమీతీర్థానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, అన్నప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జేఈఓ పోల భాస్కర్, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఝాన్సీరాణి, సహాయ కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

కన్నులపండువగా లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర
తిరుపతి, డిసెంబర్ 8: తిరుమల శ్రీవారికి ప్రతి పౌర్ణమి గరుడసేవ రోజున అలంకరించే లక్ష్మీకాసుల హారం శోభాయాత్ర శనివారం తిరుచానూరులో వైభవంగా జరిగింది. ముందుగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ హరీంధ్రనాథ్, పేష్కార్ రమేష్, బొక్కసం బాధ్యులు గురురాజారావు కలిసి లక్ష్మీకాసుల హారాన్ని తిరుచానూరు రోడ్డులోని శిల్పారామం వద్దకు తీసుకువచ్చి జేఈఓ పోల భాస్కర్‌కు అందజేశారు. అక్కడ నుంచి కాలినడకన తీసుకువెళ్లి టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్‌కు అందించగా ఆయన తిరుచానూరులోని పసుపుమండపం వద్ద ఆలయ అర్చకులకు అందించారు. ఈసందర్భంగా కాసులహారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళవాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ శోభాయాత్రగా మాడవీధుల గుండా ఆలయానికి తీసుకువెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన ఈ లక్ష్మీకాసుల హారాన్ని గజవాహనం, గరుడువాహన సేవల సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి అలంకరించనున్నట్లు తెలిపారు. స్థానికాలయాల్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ, గజ వాహనాల్లో అలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో గోపీనాథ్ జెట్టి, ఆలయ డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి, విజిఓ అశోక్‌కుమార్ గౌడ్, ఏఈఓ సుబ్రహ్మణ్యం, ఏవీఎస్వోలు నందీశ్వర్, కూర్మారావు, సురేంద్ర, రాజేష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

వీధి విక్రయదారులకు ఆర్థిక భరోసా కల్పించాలి
* జాతీయ రహదారుల ప్రాముఖ్యతను గుర్తించాలి
* విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు * జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న

చిత్తూరు, డిసెంబర్ 8: వీధి విక్రయదారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. శనివారం జిల్లా సచివాలయంలోకలెక్టర్ మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ పరిధిలో వీధి విక్రయదారులకు రుణాలు మంజూరుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. మున్సిపల్ పట్టణాల్లో వీధి విక్రయదారులకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు వివిధ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి వారికి నెలకు పది వేల రూపాయలు ఆదాయం వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. మున్సిపాల్టీ పరిధిలో నిరాశ్రయులైన వీధి విక్రయదారులకు ప్రత్యేక వసతి సదుపాయాలు కల్పించాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి పథకాలను ప్రజలకు సక్రమంగా అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని శాఖలు తమ లక్ష్యాలను అధికమించడంలో నిర్లక్ష్యం వ్యహరిస్తున్నాయని, ఇకపై అలా కొనసాగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ముద్రా రుణాలను పెంచాలని అధికారులను ఆదేశించారు. అన్ని మున్సిపాల్టీ కార్పొరేషన్ పరిధిలో అధికార తెలుగుభాష విధిగా అమలు కావాలన్నారు. అన్ని బోర్డులు డిసెంబర్ 31లోగా తెలుగులోనే ఉండాలన్నారు. గృహాల మంజూరును కూడా వేగవంతం చేయాలన్నారు. ప్రజల జీవన విధానంలో మార్పులు వచ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, 2019 మార్చి నాటికి చెత్తసేకరణ విధిగా నూటికి నూరుశాతం కొనసాగాలన్నారు. అంతకు ముందు కలెక్టర్ జాతీయ రహదారుల నిర్మాణంపై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జాతీయ రహదారుల సమస్యలను గుర్తించి ఈ పనులను మరింత వేగవంతంగా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో కొనసాగుతున్న జాతీయ రహదారుల పనులపై ఆరా తీసారు. జిల్లాకు జాతీయ రహదారులు ఒక వరమని ఈ పనులు పూర్తి అయితే పలు రంగాల్లో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అధికారులు ఈ పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా కృషి చేయాలన్నారు. జాతీయ రహదారి పనులకు సంబంధించి 46 గ్రామాల భూసేకరణకు సంబంధించి అన్ని పనులు ఈనెల 14వ తేదీ లోపు పూర్తి చేయాలని ఆర్డీవో మల్లికార్జున్ ఆదేశించారు. తిరుపతి-నాయుడుపేట పనులకు సంబంధించి భూపరిహారాన్ని పూర్తి చేసి టెండర్లు దిశగా చర్యలు చేపట్టాలన్నారు. పీలేరు-మదనపల్లి, మదనపల్లి-రాయచోటి, పలమనేరు-కృష్ణగిరి అన్ని పనులు వేగవంతం కావాలని ప్రతి వారం ఈ పనులపై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ భూసేకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ గిరీషా, జేసీ 2 చంద్రవౌళి, తిరుపతి, మదనపల్లి సబ్‌కలెక్టర్లు మహేష్‌కుమార్, కీర్తి, ఎన్‌హెచ్‌డీఈ హరిప్రసాద్‌తో పాటు పలువురు మున్సిపల్ కమిషనర్లు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

రామమందిర నిర్మాణమే హిందువుల సంకల్పం
* విహెచ్‌పి అఖిల భారత సంయుక్త ప్రధానకార్యదర్శి రాఘవులు స్పష్టీకరణ
తిరుపతి, డిసెంబర్ 8: అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని యావత్ భారతదేశంలోని హిందుల సంకల్పమని విశ్వహిందూ పరిషత్ అఖిల భారత సంయుక్త ప్రధాన కార్యదర్శి ఎక్కలి రాఘవులు అన్నారు. శనివారం స్థానిక ఇందిరామైదానంలో అయోధ్య శ్రీ రామజన్మభూమి మందిర శీఘ్ర నిర్మాణ సంకల్ప సభ జరిగింది. సభ ప్రారంభానికి ముందు స్థానిక బైరాగిపట్టెడ నుంచి ఇందిరామైదానం వరకు దాదాపు 200 మందితో విహెచ్‌పి విభాగ్ కార్యదర్శి కురవ సుబ్బన్న, తిరుపతి అసెంబ్లీ నియోజక వర్గ బీజేపీ కన్వీనర్ ఆకుల సతీష్‌ల ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ జరిగింది. ఈసందర్భంగా పలువురు స్కేటింగ్ చేస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో ఆకుల సతీష్ వారి మధ్య వీహెచ్‌పీ జెండాను చేతపట్టుకుని కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు జై శ్రీరామ్ నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించారు. అనంతరం ఇందిరామైదానంలో జరిగిన సభలో విహెచ్‌పి జాతీయ ప్రధానకార్యదర్శి ఎక్కలి రాఘవులు మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం నేడు చేపట్టిన కార్యక్రమం కాదన్నారు. ఎన్నికలకు ముందు రామజన్మభూమి అంశాన్ని బీజేపీ తెరపైకి తెస్తోందన్నది పూర్తి అవాస్తవమని అన్నారు. గత 490 సంవత్సరాలుగా రామజన్మభూమి అంశం నలుగుతూనే ఉందని, ఎందరో దేశభక్త కార్యకర్తలు తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. 1964లో ఉద్ధృతమైన ఈ ఉద్యమం బాధ్యతలను విశ్వహిందూ పరిషత్‌కు పూజ్య సాధుసంత్ సమాజం అప్పగించిందని వివరించారు. ఆనాటి నుంచి శిలాపూజ, కరసేవ, పాదుకాపూజ, హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ముందుకు వెళుతున్నామని చెప్పారు. రామజన్మభూమి ప్రాంతంలో మందిరం కూల్చబడి, మసీదు నిర్మాణం జరిగిందని స్పష్టమైందని అన్నారు. యావత్ హిందూ భారత సమాజం రామ మందిర నిర్మాణానికి వేయికళ్లతో ఎదురుచూస్తోందన్నారు. అయితే కోర్టు తీర్పు అనుకూలంగాను, మరోసారి ప్రతికూలంగా వచ్చిందన్నారు. ఈ విషయంలో కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందన్న నమ్మకం హిందూ సమాజానికి లేదని ఆయన అన్నారు. ఈవిషయంలో పార్లమెంట్‌లో శాసనం చేయడం ఒక్కటే సాధ్యమని నమ్ముతున్నామన్నారు. ఇందులో భాగంగానే రాష్టప్రతికి, ఎంపీలకు వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతోందన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం త్వరగా జరగాలని ఆకాంక్షతో యావత్ హిందూ సమాజం దీక్షాబద్దులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస మంగాపురం శ్రీ లలితా పీఠ సంస్థాపకులు స్వరూపానంద గిరిస్వామి, రాజుపాళెంకు చెందిన శివనానంద స్వామి, కైలాసకోనకు చెందిన కైలాసానందగిరి స్వామి, జయచంద్ర స్వామి, విహెచ్‌పి విభాగ్ కార్యదర్శి కురవ సుబ్బన్న, జిల్లా ఉపాధ్యక్షురాలు మురళి తదితరులు పాల్గొన్నారు.

ఏపీలోనైనా ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించండి
* తెలంగాణ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశారు * లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ
తిరుపతి, డిసెంబర్ 8: తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేశాయని, 2019లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికలనైనా ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ దృష్టిసారించాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పాక్-ఇండియా క్రికెట్ మ్యాచ్‌ను తలపించాయన్నారు. నేతలు నీతులు మరచిపోయి ప్రజల స్వేచ్చను హరించారని, విలువలు, విధానాలకు పూర్తిగా తిలోధకాలిచ్చారన్నారు. తెలంగాణ ఎన్నికల నిర్వహణ తీరును గమనిస్తే ఎన్నికల వ్యవస్థ మొద్దునిద్ర పోయినట్ల స్పష్టంగా కనిపించిందన్నారు. ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పెరుగుతున్న నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు, విద్య, ఆరోగ్యం ఇతర అంశాల గురించి పట్టించుకోలేదన్నారు. కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితమయ్యారన్నారు. కులాల పేరుతో ఓటర్లలో చీలికలు తెచ్చేందుకు నిసిగ్గుగా ప్రయత్నించారని అన్నారు. ఏపీలో ప్రజా సమస్యలను పట్టించుకోని సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తెలంగాణలో తిష్టవేశారని అన్నారు. ఈ నేపథ్యంలో విభజన హామీలపై లోక్‌సత్తా పార్టీ రాష్టస్థ్రాయిలో ప్రత్యేక ఉద్యమం చేపడుతోందని, అందులో భాగంగా ఈనెల 19, 20 తేదీల్లో విజయవాడలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రమణ్యం, రాష్ట్ర నాయకుడు కొప్పోలు రామారావు, జిల్లా నాయకులు రాఘవరెడ్డి, సత్యనారాయణ, నగర నాయకుడు బెల్లంకొండ సురేష్, మునిచంద్ర, హేమాద్రి తదితరులు పాల్గొన్నారు.

‘తిరుపతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసింది బీజేపీనే’
తిరుపతి, డిసెంబర్ 8: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీపై ప్రత్యేక అభిమానంతో తిరుపతిని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తోందని బీజేపీ జిల్లా ప్రచార కార్యదర్శి గుండాల గోపీనాధరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కట్టమంచి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మంచాల నాగేశ్వరాచారి ఆధ్వర్యంలో శనివారం స్థానిక చిన్నగుంట, మంచినీళ్ల గుంట ప్రాంతాల్లో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా ఏపీకి కేంద్రం అందించిన నిధులు, చేపట్టిన ప్రాజెక్టులు గురించి ప్రత్యేకంగా ముద్రించిన కరపత్రాలను పంచిపెట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే దేశం, రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతాయనడంలో సందేహం లేదన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉన్నప్పుడు తిరుపతిని స్మార్ట్‌సిటీగా ఎంపిక చేసి, అభివృద్ధికి నిధులు కేటాయించిన విషయం మరచిపోరాదన్నారు. అమృత పథకం ద్వారా ప్రజలకు 24 గంటలు మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు. జిల్లాలోని జాతీయ రహదారులను నాలుగు లైన్ల రోడ్లుగా అభివృద్ధి చేయడం, 7 ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారన్నారు. అందులో భాగంగానే ఎస్వీయూ రైల్వేగేటు వద్ద, నరసింగాపురం రైల్వేగేటు వద్ద, చిత్తూరు-తిరుపతి రహదారిలో మూడు, పీలేరులో ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపడుతున్నట్లు వారు చెప్పారు. ఇవి పూర్తయితే ప్రజలకు అనేక సమస్యలు తొలగిపోతాయన్నారు. ఈకార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కోశాధికారి అక్కెపల్లి మునికృష్ణ యాదవ్, జెడ్‌ఆర్‌యూసీసీ సభ్యుడు వల్లెపల్లి ప్రసాద్, నాయకులు గంధం వెంకటముని, రమేష్‌బాబు, ఆముదాల సుబ్రమణ్యంశెట్టి, జయంత్ కుమార్, టపాసుల మునికృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో బీజీపీకి అండగా నిలవండి
దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి, దేశ సమగ్రత, ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న పథకాలను చూసి ప్రపంచ దేశాలే ప్రశంసిస్తున్నాయని రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భానుప్రకాష్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్, తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ ఆకుల సతీష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునిసుబ్రమణ్యం, కొత్తపల్లి అజయ్,జిల్లా ప్రచార కార్యదర్శి గుండాల గోపీనాధరెడ్డి కోరారు. ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ఇందిరనగర్‌లో కరపత్రాలను పంచిపెట్టి బీజేపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, దేశభక్తితో ప్రధాని మోదీ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని వివరించారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో మునిగి తేలుతూ తమను ప్రశ్నించేవారిపై అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ఓటువేసి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈకార్యక్రమంలో నగర అధ్యక్షుడు వరప్రసాద్, సీనియర్ నాయకులు ఎంఆర్ రాజా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొనగంటి భాస్కర్, నాయకులు మునికృష్ణ యాదవ్, హేమ కిరణ్, హర్షవర్థన్, సుబ్బు యాదవ్, జీవా రాయల్ తదితరులు పాల్గొన్నారు.

పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ ఫలాలు
* మంత్రి అమరనాథ్‌రెడ్డి
గంగవరం, డిసెంబర్ 8: పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నట్లు మంత్రి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. శనివారం మండల పరిధిలోని పత్తికొండ, కీలపల్లి తదితర గ్రామాల్లో గ్రామదర్శిని కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా తెలుగుదేశ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అర్హులైన వారికి అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని తెలుసుకోవడంతో పాటు స్థానిక సమస్యలు పరిష్కారం కోసమే గ్రామదర్శిని కార్యక్రమం జరుపుతున్నామన్నారు. పలమనేరు నియోజకవర్గంలో అర్హులైన వారందరికీ 90శాతం పింఛన్లు, రేషన్ కార్డులు పంపిణీ చేసామన్నారు. చంద్రన్న పెళ్లికానుక, చంద్రన్న బీమా వంటి కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నామన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు వివరించారు. అన్ని గ్రామాలకు లింకురోడ్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానిదే అన్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి అందని వారు 1100కు ఫోన్ చేసి పొందవచ్చన్నారు. అనంతరం బెంగుళూరు రోడ్డు నుంచి బాలేపల్లి వరకు నిర్మించే రోడ్డు పనులను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. జనవరిలో హంద్రీ-నీవా జలాలు జిల్లాకు రావడం జరుగుతుందని, దీనితో తాగు, సాగునీరు సమస్య తీరుతోందన్నారు. పింఛన్లు, నిత్యావసర సరుకులు పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. నిరుద్యోగభృతి కూడా అందిస్తున్నట్లు తెలిపారు. ఈసందర్భంగా పలు గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మంత్రి పరామర్శ:
మండలంలోని పత్తికొండ పంచాయతీ పరిధిలో పలువురిని మంత్రి శనివారం పరామర్శించారు. గోవిందశెట్టిపల్లికి చెందిన సంఘమిత్ర రాజప్ప ప్రమాదంలో మృతి చెందడంతో మంత్రి వారి స్వగ్రామానికి చేరుకొని ప్రమాద సంఘటనపై ఆరా తీసారు. ఈ సందర్భంగా కుటుంబీకులతో పాలు గ్రామస్థులను కలసి పరామర్శించారు. అదే విధంగా అటుకురాళ్లపల్లెకు చెందిన శ్రీనివాసులు కుమారుడు లిఖిత్(3) అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే పత్తికొండకు చెందిన కృష్ణయ్యశెట్టి భార్య లక్ష్మీదేవమ్మ మృతి చెందడంతో వారి కుటుంబీకులను కలసి తన సంతాపాన్ని తెలియచేసి సానుభూతిని వ్యక్తపరిచారు.

11న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, డిసెంబర్ 8: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని ఈనెల 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ తిరుమంజనం ఉత్సవాన్ని పురస్కరించుకుని అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఇతర ఆర్జిత సేవలు యథాతథంగా జరుగుతాయి. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు, శ్రీవారి ఆలయంలోని ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రంగా కడుగుతారు. ఈ సమయంలో స్వామివారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పివేస్తారు. శుద్ధి పూర్తయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలీ గడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
నేడు బేడీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అభిషేకం
తిరుపతి, డిసెంబర్ 8: తిరుమలలోని శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారికి ఈనెల 9వ తేదీన ప్రత్యేక అభిషేకం జరుగనుంది. ప్రతి ఏడాదీ కార్తీకమాసం చివరి ఆదివారం ఇక్కడ స్వామివారికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 8 నుంచి 9 గంటల నడుమ విశేషంగా అభిషేకం చేస్తారు. పురాణాల ప్రకారం తిరుమలలోని శ్రీ బేడీ ఆంజనేయ స్వామివారి ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అంజనీపుత్రుడైన ఆంజనేయుడు ఎంతో బలవంతుడు. అంతకుమించి పరమ భక్తుడు. త్రేతాయుగంలో శ్రీరామావతారంలో శ్రీమన్నారాయణునికి సేవకుడిగా, స్నేహితుడిగా, భక్తుడిగా దాస్యభక్తిని చాటాడు. ప్రస్తుతం కలియుగంలో సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల పూజలను అందుకుంటున్నారు.

ఫారం పాండ్స్‌లో జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు

చిత్తూరు, డిసెంబర్ 8: ఉపాధి హామి పథకం ఆనుసంధానంతో అత్యధికంగా ఫారం పాండ్స్ తవ్వకంలో జిల్లాకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా ఫారం పాండ్స్ తవ్వి అరుదైన రికార్డు సాధించడంతో రాష్ట్రంలోనూ జాతీయ స్థాయిలో జిల్లాకు ఈ గుర్తింపు వచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిక ఆన్‌లైన్ నివేదిక ప్రకారం జిల్లాకు ఈ గుర్తింపు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా 1,00,743్ఫరం పాండ్స్ తవ్వి జిల్లా అగ్రగామిగా నిలవగా, అనంతపురం జిల్లా రెండవ స్థానంలోనూ , కడప జిల్లా మూడవ స్థానంలో నిలిచినట్లు వివరించారు. ఈ అరుదైన ఘనతను సాధించడానికి ప్రజాప్రతినిధులు, రైతులు, ఉపాధి హామీ సిబ్బంది సహకారం ఎంతో ఉందని కలెక్టర్ తెలిపారు.