చిత్తూరు

సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 25: ఎన్నో దశాబ్దాల క్రితం శ్రీవారి ఆనంద నిలయానికి, కొన్ని ప్రాకారాలకు బంగారు తాపడం చేశారని, అవి ఇప్పుడు పాతబడి దెబ్బతిన్న నేపధ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వాటిని మార్చాల్సిన అవసరం ఉందని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం పథకం మరుగున పడిన విషయంపై ఓ విలేఖరి ప్రశ్నించగా మంత్రి పై విధంగా స్పందించారు. శుక్రవారం వి ఐ పి విరామ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడుతూ ఏపి రాష్ట్రాన్ని త్వరలోనే కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసినట్లు స్పష్టం చేశారు. ఇందులో బాగంగానే నదుల అనుసంధానం చేసుకుంటూ, రాష్ట్రంలో నీటి వనరులను ఉపయోగించుకుని కరవు ప్రాంతాలకు సాగు,తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని పేదరికం నిర్మూలించేందుకు సి ఎం ఎన్నో ఉపాధి హామీ పథకాలను ప్రవేశ పెడుతున్నారని ఆయన చెప్పారు. కాగా తన స్వగ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణం, విధి విధానాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.
తిరుమలలో పెరిగిన రద్దీ
* సర్వదర్శనానికి 12 గంటలు

తిరుమల, మార్చి 25: తిరుమల్లో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. గురువారం హోలీ, శుక్రవారం గుడ్‌ఫ్రైడే, వారాంతపు సెలవులు రావడంతో గురువారం సాయంత్రం నుంచే భక్తులు తిరుమలకు పోటెత్తారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా రెండు కాలిబాటల గుండా, స్వంత వాహనాలతో భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలివస్తుండటంతో ఎటుచూసినా తిరుమల కొండలు భక్తులతో నిండిపోయి కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉన్నా సాయంత్రానికి క్రమేపీ పెరగడంతో రెండవ వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండి పోయి, భక్తుల క్యూలైన్ వెలుపల వరకు కొనసాగుతోంది. కాగా మధ్యాహ్నానికే తిరుమల్లోని గదులన్నీ భక్తులకు కేటాయించడంతో గదులు దొరకని భక్తులు, యాత్రికులు ఉచిత సముదాయాల్లో సేద తీరుతున్నారు. అన్ని కల్యాణ కట్టలు కూడా భక్తులతో నిండిపోవడంతో తలనీలాలు సమర్పించడానికి 5గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోంది. ఇక సర్వదర్శనానికైతే సరాసరి 12 గంటల సమయం పడుతోంది. కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా టిటిడి ముందస్తుగా అన్ని ఏర్పాట్లు తీసుకుంది. ఆలయ డిప్యూటి ఇ ఒ చిన్నంగారి రమణ నిరంతరాయంగా క్యూలైన్లను పర్యవేక్షిస్తున్నారు. క్యూలైన్లలో వేచివున్న భక్తులకు అల్పాహారాలు అందిస్తున్నారు. వడ దెబ్బకు గురికాకుండా తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆలయంలోని అధికారులను అప్రమత్తం చేస్తూ భక్తులకు త్వరతగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. అలాగే లడ్డూ ప్రసాదాల కొరత ఏర్పడకుండాపోటు పేష్కార్ అశోక్‌కుమార్‌కు తగు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రద్దీ మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండటంతో ఇఒ సాంబశివరావు ఆదేశాల మేరకు కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
కార్పొరేట్ ఆసుప్రతులకు ధీటుగా ప్రభుత్వ వైద్యశాలలు
* నెలాఖరున ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే బస చేస్తా : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య వెల్లడి

తిరుపతి, మార్చి 25: ప్రభుత్వ వైద్యశాలలను కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా పనిచేసేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య స్పష్టం చేశారు. స్థానిక పద్మావతి అతిథిగృహంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్, వైద్యాధికారులతో ప్రభుత్వ వైద్యశాలలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలల ప్రక్షాళనకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. సిఎం చేతుల మీదుగా ప్రారంభించిన ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, 102 కాల్ సెంటర్, టెలిరేడియాలజీ, ఆసుపత్రుల పరికరాల నిర్వహణ వంటి కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 1,2 తేదీల్లో తాను తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బస చేస్తానని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పి పి విధానంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసేందుకు 100 కేంద్రాల్లో 503 డాక్టర్ పోస్టులను భర్తీచేసినట్లు తెలిపారు. రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఇంటికి వెళ్లే రోజు వరకు పైసా ఖర్చులేకుండా శస్తచ్రికిత్సలు కూడా చేయడానికి సి ఎం చంద్రబాబు నాయుడు ఆసుపత్రులను ప్రక్షాళన చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇక నుంచి జల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోన్ మ్యారో శస్తచ్రికిత్సలు, రుమటాయిడ్ ఫ్యాక్టర్ పరీక్షలు నుంచి సెల్ ఎనీమియా పరీక్ష వరకు అన్నింటిని ఉచితంగా అందజేయడానికి చర్యలు చేపట్టడం జరగుతుందని అన్నారు. అలాగే ఇతర వైద్య నిపుణులను కూడా ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకురావడం జరుగుతందని తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లోరక్తనిధి నిల్వ కేంద్రం కొరకు రూ.37 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం వద్ద తల్లి బిడ్డలకు పోషక ఆహారం అందజేయడానికి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ఈకార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి కూడా పాల్గొన్నారు.

అభయం యాప్ ద్వారా మహిళలకు రక్షణ
* కమి* కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి వెల్లడి

తిరుపతి, మార్చి 25: రానున్న మూడు నెలల్లోపు రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా సంక్షేమం, రక్షణ నిమిత్తం తప్పనిసరిగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. స్ర్తిలపై అత్యాచారాలు, సంబంధిత నేరాలపై కేసులు సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. మహిళలు, ఆడపిల్లలపై ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేదింపులు నిరోధానికి ప్రత్యేక పోలీసు బృందాలు అభయం యాప్ ద్వారా 15నిమిషాల్లో రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. బాల్య వివాహాలు అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అందులో భాగంగా వీటిని ప్రోత్సహించినా, అందులో భాగస్వాములైనా, పౌరోహిత్యం చేసినా చట్టపరంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆమె తెలిపారు. మహిళ సాధికారత కోసం సి ఎం చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి 16వ తేదీ వరకు మహిళా కమిషన్ ద్వారా 200 కేసులు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతంరం నన్నపనేని రాజకుమారి స్థానిక మహిళ ప్రాంగణాన్ని సందర్శించారు. ఎన్‌టిఆర్ ఆశయాలకు అనుగుణంగా దీనిని నిర్మించడం జరిగిందని, దీనిని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటామని వివరించారు. ఈకార్యక్రమంలో మహిళాప్రాంగణం మేనేజర్ కె.ప్రమీణ, సాయిసుధా హాస్పిటల్ అధినేత్రి డాక్టర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
* జెఇఓ పోలా భాస్కర్ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి,మార్చి 25: టిటిడికి అనుబంధంగా ఉన్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయ శ్రీరామనవమి, వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 20వ తేదీన జరగనున్న సీతారాముల కల్యాణానికి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, ఇందుకు అనుగుణంగా విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వాహణాధికారి పోలాభాస్కర్ వెల్లడించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం ఆయన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామాలయంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా అధికారులు, టిటిడి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జె ఇ ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా గుర్తించడంతో వైఎస్‌ఆర్ కడప జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఏప్రిల్ 15న శ్రీరామనవమి, 18న హనుమంత వాహనం, 19న గరుడవాహనం, 20న శ్రీ సీతారాముల కల్యాణం, 21న రథోత్సవం నాడు భక్తులు విశేషంగా విచ్చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేసే అవకాశం ఉండడంతో భద్రతాపరంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కల్యాణం కోసం సమీపంలోని 70 ఎకరాల ఆలయస్థలంలో శాశ్వతంగా కల్యాణవేదిక ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రొటోకాల్ విఐపిలు, సాధారణ భక్తుల కోసం వేర్వేరుగా ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
భక్తులందరికీ కల్యాణ అక్షింతలు
టిటిడి ఇ ఓ డాక్టర్ సాంబశివరావు ఆదేశాల మేరకు శ్రీ సీతారాముల కల్యాణానికి విచ్చేసే భక్తులందరికీ అక్షింతలు, ముత్యం, కలిపి ప్యాకెట్‌లో అందించనున్నట్లు జె ఇ ఓ తెలిపారు. ఇందుకోసం 30 కిలోల ముత్యాలను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. మొత్తం 2 లక్షల ప్యాకెట్లను తయారుచేసి స్వామివారి కల్యాణం ముగిసిన అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదంతో పాటు పంపిణీ చేస్తామన్నారు. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల ముందు కళాబృందాల ప్రదర్శనతో పాటు నైపుణ్యం గల కళాకారులతో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఆలయం, పరిసర ప్రాంతాల్లో ఇంజనీరింగ్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. భక్తులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, మజ్జిగ అందుబాటులో ఉంచుతామని, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని అన్నారు. ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు, స్వాగత ఆర్చిలు, ఎల్ ఇడి బోర్డులు ఏర్పాటుచేస్తామని వివరించారు. వై ఎస్ ఆర్ కడప జిల్లా వ్యాప్తంగా కరపత్రాలు, గోడపత్రికలు పంపి విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 9 నుంచి జిల్లా అంతటా ప్రచార రథాలను పంపి భక్తులను ఆహ్వానిస్తామని జె ఇ ఓ వివరించారు. ఈ కార్యక్రమంలో వై ఎస్ ఆర్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ కుమారి శే్వత, జిల్లా పరిషత్ సి ఈ ఓ రజియాబేగం, డి ఎం హెచ్ ఓ డాక్టర్ సత్యనారాయణ రాజు, అదనపు ఎస్పీ విజయకుమార్, రాజంపేట ఆర్డీవో ప్రభాకర్‌పైరిళ్ల, టిటిడి ఎస్ ఇ సుధాకరరావు, డిపిపి కార్యదర్శి ప్రయాగ రామకృష్ణ, సి ఎం ఓ డాక్టర్ ఎన్.వికాస్, డి ఎఫ్ ఓ శివరామప్రసాద్, ప్రజాసంబంధాల అధికారి డాక్టర్ టి.రవి, ఇ ఇ కృష్ణారెడ్డి, డిప్యూటీ ఇ ఓలు వేణుగోపాల్, బాలాజి, గౌతమి,వరలక్ష్మి, వీరబ్రహ్మం, గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, యూనిట్ ఆఫీసర్ అమరనాథరెడ్డి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.