చిత్తూరు

వైకుంఠ ఏకాదశి దర్శనానికి 2లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 14: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుదీరి ఉన్న తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ప్రముఖ పర్వదినాల్లో వైకుంఠ ఏకాదశి ఒకటి. వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని వైకుంఠ ద్వారంలో వెళ్లడానికి భక్తులు ఎక్కువగా మొగ్గుచూపుతారు. ఈ నేపథ్యంలో ఈ యేడాది ఈనెల 18న వైకుంఠ ఏకాదశి, 19న ద్వాదశి పర్వదినాల్లో వైకుంఠ ద్వారాన్ని ఎప్పటిలానే తెరచి ఉంచనున్నారు. ఈ క్రమంలో దేశం నలుమూలల నుంచి ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు ముగిసిన ఐదు రాష్ట్రాల నుంచి ప్రముఖులు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ఏకాదశి రోజున వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో 2లక్షల మంది భక్తులు వైకుంఠ ఏకాదశి, ద్వాదశిరోజున స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని అధికారులు అంచనావేసి అందుకు తగినవిధంగా ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రధానంగా వైకుంఠ ఏకాదశి రోజున ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారిని కూడా పరిమిత సంఖ్యలో అనుమతించాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించింది. అయితే గత 20 రోజులుగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన తమకు ఎక్కువ మందికి అనుమతి ఇవ్వాలని, దేశంలోని ప్రముఖుల నుంచి తిరుమల జేఈఓ శ్రీనివాసరాజుకు ఒత్తిళ్లు వస్తున్నాయి. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల నుంచి కూడా ఈ ఒత్తిడి మరింతగా పెరుగుతోంది. ఇటు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు టీటీడీ పాలక మండలి ఛైర్మన్ సభ్యులు, న్యాయమూర్తులు, ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‌ఎస్ స్థాయి అధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైకుంఠ ఏకాదశి రోజున సామాన్య భక్తులు ఎక్కువ సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారని, ఈ యేడాది 2లక్షల వరకు ఉండవచ్చన్న అంచనా వేశారని, ఈ నేపథ్యంలో తమకు సహకరించాలంటూ జేఈఓ శ్రీనివాసరాజు పైరవీకారులకు వివరించి విజ్ఞప్తి చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. మరికొంత మంది రాజకీయ నాయకులు తమదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా, బెదిరింపులకు దిగినా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకొని సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈఓ ఏకే సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజులు దృఢమైన నిర్ణయానికి వచ్చారు. ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వీఐపీలు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా వస్తేనే వారితో పాటు నలుగురిని కూడా అనుమతించాలని కచ్చితమైన నిర్ణయం తీసుకున్నారు. గత యేడాది వైకుంఠ ఏకాదశిరోజున 1,74,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్న విషయం పాఠకులకు విదితమే. భక్తుల ఏర్పాట్లు, సౌకర్యాలకు సంబంధించి టీటీడీ జేఈఓ ఏర్పాట్లను విస్తృతంగా పరిశీలించడమే కాకుండా ప్రతినిత్యం అధికారులతో సమావేశమై ప్రోటోకాల్ వీఐపీలకు, సామాన్య భక్తులకు చేపట్టాల్సిన సౌకర్యాలపై సమీక్షిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాన భక్తులకు తగిన భద్రత కల్పించేందుకు సుమారు 1400 మంది పోలీసులను వినియోగించనున్నారు. వీరితో పాటు శ్రీవారి సేవకులు, స్కౌట్లు, టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది వెరసి రోజుకు మరో 5000 మంది భక్తులకు సేవలందించనున్నారు. వైకుంఠ ఏకాదశిరోజున 1400 మంది పోలీసులతో భద్రత అవసరమా అన్న వాదన కూడా టీటీడీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఎందుకంటే విధులకు వచ్చేవారు వైకుంఠ ఏకాదశిరోజున ఆలయంలోకి వెళ్లడంపై ప్రత్యేక దృష్టిపెడితే వారి వలన ప్రయోజనం కన్నా ఇబ్బందులే ఎక్కువన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినపుడు వారి సంరక్షణ చేపట్టాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉందన్న వాస్తవాన్ని కూడా గుర్తించాలని పోలీసువర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకునే భక్తులు 48 గంటల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నారాయణగిరి ఉద్యానవనాలు ఆలయ నాలుగు మాడవీధుల్లో టీటీడీ ప్రత్యేక షెడ్‌లను ఏర్పాటుచేసింది. నారాయణగిరి ఉద్యానవనాల్లో 18,500 మంది భక్తులు కూర్చొనేందుకు వీలుగా 16 షెడ్లను ఏర్పాటుచేసి 10 సెక్టార్లుగా విభజించారు. మహిళల కోసం 128, పురుషుల కోసం 101 మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. ఆలయ నాలుగు మాడవీధుల్లో 40,000 మంది కూర్చొనేందుకు వీలుగా 14 షెడ్లు ఏర్పాటుచేసి 16 సెక్టార్లుగా విభజించారు. ఈ ప్రాంతాల్లో మహిళల కోసం 176, పురుషుల కోసం 164 మరుగుదొడ్లు ఏర్పాటుచేశారు. మాడవీధుల నుంచి షెడ్‌ల్లోకి వెళ్లే భక్తులను మేదరమిట్ట వద్ద ఏర్పాటుచేసిన ఎన్ 1 గేటు నుంచి అనుమతిస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను కూడా ఏర్పాటుచేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రసారం చేయనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం పర్యవేక్షించేందుకు అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఏది ఏమైనా వైకుంఠ ఏకాదశి రోజున ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించే అంశం అధికారులకు ఒక అగ్నిపరీక్ష అన్నది అక్షరసత్యం.

వైకుంఠ ఏకాదశికి విచ్చేసే భక్తులకు మెరుగైన సేవలందించాలి
* జేఈఓ శ్రీనివాసరాజు ఆదేశం

తిరుపతి, డిసెంబర్ 14: కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 18న జరుగనున్న వైకుంఠ ఏకాదశి పర్వదినాన లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఈక్రమంలో విధులు కేటాయించిన సిబ్బంది మరింత అప్రమత్తతో సేవలందించి టీటీడీ ప్రతిష్టను మరింత ఇనుమడింపచేయాలని జేఈఓ శ్రీనివాసరాజు సూచించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా తిరుమలలో విధులు నిర్వహించడానికి బాధ్యతలు అప్పగించిన సిబ్బందితో శుక్రవారం స్థానిక శే్వత భవనంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఇప్పటికే టీటీడీ కల్పించినట్లు చెప్పారు. భక్తులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు వారి కోసం టీటీడీ ఏర్పాటుచేసిన సదుపాయాలను వారికి సక్రమంగా అందేవిధంగా సిబ్బంది దృష్టి సారించాలన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, ద్వాదశిల పర్వదినాన భక్తులకు కేటాయించడానికి 1000 మంది సిబ్బందికి నిధులు కేటాయించామన్నారు. ఎవరు ఎక్కడ ఎలాంటి విధులు నిర్వహించాలో కూడా విస్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఎఫ్‌ఎ అండ్ సీఈఓ బాలాజీ, సీఈ చంద్రశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ జీఎం శేషారెడ్డి, సీపీఓ శేషశైలేంద్ర, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శర్మిష్ట, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.