శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బడికి వేలాయెరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 12: దేశ భవిష్యత్ నాలుగు గోడల నడుమే రూపుదిద్దుకుంటుందన్నది అక్షర సత్యం. ప్రాథమిక దశలోనే చిన్నారులకు మంచి విద్యకు పునాది వేస్తేనే దేశానికి భావిభారత పౌరులను అందించవచ్చు. సమాజ నిర్మాణంలో విద్యకే అగ్రస్థానం. అలాంటి విద్యపై చూపుతున్న శ్రద్ధ అంతంతమాత్రమే. సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా విద్యార్థులకు పాఠశాలల్లో సమస్యలు స్వాగతం పలకనున్నాయి. సర్వశిక్ష అభయాన్ నుంచి కోట్లు వస్తున్నా సౌకర్యాలు కల్పించాలనే ధ్యాస అధికారులకు లేకపోవడం బాధాకరం. వేసవి సెలవుల్లో మరమ్మతులు చేసేందుకు అనుకూలం. ఈ ఏడాది ఒక పాఠశాలలో చిన్నపాటి సమస్య కూడా పరిష్కరించలేకపోయారు. సౌకర్యాలు కల్పిస్తే తప్ప ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ ఉండదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు మేల్కొనకపోతే ముప్పు తప్పదు. జిల్లాలోని పాఠశాలల్లో సమస్యలను పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన తయారైంది. జిల్లాలో మొత్తం పాఠశాలలు 2,657 ఉన్నాయి. అందులో ప్రాథమిక ఉన్నత పాఠశాలలు 490 కాగా, ఉన్నత పాఠశాలలు 317 ఉన్నాయి. ఎక్కువ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, శిథిలావస్థకు చేరిన భవనాల సమస్యలు కనిపిస్తాయి. బోరుంటే నీరుండదు, నీరుంటే బోరుండదు, రెండూ ఉంటే విద్యుత్ సౌకర్యం ఉండదు.. ఇలా ఉంటుంది సర్కారు పాఠశాలల తీరు. తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం తర్వాత ప్లేట్లు కడిగేందుకు కూడా నీరు దొరకని పరిస్థితి. విద్యార్థులు ఇళ్ల నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుంటున్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు సుదూర ప్రాంతాల నుంచి బిందెలతో నీటిని తెచ్చి వంటలు చేస్తున్నారు. ఇక మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేదు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారే తప్ప నీటి వసతి లేక అవి మూలనపడిపోయాయి. అధికారులు శ్రద్ధ చూపకపోవడం వల్లనే ఇటువంటి ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. స్వచ్ఛ్భారత్ కింద మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టినా వాటిని వినియోగించుకోలేని దుస్థితి. చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యను అందించాల్సి ఉంది. పాఠశాలల్లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు పాఠశాలలకు మైదానాలు లేవు. వారి ఆటలు సాగేదెలా. కొన్నిచోట్ల క్రీడామైదానాలు ఉన్నప్పటికీ, అవి కాస్త రాళ్లు రప్పలతో నిండి ఉన్నాయి. జిల్లాలో సుమారు 200కు పైగా పాఠశాలల్లో ఆట స్థలాలు లేవు. క్రీడలకు మనం ఇస్తున్న ప్రాధాన్యం ఎంతపాటిదో దీన్నిబట్టి అర్థం అవుతోంది. క్రీడాసక్తి ఉన్న విద్యార్థులు తర్ఫీదు పొందలేకపోతున్నారు. మానసిక ఎదుగుదల, ఒత్తిడి అధిగమించడానికి ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాల్సి ఉంది. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరాయి. వాటిని పూర్తిగా తొలగించకుంటే ప్రమాదం తప్పదు. పాక్షికంగా దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా అధికార యంత్రాంగం దృష్టిసారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. చిన్నపాటి వర్షానికి చిత్తడిగా మారుతున్న పాఠశాల ప్రాంగణాల వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. పలు పాఠశాలల్లో భవనాల కొరత వేధిస్తోంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గదులు లేకపోవడంతో వరండాల్లోనూ, చెట్లకింద పాఠాలు బోధిస్తున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చదువులు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు అధికారులకు ముందుచూపు లేకపోవడంతో నిధులు వృథా అవుతున్నాయి. అవసరం ఉన్నచోట నిర్లక్ష్యం చూపారు. దీంతో చెట్ల కింద చదువులు తప్పడం లేదు. గదుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. ఇకనైనా స్పందించి అధికారులు వౌలికవసతులు సరిగా ఏర్పాటు చేయడం ద్వారా సత్ఫలితాలు సాధించాల్సి ఉంది.

తోళ్ల పరిశ్రమ ఏర్పాటుపై వ్యతిరేక పవనాలు
ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్న ప్రజలు
ప్రభుత్వ ఆదేశాలను పాటించక తప్పదంటున్న అధికారులు
కోట, జూన్ 12: కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలోని వాయిళ్లదొరువు గ్రామం వద్ద సుమారు 538 ఎకరాల్లో కృష్ణపట్నం ఇంటర్‌నేషనల్ లెదర్ కాంప్లెక్స్ వారు తోళ్ల పరిశ్రమ నిర్మించేందుకు అంగీకారం తెలిపింది. దీంతో పరిశ్రమ ఏర్పాటుకు 2012 డిసెంబర్ 27వ తేదిన గూడూరు సబ్‌కలెక్టర్, 2013 మార్చి 6వ తేదిన కలెక్టర్ శ్రీ్ధర్ పరిశ్రమ నిర్మించనున్న ప్రదేశంలో ప్రజాభిప్రాయసేకరణ సభలను నిర్వహించేందుకు సన్నాహాలు చేయడంతో ఆనాటి ప్రతిపక్ష శాసనసభ్యులు బల్లి దుర్గాప్రసాద్‌రావు, ప్రజానేత పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, ప్రస్తుత జట్‌పిటిసి ఉప్పల ప్రసాద్‌గౌడ్, బిజెపి నాయకులు పనబాక కోటేశ్వరరావు, మిడతల రమేష్‌తో పాటు జిల్లాకు చెందిన వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నేతలు, ప్రజలు ప్రజాభిప్రాయసేకరణ సభలను అడ్డుకోవడమే కాకుండా, ఉద్యమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో నాలుగుచోట్ల పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆయా ప్రాంతాల ప్రజలు దానిని అడ్డుకున్నారని, దీంతో ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది. అయితే కొత్తపట్నం వద్ద పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రయత్నించగా ప్రజలతో పాటు అప్పటి ప్రతిపక్ష పార్టీలు బిజెపి, తెలుగుదేశం పార్టీలు అడ్డుకున్నాయని, అదే పరిశ్రమకు ప్రస్తుతం అధికారంలో వున్న బిజెపి, టిడిపి ప్రభుత్వాలు ఎలా సమర్ధిస్తున్నాయని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తోళ్ల పరిశ్రమను ఏర్పాటుచేస్తే చర్మ, క్యాన్సర్ వ్యాధులు సోకుతాయని, కోట, వాకాడు మండలాలు కాలుష్యంతో నిండిపోవడమే కాకుండా, కోట మండలంలోని పది గ్రామాలు నామరూపాలు లేకుండా పోతాయని, సొనకాలువలు దెబ్బతిని పంటలు పండవని నిపుణులు చెబుతున్నా, పరిశ్రమ వద్దని గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్‌కుమార్, తిరుపతి పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్‌లు ముక్తకంఠంతో అంటున్నా వారి మాటలను ప్రభుత్వం లెక్కచేయకుండా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం విచారకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధే ధ్యేయమంటున్న పాలకులు తోళ్ల పరిశ్రమను ఏర్పాటుచేసి గ్రామాలను నామరూపాలు లేకుండా చేయాలని చూస్తున్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. పరిశ్రమకు వ్యతిరేకంగా ఉద్యమాలు జరగడంతో ఆ పరిశ్రమను చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గానికి తరలించినట్లు ఈ ప్రాంతంలో ప్రచారం జరిగింది. అయితే ఒక్కసారిగా పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించడంతో పరిశ్రమ అంశం మరలా తెరకెక్కింది. పరిశ్రమను ఏర్పాటుచేస్తే ప్రాణత్యాగాలైన చేసి అడ్డుకుంటామని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు.
ఆందోళనలో జాలర్లు
కోట మండలం కొత్తపట్నం సమీపంలోని వాయిళ్లదొరువు వద్ద ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమకు ప్రభుత్వం 530 ఎకరాల స్థలాన్ని కేటాయించగా, అందులో 130 ఎకరాలు అసైన్‌మెంటు కాగా మిగిలిన భూమంతా ప్రభుత్వానిదే. ఈ భూములు గోవిందుపల్లి, గోవిందుపల్లిపాళెం, వాయిళ్లదొరువు, కొత్తపట్నం, శ్రీనివాససత్రం, యమదినె్నపాళెం, గున్నంపడియ గ్రామాల పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాల్లో సన్న, చిన్నకారు రైతులతోపాటు, అధికశాతంలో మత్స్యకారులే వున్నారు. తమ భూముల్లో తోళ్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తే సముద్రపు నీరు కలుషితమై జీవరాసులు పూర్తిగా దెబ్బతింటాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పచ్చటి పొలాలు, సొనకాలువలు పూర్తిగా నాశనమవుతాయని, దీంతో తాము జీవనోపాధి కోల్పోతామని ఈ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

భూగర్భ డ్రైనేజీని ప్రణాళిక ప్రకారం నిర్మించాలి
రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి కేతంరెడ్డి డిమాండ్
నెల్లూరుసిటీ, జూన్ 12: నగరంలో భూగర్భ డ్రైనేజీని ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించాలని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూగర్భ డ్రైనేజీ కోసం హాడ్కో నుంచి మంజూరు చేసిన నిధులను ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా దోచుకోవాలని చూస్తే సహించేది లేదన్నారు. హడ్కో నుంచి మంజూరైన 1100 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ప్రాజెక్టును అధికారుల పర్యేక్షణ లేకుండా కేవలం గూగుల్ మ్యాప్ ద్వారా నగరంలోని 9 ప్రాంతాలలో సెఫ్టిక్ ట్యాంకులను నిర్మిస్తున్నారని చెప్పారు. నగరంలోని జనజీవనం ఉండేచోట ఎకరా స్థలంలో సెఫ్టిక్ ట్యాంకులను నిర్మించడంవల్ల చుట్టుపక్కల ప్రాంతాల వారు జీవించలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. హడ్కో నుంచి నిధులను దోచుకునేందుకు భూగర్భ డ్రైనేజిని ఇష్టానుసారంగా నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తు ఊరుకునేది లేదన్నారు. హడ్కో నుంచి తీసుకున్న రుణానికి సంవత్సరానికి 110 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో కార్పొరేషన్ చెల్లించాల్సి వస్తుందన్నారు. కార్పొరేషన్ ఆదాయం సంవత్సరానికి 65 కోట్ల రూపాయలు అయితే ఆ నిధులు ఉద్యోగుల జీతభత్యాలు, కరెంటు బిల్లులకే సరిపోతుందన్నారు. హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని కార్పొరేషన్ తిరిగి ఎలా చెల్లిస్తుందో అర్థం కావడం లేదన్నారు. భూగర్భ డ్రైనేజీ పేరుతో ప్రజలపై పన్నుల భారం మోపితే సహించేది లేదన్నారు. భూగర్భ డ్రైనేజి ప్రణాళికాబద్దంగా నిర్మించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా సోమవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, రవికుమార్, చంద్రశేఖర్‌రెడ్డి, షఫీ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే లక్ష్యం
* రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శివాజీ స్పష్టం
నెల్లూరు టౌన్, జూన్ 12: రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన వర్గాల అభ్యున్నతికి వినూత్నరీతిలో ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేసి పటిష్టంగా అమలుచేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. నగరంలోని దర్గామిట్టలో ఉన్న జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో ఎస్సీ, ఎస్టీ పథకాలు, అట్రాసిటీ కేసులపై పలు శాఖల జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్రంలోనే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని అన్నారు. వారి సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి సమర్థవంతంగా, చిత్తశుద్ధితో పనిచేసి వారు పూర్తిస్థాయిలో ప్రయోజనం పొందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాజకీయ జోక్యం లేకుండా అర్హులైన వారికి పూర్తిన్యాయం చేసి సహాయం అందించాలన్నారు. అట్రాసిటీ కేసులు నీరుగారిపోకుండా నేరస్థులకు చట్టపరంగా శిక్షలు పడేలా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారులపై ఉందన్నారు. ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అట్రాసిటీ కేసుల నమోదులో జాప్యం జరగకుండా సకాలంలో కేసులు నమోదుచేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. దళిత, గిరిజనులకు శ్మశానవాటికలు ఏర్పాటు చేయడంలో సంబంధిత తహశీల్దార్లు సమన్వయంతో ఆర్‌డిఓలు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయడంలో అవసరమైన చర్యలు తీసుకుని వెంటనే అందేలా చూడాలన్నారు. ఎస్సీ, కార్పొరేషన్ అధికారులు వివిధ సంక్షేమ కార్యక్రమాల కింద మంజూరుచేస్తున్న రుణాల యూనిట్లు గ్రౌండింగ్‌లో బ్యాంకు అధికారులతో చర్చించి రుణాలు మంజూరయ్యేలా చూడాలన్నారు. జిల్లా పరిషత్, డిఆర్‌డిఎ, డ్వామా, సోషల్ ఫారెస్టు, విద్యాశాఖ, మత్స్య, పశుసంవర్థక శాఖల పరిధిలో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను జూన్ నెలాఖరుకల్లా భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, ఎన్‌టిర్ గృహ నిర్మాణాలు, మంచినీటి సౌకర్యాలు, ఉచిత విద్యుత్‌లాంటి అభివృద్ధి కార్యక్రమాల పనులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల కోటలో జరిగిన సాంఘిక బహిష్కరణకు సంబంధించిన కేసును పునఃప్రారంభించి సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నూరు శాతం అమలయ్యేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియలో సంబంధిత శాఖాధికారులు వారివారి పరిధిలో మంజూరు చేసిన నిధులను పూర్తిగా వారికే కేటాయించి ఎలాంటి అవకతవకలు లేకుండా అమలుచేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎం జానకి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఇచ్చిన సలహాలను, సూచనలను పటిష్టంగా అమలుచేసి ఎస్సీ, ఎస్టీలకి పూర్తి ప్రయోజనం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వివిధ శాఖల పరిధిలో ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీచేసేందుకు తగిన నోటిఫికేషన్ ఇచ్చి ఈ నెలాఖరుకల్లా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో నగర మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎస్పీ విశాల్ గున్ని, జాయింట్ కలెక్టర్-2 రాజ్‌కుమార్, గూడూరు సబ్‌కలెక్టర్ గిరిషా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి మధుసూదనరావు, వివిధ శాకలకు చెందిన అధికారాలు పాల్గొన్నారు.

ఉద్రిక్తతల నడుమ ఆక్రమణల తొలగింపు
బుచ్చిరెడ్డిపాళెం, జూన్ 12: బుచ్చిరెడ్డిపాళెం-చెన్నూరు రోడ్డుకు ఇరువైపుల ఉన్న డ్రెయిన్‌పై నిర్మించిన అక్రమ కట్టడాలను ఉద్రిక్తతల నడుమ స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు. ఈ రోడ్డుకు ఇరువైపుల ఉన్న డ్రెయిన్లపై వ్యాపార దుకాణాల యజమానులు పెద్దపెద్ద భవంతులు నిర్మించి ఉండటంతో మురికినీరు ప్రవాహం సరిలేక కొన్ని సందర్భాల్లో ఇళ్లల్లోకి, రోడ్డుపైకి వస్తుండటంతో గ్రామ పంచాయతీ ఈ అక్రమ కట్టడాలను తొలగించాలని నెల రోజుల కిందట నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను షాపు యజమానులు బేఖాతరు చేయడంతో ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి అక్రమ కట్టడాల తొలగింపు చర్యలు భారీ పోలీసు బందోబస్తు నడుమ చేపట్టారు. దీంతో అక్కడక్కడ పంచాయతీ అధికారులకు, స్థానికుల నడుమ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసు అధికారులు వ్యాపారులతో చర్చించి ఎట్టకేలకు ఆక్రమణలను తొలగించారు. నెల రోజుల క్రిందట నోటీసులు జారీ చేసినప్పటికి ఈ ఆక్రమణల తొలగింపులో ఆర్ అండ్ బి అధికారులు, ఇరిగేషన్ అధికారులు పాల్గొనకపోవడంతో వారిపై పంచాయతీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ గ్రామ కార్యదర్శి ఉమాశంకర్ మాట్లాడుతూ రోడ్డుకిరువైపుల ఐదు మీటర్ల స్థలం పంచాయతీది ఉన్నప్పటికి ఆ స్థలం ఇప్పటికి పూర్తిగా ఆక్రమించబడటం వల్ల డ్రెయిన్లు ప్రవహించకపోవడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని అన్నారు. స్వతహాగా తొలగింపులు చేపట్టి ఉంటే ఎక్కువ నష్టం జరిగి ఉండేది కాదని అన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఇలాంటి చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఆక్రమణల తొలగింపులో బుచ్చి సిఐ గంగా వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ వేణుగోపాల్‌రెడ్డి పూర్తి సహకారాన్ని అందించినందుకు వారికి పంచాయతీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

అంటరానితనం ఒక వింత రోగం.. వివక్ష చూపితే ఉపేక్షించం
పౌర సన్మానంలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మెన్ కారెం శివాజీ
నెల్లూరు కలెక్టరేట్, జూన్ 12: ఎస్‌సి, ఎస్‌టిలను ఆర్ధికాభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు అందజేస్తుంటే వాటిని వినియోగించకుండా జిల్లా ఉన్నతాధికారులు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారని రాష్ట్ర ఎస్‌సి, ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని విఆర్‌సి మైదానంలో ఆదివారం ఆయనకు పౌరసన్మానం, అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేయాల్సిన నిధులను క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు వినియోగించకపోవటం దారుణమన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి కొన్నిచోట్ల ఎస్‌సి, ఎస్‌టి సామాజిక వర్గాలపై వివక్ష కొనసాగుతోందని కమిషన్‌కు ఫిర్యాదులు వస్తున్నాయని ఇలాంటి చర్యలను కమిషన్ ఉపేక్షించబోదని హెచ్చరించారు. వివక్ష, అంటరానితనం వింత రోగాలని వీటిని సమూలంగా నిర్మూలించి అంబేద్కర్ కలలుకన్న సమసమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, శాసనమండలి సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు అందరం కంకణబద్దులు కావాలన్నారు. తమ సామాజిక వర్గాల అభివృద్ధికి పాటుపడటం, అన్యాయం జరిగితే ప్రభుత్వాన్ని నిలదీయటం ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని ఆందోళనలు, ఉద్యమాలను రెచ్చగొట్టే విధంగా ఉండరాదని ప్రతిపక్ష నేత జగన్, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభంలను ఉద్దేశించి మాట్లాడారు. రిజర్వేషన్లు విషయంలో ప్రభుత్వాలు కమిషన్‌లను ఏర్పాటు చేస్తాయన్నారు. ఆయా కమిషన్‌లను కలసి తమ సామాజికవర్గాలకు జరిగిన నష్టాలను వివరించి న్యాయం పొందాలి తప్ప అరాచకంగా, హింసాత్మక దాడులకు పాల్పడకూడదని హితవు పలికారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సభ ముగింపులో వివిధ దళిత, ఉద్యోగ సంఘాలు ఆధ్వర్యంలో కమిషన్ ఛైర్మన్‌కు ఘనంగా పౌర సన్మానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పరసా వెంకటరత్నం, బొమ్మిళ్ల బాలచెన్నయ్య, జ్యోత్స్నలత, ఆర్టీసీ నాయకులు ఎజ్రాశాస్ర్తీ, దళిత బాబు, జయరాజు, ఎల్లసిరి దేవా తదితరులు పాల్గొన్నారు.