చిత్తూరు

ప్యాకేజీకి నిరసనగా రేపు రాష్ట్ర బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 8: ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన బిజెపి, టిడిపిలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని సిపి ఎం జిల్లా కార్యదర్శి కె కుమార్ రెడ్డి, సిపి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి హరినాథరెడ్డి, జిల్లా కార్యదర్శి డి రామానాయుడు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి 10 ఏళ్లు ప్రత్యేక హోదా తెస్తామని ఇదే తిరుపతిలో సన్మానాలు చేయించుకున్న వెంకయ్య నాయుడు ఇపుడు నిసిగ్గుగా ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో హామీలిచ్చిన బిజెపి నేడు ఆంధ్ర ప్రజల పట్ల పచ్చి అవకాశవాదంగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఆంధ్రా హక్కు అని ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అన్నారు. కేంద్రం దిగొచ్చేవిధంగా రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరూ పోరాడాల్సిన అవసరముందన్నారు. మాటలతో చెబితే బిజెపి, టిడిపిలు వినేటట్లు లేవని పోరాటంతో వారి మెడలు వంచాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌లో ప్రజలందరూ పాల్గొని సత్తా చూపాలన్నారు. పోలీసుల కుటుంబాలు, పిల్లల భవిష్యత్తు కూడా ప్రత్యేక హోదాతో ముడిపడి ఉందని ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొని పాలకుల కళ్లు తెరిపించాలన్నారు. హరినాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్యాకేజీలో అదనంగా ఏమీ ఇవ్వడం లేదన్నారు. కడప ఉక్కు పరిశ్రమ, విశాఖ రైల్వేజోన్ ఊసే లేదన్నారు. చంద్రబాబు, టిడిపి ఎంపీలు ప్యాకేజీకి సిగ్గులేకుండా హర్షం వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. బాబు ఏమి ఆశించి కేంద్రానికి దాసోహం వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రామానాయుడు మాట్లాడుతూ కేబినెట్ మంత్రి అశోక్‌గజపతిరాజు లేకుండా, టిడిపి పార్లమెంటు పక్షనేత, పార్లమెంటు సభ్యులు కూడా లేకుండా దొడ్డిదారిన ఎంపిలైన సుజనాచౌదరి, సిఎం రమేశ్‌లు ఆర్థిక మంత్రితో మంతనాలు ఏమిటో అందులో ఎవరి ప్రయోజనాలున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడితేనే కేంద్రం దిగొస్తుందని అన్నారు. శనివారం రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా ప్రత్యేక హోదానే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపి ఎం నాయకులు టి సుబ్రమణ్యం, ఆర్ లక్ష్మి, సిపి ఐ నాయకులు చినె్నం పెంచలయ్య, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బంద్‌కు విద్యార్థి, యువజన సంఘాల పిలుపు
కేంద్రప్రభుత్వం రెండున్నరేళ్లు నాంచి ఇపుడు ప్రత్యేక ప్యాకేజీ పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని విద్యార్థి, యువజన సంఘాల నాయకులు విమర్శించారు. కేంద్రప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రయివేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని మద్దతివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివై ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి జయచంద్ర, ఎస్ ఎఫ్ ఐ నగర అధ్యక్షులు జాఫర్, ఎ ఐ ఎస్ ఎఫ్ జిల్లాకార్యదర్శి శివారెడ్డి, కత్తి రవి, శైలజ, ఎన్ ఎస్ ఎఫ్ నగేష్, ఎన్ ఎస్ యు ఐ గండి కోట సుబ్రమణ్యం, వై ఎస్సార్ విద్యార్థి నాయకులు ఓబుల్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు.
బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం వద్ద నాయకుల అరెస్ట్, ఉద్రిక్తత
కేంద్రం రెండున్నర సంవత్సరాలుగా మాయ మాటలు చెప్పి అర్ధరాత్రి దాటాక ప్యాకేజీ అని సీమాంధ్రులను దారుణంగా మోసం చేసిందని సిపి ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథరెడ్డి, సిపి ఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతు గురువారం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా వామపక్షనేతలు స్థానిక బి ఎస్ ఎన్ ఎల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆందోళన విరమించాలని నాయకులను కోరారు. అందుకు వామపక్షనేతలు ససేమిరా అనడంతో ఆందోళన కారులను అరెస్ట్ చేసేందుకు సన్నద్దమయ్యారు. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్తవాతావరణం ఏర్పడింది. అదే సమయంలో తమ నాయకులను పోలీసులు అరెస్ట్ చేయకుండా కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తోపులాటలు, తొక్కిసలాటలు జరిగాయి. చివరకు ఆందోళన చేస్తున్న నాయకులను, కొంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు మాట్లాడుతూ రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంక్షేమం కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపి ఐ నాయకులు చిన్నం పెంచలయ్య, సిపి ఎం నాయకులు గురుప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.