చిత్తూరు

మార్చినాటికి బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఫిబ్రవరి 7: బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చినాటికి భర్తీచేయాలని, ఎస్వీబీసీలో రోస్టర్ విధానం అమలుచేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కారెం శివాజీ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత 3 రోజులుగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటిస్తున్న విషయం పాఠకులకు విదితమే. ఇందులో భాగంగా గురువారం ఉదయం స్థానిక పద్మావతి అతిథి భవనంలో ఎస్పీడీసీఎల్, స్విమ్స్, ద్రవిడ యూనివర్శిటీ, ఎస్వీ యూనివర్సిటీలోని బ్యాక్‌లాగ్ పోస్టులు, ఆర్‌ఓఆర్‌లపైన, అర్బన్ పోలీస్ పరిధిలో2011 నుంచి ఉన్న అట్రాసిటీ, ఇతర కేసులపై సంబంధిత అధికారులతో కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ విడతల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు రోజులుగా తాము జరుపుతున్న సమీక్షల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వం జీఓ నెంబర్ 65, 66 మేరకు బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ జరగకపోవడాన్ని గుర్తించామన్నారు. మార్చిలోపు బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు. టీటీడీలో ఎస్సీలకు సంబంధించి 94, ఎస్టీలకు 76, ఎస్వీబీసీలో ఎస్సీలకు 21, ఎస్టీలకు 8, ఎస్పీడీసీఎల్‌లో 214 షిప్ట్ ఆపరేటర్ పోస్టులు, కడపలో 26 ఎస్సీ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వెంటనే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. తిరుపతిలో ఒక ఎస్సీ కాలనీలో విద్యుత్, తాగునీరు లేవని ఫిర్యాదులు అందాయని, తక్షణం 100 శాతం పూర్తిచేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తున్న 100 యూనిట్ల విద్యుత్ రాయితీ జనాభా ప్రాతిపదికన చూస్తే ఎంతోతేడా కనబడుతుందన్నారు. ఈనేపథ్యంలో అర్హులైన వారికి అవగాహన కల్పించి ఉచిత విద్యుత్‌ను వినియోగించే వారి సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఎల్‌ఈడీ బల్బులను పంపిణీచేసిన ఎస్సీ, ఎస్టీకుటుంబాల వివరాలు ఈనెల 14లోపు కమిషన్ ముందు సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎస్పీడీసీఎల్‌లో డీఈగా పనిచేస్తున్న సత్యానంద్‌ను తప్పుడుకేసుల్లో ఇరికించారని అభియోగం ఉందని, న్యాయస్థానంలో తీర్పువచ్చేంత వరకు జీతం చెల్లించాలని డైరెక్టర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. స్విమ్స్‌లో ఎస్సీ బ్యాక్‌లాగ్‌పోస్టులు 59 ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీచేయాలని రిజిస్టర్ కళావత్‌ను ఆదేశించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ శాంతి, లక్ష్మీప్రసన్నల విషయంలో వివక్షత చూపుతున్నట్లు ఫిర్యాదులు అందాయని, వారికి తగిన న్యాయం చేయాలని కారెం శివాజీ ఆదేశించారు. ద్రవిడ విశ్వవిద్యాలయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో యూజీసీ జీతాలు పొందుతూ యూజీస్ రిజిస్టర్‌ను అమలుచేయకపోవడాన్ని గుర్తించామని, వెంటనే చర్యలు చేపట్టాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పెంచులయ్యను ఆదేశించారు. ఎస్వీ యూనివర్సిటీలో నివేదికలో నిర్దేశించిన మేరకు బ్యాక్‌లాగ్‌పోస్టులు భర్తీ కాలేదని, శాశ్వత సిబ్బంది 1070 మంది ఉంటే ఎస్సీలు 10 శాతం, ఎస్టీలు 3.45 శాతం మాత్రమే ఉందని, ఇది దారుణమని, తక్షణం వాటిని భర్తీ చేయాలని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ అనూరాధను ఆదేశించారు. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేరకు 15 శాతం, 6 శాతంతో బ్యాక్‌లాగ్‌పోస్టులు భర్తీచేయడానికి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. ఎస్వీయూ ప్రతిష్ట దిగజార్చేలా విద్యార్థుల మెస్‌బిల్లుల విషయంలో ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర యూనివర్సిటీలు మెస్‌బిల్లులు ఎలా విద్యార్థుల నుంచి తీసుకుంటున్నారో ఆ విధానాన్ని అమలుచేయాలని ఆదేశించారు. 3 నెలల ఏవరేజ్ హాజరుపట్టికను పరిగణలోకి తీసుకొని 75 శాతం హాజరు ఉంటే స్కాలర్‌షిప్ వర్తిస్తుందన్నారు. ఈ మేరకు స్కాలర్‌షిప్ వివరాలను సాంఘిక సంక్షేమ శాఖకు పంపించి పెండింగ్ స్కాలర్‌షిప్‌లు వచ్చేలా చూడాలన్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. వేదిక్ విశ్వవిద్యాలయంలో యూనిక్ పోస్టులు మినహా, ఇంగ్లీష్, మ్యాథ్స్ వంటి ఆచార్యుల పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా విశ్వవిద్యాలయం వీసీ సుదర్శన్ శర్మను కమిషన్ ఆదేశించింది. టీటీడీపై ఆధారపడటం కన్నా యూజీసీ పరిధిలో నిధులు పొందాలంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పనిసరిగా ఉండాలన్న వాస్తవాన్ని విస్మరించకూడదని హెచ్చరించారు. ఈ మేరకు త్వరలో జరుగనున్న టీటీడీ బోర్డు సమావేశంలో ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎస్వీబీసీ అధికారులు కూడా అదేరోజు బోర్డు అనుమతికి రోస్టర్ విధానానికి అనుమతి పొందాలన్నారు. ప్రతి యేడాది సాంఘిక సంక్షేమ శాఖ వద్ద విధిగా ఆడిట్ చేయించుకోవాలన్నారు. గత 20 సంవత్సరాల నుంచి 2019 వరకు జరిగిన అట్రాసిటీ, రేప్‌కేసుల నివేదికను తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కమిషన్‌కు సమర్పించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ కారెం శివాజీ మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులుగా రుజువైతే వారికి జీఓ నెంబర్ 95 మేరకు రూ.8.25లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం, భూమి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. బోర్డుశాఖ ఇలాంటి కేసులను ఎప్పటికప్పుడు గుర్తించి జాప్యం చేయకుండా జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపాలని ఎస్పీని ఆదేశించారు. 2018లో అట్రాసిటీకి సంబంధించి ఒక్క కేసుమాత్రమే ఫైల్ కావడం ఒక శుభపరిణామమన్నారు. ఇదిలా ఉండగా ఎస్వీయూ విద్యార్థులు, సంఘ నాయకులు తమ సమస్యకు సంబంధించి ఛైర్మన్‌కు వినతులు అందించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు నరహరి వరప్రసాద్, రవీంద్ర, అబ్రహ సవేరి, ఛైర్మన్ ఓఎస్‌డీ సుబ్బారావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ చలపతి, సీజీఎం సంగీత రావు, స్విమ్స్ ప్రొఫెసర్ శ్రీ్ధర్‌బాబు, అలోక్‌వర్మ, వేధిక్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ శ్రీనివాసాచార్యులు, సోషియల్ వెల్ఫేర్ జేడీ విజయకుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.