చిత్తూరు

పొలంలో నిద్రపోతున్న రైతు దారుణహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 17: మండలంలోని దిగువమల్లవరం గ్రామంలో పొలంలో నిద్రపోతున్న రైతును దారుణహత్య చేసిన సంఘటన మండలంలో సంచలనం రేపింది. వివరాల్లోకెళితే మండలంలోని మల్లవరం పంచాయతీ పరిధిలోని దిగువ మల్లవరంలో సేద్యం చేసుకుంటూ కాపురముంటున్న పద్మమణి అలియాస్ చిన్నబాబు (65)కు భార్య, ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉండగా కుమార్తెలకు పెళ్లి చేసి పెద్ద కొడుకు మునిచంద్రయ్య తండ్రితోపాటు సేద్యం చేసుకుంటూ జీవిస్తున్నాడు. చిన్నకొడుకు ప్రైవేటు కర్మాగారంలో పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పొలంలో శనగకాలు కోసి కుప్పవేసి దానికి కాపలాగా చినబాబు పొలంలో నిద్రించాడు. అర్థరాత్రి గుర్తుతెలియనివ్యక్తులు కాశిరాయితో తలపై గట్టిగా మోది, కత్తితో గొంతుకోసి హత్య చేసి పరారయ్యారు. ఉదయం మృతుడి భార్య వెంకటసుబ్బమ్మ పొలానికి వచ్చి చూడగా భర్త రక్తపు మడుగులో శవమై ఉండటం చూసి గట్టిగా కేకలు వేస్తూ స్పృహకోల్పోయింది. కేకలు విన్న పక్క పొలంలో పనిచేస్తున్న రైతులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి గ్రామంలో ఎవరితో ఎటువంటి విభేదాలు లేవని, గతంలో కూడా ఎలాంటి ఆర్థిక, స్థల వివాదాలు లేవని గ్రామస్థులు తెలిపారు. అయితే ఆయన్ను హత్య ఎందుకు చేశారన్నది మిస్టరీగా మారింది. ఈ హత్యవెనుక ఎవరైనా బంధువులు ఉన్నారా... లేక మరేదైనా కారాణాలున్నాయా అన్న అంశంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. కాగా హత్య సమాచారం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ డి ఎస్పీ నరసప్ప, ఎస్ ఐ మధుసూధన్ రావులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తిరుపతి నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది వచ్చి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా రేణిగుంట ఇన్‌చార్జ్ డి ఎస్పీ నరసప్ప మీడియాతో మాట్లాడుతూ మృతుడు దారుణహత్యకు గురయ్యాడని, అయితే ఈ హత్య ఎందుకు, ఎవరు చేశారో విచారణలో తేలనున్నదని అన్నారు. ఇదిలా ఉండగా తిరుచానూరు ఇన్ చార్జ్ సి ఐ సురేంద్ర కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మూడువేల అడుగుల భారీ జాతీయ పతాకం ప్రదర్శన

వి.కోట, ఆగస్టు 17: మండల కేంద్రమైన వి.కోటలో 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మూడు వేల అడుగుల జాతీయ పతాకాన్ని విద్యార్థులు, ప్రముఖులు పట్టణంలో బుధవారం ప్రదర్శించారు. స్థానిక రాజశ్రీ, దివ్యజ్ఞాన పాఠశాల విద్యార్థులు యాజమాన్యం మూడువేల అడుగుల పొడవు, తొమ్మిది అడుగుల వెడల్పుతో జాతీయ పతాకాన్ని ఎగువ మార్కెట్ యార్డు నుంచి లాంగ్ బజారు మీదుగా దుర్గానగర్, మండల పరిషత్ కార్యాలయం వరకు ప్రదర్శించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ర్యాలీలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పుర ప్రముఖులు భారీఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఇంతవరకు ఇలాంటి భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించలేదని లింకాబుక్ ఆఫ్ రికార్డులో ఇది రికార్డుగా నిలుస్తుందని నిర్వాహకులు రఘుపతి, శ్రీనివాసులు, ఖలీఫ్, నారాయణస్వామి పేర్కొన్నారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని, సోదరబావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు చేయడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో రమేష్, ఎంపిపి సులోచనరంగనాథ్, జడ్పీటిసి నాగవేణివిశ్వనాథ్, ఎంఇవో నారాయణమ్మతో పాటు కుప్పం సిఐ రాజశేఖర్ పాల్గొన్నారు.

మహిళా వర్సిటీ విద్యార్థినికి
ఇండోయూరోపియన్ ఫెలోషిప్
తిరుపతి, ఆగస్టు 17: శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ లోని విద్యార్థిని సుజాత బయోటెక్నాలజీపై పరిశోధన చేసినందుకు ఇటలీ ప్రభుత్వం బ్రేవ్ ఫెలోషిప్ ఇచ్చింది. ఈ పత్రాన్ని బుధవారం వర్సిటీ వీసి ఆచార్య వి.దుర్గ్భావాని ఆమెకు అందజేశారు. ఆచార్య ఆర్. ఉష పర్యవేక్షణలో ఆనియన్‌లోని వ్యాధులు వాటి నివారణ పద్దతులపై విద్యార్థిని సుజాత 10నెలల పాటు యూనివర్సిటీ ఆఫ్ మిలాన్‌లో పరిశోధన చేసేందుకు నిధులు మంజూరయ్యాయి. పరిశోధన సౌలభ్యం కోసం సుజాతకు వ్యవసాయ, పర్యావరాణానికి సంబంధించిన ఉత్పత్తులు, ప్రకృతి దృశ్యం, అగ్రి ఎనర్జీలపై మిలాన్ వర్సీటీలో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణ వలన ఇటలీభాష, ప్రయోగ నైపుణ్యాన్ని సంపూర్ణంగా సాధించడానికి వీలుపడుతందని ఆచార్య ఉష తెలిపారు. ఈ సందర్బంగా రెక్టార్ వి. ఉమ, బయోటెక్నాలజీ విభాగాధిపతి ప్రొ.కళారాణి, అధ్యాపకులు జోత్స్న, కిశోరి, షుష్మాలు సుజాతను అభినందించారు.
20న స్విమ్స్‌లో పిజి కోర్సులకు రెండో విడత కౌనె్సలింగ్
తిరుపతి, ఆగస్టు 17: స్విమ్స్‌లో పిజి కోర్సులకు 20న శనివారం ఉదయం 8.30 గంటలకు రెండోవిడత కౌనె్సలింగ్ నిర్వహిస్తామని స్విమ్స్ రిజిస్ట్రర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంతకు మునుపు ధరఖాస్తుచేసిన అభ్యర్థులతో పాటు ధరఖాస్తు చేయనివారుకూడా అర్హులని వారు పేర్కొన్నారు.
ఫెలోషిప్ సర్ట్ఫికెట్ కోర్సులు
- సర్జికల్ -3, అనస్తీషియా - 5
ఎం ఎస్ సి నర్సింగ్ - 15
ఎం ఎస్ సి బయోటెక్నాలజీ - 9
ఎం ఎస్ సి బయో ఇన్ఫార్మెటిక్స్ - 14
ఎం ఎస్ సి అనాటమీ - 1
పిజి డిప్లమా ఇన్ డయాలసిస్ టెక్నాలజీ - 2
పిజి డిప్లమా మెడికల్ రికార్డ్ సైన్స్ - 4 కోర్సులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్ట్ఫికెట్లతో పూర్తి ఫీజుతో శ్రీ పద్మావతి ఆడిటోరియంలో హాజరుకావాలన్నారు. రిజర్వ్‌డ్ అభ్యర్థులు లేనిచో ఆ ఖాళీలను జనరల్ అభ్యర్థులకు భర్తీచేస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు స్విమ్స్ వెబ్‌సైట్‌ను పరిశీలించగరని కోరారు.

యువ ఐఎఎస్ అధికారి ఉదయప్రవీణ్‌కు ఘన సన్మానం

తిఠుపతి, ఆగస్టు 17: సామాన్య కుటుంబంలో పుట్టి మెడిసెన్ పూర్తిచేసి డాక్టర్‌గా విధులు నిర్వహిస్తూ సమాజానికి మరింత సేవలందించాలనే ఆశయంతో ఐఎఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 2015వ సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఉదయప్రవీణ్‌ను బుధవాఠం తిరుపతి నెహ్రూ మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో బుధవారం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి, తెలుగునాడు ఉపాధ్యాయ ప్రధాన కార్యదర్శి కె.అర్జునుడు, ఆర్డీవో ఆఫీస్ డిప్యూటీ తహశీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపి హెచ్ ఇ ఓ రత్నాకర్, విశ్వనాథ్, యుటి ఎఫ్ నాయకులు మునిరామయ్య, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

‘ఇష్టపడిన అంశంపై కష్టపడితే
ఫలితం సొంతం’
చంద్రగిరి: చంద్రగిరిలో దళిత ఐత్యవేదిక ఆధ్వర్యంలో దళితుల అభివృద్ధి కోసం కృషిచేసిన డాక్టర్ పి. ఉదయ్ ప్రవీణ్‌ను (ఐఎఎస్) ఘనంగా సన్మానించారు. బుధవారం చంద్రగిరి సమీపంలోని రాయలపురంలో ఏర్పాటుచేసిన సమావేశంలోడాక్టర్ సి. ఉదయప్రవీణ్ దళితుల పట్ల చేసిన అభివృద్ధి గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఐ ఎ ఎస్ ఆఫీసర్ ఉదయ్ ప్రవీణ్ మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకొని స్వయం కృషితో ప్రయత్నిస్తే కలలు సాకారం చేసుకోవడం సాధ్యమేనని 2015 సివిల్ సర్వీస్‌లో ఐఎఎస్‌కు ఎంపికైన డాక్టర్ ఉదయప్రవీణ్ అన్నారు. ఇష్టపడిన అంశంపై కష్టపడితే ఫలితాన్ని సొంతం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి దశ ప్రతి ఒక్కరి ఎదుగుదలకు పునాది వంటి దన్నారు. పాఠశాల స్థాయిలోనే సమాజానికి ఉపయోగపడాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం ద్వారా విద్యపట్ల అంకితభావం పునాదివంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో వెంకటనారాయణ, ఎం ఇ ఓ వెంకటపతిరాజు, ప్రిన్సిపల్ నాగరాజు నాయుడు, రామారావు, రాజేంద్ర, మస్తాన్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.

‘్ధరలు అదుపు చేయలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి’
చిత్తూరు, ఆగస్టు 17: నిత్యావసర వస్తువుల ధరలను అదుపుచేయలేని ప్రభుత్వాలు వెంటనే గద్దె దిగాలని జిల్లా సిపిఐ కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మెడలో కూరగాయలు, నిత్యావసర వస్తువులతో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని, లేనిపక్షంలో ప్రభుత్వాలు ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణి, ఆర్ముగం, విజయకుమార్, బాలాజీ, ఉమాపతి, జయలక్ష్మి, కుమారి, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు రవీంద్రబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.

వేడుకగా ఊంజల్‌సేవ
శ్రీ కాళహస్తి, ఆగస్టు 17: శ్రీ కాళహస్తీశ్వరాలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి ఊంజల్‌సేవ వైభవంగా జరిగింది. ఈకార్యక్రమంలో దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు, మునిసిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారధి, టౌన్ బ్యాంకు వైస్ ఛైర్మన్ పులి రామచంద్ర, ఆలయ పూజారి కన్నానాగయ్య, బత్తెయ్య, చంద్ర, చల్లా వెంకటేశ్వర్లు, బండారి రవి, మాచర్ల బ్రహ్మయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే భారీ ఉద్యమం
* 19న తిరుపతిలో భారీ బహిరంగ సభ
* విద్యార్థి సంఘాల జెఎసి నాయకుల హెచ్చరిక

తిరుపతి, ఆగస్టు17: కేంద్రంలో బిజెపి, కాంగ్రెస్ ప్రభుత్వాలు నాటకాలు ఆపి వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను కల్పించాలని, లేదంటే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతామని విద్యార్థి సంఘాల జె ఎసి జిల్లా అధ్యక్షులు హేమాద్రి యాదవ్ హెచ్చరించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమైక్య రాష్ట్రం కోసం విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించిన విషయం గుర్తుచేశారు. అయితే నాటి కేంద్ర ప్రభుత్వం విభజన అనివార్యంచేసి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామినిచ్చిందన్నారు. విభజనలో నాడు భాగస్వామి అయిన బిజెపి కూడా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు హోదా కల్పించడంలో దోబూచులాడటం దారుణమన్నారు. తక్షణం హోదా కల్పించకుండే ఉద్యమాన్ని విద్యార్థుల చేతిలోకి తీసుకుంటామన్నారు. 13 జిల్లాల్లోని , అన్ని యూనివర్సిటీలలో ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు. దీనిలో భాగంగా శుక్రవారం తిరుపతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వర్సిటీల విద్యార్థులతో ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభలో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళిక కూడా ప్రకటిస్తామన్నారు. ఉద్యమానికి సంఘీభావంగా కార్మికులు, ఉద్యోగులు, లాయర్ల సంఘాల నాయకులు సభలో పాల్గొంటారన్నారు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమాల సంబంధించి గోడపత్రికను జె ఎసి నాయకులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జె ఎసి నాయకులు భానుప్రసాద్, జగదీశ్ రాజిరెడ్డి, వినీల్ కుమార్, నవీన్, ప్రసాద్,, కోటి, మధు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా నంది సేవ
శ్రీ కాళహస్తి, ఆగస్టు 17: శ్రీ కాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలోని అన్నపూర్ణాదేవి సమేత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నందిసేవ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులు నంది వాహనంపై ఊరేగారు. ఈ సేవలో శ్రీ కాళహస్తి దేవస్థానం అధికారులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గురువారం రథోత్సవం జరుగనుంది.

ఎన్‌సిసి , స్పోర్ట్స్‌కోటాలో ఒక సీటు పిజిలో కేటాయింపు
* ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం అకడమిక్ కౌనె్సలింగ్ సమావేశం నిర్ణయం
తిరుపతి, ఆగస్టు 17: ఎన్ సిసి, స్పోర్ట్స్‌కోటాలో ఏడాదికి ఒక సీటు పిజి విద్యార్థులకు కేటాయించాలని శ్రీ వేంకటేశ్వరా పశువైద్య విశ్వవిద్యాలయం 16వ అకడమిక్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. బుధవారం విసి, ఎపి స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ మన్మోహన్ సింఘ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 43 ప్రతిపాదనలను అజెండాలో చర్చించారు. పి హెచ్ డికి ఇన్ సర్సీసు కోటా అభ్యర్థులను ఇతర రాష్ట్రాలలోని విశ్వవిద్యాలయాలకు వచ్చే ఏడాది నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ప్రైవేటు వెటర్నరీ కళాశాల, పశు, డైరీ, మత్య్య, పాలిటెక్నిక్ కళాశాలలు స్థాపనకు వచ్చిన ప్రతిపాదనలను అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటుచేశారు. ఈకమిటీలో ఇతర యూనివర్సిటీల విశ్రాంత ఉపకులపతులు, డీన్‌లతో కమిటీని ఏర్పాటుచేశారు. విసి ఐ నిబంధనల ప్రకారం కాలేజిలను అనుమతిస్తామని కమిటీ చైర్మన్ మన్మోహన్ సింగ్ తెలిపారు. అలాగే పశుసంవర్థక శాఖ నుంచి వచ్చి విశ్వవిద్యాలయంలో చేరిన అధ్యాపకులకు పే ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈకార్యక్రమంలో బోర్డు సభ్యులు సూర్యనారాయణ, డాక్టర్ కరుణానిధి, విశ్వవిద్యాలయం అధికారులు, నామినేటెడ్ మెంబర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్, పి ఆర్వో డాక్టర్ త్రివేణి తదితరులు పాల్గొన్నారు.

‘రైతులు, సైనికుల సంక్షేమమే ధ్యేయంగా జై భారత్ సంస్థ ఏర్పాటు’
తిరుపతి ఆగస్టు 17: దేశంలోని సైనికులు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పాటు అయిన జై భారత్ సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈ నెల 22న రామానుజ సర్కిల్‌లోని సంధూరి కల్యాణ మంటపంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కళ్యాణచక్రవర్తి తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై జవాన్, జైకిసాన్ నినాదంతో వారి సంక్షేమానికి సంస్థ కృషిచేస్తుందన్నారు. 22న రామానుజ సర్కిల్ నుంచి సింధూర కళ్యాణమంటపం వరకు రైతులు, కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న వీర జవాన్లతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వారిని సత్కరిస్తామని తెలిపారు. సంస్థ గౌరవాధ్యక్షులు, టిటిడి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తాము, తమ కుటుంబం బాగుండాలనుకునే రోజుల్లో పదిమందికి సేవ చేయాలని జై భారత్‌ను స్థాపించడం గొప్ప విషయమన్నారు. సంస్థకు తన వంతు సహకారాలు ఎపుడూ ఉంటాయని తెలిపారు. మహిళామండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ సమాజసేవలో తమను భాగస్వాములను చేయడం సంతోషంగా ఉందన్నారు. రైతులు, సైనికులకు సేవచేయాలనుకోవడం అభినందనీయమని తెలపారు. ఈ కార్యక్రమంలో పెస్‌క్లబ్ కార్యదర్శి గిరిబారు, బిజెపి నాయకులు సామంచి శ్రీనివాస్, వేదవ్యాస రంగభట్టాచార్య, అజయ్‌కుమార్, మోహనరావుతదితరులు పాల్గొన్నారు.

వైభవంగా ముగిసిన వేణుగోపాల స్వామి తెప్పోత్సవాలు
కార్వేటినగరం, ఆగస్టు 17: స్థానిక శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి శుద్ధి, తోమాల సేవ, అర్చన, మొదటి గంట తదితర నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు ఉదయం 8.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవేరుల సమేతుడైన స్వామివారు గ్రామ పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారి స్కంద పుష్కరిణి వద్దకు వేంచేసి సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.