చిత్తూరు

డాక్టర్ రాయ ఆశాలతకు వైద్యశిఖామణి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 9: ఆశాలత టెస్ట్‌ట్యూబ్ బేబి సెంటర్ అధినేత, టిడిపి మహిళా అధ్యక్షురాలు డాక్టర్ రాయ ఆశాలతకు సుబ్బరాజు నాటక కళా పరిషత్ ప్రకటించిన వైద్యశిఖామణి అవార్డును శుక్రవారం రాత్రి మహతి ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుగుణమ్మ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ఆశాలత టెస్ట్‌బ్యూబ్ బేబి సెంటర్ ద్వారా డాక్టర్ ఆశాలత, ఆమె భర్త డాక్టర్ వెంకటేశ్వర్లు పేదలకు గత 30 సంవత్సరాలుగా ఎన్నో సేవలందించారన్నారు. డాక్టర్ ఆశాలత మాట్లాడుతూ తాను ఈ వైద్యసేవలందించడంలో తన భర్తపాత్ర కొండంత ఉందన్నారు. ఈసందర్భంగా నాటక కలాపరిషత్ నిర్వాహకులు డాక్టర్ ఆశాలత దంపతులను ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో చిత్తూరు జిల్లా కాపునాడు నాయకులు సరితానాగరాజు, వెంకటేశ్వర్లు, బలిజ సంఘ నాయకులు వెంకటరమణ, ప్రమీల, పార్వతి, భూపతి నాయుడులు కూడా ఆశాలత దంపతులను సన్మానించారు.
‘జాతీయ ఎస్సీ కమిషన్‌కు సివిల్‌కోర్టు అధికారులుండాలి’
తిరుపతి, జూలై 9: జాతీయ ఎస్సీ కమిషన్‌కు సివిల్‌కోర్టు అధికారాలుండాలని జాతీయ ఎస్ సి కమిషన్ మెంబర్ కమలమ్మ అభిప్రాయపడ్డారు. శనివారం స్థానిక గోవింద రాజ స్వామి దక్షిణ మాడ వీధిలో ఉన్న శ్రీ కోదండరామస్వామి కల్యాణ మండపం నందు జరిగిన అఖిలభారత ఎస్సీ, ఎస్టీ బ్యాంకు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఎస్సీ కమిషన్ మెంబర్ కమలమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో ఎస్సీ కమిషన్‌కు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందని, రాజ్యాంగ నిర్మాణ కర్త డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అట్టడుగున ఉన్న ఎస్సీ కులాల వారిని సమసమాజ స్థాపనచేయాలని కృషిచేసిన మహోన్నత వ్యక్తిఅని ఆమె సూచించారు. చిత్తూరు జిల్లాలో నాలుగు సార్లు పర్యటించడం జరిగిందని, వివిధ సమస్యలపై ప్రజలనుంచి వినతులు, కుల సంఘాల నుంచి వినతులు స్వీకరించి వాటిని అమలయ్యేదానికి జిల్లా సాంఘీక సంక్షేమ అధికారులకు అందజేయడం జరిగిందని, శనివారం స్థానిక సంక్షేమ అధికారులు ఆ వినతులపై ఆరా తీయగా వివిధ దశల్లో ఉన్నాయని అధికారులు సమాధానం చెప్పారని ఏ ఒక్క వినతి పరిష్కారం కాలేదని ఆమె ఆవేధనచెందారు. కొన్ని జిల్లాలో ఎస్సీ ప్రజలు సమస్యను పరిష్కరించడంలో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆమె ఆవేదన చెందారు. ఎస్సీ గ్రామలు ముంపు గ్రామాలుగా గుర్తించినట్లయితే వెంటనే వారికి పునరావాసం కల్పించాలని ఆమె తెలిపారు. జాతీయ ఎస్సీ కమిషన్‌కు సివిల్‌కోర్టుల అధికారులుండాలని ఆమె అభిప్రాయపడ్డారు. 16(4) బి యాక్ట్ చట్టం చేయాలని ఆమె తెలిపారు. ఈకార్యక్రమంలో జె.ప్రభాకర్ రావు,గురుస్వామి, బ్రహ్మానందం రావు, కె. రమేష్‌బాబు, జి.ప్రభాకర్ రావు, లోకనాధం, కృష్ణ, జెఎసి కన్వీనర్, సందీప్ కుమార్‌పాల్గొన్నారు.

బాబూ! పేదల భూముల జోలికొస్తే నాలుక కోస్తా
* సిపిఐ నేత నారాయణ హెచ్చరిక

శ్రీ కాళహస్తి, జూలై 9: విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేదల భూములను స్వాధీనం చేసుకుంటున్నారని, ఈ పద్ధతి మానుకోకుంటే నాలుక తెగకోస్తానని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ హెచ్చరించారు. శనివారం ఆయన శ్రీ కాళహస్తి మండలం రెడ్డిపల్లి గ్రామంలో పర్యటించారు. ఫ్యాక్టరీలకు కేటాయించిన పంట భూములను రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ శ్రీ కాళహస్తి, తొట్టంబేడు, రేణిగుంట మండలాల్లో 19వేల ఎకరాలను ఫ్యాక్టరీలకు ధారాదత్తం చేయడానికి చంద్రబాబునాయుడు దళారీగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పచ్చటి పొలాలను పోగొట్టుకొని పేదరైతులు కూలీలుగా మారబోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.విదేశీ కంపెనీలకు పేదల భూములను కట్టబెట్టడానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ముఖ్యమంత్రి పన్నాగం పన్నుతున్నారని విమర్శించారు. ఈ భూములు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబ్బసొత్తుకాదని, పేద ప్రజలు కష్టార్జితం అని అన్నారు. సారవంతం కాని భూములను ఫ్యాక్టరీలకు కేటాయించాలని, పంట భూములను కేటాయించవద్దని డిమాండ్ చేశారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ప్రజలు ఓట్లువేసి గెలిపిస్తే ఆయన కక్షకట్టారని ఆరోపించారు. శ్రీ కాళహస్తి మండలంలోని ఊరందూరులో ఉన్న ఆయన సొంత పొలాల్లో ఫ్యాక్టరీని పెట్టుకోవాలని సలహా ఇచ్చారు. రైతులందరూ ఐకమత్యంగా ఉంటే అందరి తరఫునా తాను పోరాటం చేస్తామని, అవసరమైతే ప్రాణిలిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా అధికారులు కూడా భూ సేకరణలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టారు. పేదల జోలికి వస్తే సహించేది లేదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణతోపాటు పార్టీ నాయకులు రామానాయుడు, వెంకయ్య, భాస్కర్‌రెడ్డి, గురవయ్య, శివ తదితరులు భూములను పరిశీలించారు.