చిత్తూరు

స్వయం ఉపాధి పథకాలు సద్వినియోగం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కాళహస్తి, ఆగస్టు 16: నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాలను గురించి తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం శ్రీ కాళహస్తి ఎంపిడివో కార్యాలయంలో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ దశరథాచారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం గురించి అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నదని వివరించారు. వాటిపై అవగాహన పెంచుకుంటే మరికొందరికి ఉపయోగపడుతుందన్నారు. కేవలం ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకే కాకుండా స్వయం ఉపాధి పథకాలపై కూడా మొగ్గుచూపాలని నిరుద్యోగులకు సూచించారు. ప్రధానమంత్రి ఉపాధి హామీ పథకం కింద హస్తకళాకారులకు ఎన్నో పథకాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ దశరథాచారి తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటికే చాలామంది లబ్ధిపొందామని బ్యాంకు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ బ్యాంకుల అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘ప్రజల ఆదరణ పొందండి ’
కార్యకర్తలు ప్రజల ఆదరణ పొందేవిధంగా కృషిచేయాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టిడిపి కార్యకర్తలను కోరారు. మంగళవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శ్రీ కాళహస్తి సత్యవేడు నియోజకవర్గాల పార్టీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన పనులు చేయడమేకాకుండా వారి ఆదరణ ఏవిధంగా ఉందో పరిశీలించాలన్నారు. కేవలం పనులు చేయడం వల్ల ఎన్నికల్లో లబ్ధిపొందలేమని, సానుభూతి కూడా అవసరమేనన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కలికిరి ప్రాంతంలో వారు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశారని, అయితే ఎన్నికల్లో ఆయన సోదరుడు గెలవలేదని గుర్తుచేశారు. ప్రజలు ఆదరించకపోవడం వల్లే ఓడిపోయారని, అటువంటి పరిస్థితులు రాకుండా ప్రజల సానుభూతిని పొందాలన్నారు. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిత్య మాట్లాడుతూ కార్యకర్తల మధ్య వివాదాలుంటే సమావేశాలు జరిపి పరిష్కరించుకోవాలని, బయటపడవద్దని కోరారు. అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి చెడు జరగకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి పరసారత్నం, శ్రీ కాళహస్తి, సత్యవేడు పార్టీల నాయకులు పాల్గొన్నారు.

పూర్ణాహుతితో ఘనంగా ముగిసిన పవిత్రోత్సవాలు
తిరుమల, ఆగస్టు 16: తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రావణమాసంలో ప్రతియేటా 3రోజుల పాటు నిర్వహించే పవిత్రోత్సవాలు మంగళవారం పవిత్ర పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. తొలి రెండురోజుల వలే మంగళవారం ఉదయం కూడా యాగశాలలో రుత్వికులు హోమాలు నిర్వహించారు. తరువాత ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఉత్సవమూర్తులకు వరుసగా గో క్షీరము, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనపూత పూశారు. ధూపదీప నేవేద్యాలు నివేదించారు. దీంతో స్నపన తిరుమంజన కార్యక్రమం శాస్త్రోక్తంగా ముగిసింది. ఈకార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు ఎవి రమణ , భానుప్రకాష్‌రెడ్డి, అరికెల సరసారెడ్డి, డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు, పేష్కార్ శెల్వం తదితరులు పాల్గొన్నారు. కాగా మధ్యాహ్నం విశేష సమర్పణ, సాయంత్రం ఉత్సవ మూర్తుల ఊరేగింపు కార్యక్రమాలు జరిగాయి. రాత్రి 7 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామివారు శ్రీదేవి,్భదేవితో కూడి విమానప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు పరిసమాప్తి అవుతాయి. పవిత్రోత్సవాల నేపథ్యంలో మంగళవారం అష్టదళ పాదపద్మారాధన, ఆర్జిత బ్రహ్మోత్సవం, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దుచేసింది.
శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో మొక్కలు నాటండి
* టిటిడి ఇ ఓ సాంబశివరావు ఆదేశం
తిరుమల, ఆగస్టు 16: శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా త్వరగా పెరిగే మొక్కలు నాటాలని టిటిడి ఇ ఓ డాక్టర్ డి.సాంబశివరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సీనియర్ అధికారులతో ఆయన వారపు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకవిక్రయశాల పక్కన ఏర్పాటుచేసిన బ్యాంక్ కౌంటర్‌లో బంగారు, వెండి డాలర్ల విక్రయాలను త్వరగా ప్రారంభించాలని సూచించారు. దివ్యదర్శనం కాంప్లెక్స్‌ను సెప్టెంబర్‌లో పూర్తిచేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కుటుంబ సభ్యులు తప్పిపోయిన భక్తుల సౌకర్యార్థం ఆలయానికి అభిముఖంగా సులువుగా గుర్తించేలా లాస్ట్‌అండ్ ఫౌండ్ సెంటర్‌ను నిర్మించాలని ఆదేశించారు. అన్నప్రసాద భవనంలో బఫే భోజనంచేసే ఏర్పాటు ఉందని భక్తులకు తెలిసేలా సూచికబోర్డులు ఏర్పాటుచేయాలన్నారు. పి ఎసి -4, జి ఎన్ సి టోల్‌గేట్ వద్దగల లగేజి కౌంటర్లలో భక్తులకు ఇబ్బందిలేకుండా లగేజీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతిలోని ఐ ఐ టి విద్యార్థుల ద్వారా సర్వేచేయించి లగేజి కౌంటర్లనిర్వహణ, భక్తుల సంతృప్తి తదితర విషయాలపై ప్రతిస్పందన తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో టిటిడి న్యాయాధికారి వెంకటరమణ, చీఫ్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి అదనపు ఎఫ్ ఎ, సి ఎ ఓ బాలాజి, ఎస్ ఇ -2 రామచంద్రారెడ్డి, ఆలయ డిప్యూటీ ఇ ఓ కోదండరామారావు, ముఖ్య భద్రతాధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పట్టపగలే దుకాణంలో చోరీ
పాకాల, ఆగస్టు 16: పట్టపగలు నడివీధిలో అందరూ చూస్తుండగానే మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడు దుకాణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న యువతి మెడలోని 18 గ్రాముల బంగారు చైన్ లాక్కెళ్లిన సంఘటన పాకాల మండలం దామలచెరువులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. దామలచెరువు నల్లాయనవారిపల్లెకి చెందిన ఓ వ్యక్తి మ్యాంగోనగర్‌లో పాల దుకాణం నడుపుతున్నాడు. ఆయన భోజనానికి వెళుతూ తన సోదరుని కుమార్తెను దుకాణంలో కూర్చోబెట్టాడు. ఈ సమయంలో మోటార్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు దుకాణం ముందు వాహనాన్ని ఆపారు. వారిలో ఒక యువకుడు దుకాణంలోకి ప్రవేశించాడు. కనురెప్ప మూసే సమయంలో ఆ యువతి మెడలో ఉన్న బంగారు చైన్‌ను లాక్కొని వాహనంపై పరారయ్యాడు. దీంతో ఆ యువతి కేకలు వేసేలోపే యువకులు కనుమరుగయ్యారు. మ్యాంగ్‌బజార్ నడివీధిలో పట్టపగలే చోటు చేసుకోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సిఐటియు ఆధ్వర్యంలో టిటిడి ఇఓకు సమ్మె నోటీసు
తిరుపతి, ఆగస్టు 16: కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు సెప్టెంబర్ 2న సమ్మెలోకి వెళ్తున్నట్లు టిటిడి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ (సి ఐ టి యు) ఆధ్వర్యంలో టిటిడి ఇ ఓ సాంబశివరావుకు సమ్మె నోట్ ఇచ్చినట్లు యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.సుబ్రహ్మణ్యం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడిలో ఏళ్ల తరబడి 13వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తమ సేవలను అందిస్తున్నారని చెప్పారు. పెరిగిన ధరలు, ఇంటి అద్దెలతో కుటుంబ పోషణ కష్టంగా ఉందన్నారు. మరో పక్క కార్మికులకు వయస్సు మీరు తుండటం వల్ల ఉద్యోగభద్రత కరువైందన్నారు. ఏడోవేతన సిఫార్స్ ప్రకారం కనీస వేతనాలు 18వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. టిటిడి బోర్డు చేసిన తీర్మానం ప్రకారం పే స్కేల్ వర్తింపచేసి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. సులబ్‌లో పనిచేస్తున్న కార్మికులకు ఇ ఎస్ ఐ, పి ఎఫ్ వారాంతపు సెలవులు మంజూరు చేయాలని కోరారు. సెప్టెంబర్ 2లోపు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు జి.మార్కొండేయ, మునిలోక,చిరంజీవి, రమణయ్య, మధు, సుబ్రహ్మణ్యం, సుభద్ర, పద్మమ్మ, ఉష పాల్గొన్నారు.
2న సమ్మెను జయప్రదం చేయండి
* ఎ ఐ టి యుసి మురళి
కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతూ హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా 12 డిమాండ్లతో సెప్టెంబర్ 2న చేపట్టే జాతీయ సార్వత్రిక కార్మిక సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎ ఐ టి యుసి జిల్లా అధ్యక్షుడు పి.మురళి పిలుపునిచ్చారు. మంగళవారం బైరాగిపట్టెడంలోని ఎ ఐ టి యుసి కార్యాలయంలో ఎ ఐ టి యుసి ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సమ్మెను జయప్రదం చేయడానికి అన్ని కార్మిక వర్గాలు ఆయా యాజమాన్యాలకు నోటీసులుజారీచేసి సదస్సులు నిర్వహించి గేట్ సమావేశాలు నిర్వహించి సమ్మె ఉధృతాన్ని తెలియజేయాలని సూచించారు.గత ఏడాది సెప్టెంబర్ 2 న ఇలాంటి సమ్మెను చేపట్టినపుడు చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన పాలకులు ఏడాది గడుస్తున్నా పట్టించుకోలేదన్నారు.
ఈకార్యక్రమంలో నాయకులు ఎన్ డి రవి, కెవై రాజా,చిన్న పెంచులయ్య, రాధాకృష్ణ, ఆరుణ, వై. జగన్నాధం, రవి, శివ, సత్యవేలు, బ్యాంక్ ఉద్యోగులు వెంకటరెడ్డి, బి ఎస్ ఎన్ ఎల్ ఉద్యోగి గోవింద స్వామి, భాష తదితరులు పాల్గొన్నారు.

అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు
* ఒకరు మృతి - ఇద్దరికి స్వల్పగాయాలు
నాగలాపురం, ఆగస్టు 16: అదుపుతప్పి చెట్టును ఢీకొన్నకారు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి స్వల్పగాయాలైన సంఘటన సోమవారం రాత్రి నాగలాపురం మండలం నందనం గ్రామ సమీపాన చెన్నై-పుత్తూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల వివరాల మేరకు తమిళనాడుకు చెందిన అబ్దుల్ రహీం (28), అరుణ్‌కుమార్ (30), గురురాజు(29), అబ్దుల్జ్రాక్ (29) అనే నలుగురు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు. వీరు మారుతీకారులో తిరుపతి నుంచి చెన్నైకి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎక్కడో మద్యం సేవించి కారును అతివేగంగా నడుపుకుంటూ వెళ్తూ నందనం సమీపంలో చెట్టును ఢీ కొట్టారు. ప్రమాదంలో అబ్దుల్ రహీం అక్కడికక్కడే మృతిచెందగా గురురాజు, అబ్దుల్ రజాక్‌కు స్వల్పగాయాలయ్యాయి. వీరిని తమిళనాడైన తిరవళ్లూరు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి అబ్దుల్ రహీం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్యవేడుకు తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.