చిత్తూరు

వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదోరోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథం 10 గంటలవరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో సాగింది. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో ప్రకాశించే అలమేలు మంగ సకలదేవతా పరివారంతో వైభవోపేతంగా తిరువీధుల్లో విహరించే వేళలో ఆ తల్లిని సేవించిన భక్తుల మనోరథాలన్నీ సిద్ధిస్తాయి. శరీరం-రథం, ఆత్మ-రథికుడు, బుద్ధి-సారధి, మనస్సు-పగ్గాలు, ఇంద్రియాలు-గుర్రాలు, ఇంద్రియ విషయాలు రథం నడిచే త్రోవలు. రథం రథికుణ్ణి చూడమంటుంది. రథికుడు పగ్గాల సాయంతో గుర్రాలను అదిలిస్తూ దారుల వెంబడి పరుగులు తీయించినట్లే ఇంద్రియాలతో, మనస్సుతో కూడిన ఆత్మ విషయాల్ని అనుభవిస్తూ ఉంటుంది. రథోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. భక్తుల హృదయక్షేత్రాలలో తాత్త్వికబీజాలు విత్తే ఒక యజ్ఞం. సింగారించిన పాలకడలి గారాలపట్టిని దర్శించిన వారికి జన్మాది దుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథోత్సవం అనంతరం మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు రథ మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద జియ్యంగార్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, టీటీడీ తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌జెట్టి, అదనపు సీవీఎస్‌ఓ శివకుమార్ రెడ్డి, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి ఝాన్సీరాణి, వీజీఓ అశోక్‌కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
అశ్వవాహనంపై లోకరక్షణి
అలాగే రాత్రి 8 గంటల నుంచి 11గంటల వరకు అశ్వవాహనంపై కల్కి అవతారంలో అమ్మవారు విహరించారు. అశ్వంవేగంగా పరిగెత్తే అందమైన జంతువు. అందుకే ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలుగా అభివర్ణిస్తున్నాయి. అలమేలుమంగ అన్ని కోరికలను తీర్చడంలో ఒకే ఒక ఉపాయంగా, సౌభాగ్యంగా ఆర్ష వాజ్ఞ్మయం తెలియజేస్తోంది. పద్మావతి శ్రీనివాసుల తొలిచూపువేళ, ప్రణయవేళ, పరిణయవేళ సాక్షిగా అశ్వం నిలిచింది. పరమాత్ముడైన హరి పట్టపురాణి అలమేలుమంగ అశ్వవాహన సేవాభాగ్యాన్ని పొందుతున్న భక్తులకు కలిదోషాలను తొలగిస్తుంది.

వ్యవసాయ రంగంలో రాష్ట్రం ఆదర్శం
* వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

చిత్తూరు, డిసెంబర్ 11: వ్యవసాయ రంగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో రైతు రుణమాఫీ వినతుల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంతో అప్పుల్లో కూరుకుపోయిన రైతులకు చేయూతనివ్వాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఈ రుణమాఫీ కార్యక్రమం చేపట్టిందన్నారు. విభజన నేపథ్యంలో ఆర్థిక సంక్షోబంలో ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు భరోసా కల్పించాలనే సంకల్పంతో ఈ రుణమాఫీని అమలు చేశారన్నారు. రుణమాఫీ కార్యక్రమం దేశంలోనే పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. 16వేల కోట్ల లోటుబడ్జెట్ ఉన్నా రైతుల కోసం 24వేల కోట్లు రుణమాఫీ కింద ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఇప్పటికి సుమారు మూడుదఫాలుగా 15వేల కోట్లు రైతులకు రుణామాఫీ అందచేసామని, రానున్న రెండు నెలల్లో పూర్తిస్థాయిలో ఈ రుణమాఫీని ప్రతి ఒక్క రైతుకు అందిస్తామన్నారు. మరో రెండు విడతల్లో సుమారు ఎనిమిదివేల కోట్లు అందించడానికి చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేకూర్చడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మరోపక్క రాయితీ ద్వారా ఎరువులు, విత్తనాలు, ఇతర యంత్రాలను కూడా ఇస్తున్నామన్నారు. వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఇటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులకు కూడా ఆర్థిక భరోసా ఇస్తున్నామన్నారు. 10.5శాతం వ్యవసాయ వృద్ధిరేటు సాధించి ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రగామిగా నిలవటం గొప్ప విషయమన్నారు. అయితే ఈ రుణమాఫీ పరంగా కొన్ని బ్యాంకులు, ఇతర సిబ్బంది చేసిన తప్పుల కారణంగా పలువురు రైతులకు ప్రయోజనం అందలేదని, ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ప్రత్యేక పరిష్కార వేదికలు ఏర్పాటు చేసామన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం కొనసాగించి రుణమాఫీ వర్తించే ప్రతి రైతుకు లబ్ధి చేకూర్చామని, ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన రుణమాఫీ పరిష్కార వేదిక జిల్లాలోని అందరి రైతులు సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, దీనిని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పలు రాష్ట్రాలకు కేంద్రం విరివిగా నిధులు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని రైతులు గుర్తించాలన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి మాట్లాడుతూ రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. దశల వారీగా రైతులు రుణమాఫీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. వివిధ కారణాలతో రుణమాఫీ అందని రైతులకు కూడా లబ్ధి చేకూర్చడానికే ఈ పరిష్కార వేదిక ఏర్పాటుచేసినట్లు వివరించారు. జిల్లాలో మామిడి రైతులను ఆదుకోవడానికి మామిడికి గిట్టుబాటు ధర కల్పించిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనన్నారు. జిల్లాలో పండ్ల తోటలు, కూరగాయలు, పట్టుపరిశ్రమకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు సాంకేతిక పరిజ్ఞానం పట్ల మక్కువ చూపాలన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వానికి రైతులు అండగా నిలవాలన్నారు. కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ జిల్లాను కరువురహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రకృతి వ్యవసాయంలో జిల్లా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందన్నారు. జిల్లాలో 1.80లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం సాగవుతోందన్నారు. జిల్లాలో కరువును అధిగమించడానికి ఉద్యాన పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు కూడా పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేయాలని, అప్పుడే అధిక లాభాలు సాధించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణిచంద్రప్రకాష్, ఎమ్మెల్సీ దొరబాబు, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, నగర మేయర్ కఠారి హేమలత, వ్యవసాయశాఖ జేడీ విజయకుమార్, దేశం నేతలు నాని, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

గంగమ్మకు బంగారు తాళిబొట్టు వితరణ
తిరుపతి, డిసెంబర్ 11: శ్రీకాళహస్తిలో నిర్వహిస్తున్న ఏడు గంగమ్మల ఉత్సవాల సందర్భంగా పెళ్లిమండపం వద్ద నిలిపే పొన్నాలమ్మకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సామాను శ్రీ్ధర్‌రెడ్డి రూ. 50,116లు విలువైన బంగారు సరుడును వితరణగా ఇచ్చారు. శ్రీకాళహస్తి వైకాపా ఇన్‌చార్జ్ బియ్యపుమధుసూదన్‌రెడ్డి కుమార్తె బియ్యపు పవిత్ర వెండి ఉడుపులు, విశేష స్వర్ణ్భారణాలు విరాళంగా ఇచ్చారు. ఈ ఆభరణాలను మంగళవారం బియ్యపు పవిత్ర, వైకాపా జిల్లా అధికార ప్రతినిధి అంజూరు శ్రీనివాసులు మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయ కమిటీకి నిర్వాహకులకు అందజేశారు. అనంతరం పవిత్రమాట్లాడుతూ ఈ ఆభరణాలను తన తండ్రి అమ్మవారికి తయారుచేయించి ఇచ్చారని, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని పొన్నాలమ్మను ప్రార్థించారన్నారు. గత దశాబ్ధన్నర కాలంగా మహాశివరాత్రి పర్వదినాల్లో ఆలయ మాడవీధుల్లో ఉన్న పెళ్లి మండపం వద్ద స్వామి, అమ్మవార్లకు నిర్వహించే కల్యాణోత్సవం రోజున ముత్యాల తలంబ్రాలు కూడా అందించే సంప్రదాయాన్ని తనతండ్రి బియ్యపు మధుసూదన్‌రెడ్డి అనుసరిస్తున్నారన్నారు. అదే సమయంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం రోజున వివాహం చేసుకునేవారికి తాళిబొట్లను కూడా అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పగడాల రాజు, ఆలయ కమిటీ సభ్యులు స్వర్ణమూర్తి, శేఖర్, కార్తీక్, రమేష్ రాయల్, జయశ్యాం రాయల్, యానాదయ్య, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
ఏడు వారాల నగలను ఊరేగింపుగా తీసుకెళ్లిన ఆలయ కమిటీ సభ్యులు
పొన్నాలమ్మకు గత యేడాది బెంగళూరుకు చెందిన ఓ భక్తుడు అందించిన వివిధ రకాల బంగారు, వెండి ఆభరణాలను కమిటీ సభ్యులు స్వర్ణమూర్తి, శేఖర్, కార్తికేయ ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించారు. పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ జాతరలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ దంపతులు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు తనయుడు దిలీప్, వజ్రం కిషోర్, జనసేన నాయకుడు విజయ్‌కుమార్, వైకాపా నాయకులు పవిత్రారెడ్డి, శ్రీనివాస్, పగడాల రాజు తదితర నగర పట్టణ పెద్దలు పాల్గొన్నారు.
ఏడు గంగమ్మలకు సారె అందించిన టీటీడీ
శ్రీకాళహస్తి ఏడు గంగమ్మల జాతర సందర్భంగా ప్రతి ఏడాది టీటీడీ అమ్మవార్లకు సారె అందించే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అమ్మవార్ల జాతరను పురస్కరించుకొని టీటీడీ ధర్మప్రచార పరిషత్ జిల్లా సభ్యులు పోతల రాజకుమార్ అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయం నుంచి ఏడు గంగమ్మల జాతర నిర్వహించే ముత్యాలమ్మ గుడివీధిలోని ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపులో అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

వికృతమాల వద్ద భూములు పరిశీలించిన జేసీ గిరీషా
* భూముల పత్రాలను తహశీల్దార్‌కు అప్పగించాలని ఆదేశం
తిరుపతి, డిసెంబర్ 11: వికృతమాల వద్ద టీసీఎల్ కంపెనీకి అందించనున్న డీకేటీ భూములను జిల్లా జాయింట్ కలెక్టర్ గిరీషా మంగళవారం పరిశీలించారు. ఏర్పేడు మండలం వికృతమాల ఈఎంసీఈ2 క్లస్టర్ వద్ద టీసీఎల్ కంపెనీకి భూములు అందించనున్న నేపథ్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జేసీ రైతులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ భూములపై అభ్యంతరాలుంటే రైతులు త్వరగా తెలియజేయాలని, ఇప్పటికే దీనిపై నోటీసులు జారీ చేశామన్నారు. డీకేటీ భూములకు సంబంధించిన పత్రాలను వెంటనే ఏర్పేడు తహశీల్దార్‌కు అప్పగించాలన్నారు. వాటిని పరిశీలించి పరిహారం రైతుల ఖాతాలకు జమచేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతం ఎలక్ట్రానిక్స్‌కు నెంబర్‌వన్‌గా నిలువనుందని, ఇందుకు రైతులు సహకరించాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి ఇక్కడ టీసీఎల్ కంపెనీకి శంకుస్థాపన చేస్తారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏర్పేడు తహశీల్దార్ సుబ్బన్న తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ కోఆర్డినేటర్లకు ఆండ్రాయిడ్ ఫోన్లు పంపిణీ
* బూత్ కన్వీనర్లను సమన్వయం చేసుకుని పనిచేయండి * టీడీపీ నాయకులకు నేతల క్లాస్
తిరుపతి, డిసెంబర్ 11: తిరుపతి-రేణిగుంట మార్గమధ్యంలోని ఓ ప్రైవేట్ హోటల్లో శ్రీకాళహస్తి, తిరుపతి, వెంకటగిరి, సత్యవేడు నియోజక వర్గాలకు చెందిన టీడీపీ ఏరియా కో ఆర్డినేటర్ల నిర్వహించిన సమావేశంలో మంగళవారం ఆండ్రాయిడ్ ఫోన్లను అందించారు. గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ సమావేశంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పార్టీని ఎలా పటిష్టం చేయాలన్నదానిపై తరగతులు నిర్వహించారు. ప్రతి బూత్ కన్వీనర్లు, సేవా మిత్రల ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు, ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతున్న వివిధ పథకాల సమాచారం, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాల్సిన అవసరం గురించి తెలిపారు. ఈ సందర్భంగా దాదాపు 150 మంది కో ఆర్డినేటర్లకు రూ. 11వేలు విలువచేసే ఆండ్రాయిడ్ ఫోన్లను కేవలం రూ. 1120లకు అందించారు. ఈ ఫోన్ ద్వారా టీడీపీ ప్రత్యేక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని తమకు కేటాయించిన వార్డుల్లోని సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందులో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం సీఎం డాష్‌బోర్డుకు సైతం అందే అవకాశం ఉండటంతో ఎక్కడా పొరబాట్లకు తావులేకుండా చూడాలని నాయకులకు సూచించారు. ఈ సమావేశంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తిరుపతి నియోజక వర్గానికి చెందిన టీడీపీ కో ఆర్డినేటర్లు డాక్టర్ ఆశాలత, ఎన్.విజయలక్ష్మి, సూరా సుధాకర్ రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, పుష్పా, సింధూజ, కుమారి, శ్రీనివాసులు చౌదరి, బుల్లెట్ రమణ తదితరులు పాల్గొన్నారు.

నగరపాలక సంస్థ అధికారులతో ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ భేటీ
తిరుపతి, డిసెంబర్ 11: నగరపాలక సంస్థ కార్యాలయంలోని వైఎస్‌ఆర్ భవన్‌లో మంగళవారం ఫోర్ట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ జి.నాంచారయ్య అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 2019 సంవత్సరానికి నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో కాలువలు, రోడ్లు నిర్మాణానికి, తాగునీటి పైపుల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలను సిద్ధం చేసి అందించాలన్నారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ విజయరామ రాజు మాట్లాడుతూ నగర జనాభా రోజు రోజుకు పెరుగుతున్న కారణంగా ప్రజలకు అవసరమైన వౌలిక వసతుల కల్పన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్తగా తాగునీటి పైప్‌లైన్లు వేయడానికి, యూడిఎస్ కనెక్షన్లు, రోడ్లు, కాలువలు, పార్కులు, వాటర్ ట్యాంకులు ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.జయసింహులు నాయుడు, ప్రొఫెసర్ బి.నాగరాజు, తిరుమల భాస్కర్, వి.సత్యనారాయణ, తిరుపతి నగరపాలక సంస్థకమిషనర్ విజయరామ రాజు, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేష్, శ్రీకాహస్తి కమిషనర్ రమేష్, నగరి కమిషనర్ సాంబయ్య, పుత్తూరు, మదనపల్లి, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

‘రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో వైకాపాదే అధికారం’
చిత్తూరు, డిసెంబర్ 11: రాష్ట్రంలో వచ్చే 2019 ఎన్నికల్లో వైకాపాదే అధికారమని వైకాపా చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని వైకాపా కార్యాలయంలో ఆ పార్టీ చిత్తూరు నియోజకవర్గ బూత్‌కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జంగాలపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార టీడీపీ పరిస్థితి దారుణంగా పడిపోయిందని, అందుకు మంగళవారం విడుదలైన తెలంగాణా ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న టీడీపీ అవినీతి, అక్రమ పాలనపై ప్రజలు విసిగివేసారిపోయారని చెప్పారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టీఆర్‌ఎస్ తరహాలో తమ పార్టీ ఏకంగా 150కిపైగా సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. వైకాపాను బలోపేతం చేయడానికి చిత్తూరు నగరంలోని 50 డివిజన్లు, నియోజకవర్గం పరిధిలోని గుడిపాల, చిత్తూరు రూరల్ మండలంలోని పార్టీ కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచలోనే ఏ నాయకుడూ చేయని సాహసం తమ పార్టీ నాయకుడు జగన్ చేస్తున్నారని, రికార్డు స్థాయిలోప్రజాసంకల్ప యాత్ర చేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాకంఠక పాలన చేస్తున్నారని, ఆయన పీడ వదిలించుకోవడానికి ఆత్రంగా ఎదురు చూస్తున్నట్లు ప్రజలు తమవద్ద వాపోతున్నారని వివరించారు. చిత్తూరు నగరంలో చేపడుతున్న కావాలి జగన్-రావాలి జగన్ కార్యక్రమానికి నగరవాసుల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, జనవరి నుంచి నియోజకవర్గ పరిధిలోని చిత్తూరు రూరల్, గుడిపాల మండలాల్లో కావాలి జగన్-రావాలి జగన్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణా ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ సీనియర్ రాజకీయ నాయకుడు లగడపాటి రాజగోపాల్ సీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి మాయల ఫకీరులా మహాకూటమి విజయం సాధిస్తుందని చెప్పడం చిలకజోస్యంగా మిగిలిపోయిందని ఎద్దేవా చేశారు. కూటమితో కలిసి పోటీ చేసినా టీడీపీ రెండంకెల సీట్లను గెలుచుకోలేక పోవడం దారుణమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీడీపీకి ఇదేగతి పట్టడం ఖాయమని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎంఎస్ బాబు, నాయకులు పురుషోత్తంరెడ్డి, కృష్ణారెడ్డి, త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.