చిత్తూరు

జిల్లాలో మ్యాంగో బోర్డు ఏర్పాటుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, జూలై 13 : రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బుధవారం చిత్తూరులో జిల్లా తెలుగు రైతు విభాగం ప్రమాణస్వీకార కార్యమ్రానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తూరు జిల్లా మామిడి పంటకు ప్రసిద్ధి అని, మామిడి రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందకు త్వరలోనే మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయనున్నామని హామీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ పరంగా రైతులకు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం అయ్యేందుకు రాష్ట్రంలో త్వరలోనే రైతు సంఘాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నది ముఖ్యమంత్రి సంకల్పమని స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా నేడు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశామని తెలిపారు. నేడు రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని, అందులో భాగంగా భూసార పరీక్షలతో అనేక ఆధునిక వ్యవసాయ పద్ధతులను అందుబాటులోకి తెచ్చినఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు ఇచ్చి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఉద్యాన పంటలను ప్రోత్సహించడంతో పాటు పాడి, పౌల్ట్రీ పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాలను పెంచడానికి చెరువులు, కుంటలను బాగు చేస్తున్నట్లు తెలిపారు. కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు నీళ్లు అందించే పనులు జోరుగా జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఏర్పడిన తెలుగు రైతు విభాగం రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నేడు అనేక కార్యక్రమాలను చేపట్టిందని, వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా నేడు అనేక కొత్త పథకాలను రైతుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా తెలుగు రైతు విభాగం రైతుల సంక్షేమం కోసం కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్‌నాయుడు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి న్యాయం చేస్తానని, రైతులకు ప్రభుత్వ పరంగా అందే పథకాలను సక్రమంగా అందేలా తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరుపతి ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ మోహన్, తెలుగుదేశం నేతలు దొరబాబు, బద్రీ నారాయణ, గురవయ్యనాయుడు, కన్నయ్యనాయుడు, మాపాక్షి మోహన్, నాని, ప్రవీణ్, శ్రీధర్‌వర్మ, శ్మామ్‌రాజ్, ఇందిర తదితరులు పాల్గొన్నారు.
అట్టహాసంగా తెలుగు రైతు విభాగం ప్రమాణస్వీకారం
జిల్లా తెలుగు రైతు విభాగం ప్రమాణ స్వీకారం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రులు పత్తిపాటి పుల్లారావు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా చిత్తూరు నగరంలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలు వేసి అక్కడ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులతో పాటు అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అవిలాల చెరువును అత్యద్భుతంగా అభివృద్ధి చేయాలి
* టిటిడి ఇ ఓ సాంబశివరావు ఆదేశం

తిరుపతి, జూలై 13: తిరుపతి సుందరీకరణలో భాగంగా నగరవాసులకు ఆహ్లాదం పంచేలా అవిలాల చెరువును అభివృద్ధి చేయాలని, అక్టోబరు చివరి నాటికి ఈ పనులు పూర్తిచేయాలని టిటిడి కార్యనిర్వాహణాధికారి డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల ఇఓ కార్యాలయంలో బుధవారం టిటిడి, తుడ, రెవెన్యూ, అటవీశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇ ఓ మాట్లాడుతూ అవిలాల చెరువు చుట్టూ రంగురంగుల పుష్పాల మొక్కలు, వెదురు తదితర మొక్కలతో ఎకోపార్కు, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుచేయాలని సూచించారు. పర్యాటకులను ఆకర్షించేలా చెరువు పరిసరాలను ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలన్నారు. ఇదే తరహాలో తిరుపతి అర్బన్ పరిధిలోని లింగాలమ్మ చెరువును తుడ అభివృద్ధి చేయనుందని తెలిపారు. ఈ సమావేశంలో తుడ వైస్ చైర్మన్ వినయ్‌చంద్, కార్యదర్శి మాధవీలత, ఇరిగేషన్ ఎస్ ఇ శివరామకృష్ణ, టూరిజం రీజనల్ డైరెక్టర్ చంద్రవౌళి, డ్వామాపిడి వేణుగోపాలరెడ్డి, టిటిడి ఛీప్ ఇంజనీర్ చంద్రశేఖర్‌రెడ్డి, డి ఎఫ్ ఓ శివరామప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల్లోని పేదల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు

* ప్రతి పేద కుటుంబానికి వార్షిక ఆదాయం 50వేలు ఉండేలా యోచన: రాష్ట్ర సెర్ఫ్, మెప్మా మిషన్ డైరెక్టర్
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, జూలై 13: రాష్ట్రంలోని మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ప్రతి పేద కుటుంబం యేడాదికి 50వేల రూపాయలు ఆదాయం తగ్గకుండా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో నిర్థిష్టమైన ప్రణాళికలను అమలుచేస్తున్నట్లు రాష్ట్ర సెర్ఫ్, మెప్మా మిషన్ డైరెక్టర్ చిన్నతాతయ్య తెలిపారు. బుధవారం స్థానిక బ్లిస్ హోటల్‌లో 5 జిల్లాలలోని మునిసిపాలిటీల మెప్మా, మెప్మాపీడీలతో ప్రాంతీయ వర్క్‌షాపును నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సదస్సుకు ముగింపు సమావేశానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈసందర్భంగా వివిధ మునిసిపాలిటీల్లో మెప్మా చేయబడుతున్న పనులపై సమావేశం నిర్వహించడంతో పాటు ప్రగతి నివేదికలు, లక్ష్యసాధన అమలుపై ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదలు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక చర్యలు చేపడున్నారన్నారు. ఇందులో భాగంగానే ఒక్కో పేదకుటుంబానికి రూ.50వేలు వార్షిక ఆదాయం తగ్గకుండా అవరసమైన ప్రగతి ప్రణాళికను రూపొందించామన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,755 వేల మురికివాడలున్నాయని, దీని సంక్షేమానికి మెప్మా ఆధ్వర్యంలో నిధులు ఖర్చుచేస్తున్నామన్నారు. అలాగే పేద విద్యార్థులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు 6 నుంచి 10వ తరగతి వరకు ఐ ఐ టి ఫౌండేషన్ ఉచిత శిక్షణ కార్యక్రమాల కొరకు 50కోట్లు ఖర్చుచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా మహిళా సంఘాలకు భాగస్వాములు చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు నెల నుంచి పట్టణాల్లో వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో 30వేల మంది స్వయం సహాయక సంఘ సభ్యులకు ప్రథమచికిత్స కిట్‌లను అందజేయడానికి చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. ఆగస్టు నెల నుంచి మెప్మా ఆధ్వర్యంలో జరిగే ప్రతి కార్యక్రమాలు ఆన్‌లైన్లో పెట్టడానికి ఇటువంటి సమీక్షా సమావేశం నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో గల 1.85 లక్షల అసంఘటిత కార్మికులను ఆదుకోవడం కోసం ఆగస్టు నెల నుంచి చంద్రన్న భీమా పథకం అమలు చేసే ప్రభుత్వం ఏడాదికి రూ.300 కోట్లు కేటాయించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందని కార్మికుడే (మిగతా 7వ పేజీలో)
(1వపేజీ తరువాయ)సర్వీసు చార్జీ కింద రూ.15 చెల్లించాల్సి ఉంటుందనిన ఆయన తెలిపారు. స్వయం సహాయక బృందాలు ఆర్థిక సాధికారతకై రూ. 10,298 కోట్లు పెట్టుబడులు సమకూర్చాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిశ్చయించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని మహిళల జీవనోపాదులు మెరుగుపర్చడం కోసం మెప్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 87 కుట్టు శిక్షణా కేంద్రాలలో వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి మా సంస్థ నిరంతరం కృషి చేయుచున్నదని ఆయన తెలిపారు. 2019వ నాటికి ప్రతి ఇంటికి ఒక మహిళ ఇ-లిటరేట్ కావాలని అదే విధంగా 2019-20 నాటికి ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండేలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుచున్నామని ఆయన తెలిపారు. మహిళల ఆరోగ్య సంక్షేమం కొరకు పట్టణంలో ఉన్న భవనాల పైన కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయడానికి మెప్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుచున్నామని ఆయన తెలిపారు. ఈ సమీక్షలో మెప్మా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించుచున్నామని ఆయన తెలిపారు. ఈ సమీక్షలో మెప్మా ఆధ్వర్యంలో ఎంత ఖర్చుచేశారు. రాబోయే సంవత్సరంలో ఎలాంటి పనులు చేపడతారో నివేదికలు రూపంలో మాకు అందజేసారని ఆయన తెలిపారు. నెలకొకకసారి మెప్మా ఆధ్వర్యంలో జరిగే వివిధ కార్యక్రమాలపై ప్రెస్ టూర్ నిర్వహించడానికి సంబంధిత మెప్మా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా రూ.14 వేల కోట్ల కార్పస్ నిధులున్న స్వయం సహాయక బృందాలు మనకున్నాయని వారిని ఒక్కొక్క రంగంలో తర్ఫీదు ఇచ్చి స్వావలంబనకు దోహద పడాలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగాఢ కోరికను ఆయన తెలిపారు. గత సంవత్సరం 1లక్షా 28 వేల కుటుంబాలకు అదనపు ఆదాయం సమకూర్చడం జరిగిందని ఈ ఆర్థిక సంవత్సరం నందు 2 లక్షల కుటుంబాలను ఆర్థికంగా కుటుంబాలలో అదనపు ఆదాయం సమకూర్చడానికి నిర్థిష్టమైన ప్రణాళికలు అమలు చేయుచున్నామని ఆయన తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మెప్మా పిడి చిత్తూరు నాగ పద్మజ, రాష్ట్ర ఫైనాన్స్ మేనేజరు విజయభారతి, కర్నూలు మెప్మా పిడి రామాంజనేయులు, అనంతపురం మెప్మా పిడి జి. సావిత్రి, చిత్తూరు డిపి ఎం వెంకటేష్, నెల్లూరు, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ధరలు నియంత్రించాలి, ఉపాధి కల్పించాలి

* సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ
తిరుపతి, జూలై 13: ధరలు నియంత్రించాలని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ సిపి ఎం కేంద్రకమిటీ పిలుపుమేరకు చేపట్టిన కరపత్రాల పంపిణీ కార్యక్రమాన్ని సిపి ఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి నేతృత్వంలో నగరంలో పలు చోట్ల కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమర్‌రెడ్డి మాట్లాడుతూ ఈనెల 11నుంచి 17 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.
సామాన్యులు కడుపునిండా తిండి తినలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. పేదవాడిని ఆదుకుంటామని, పేదవాడిని మహరాజు చేస్తామని గొప్పలు చెప్పుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడిని బికారిని చేసే కార్యక్రమం నిర్వఘ్నంగా చేపడుతున్నారని ఎద్దేవాచేశారు. పెట్రోల్ ధరలు, రైలుఛార్జీలు, మందులు, పుస్తకాలు, స్కూల్ ఫీజులు, ఇలా పేదవాడికి అవసరమైన ప్రతి వస్తువుధరలు పెరిగిపోయాయన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం సర్వీసుల్లో రూ.7లక్షలా 47 వేల 171 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దేశంలో 20కోట్ల మంది భారతీయులు నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఇక రాష్ట్రంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగులు కుప్పలు తెప్పలుగా ఉన్నారన్నారు. బాబు వస్తే జాబొస్తుందని చెప్పి ఉన్నజాబులను ఊడగొట్టడం, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి ఆటలాడుకుంటున్నారన్నారు. ఉద్యోగం రాని నిరుద్యోగులకు 2వేల రూపాయలు భృతి కల్పిస్తామని మాటిచ్చిన సి ఎం ఆ మాటను అటకెక్కించాడని నిప్పులుచెరిగారు. మోస పూరిత వాగ్దానాలు, కుట్రపూరిత వైఖరిలతో చంద్రబాబు అధికారాన్ని రక్షించుకోవాలని చూస్తున్నారని , అయితే ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ప్రజలకు అనుకూలమైన విధానాలు తీసుకురాకపోతే తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం నాయకులు టి. సుబ్రహ్మణ్యం, ఎస్. జయచంద్ర, చంద్రశేఖర్ రెడ్డి, సాయిలక్ష్మి, హేమలత, లక్ష్మి, గురుప్రసాద్, కుమారమ్మ, రాధ, మల్లికార్జున, నరేంద్ర, సుమన్, జీవన్, నందకిశోర్, పళణి, ఆండాళ్, బుజ్జి పాల్గొన్నారు.
ధరల నియంత్రణపై కరకంబాడి రోడ్డులో రాస్తారోకో చేసిన సిపి ఎం
ధరలను నియంత్రించి పేదవాడిని కాపాడాలంటూ నిలదీస్తూ శెట్టిపల్లి పంచాయతీ సిపి ఎం కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీ ఓ కార్యాలయం ముందు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకుడు యాదగిరి మాట్లాడుతూ పేద, బడుగు,బలహీన వర్గాలను ఉద్దరిస్తామని ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉపన్యాసాలతో ఊదరగొట్టారన్నారు. అయితే అధికారం దక్కగానే విమానాలనే ఇంటి నివాసాలుగా చేసుకొని విదేశాల్లో విహరిస్తూ పేదవాడి సమస్యను సముద్రంలో కలిపేస్తున్నారని నిప్పులు చెరిగారు. రెండు గంటల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించిన ఆందోళన కారులు చివరగా ఆటో కార్మికుల సమస్యలపై ఆర్టీవో వివేకానందరెడ్డిని కలిసి చర్చించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటరెడ్డి, జగన్, చిన్నవెంటకయ్య, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, జె. శ్రీనివాసులు, కన్నయ్య, జయపాల్‌రెడ్డి, చిన్నబ్బ, రవి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన మఠాధిపతులకు
బిజెపి నేతల ఘనస్వాగతం
తిరుపతి, జూలై 13: ఢిల్లీలోని వివిధ మఠాలకు చెందిన అధిపతులు శ్రీవారి దర్శనార్థం బుధవారం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ కాళహస్తి బిజెపి నాయకులు కోలా ఆనంద్, తిరుపతి బిజెపి నాయకులు గుండాల గోపీనాథరెడ్డి, నారాయణ రెడ్డి విమానాశ్రయంలో వారికి ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన మఠాధిపతుల్లో స్వామి అవిదేషానందగిరి, స్వామి ప్రేమానందజీ, శ్రీ నిర్మలానంద నాథ్ స్వామిలతో పాటు ఢిల్లీ ఎంపి మహేష్‌గిరి, ఇతర స్వామీజీలు ఉన్నారు. ముందుగా శ్రీ కాళహస్తిని దర్శించుకున్న మఠాధిపతులు అనంతరం తిరుమలకు చేరుకొని వేదగిరి పాఠశాలను సందర్శించారు. అక్కడ విద్యార్థులు అభ్యసిస్తున్న వేదవిద్యను చూసి టిటిడిని అభినందించారు. రాత్రి తిరుమలలో బసచేయనున్న స్వామీజీలు గురువారం విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.
తరగతులకు గైర్హాజరైతే చర్యలు తప్పవు

* విద్యార్థులకు విసి దామోదరం హెచ్చరిక
తిరుపతి, జూలై 13: విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని ఎస్వీయూ విసి ఆచార్య దామోదరం రిజిస్ట్రార్ ఆచార్య దేవరాజులు నాయుడు విద్యార్థులను హెచ్చరించారు. బుధవారం తరగతులు జరుగుతున్న సమయంలో విసి, రిజిస్ట్రార్ ఆకస్మికంగా బాలుర వసతి గృహాలను తనిఖీచేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వసతి గృహాల్లో ఉండటాన్ని గమనించారు. తరగతులు జరుగుతున్న సమయాల్లో వసతి గృహాల్లో ఉంటే చదువు పాడైపోతుందని హితబోధ చేశారు. తరగతులు ముగిసిన తరువాత విద్యార్థులు ఎస్వీయూ గ్రంథాలయాలనికి వెళ్లి విజ్ఞానాన్ని సమపార్జించేందుకు కృషిచేయాలని హితవు పలికారు. అనంతరం విసి, రిజిస్ట్రార్‌లు క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. పరిశుభ్రతకు ప్రాధాన్యిత ఇవ్వకపోతే తీవ్ర చర్యలు తప్పవని క్యాంటీన్ నిర్వాహకులు హెచ్చరించారు. అలాగే క్యాంటీన్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు అక్కడ కనబడితే చర్యలు తప్పవన్నారు. అనంతరం సౌత్ ఈస్ట్ ఏసియా, ఫసిఫిక్ స్టడీస్ విభాగాన్ని వారు తనిఖీచేశారు. ఈ సందర్భంగా అటెండెన్స్‌ను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పనివేళల్లో బోధన, బోధనేతర సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విదేశీ సంబంధాల డీన్ ఆచార్య జి.సుదర్శనం, ఇంజనీరు అజయ్‌బాబు తదితరులు ఉన్నారు.

అత్యంత ఘనంగా కృష్ణా పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు
* రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం
తిరుమల, జూలై 13: పనె్నండేళ్లకు ఒకసారి వచ్చే కృష్ణ పుష్కరాలను అత్యంత ఘనంగా నిర్వహించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లురవీంద్ర స్పష్టం చేశారు. బుధవారం విరామ సమయంలో ఆయన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఆలయం వెలుపల విలేఖరులతో మాట్లాడారు ముఖ్యంగా సిఎం చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారన్నారు. కృష్ణాపుష్కరాలతో ఆ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు కూడా ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందన్నారు. ఇందులో భాగంగా నదీతీరాన భక్తులు స్నానం చేసుకోవడానికి ఏర్పాటుచేస్తున్న ఘాట్లను శాశ్వతంగా ఉంచేవిధంగా నిర్మాణాలు చేపడుతామన్నారు. ఇక కృష్ణా పుష్కరాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు స్వామి దర్శనం చేసుకునే అవకాశం కల్పించేందుకు టిటిడి నమూనా ఆలయాన్ని ఏర్పాటుచేస్తుండటం అభినందనీయమన్నారు. ఇక వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ, చిన్నలడ్డూల పంపిణీ లాంటి కార్యక్రమాలను కూడా టిటిడి చేపడుతోందని, భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకుమునుపు శ్రీవారి దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లుచేశారు.
టిటిడి విద్యాసంస్థలలోని
పిజి విద్యార్థులకు
ఉచిత భోజన సౌకర్యం కల్పించాలి
* ఎఐఎస్‌ఎఫ్ డిమాండ్

తిరుపతి, జూలై 13: టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న పిజి విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి మెస్‌బిల్లును రద్దుచేసేందుకు 2 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని, లేని పక్షంలో తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటామని ఎ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో పిజి విద్యార్థులు హెచ్చరించారు. టిటిడి విద్యాసంస్థల్లో చదువుతున్న పిజి విద్యార్థులకు ఉచిత భోజనం కల్పించాలంటూ బుధవారం ఎ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు టిటిడి పరిపాలనాభవనం ముట్టడించారు. ఈసందర్భంగా ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి.శశికుమార్, కె. శివారెడ్డి మాట్లాడుతూ ఉచిత భోజనం పెడతామని ముందుగా ఆశ చూపించిన టిటిడి విద్యాసంస్థల అధికారులు చేరిన తరువాత ఒక్కో విద్యార్థి నుంచి 1500 నుంచి 2100 రూపాయల వరకు ఫీజులు వసూలుచేయడం దుర్మార్గమన్నారు. ఈ అంశంపై తాము టిటిడి డి ఇ ఓ విజయ్‌కుమార్‌ను కలిస్తే తమ నిస్సహాయతను వ్యక్తం చేశామన్నారు. ఫీజులు చెల్లిస్తేనే హాస్టల్ వసతి కల్పిస్తామని చెబుతున్నారన్నారు. 2008 నుంచి 2014 వరకు టిటిడి విద్యాసంస్థల్లోని పిజి విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించేవారన్నారు. అలాగే ఇపుడు కూడా ఉచితంగా కల్పించాలని, టిటిడి విద్యార్థులకిచ్చిన 15వేల రూపాయల మెస్‌బిల్లును రద్దుచేయాలని డిమాండ్ చేశారు. రెండురోజుల్లో కల్పించకపోతే ఆమరణ దీక్షకు కూర్చుంటారని హెచ్చరించారు.అనంతరం ఎ ఐ ఎస్ ఎఫ్ బృందం ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావును కలిసి తమ బాధను వ్యక్తం చేసుకున్నారు. ఈ అంశంపై అధికారులతో చర్చించి తగున్యాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కృష్ణ, దాము, చలపతి, విష్ణు, బుజ్జిబాబు, వెంకటేష్, జయమ్మ, పవిత్ర తదితరులు పాల్గొన్నారు.